Monday, March 26, 2018

శ్రీ మద్రామాయణము నందలి వ్యక్తిత్వాల శోభ.

శ్రీ మద్రామాయణము నందలి కొన్ని సందర్భాలు/ సంభాషణలు.
ఆయా మహోన్నత వ్యక్తిత్వాల శోభ ఎలాంటిదో చూడండి.

వాల్మీకితో నారదుడు.

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ౹
ఆర్యః సర్వసమశ్చైవ సదైవప్రియదర్శనః ౹

స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః ౹
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ౹

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శినః ౹
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ౹
ధనదేన సమ స్తాగే సత్యే ధర్మ ఇవాపరః ౹

16-18, 1 వ సర్గ, బాలకాండము,శ్రీమద్రామాయణము.

నదులు సముద్రమును కలిసినట్లు సత్పురుషులు నిరంతరం శ్రీరాముని చేరుచుందురు.
అతను అందరికీ పూజ్యుడు. ఎవరియెడలా వైషమ్యాలు గాని,తారతమ్యాలుగానీ లేక మెలగువాడు.,
ఎల్లవేళలా అందరికీ ఆయన దర్శనము ప్రీతినిగొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణవిలసితుడు, అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీమహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు,సుతిమెత్తని హృదయం కలవాడే ఐనను తన ఆశ్రితులకు అపకారం చేసినవారి యెడల ప్రళయాగ్నివంటివాడు.
సహనమున భూదేవి వంటివాడు. కుబేరుడివలె త్యాగస్వభావం కలవాడు,సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు.

సీతాదేవి రాములవారితో.....
పశ్చాదపి హి దుఃఖేన మమ నైవాస్తి జీవితమ్ ౹
ఉజ్ఝితాయాస్తవయా నాథ!తదైవ మరణం వరమ్ ౹

ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే ౹
కిం పునర్దశవర్షాణి త్రీణిచైకం చ దుఃఖితా ౹

20 - 21, 30 వ సర్గ, అయోధ్యాకాండ, శ్రీ మద్రాయణము.


ప్రభూ! నీవు నన్ను ఇచటనే  విడిచి, వనములకు వెళ్ళినచో, ఆ పిమ్మటనైన దుర్భరమైన నీయెడబాడు కారణముగా నేను జీవించియుండుట అసంభవం.
కనుక, ఇప్పుడే నీయెదుటనే ప్రాణములు వీడుట మేలు.
స్వామీ! నీకు దూరమై ఈ విరహ బాధను ఒక్క క్షణం కూడా భరించలేను. ఇక దుర్భరదుఃఖముతో పదునాలుగేళ్ళు ఎలా గడపగలను?

అరణ్యవాసం విషయంలో శ్రీ రామునితో లక్ష్మణుడు.

న దేవలోకాక్రమణం నామరత్వమహం వృణే ౹
ఐశ్వర్యం వాపి లోకానం కామయే న త్వయా వినా ౹

5, 31 వ సర్గ, అయోధ్యాకాండ.

స్వామీ! నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభిఃచిననూ నాకు అక్కర లేదు, జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకొనను., అంతే  కాదు పరమపద ప్రాప్తిని సైతము నేను వాంఛింపను.

శ్రీ రామునితో భరతుడు.

 అధిరోహా౽ర్య! పాదాభ్యాం పాదుకే హేమభూషితే ౹
ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః ౹

తవ పాదుకయోర్న్యస్య రాజ్యతంత్రం పరంతప! ౹
చతుర్దశే హి సంపూర్ణే వర్ష౽హని రఘూత్తమ!౹
న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్షామి హుతాశనమ్౹

21& 25,
112 వ సర్గ, అయోధ్యాకాండ.


పూజ్యుడైన ఓ అన్నా! నీ పాదుకలు బంగారం తో తాపబడినవి.
వాటిని ఒకసారి నీ పాదములకు తొడిగి నాకు అనుగ్రహింపు.
అవే సమస్తలోకాలకు యోగక్షేమాలు సమకూర్చును.

ఓ పరంతపా! ఈ పదునాలుగేళ్ళు రాజ్యతంత్రమును నీ పాదుకల మీదనే ఉంచెదను.
పదునాలుగేళ్ళు ముగిసిన మరునాడు నీ దర్శనం కానిచో అగ్ని ప్రవేశం చేసెదను.


No comments:

Post a Comment