Wednesday, October 25, 2017

మీరు గెలవాలి అనుకొంటున్నది ఒక్క కాంపిటీటివ్ పరీక్ష లోనా లేదా జీవితం లోనా ?

ఈ రోజు వార్తా పత్రికల్లో ఐదుగురు విద్యార్థుల ఆత్మ హత్య లకు సంబందించిన వార్తలు . ప్రతి రోజు కనీసం ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఆత్మ హత్య లు చేసుకొంటున్న పరిస్థితి .
మెడికల్ సీట్ వస్తుందో రాదో అని ఆత్మ హత్య చేసుకొనే వారు కొందరైతే ఎంబీబీస్ లో చేరాక మంచి మార్కులు రావడం లేదని బలవన్మరణానికి పాల్పడేవారు కొందరు . ఐఐటీ లో సీట్ రాదని కొందరు , ఐఐటీ చదువు ముగిసి క్యాంపస్ ప్లేసెమెంట్ లో ఉద్యోగం రాలేదని ఆత్మ హత్య చేసుకొనేవారు మరికొంత మంది . పరిస్థితి భయానకంగా వుంది .
పిల్లల ఆత్మ హత్య ల కు కార్పొరేట్ సంస్థల్లో ని విపరీతమైన ఒత్తిడి కారణం అనేది అందరికి తెలిసిందే . మరో కారణం పిల్లలకు లైఫ్ స్కిల్స్ తో కూడిన విద్య అందక పోవడం .
కింది తరగతుల నుంచి కేవలం మార్కులు, రాంక్ ల పై ద్రుష్టి పెట్టి , క్రీడా స్ఫూర్తి నింపే ఆటలు , ఆత్మ విశ్వాసాన్ని పాదుకొలిపే లైఫ్ స్కిల్స్ పాటలు ఉండక పోవడం మరో కారణం . కేవలం కారణాలను విశ్లేషించుకొంటే లాభం లేదు . పిల్లలలో ఆత్మ విశ్వాసం నింపే ఒక చిన్ని ప్రయత్నం ! ఈ పోస్ట్ విద్యార్థుల కోసం !!

గెలుపు లోకానికి నిన్ను పరిచయం చేస్తుంది . ఓటమి లోకాన్ని నీకు పరిచయం చేస్తుంది . ఏది ముఖ్యం ? లోకాన్ని నువ్వు తెలుసుకోవడమా లేక లోకానికి నువ్వు పరిచయం కావడమా? ముందుగా లోకాన్ని తెలుసుకోవాలి . లోకాన్ని తెలుసుకోకుండా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సినిమా స్టార్ లు , క్రికెట్ స్టార్ లు జీవితం మలి దశ లో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు . కొందరైతే అర్ధాంతరంగా జీవితం చాలించారు . ఇప్పుడు తేల్చుకోండి ఏది ముఖ్యం ? గెలుపా? ఓటమా?
గెలుపు ప్రతికూల మిత్రుడు .. కన్నింగ్ ఫ్రెండ్ .. అయాచితంగా చిన్న వయసులో విజయం సాధించిన వారు .. తమ శక్తి సామర్త్యాలను ఎక్కువగా ఊహించుకొని .. ఇక మనకు మొత్తం తెలుసు; ఇక నేర్చుకోవలసింది ఏమి లేదు అనే మనస్తత్వం తో జీవితం లో చతికిల పడుతారు. ఇలాంటి వారు కోకోల్లలు .
ఓటమి అనుకూల శత్రువు .. honest enemy .. ఒక్క ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది ... ఎన్ని ఓటములు ఎదురైతే అన్ని పాఠాలు .. అంత అనుభవం .. జీవితం లో అంత రాటు దేలుతారు . జీవితం అనే మారథాన్ రేస్ లో ఇలా రేటు దేలిన వారికే హ్యాపీనెస్ జీవితాంతం వెన్నంటి ఉంటుంది .
వంద మీటర్ ల పరుగు పందెం లాంటి ఒక్క పరీక్ష లో { ఎంబీబీస్, ఐఐటీ, సివిల్స్ , మిస్ వరల్డ్ } నెగ్గితే తాత్కాలిక ఆనందం వస్తుంది . ఇక అటు పై మాజీ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ లా ఒకప్పుడు ఇలా ఉండేది అంటూ జీవితాంతం పాతజ్ఞాపకాలను నెమరు వేసుకొంటూ బతకాల్సిందే .
నిన్నటి కంటే నేడు గొప్పగా ఉండాలి .. నేటి కంటే రేపు గొప్పగా ఉండాలి . అలా కాకుండా నిన్నటి కంటే నేడు హీనం అయితే ఇక బతుకు దయనీయం . { అదేంటి ఐఏఎస్ పరీక్ష లో ఒక సరి పాస్ అయితే ఇక జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు కదా అనుకొంటున్నారా ? అయితే మీకు వారి జీవితాలగురించి పెద్దగా అవగాహన లేనట్టే } .
అది ఒక హిందూ దేవాలయం . అందులోని విగ్రహం రాతి తో చేసింది . గర్భగుడి నేల పై కూడా రాతి బండలు పరిచారు . నేల పై ఉన్న ఒక రాయి బండ చాలా రోజుల పాటు జరుగుతున్న తంతు ను చూసి ఒక రోజు విగ్రహం తో ఇలా అందట . " అదేంటి నువ్వు నేను ఒక కొండ పై వుండే ఒక పెద్ద బండ రాయి నుంచే వచ్చాము కదా . నీకు జనాలు వంగి దండం పెట్టి పూజలు చేసి పూలు చల్లు తున్నారు . నా పై ఎక్కి నిల్చుంటున్నారు . నువ్వు చేసిన పుణ్యం, నేను చేసిన పాపం ఏంటి "
దానికి విగ్రహం లోని రాయి ఇలా అంది " మిత్రమా .. ఇద్దరం ఒకే చోటు నుంచి వచ్చిన మాట నిజం . కాని నన్ను ఈ రూపం లో నిలపడానికి శిల్పి వేలాది దెబ్బలు నా వొంటి పై వేసాడు . అన్నింటికీ తట్టుకొని నిలపడ్డాను . అందుకే ఈ రోజు ఈ గౌరవం . ఇక నీదేముంది . నాలుగంటే నాలుగు పోట్లు కూడా పడ లేదు . నీకు ఇంత కన్నా గౌరవం ఎలా దక్కుతుంది ?
వజ్రం .. బొగ్గు .. రెండు కార్బన్ అని ఎంసెట్ . ఐఐటీ కి బట్టి కొట్టే మీకు తెలియంది కాదు . కాకా పొతే అవి చెప్పే పాఠం ఒకటి వుంది . ఒత్తిడి తట్టుకుంది వజ్రం అయ్యింది . మిగతాది బొగ్గుగానే వుంది . అది సంగతి . దీని అర్థం కార్పొరేట్ హాస్టల్స్ లో వారు పెట్టె హింస మొత్తం సమర్థనీయం అని కాదు . నేను మాట్లాడుతున్నది జీవితం లో ముఖ్యం గా కాంపిటీటివ్ పరీక్షల్లో ఎదురైయ్యే ఒత్తిడి గురించి .
అయినా .. ఒకటో రెండో .. ఓటములు ఎదురైతే .. అవమానాలు ఎదురైతే ఆత్మ హత్యా చేసుకోవడం ఏంటండీ ? బాబా సాహెబ్ అంబెడ్కర్ కు చిన్న వయసులో ఎదురైన అవమానాలు ఎన్ని ? ఆయన కూడా నేటి యువత లాగా అలోచించి ఉంటే భారత జాతి కి " నవ సమాజ నిర్మాత" దక్కే వాడా? అవమానాలను తట్టుకొని నిలపడ్డాడు .. మెట్టు మెట్టు ఎక్కాడు కాబట్టే నేడు ఆయన దేవుడి లా చూడబడుతున్నాడు .
అటు ఇటుగా అబ్దుల్ కలాం జీవితం కూడా ఇదే గా ? ఇలాంటి మహనీయుల పేర్లు ఎన్నినా చెప్పవచ్చు . అన్నింటి సారాంశం ఒక్కటే .. పడ్డ వాడు .. చెడ్డ వాడు కాదు .. నేటి కష్టం .. వడ్డీ తో సహా రేపు సుఖాన్ని తెస్తుంది .. కావాల్సిందల్లా మనం కష్టాన్నుండి .. ఓటమి నుండి .. అవమానంనుండి .. సరైన పాఠాన్ని గ్రహించడమే .
ఇంత గొప్ప వ్యక్తుల గురించి కాదు కానీ మీకు మరో సాదా సీదా వ్యక్తి గురించి చెబుతాను . మీ అమ్మ నాన్న లాగే అతని తల్లితండ్రులు కూడా పుట్టినప్పుడే మా వాడు డాక్టర్ కావాలి అని నిర్ణయించేసారు . మూడు ఏళ్ళు నిండా కుండా నే ఒకటో తరగతి లో చేర్చేసారు . టీచర్ లయిన ఆ తల్లితండ్రులు మన వాడు చురుగ్గా చదువుతున్నాడు .. చిన్న వయసులో అయితే ఎలాంటి diversions లేకుండా టార్గెట్ సాధిస్తాడు అని ఆశ పడ్డారు . చదువైతే చురుగ్గా సాగించాడు కానీ ఆ అబ్బాయికి అండర్ ఏజ్ కారణం గా ఎంబీబీస్ రాసె అవకాశం ఇంటర్ అయ్యిందే రాలేదు . విథి లేక B SC లో చేరాల్సి వచ్చింది . డిగ్రీ పూర్తయ్యాక MBBS రాసే అవకాశం వచ్చినా మనకంటే జూనియర్స్ తో ఎలా అని పరీక్ష కు సరిగ్గా ప్రిపేర్ కాలేదు . ఏమైతే ఏమి / డాక్టర్ కావాలి అని కాలేక పొయ్యాడు .
అటు పై ఐఏఎస్ అనుకొన్నాడు . ఇది సొంత ఆలోచన . ప్రయత్నం తీవ్రంగానే చేసాడు . మొత్తం మూడు సార్లు ప్రిలిమ్స్ మైన్స్ దాటి ఇంటర్వ్యూ కు వెళ్లినా ఏదో ఒక సర్వీస్ వచ్చింది కానీ అనుకొన్న ఐఏఎస్ రాలేదు . కారణాలు ఏమైతే నేమి .. మళ్ళీ టార్గెట్ లో ఛేదన లో ఫెయిల్.
సో ఏమి చెయ్యాలి ? ఆత్మ హత్య చేసుకోవాలా ? జీవితం లో రెండు సార్లు ఫెయిల్. అనుకొన్నది సాధించలేదు . అసలు అను కొన్నది ఏంటి ?

రెండు ఓటములు అతనికి లైఫ్ స్కిల్స్ పాఠాల్ని నేర్పాయి . జీవితం పై అవగహన పెంచాయి . చెయ్యాల్సింది ఏమిటో అర్థం అయ్యేలా చేసాయి ..
డాక్టర్- ఐఏఎస్ లక్ష్యమా .. లేక మార్గమా .. మార్గం మాత్రమే .. ఐఏఎస్ అయితే హ్యాపీ గ బతకొచ్చు .. మంచి పేరు ప్రఖ్యాతులు సాదించ వచ్చు .. డాక్టర్ అయితే కూడా అంతే.. సో లక్ష్యం ఏమిటంటే .. హ్యాపీ గా బతకడం .. మంచి పేరు సంపాదించడం .. నలురికి ఉపయోగ పడడం. ఆ అబ్బాయి చిన్నప్పుడే విజయం సాధించి ఉంటే బహుశా ఒక మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా ఉండేవాడు . ఐఏఎస్ అయ్యివుంటే ఒక డిపార్టుమెట్ కు సెక్రెట్రరీ అయ్యి వుండే వాడు . కానీ ఇప్పుడు వందల వేల మంది ని డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ లు గా తీర్చిదిద్దుతున్నాడు. అసలు టీచింగ్ తన passion అని అతనికి చాలా లేటుగా అర్తం అయింది . అందుకే డాక్టర్ , ఐఏఎస్ కన్నా ఎక్కువగా తన ప్రొఫెషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు .
మన అభిరుచి కి తగ్గ రంగం మనకు దొరికినప్పుడు మనం పూర్తి స్థాయి జాబ్ సాటిస్ఫాక్షన్ పొందుతాము . చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తాము . అప్పుడు మనకు అలసట తెలియదు . పని వెంట మనం పడితే .. మన వెంట పేరు ప్రఖ్యాతలు డబ్బు పడుతాయి . డబ్బు వెంట పేరు వెంట మనం పడితే అవి మనకంటే వేగం గా పరి పారిపోతాయి . అర్థం చేసుకోండి .
మీకు వీక్ ఎండ్ టెస్ట్ ల లో తక్కువ మార్కు లు వస్తున్నాయా ? మీ సెక్షన్ కిందకు కిందకు వెళుతోందా ? మీ లెక్చరర్స్ , మీ అమ్మ నాన్న .. చివరకు మీ స్నేహితులు కూడా మిమల్ని చిన్న చూపు చూస్తున్నారా ? అబ్బా! మీరెంత అదృష్టవంతులు .. ఆ కసి ని అలాగే ఉంచుకోండి .
. నిదానం .. ప్రదానం .. మిమ్మల్ని ఇప్పుడు వెక్కిరించినవారే మీ ఆఫీస్ ముందు ఉద్యోగం కోసం నిలిచే రోజు వస్తుంది . వారు బిట్లు బట్టికొడుతున్నారు . మీరు లైఫ్ స్కిల్స్ పాఠాన్ని ప్రాక్టికల్ గా నేర్చుకొంటున్నారు . జస్ట్ టైం.. అలాగే.. అలాగే .. మారథాన్ రేస్ సాగించండి .. మరీ ఎక్కువ వేగం అక్కర లేదు . వేగం గా పయనించిన వాడు ఎవ్వడు మారథాన్ రేస్ లో గెలిచినట్టు చరిత్ర లో లేదు . తేల్చుకోండి . మీరు గెలవాలి అనుకొంటున్నది ఒక్క కాంపిటీటివ్ పరీక్ష లోనా లేదా జీవితం లోనా ? కేవలం ఒక్క పరీక్ష లోనే అంతే మీకు నా సానుభూతి .. జీవితం లో అనుకొంటే .. మళ్ళీ కలుద్దాం .

No comments:

Post a Comment

Total Pageviews