Tuesday, April 7, 2015

ప్రదక్షిణ

                                                                  ప్రదక్షిణ
                                       ఆలయాలను సందర్శించునపుడు ప్రదక్షిణ చేయడం అనేది అనాదిగా వస్తున్నా హైందవ సాంప్రదాయం. గర్భగుడిలోనున్న మూలవిరాట్టును దర్శించు కొనడానికి ముందుగా గర్భగుడిచుట్టూ భక్తులు కొన్ని సార్లు ప్రదక్షణ చేస్తుంటారు. మనసును ప్రాపంచిక విషయ చింతనల నుండి భక్తిభావాలవైపుకు మళ్ళించడానికి ప్రదక్షిణ తోడ్పడుతోంది. ఈవిధంగా మనస్సును ముందుగా శుభ్రపరచుకొని, పవిత్రమొనరించుట ద్వారా తరువాత మూలవిరాట్టును దర్శించుకొనినపుడు, ఇతర ఆలోచనలు లేకుండా పరిపూర్ణమైన మనస్సుతో దైవాన్ని ప్రార్ధించడానికి, దైవంపై మనస్సును సంపూర్ణంగా లగ్నం చేయడానికి ప్రదక్షిణ ఉపకరిస్తుంది. దేవాలయాలోనే కాకుండా, మహాత్ములకూ, పవిత్రస్థలాలకు, వృక్షాలకు, పర్వతాలకు, సరస్సులకు కూడా ప్రదక్షిణ చేయడం పరిపాటి. షిర్డీ, మంత్రాలయాలలోగల సమాధులకు, ఇళ్లలో పెంచే తులసి మొక్కకు, మారేడు, రావి వేప, మర్రి మొదలగు వృక్షాలకు, అరుణాచలం, కైలాసశిఖరం, బృందావనం మొదలగు పర్వతాలకు, మానస సరోవరంలాంటి సరస్సులకు కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు. వివాహాది కార్యక్రమాల్లో వధూవరులను అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. షోడశోపచార పూజావిధానంలో ఆత్మప్రదక్షిణ రూపంగాను యజ్ఞయాగాది క్రతువులలోను ప్రకక్షిణ ఒక అంతర్భాగమనేది చెప్పనవసరం లేదు.

                                       ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది. ‘ప్ర’ అనగా పాప నాశనమని, ‘ద’ అనగా కోరికలను నెరవేర్చుట అని, ‘క్ష’ అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అని ‘ణ’ అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించునదని అర్థం.

No comments:

Post a Comment