Tuesday, November 22, 2022

 పెళ్ళిపిలుపు

**  **  ** 

మా చిన్నతనంలో పల్లెటూరులో అగ్రహారంలో ఎవరి ఇంట్లో ఐనా పెళ్ళి జరగబోయే ముందు 

వీలైనంతవరకు కన్యాదాత భార్యసమేతంగా బయల్దేరి స్వయంగా పిలిచేవారు. 

ఆపిలుపుల్లోకూడా రకరకాల వైవిధ్యం గమనించండి

1. బాగా దగ్గర బంధువులు సన్నిహితులు అయితే ఒక మంచిరోజున వారి ఇంటికివెళ్ళి

(దృశ్యం)

కన్యాదాత: యాజులు బావగారూ

యాజులు గారు (ప్రవేసిస్తూ) ఓహో శాస్త్రిబావగారా రండీ. (ఈలోగా యాజులు గారి భార్య ప్రవేశిస్తుంది)

శాస్త్రి: బావగారూ మీకు తెలుసుగా. పెద్దమ్మాయి వివాహం ఎల్లుండి రాత్రి 7.30 కి. మీరు అక్కయ్యగారు పిల్లలు తప్పకరావాలి. ఈ ఐదురోజులూ మీరు దగ్గరవుండి వివాహం జరిపించాలి

యాజులు: అలాగే బావగారు.

శాస్త్రి భార్య: (యాజులు గారి భార్యకు బొట్టుపెట్టి) వదినా  రేపు  మీమేనకోడలుని పెళ్ళికూతురుని చేస్తాం. వచ్చి పిల్లను ఆశీర్వదించాలి. తర్వాత పెల్లికి వచ్చి ఐదురోజులూ వుండి ..

యాజులు భార్య: అలాగే వదినా. 

యాజులు: అన్నట్టు శాస్త్రీ దొడ్లో పనస చెట్టు కూరకాయలు నాలుగు పంపుతాను. పాదుని గుమ్మడి కాయలు  ఆనపకాయలు కూడా పంపుతాను

యాజులు భార్య: అన్నట్టు వదినా వంటకు..

శాస్త్రిభార్య: తణుకు నుంచి సుబ్బన్నగారు వస్తున్నారు.

యాజులు భార్య: ఆహితాగ్నుల మాటేమిటి?

శాస్త్రిభార్య: మాపిన్ని వుంది వదినా

యాజులు భార్య: అదేమిటీ అత్తయ్యగారు వక్కరివల్లా అవుతుందా? నేనూ మడికట్టుకుని .........

2 వ దృశ్యం

వూరిలో తెలిసిన  దూరపు చుట్టాలని స్నేహితులను పిలవడం 

శాస్త్రి: శర్మగారూ

శర్మ ప్రవేశిస్తూ ఓహో శాస్త్రి గారా. రండి రండి

శాస్త్రి: శర్మగారూ ఎల్లుండి రాత్రి 7.30 కి మాపెద్దమ్మాయి వివాహం. తాము బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి వధూవరులను ఆశీవర్దించాలి. మర్నాడు మధ్యాహ్నం దేవతార్చనకు  దయచేయాలి. అక్కయ్యగారు లోపలవున్నారా

శర్మతలవూపుతారు. శాస్త్రిగారి భార్య లోపలిలికి వెళ్ళి 

వదినగారూ రేపు మాపెద్దమ్మాయిని పెళికూతుర్ని చేస్తాం. మీరు వచ్చి పిల్లని ఆశీర్వదించాలి. ఎల్లుండి రాత్రి 7.30 కి పెళ్ళికి మర్నాడు మధ్యాహ్నం సంతర్పణకి తప్పక రావాలి

సాధారణంగా ఆరోజుల్లో వివాహమహోత్సవ ఆహ్వాన పత్రికలు అంటూ వుండేవి కావు

ఇతరగ్రామాలలో వున్న బంధువర్గానికి పోస్టు కార్డు వ్రాయడమే

మరో విషయం. భోజనాని కి అని గాని విందు అనిగాని పిలిచేవారుకాదు. దేవతార్చనకి అనే మాటే వాడేవారు

ఈ పద్ధతి 1936 వరకే అని గుర్తు.

రాను రాను కాలంతో మార్పులు వచ్చాయి. 

అవి తమకే తెలుసు కదా

కొసమెరుపు: 1. మార్చి 1945 నాపెళ్ళికి కార్డు ప్రింటైన శుభలేఖే 

మరోకొసమెరుపు: ఈమధ్య అంతర్జాలంలో పిలిచేస్తున్నారు

భవదీయుడు

25-12-2022 న 96 లోకి దేవుని దయవల్ల అడుగిడబోయే

కాలనాధభట్టవీరభద్రశాఅస్త్రి

హ్యూస్టన్ అమెరికా’


Saturday, September 3, 2022

 జీవితానికి అవసరమైన భగవద్గీత చావు ఇంట్లో వింటున్నాము భక్తి పారవశ్యం తో తేలియాడాల్సిన వినాయక మండపాలును బూతు రికార్డింగ్ డాన్స్ లతో ముంచుతున్నాము మన హిందూ జాతి స్వీయ ప్రక్షాళన దిశగా వెళ్లి మరలా పూర్వ వైభవం తీసుకుని రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కళాకారులను నేను తప్పు పట్టను ఎందుకంటే అదే వారికి జీవనధారం.. వాళ్ళు మనం ఏం కోరుకుంటున్నామో అదే ప్రదర్శిస్తున్నారు. వాళ్లనే భక్తి పాటలకి డాన్స్ చెయ్యమంటే వాళ్ళు అదే చేస్తారు.. ఎన్నో నాటకాలు భాగవతాలు హారికథలు కనుమరుగై కళాకారులు రోడ్డున పడుతున్నారు. కొంతమంది బిక్షగాళ్లు గా మారుతున్నారు. అటువంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాల్సిన సందర్భాలు మన వినాయక ఉత్సవాలు దేవీ నవరాత్రులు అమ్మవారి పండగలు.. కొన్ని ఏళ్లగా కొనసాగుతున్న ఈ జాడ్యాన్ని ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఉంది లేదంటే మన హిందూ పండగలు ఇంకా విమర్శలు పాలు కావాల్సి వస్తుంది... ఎంతో లోక హితం కోరే మన పండగలు ఆరోగ్యం ఆహ్లాదం సాటి మనుషులకు జీవన భృతి ని ఉపాధిని కల్పించే మన పండగలు ఇలాంటి కార్యక్రమాలు వలన వన్నె కోల్పోయి ఎదుటి వారికి విమర్శ అస్త్రాలు గా మారుతున్నాయి ... నాకు తెలిసి ఈ జాడ్యం మన తెలుగు రాష్ట్రాలు లోనే ఎక్కువ కనిపిస్తుంది... ఒక జాడ్యం ఒకేసారి మారదు కొంచెం కొంచెం అయినా మారినా చాలు. అయితే అందరూ వీటిని మాత్రమే ప్రోత్సహస్తున్నారు అంటే కాదు మంచి కార్యక్రమాలు ప్రోత్సహించి ఔన్నత్యం చాటుతున్నవారు ఉన్నారు అటువంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను దయచేసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.. ఇది చదువుతున్నవారు .నలుగురికి తెలిసేటట్టు ఫార్వర్డ్ చెయ్యగలరు ఒక్క కమిటీ మారినా చాలు వాళ్ళ ద్వారా ఇంకొంత మంది మారటానికి అవకాశం ఉంది .... త్రినాధ్



Thursday, September 1, 2022

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

 బదరీ జ్యోతిష్పీఠ మరియు ద్వారకా శారాదాపీఠ సింహాసనాధీశ్వరులు, ద్విపీఠాధీశ్వరులు అస్మద్గురువులు అనన్తశ్రీవిభూషిత ధర్మసామ్రాట్ జగద్గురు శఙ్కరాచార్య స్వరూపానన్ద సరస్వతీ మహాస్వామి వారి 99 ప్రకటోత్సవం(జన్మదిన సందర్భంగా ) కోటి కోటి ప్రాణమాలు..


శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

పదవాక్య ప్రమాణ పారావార పారీణ 

యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాననిష్ఠా

తపశ్చర్యాచరణ చక్రవర్తిన

అనాది గురుపరంపరాప్రాప్త 

వైదికధర్మ ప్రచారణ పారాయణ

సకల దర్శన సమన్విత 

వేద వేదాంత సిద్ధాంత ప్రతిపాదకాచార్య

నిగమాగమ సార హృదయ 

సర్వతంత్ర స్వతంత్రత

వర్ణాశ్రమ సదాచార శిక్షకా

విశ్వకళ్యాణ మానసా

అఖండ భూమండలాచార్యా

అనంత శ్రీ విభూషిత శ్రీ మదాద్య శంకరాచార్య భగవత్పాద స్థాపిత మర్యాదా పోషణ పరాయణా

పరాపర విద్యాధ్భోదితాంతఃకరణా

అలకనందా తీరవాసిన

శ్రీ బదరీనారాయణ సమాధాన మానసా

జ్యోతిరీశ్వరసహిత పూర్ణాంబోపాసక

ఉత్తరామ్నాయ జ్యోతిర్మఠాధీశ్వర 

గోమతీ తీరవాసిన

పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠాధీశ్వర 

అనంత శ్రీ విభూషిత శ్రీ జగద్గురుశంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివర్యా తవ పాదారవిందయోః సాష్టాంగ ప్రణా

మాన్ సమర్పయామః

🙏🕉️🚩

Thursday, August 18, 2022

 పుష్ప విలాపం.. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 


Pushpa vilapam....the cry of the flower...Jandhyala. Papaiya Shastri.


The delicate flower,cries in pain and anguish, as the  woman plucks the flowers from the creeper and makes garlands by poking  them with needles..


పల్లవి:


నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ

ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతోంది

పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి

అప్పుడు..


నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి

గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి

మా ప్రాణము తీతువా..ఆ..యనుచు బావురుమన్నవి కృంగిపోతు

నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై.. ఆ.. ఆ.. ఆ..


చరణం 1:


అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అన్నది ప్రభు


ఆయువుగల్గు నాల్గు ఘడియల్

కనిపించిన తీగతల్లి జాతీయత దిద్ది తీర్తుము

తదీయ కరమ్ములలోన స్వేచ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము

ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము

ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

ఆ....ఆ...


ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డు వస్తావ్?

మేము నీకేం అపకారము చేసాం?


గాలిని గౌరవింతుము సుగంధము పూసి

క్షమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు

మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాళుము

త్రుంప బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతురే... ఏ....ఏ....


చరణం 2:


ఇంతలో ఒక గులాబి బాల కోపంతో

ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభూ..


ఊలు దారాలతో గొంతుకురి బిగించి

గుండెలోనుండి సూదులు గ్రుచ్చి, కూర్చి

ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మూ..

అకటా..ఆ.. దయలేనివారు మీ ఆడవారు


పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే


మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల

మీకై త్యజించి కృశించి నశించిపోయే..

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల

మీకై త్యజించి కృశించి నశించిపోయే..

మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి

మమ్మావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా..ఆ..


చరణం 3:


ఓయీ మానవుడా


బుద్ధదేవుని భూమిలో పుట్టినావు

సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి

అందమును హత్య చేసెడి హంతకుండా

మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ఆ... ఆ... ఆ...


అని దూషించు పూలకన్నియల కోయలేక

వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని

నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..

ప్రభూ ఊ ఊ ఊ...


Friday, June 24, 2022

భయం -ఖలీల్ జిబ్రాన్

 భయం


అంటారు సముద్రంలో కలిసిపోయే ముందు నది 

భయంతో వణకిపోతుందని


దాటివచ్చిన దారిని వెనక్కు తిరిగి చూచుకుంటుంది

పర్వతాగ్రాలనుండి అరణ్యాలు జనపదాలు, వంపుల సుదీర్ఘపయనం.


ఎదురుగా చూచింది ఎంతటి అనంతసముద్రం 

అందులో దిగడమంటే శాశ్వతంగా అదృశ్యమవడమే.


మరో దారి లేదు 

నది వెనక్కు తిరగలేదు. 


సాహసం చేయవలె

సముద్రంలో దిగవలె

అప్పుడే భయం వదిలిపోగలదు

అప్పుడు కాని తెలియదు 

అబ్ధిలో లబ్ధి

అదృశ్యమవడం అంటే

సముద్రమవడం అని. 


                        -ఖలీల్ జిబ్రాన్


నోట్: 

[Nobody can go back

To go back is impossible in existence 


ఆంగ్లానువాదంలోని యీ చరణాలు నా తెలుగు అనువాదంలో వదిలేశాను. అవి లేకున్నా కవిత పూర్ణమే అనిపించింది. ]


Sunday, May 29, 2022

మిత్రులు శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు, వకీలు, సుప్రీంకోర్టు, మాజీ జిల్లా న్యాయమూర్తి గారితో ముఖాముఖి - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌

 


మిత్రులు శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు, 

వకీలు, సుప్రీంకోర్టు, మాజీ జిల్లా న్యాయమూర్తి గారితో ముఖాముఖి - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌

ఈ దిగువ లింక్‌ ల్లో చూడండి

1) https://www.youtube.com/watch?v=o9XIU4DJyGs




2) https://www.youtube.com/watch?v=-Lnbvi7rqVQ








Monday, February 28, 2022

"స్కైలాబ్" తగిన ప్రచారానికి నోచుకోని ఒక చక్కని సినిమా

 ఒక చక్కని సినిమా ఇది ప్రచారం లేదు  

4 డిసెంబర్ 2021 తేదీన విడుదలైన స్కైలాబ్ సినిమా ఎంతమంది చూసారు. 1979లో స్కైలాబ్ నేలమీద పడబోతోందన్న వార్త ఇతివృత్తంగా ఆ నేపథ్యంలో ఒక తెలంగాణా పల్లెటూరి నేపధ్యంగా అల్లిన ఈ చిత్రం లో  సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, నారాయణరావు, తులసి, సుబ్బరాయ శర్మ, తదితరులు నటించిన ఈ సినిమా 

1979లో స్కైలాబ్ ఊరి మీద పడుతుందని అప్పట్లో ప్రతి ఊళ్లోనూ కలకలం ఏర్పడిన సంగతి అప్పటి వారికి తెలుసు. 

ఎలాగూ పొతాము అనే తెగింపుతో చాలామంది ఆస్తులమ్మేసుకోవడం, దానాలు చేసేయడం, రకరకాల తీరని కోర్కెలు తీర్చేసుకోవడం, ఎవర్నైనా తిట్టాలనుకుంటే భయాన్ని పక్కనబెట్టి తిట్టేయడం, పెరట్లో ఉన్న కోళ్లని మేకల్ని కోసుకు తినేయడం, రైతులు పొలం పనులకు వెళ్లకపోవడం, చాలమంది తాగి పొడుకోవడం లాంటివి చేసారు. 

చివరికి స్కైలాబ్ సముద్రంలో పడడంతో కధ సుఖాంతం అయింది. సరదాగా నడుస్తుంది. నటీనటుల హవభావాలు, నెపధ్య సంగీతం కెమెరా పనితీరు, ఆర్ట్ వర్క్ లాంటి సాంకేతిక విలువలు బాగున్నాయి  1979 నాటి కాలాన్నిపునఃసృష్టించడం కళా దర్శకుని ప్రతిభ కు నిదర్శనం. ఈ చిత్రం ఒక ఆర్ట్ సినిమాలా అలరిస్తుంది. 

మీ కోసం ఈ లింక్‌ ఇస్తున్నాను. https://www.youtube.com/watch?v=CFj76ZnB-5Q   చూడండి! ప్రచారం మనం కల్పిద్దాం! మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్‌ 



Total Pageviews