Sunday, October 29, 2017

జనభాషలో తీర్పులే న్యాయం! Enadu Editorial

జనభాషలో తీర్పులే న్యాయం!
న్యాయం చెయ్యడమే కాదు, చేస్తున్నట్లూ కనిపించాలన్నది సమున్నత న్యాయసూత్రం. కాలానుగుణ సంస్కరణలకు నోచక, కొందరు న్యాయమూర్తులే లోగడ చెప్పినట్లు ఇంకా ఎడ్లబండి కాలంలోనే ఉన్న న్యాయపాలికలో- కక్షిదారులకు అర్థంకాని భాషలో సాగే వాదోపవాద విన్యాసాలు న్యాయార్థుల్ని ఏ దరికి చేరుస్తున్నాయన్నది అగమ్యగోచరం! సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల కొండలు కొద్దిగా కరుగుతుంటే, దిగువకోర్టుల్లో వాటి తాకిడి పెరుగుతోందని సర్కారీ లెక్కలు చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ‘సుప్రీం’ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాలు వెలువరించిన సూచనలు, హితోక్తులు ఎంతో విలువైనవి. ప్రజలకోసం న్యాయస్థానాలున్నాయిగాని, కోర్టులకోసం ప్రజలు కాదన్నదే న్యాయపాలిక సేవాగుణ మౌలిక లక్షణం కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఉద్బోధించారు. అందుకు అనుగుణంగా- కక్షిదారులకు తెలిసిన, అర్థమయ్యే భాషలోనే హైకోర్టుల తీర్పులు ఉండాల్సిన అవసరాన్ని ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ నొక్కి చెప్పారు! దేశవ్యాప్తంగా 24 ఉన్నత న్యాయస్థానాలున్నాయి. వాటిలో న్యాయ విచారణ ప్రక్రియ కక్షిదారులకు అవగతం కాని ఆంగ్లభాషలోనే సాగుతుండటంపట్ల దశాబ్దాలుగా వాద వివాదాలు రేగుతున్నాయి. పూర్వాశ్రమంలో న్యాయవాదిగా ఆ సమస్య లోతుపాతులు తెలిసిన కోవింద్‌- కనీసం తీర్పుల సారం కక్షిదారులకు అవగాహనకు వచ్చేలా వారి వారి భాషల్లో ఆయా న్యాయ నిర్ణయాల అనువాద ధ్రువీకృత ప్రతుల్ని అందించే యంత్రాంగం ఏర్పాటు కావాలని సూచిస్తున్నారు! అంతవరకు అది బాగానే ఉన్నా- ఆయా రాష్ట్రాల పరిధిలోని దిగువ కోర్టుల్లో స్థానిక భాషల్లో న్యాయ విచారణ ప్రక్రియ ఇంకా అమలుకాకపోవడం ఏమిటి? తాము వెళ్లబోసుకొనే గోడు ధర్మపీఠాల దృష్టికి సజావుగా చేరుతోందో లేదో తెలియక, విచారణ ప్రక్రియలో, తీర్పుల్లో ఆంగ్ల భాష అర్థంకాక కక్షిదారులు పడే వేదనకు దశాబ్దాలుగా పరిష్కారం ఏదీ?
సామాన్యుడు సైతం తన కేసును తానే వాదించుకొని సరైన పరిష్కారం పొందగల న్యాయవ్యవస్థ ఉండాలని పూజ్య బాపూజీ ఆకాంక్షించారు. వివాద పరిష్కారంకోసం బక్క రైతు బస్తీకి వెళ్ళి కొన్ని వారాల పాటు బస చేయాల్సిన పరిస్థితి రాకూడదని గాంధీజీ అభిలషించినా- పలుపు కోసం కోర్టుకెక్కి బర్రెను అమ్ముకొనే దుస్థితి దాపురించిందిప్పుడు! తమ తరఫున నల్లకోటు వకీళ్లు తమకే మాత్రం తెలియని భాషలో ఏం వాదిస్తున్నారో గుడ్లప్పగించి చూడటమేగాని, తమ గుండె ఘోష వాళ్ల గళాల్లో పలుకుతున్నదీ లేనిదీ తెలుసుకోగల అవకాశం కోట్లాది కక్షిదారులకు లేదు. రాజ్యాంగంలోని 348 అధికరణ సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఆంగ్ల భాషే చెల్లుబాటు కావాలని తీర్మానించింది. ఆయా హైకోర్టుల్లో ప్రాంతీయ భాషల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చే వినతుల్ని ఆమోదించరాదని సర్వోన్నత న్యాయపాలిక 1997, 1999, 2012లో గట్టిగా నిర్ణయించింది. కోర్టుల తీర్పుల్ని హిందీతోపాటు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యులులో పొందుపరచిన భాషల్లో తర్జుమా చేసి అందుబాటులో ఉంచాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2015 డిసెంబరులో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టుల భాష ఆంగ్లమేనంటూ ‘సుప్రీం’ గట్టిగా స్పష్టీకరించిన నేపథ్యంలో- రాష్ట్రపతి తాజా సూచనకు ఏ పాటి మన్నన దక్కుతుందో చూడాలి. అంతకు మించి, దిగువ కోర్టుల్లో ఆంగ్లభాష వినియోగాన్ని కక్షిదారులపట్ల క్రూర పరిహాసంగానే సంభావించాలి! సూటిగా సరళంగా స్పష్టంగా ఉండాల్సిన తీర్పులు ఆంగ్ల భాషా పటాటోప ప్రదర్శనగా నివ్వెరపరుస్తున్నాయంటూ మొన్న మే నెలలో వెలుగు చూసిన వార్తాకథనాలు- నాణేనికి ఒక పార్శ్వం. జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో పోగుపడిన రెండుకోట్ల 68 లక్షల కేసుల్లో స్థానిక భాషల్లో విచారణ జరిగినప్పుడే కక్షిదారులకు దక్కుతుంది- పారదర్శక న్యాయం!
‘అసలు న్యాయస్థానాల్లో వాదనలు, ఇతర కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడం ఏమిటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం?’- రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జీఎస్‌ సింఘ్వి 2006లో వ్యక్తీకరించిన ధర్మాగ్రహమది! జిల్లా సెషన్స్‌ కోర్టు, అంతకు దిగువనున్న న్యాయాలయాల్లో స్థానిక భాషలోనే తీర్పులు వెలువడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 1974లోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాల జారీతోనే తన బాధ్యత తీరిపోయిందని భావించిన ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి నిదర్శనగా, న్యాయాలయాల్లో ఆశ్రితులకు అర్థంకాని ఆంగ్లమే నేటికీ రాజ్యమేలుతోంది. తెలుగు గడ్డపై తెలుగులో న్యాయపాలనకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని, న్యాయ పదకోశాలు, న్యాయ శాస్త్ర గ్రంథాలు, చట్టాలను అనువదించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని 2013 ఫిబ్రవరిలో ప్రధాన న్యాయమూర్తిగా పినాక చంద్రఘోష్‌ ప్రకటించారు. దాదాపు అదే సమయంలో- స్థానిక న్యాయస్థానాల్లో తెలుగు వెలుగులీనేలా చేయడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయన్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ- తెలుగులో న్యాయ పదకోశం సరిగా అందుబాటులో లేకపోవడం వాటిలో ఒకటంటూ రాష్ట్ర న్యాయ అకాడమీ అధ్యక్షులుగా తనవంతు ప్రయత్నం చేశారు. రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణాల్లో సామాన్య జన భాషలోనే తీర్పులుంటాయంటున్నప్పుడు ఆ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ వెనుకబడటం ఏమిటి? న్యాయపాలన క్రతువు తేట తెనుగులో సాగితే పారదర్శకత ఇనుమడించి కేసుల సత్వర పరిష్కారమూ సాధ్యపడుతుంది. మాతృభాషకు మంగళారతులు పడతామంటున్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ దిగువ కోర్టుల్లో తెలుగు వెలుగుకు దివిటీలు పట్టే కార్యాచరణను సత్వరం పట్టాలకెక్కించాలి!
జిల్లా వార్తలు

No comments:

Post a Comment

Total Pageviews