Thursday, July 11, 2019

గుండె లోతుల్లో ఓ జ్ఞాపకం

గుండె లోతుల్లో ఓ జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తొలకరి వేళ
చిరుజల్లులు కురిసి
పుడమి కాంత మేనుకు
హాయిని కలిగించాయి!
గ్రీష్మతాపంతో
కమిలిన ధరాసుకుమారి
సుందర రూప లావణ్యం
ఆషాఢ మేఘం పలకరింపునకు
స్వాంతన పొంది
చిరుదరహాసంతో
పులకరించింది!
ఇంకా...
నువ్వు వస్తావనే ఆశ
నా గుండెలోతుల్లో
భద్రంగా దాగి ఉంది!
ఉగాదులెన్నో మారాయి
విరహం వేసవికి
నా హృదయంలో
వేడి సెగలు రగిలాయి!
కానీ.. చెలీ!
మునుపెన్నడో
నీతో పంచుకున్న
జ్ఞాపకాల మల్లెలు
సుగంధాలై పరిమళించి
రగులుతోన్న విరహాగ్నిలో
శాంతి ధూపం వేశాయి!
కాలం వేగంగా కదులుతున్నా
నీ ఊహల్లో బతుకుతోన్న నాకు
కాలగమనమే తెలియడంలేదు!
నా వలపు రహదారిలో
నువ్వు నా కోసం
నడిచి వస్తున్నావనే భావనే
నన్నింకా బతికిస్తోంది! *
-విడదల సాంబశివరావు 9866400059

అచ్చతెలుగు గళాకారుడు బాలు --- పున్నమరాజు


‘‘కలువలు పూచినట్లు! చిరుగాలులు చల్లగ వీచినట్లు! తీ

వలు తలలూచినట్లు! పసిపాపలు చేతులు సాచినట్లు! క్రొ 
వ్వలపులు లేచినట్లు! చెలువల్‌ చెలువమ్ముగ చూచినట్లుగా 
పలుకుట పూర్వపుణ్యపరిపాకముగాదె తలంచి చూడగన్‌’’
‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన ఈ పద్యం, శ్రీపతి పండితారాధ్యుల
బాలసుబ్రహ్మణ్యం వాచిక ప్రతిభను గుర్తుకు తెస్తుంది.

ఎందుకంటే...ఆయన స్వరంలో
అక్షరం’ అక్షర ‘మై నిలుస్తుంది...
హాస్యం లాస్యం చేస్తుంది...
శృంగారం సింగారాలు పోతుంది..
విషాదం మన కంట నీరొలికిస్తుంది..
భక్తిభావం భగవద్దర్శనం చేయిస్తుంది!

తరతరాలకు తన్మయ తరంగమై పల్లవిస్తున్న ఆ గాంధర్వ స్వరం- ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం!
పలుకులమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో, గానకళాకోవిదుడై, తెలుగు యశస్సుకు
తార్కాణంగా నిలిచిన నిత్య గాయకుడు, నిఖిల గాయకుడు, ‘‘బాలు’’గా కోట్లాది 
మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు 
ఈరోజు!

అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకుని, ఆయా భాషల్లోని మాటల భావాత్మని
తన గొంతులో పలికించి, ఆ భాషల శ్రోతలకు అవధీరహితమైన గళపరిమళాన్ని
పంచి, స్వరసామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగిన బాలు తెలుగువాడు కావడం మనం మరీ
మరీ మురిసిపోవలసిన విషయం!

బాలు నట గాయకుడు. ఏ నటుడి కోసం పాడుతున్నాడో 
ఆ నటుడి హావ భావాల్ని, నటనా ధోరణిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని, తదనుగుణంగా గాత్రాన్ని 
మలిచి పాటకు ప్రాణం పోయడం బాలుకు గొంతుతో పెట్టిన విద్య. 

ఆయన స్వరానికున్న అనితరసాధ్యవిస్తృతి, 
ఏ భావాన్నైనా అలవోకగా పలికించగల అనన్యత్వాన్ని ప్రసాదించింది. 
దానికి తోడు శిఖరాయమైన ఆ ప్రతిభ దైవదత్తమని మనఃపూర్వకంగా నమ్మి, 
ఏ మాత్రమూ అహంకారం లేకుండా, సాధనతో పరిపూర్ణతను సిద్ధింప చేసుకున్న మానవతామూర్తి బాలు!

కవి ఏ సందర్భంగా ఆ పదాన్ని వాడాడో తెలుసుకుని, భాషాభావ సంస్కారంతో, 
సమయోచితరీతిలో ఆ పదాల విలువ పెంచేవిధంగా స్వరచాలనం చేసి, 
పాటకు మన మదిలో శాశ్వత్వాన్ని ప్రతిపాదించిన నాదయోగి బాలు!

శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినప్పటికీ, శృత పాండిత్యంతో, అత్యంత 
అభినివేశంతో, దీక్షాదక్షుడై, కఠోర సాధన చేసి, త్యాగయ్య, శంకరాభరణం
చిత్రాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలను పండిత పామర మనోరంజకంగా 
ఆలపించి, అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్న గాన తపస్వి బాలు!

తొలినాళ్ళలో చేయూత నిచ్చిన గురువు పట్ల అభిమానంతో తన 
ధ్వనిముద్రణాశాలకు కోదండపాణి పేరును ఉంచడం, దైవసమానుడిగా భావించే
ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం, జానకమ్మ
ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేసాననే కృతజ్ఞతాభావంతో ఈ
పుట్టినరోజునాడు ఎస్‌ జానకికి జాతీయ పురస్కారాన్ని అందించడం బాలు
సంస్కారానికి, మహోన్నత వ్యక్తిత్వానికి, శుభలక్షణ సంపన్నతకు నిలువెత్తు
నిదర్శనాలు.

ఈటీవీ అధినేత రామోజీరావు గారి సూచన ఆమోదించి, 1996 నుంచి నేటి వరకూ 
అప్రతిహతంగా, అనితర సాధ్యమైన వ్యాఖ్యానపటిమతో బాలు నిర్వహిస్తున్న 
సంప్రదాయబద్ధమైన లక్షగళార్చన ‘‘పాడుతాతీయగా’’ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 
ఉన్న వర్తమాన గాయనీ గాయకుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వారి ప్రతిభకు పట్టం
కడుతూ, తెలుగు పాట కీర్తి కేతనాన్ని విశ్వ వేదికపై రెపరెపలాడిస్తోంది.

బహుముఖీయమైన ప్రజ్ఞా ప్రభాసిగా ఎదిగినా...సముద్రమంత ఆర్తితో 
శిఖరాయమానమైన కీర్తిని సాధించినా...తన సహజాత స్నిగ్ధాపిపాసతో
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని, వేలాదిమంది స్నేహితుల్నీ
సంపాదించుకున్న మనసున్న మనిషి బాలు!

గొంతులో తగ్గని మార్దవం, పలుకుబడిలో ఒలికే అందాలు, పాట భావంలో
ఒదిగేపోయే తత్త్వం, రాజీలేని తపన, సాహితీ అభిలాషతో కూడిన సంగీత ప్రజ్ఞ
ఔచితీవంతమైన గానపద్ధతి, బహుగాత్రదానధురీణత, అద్భుత నటనా కౌశలం
స్వంతం చేసుకున్న బాలు సుస్వర సర్వస్వమై ఎదిగి అందిపుచ్చుకున్న లెక్కలేనన్ని
పురస్కారాలలో పద్మశ్రీ, పద్మభూషణ్‌, శత వసంత భారతీయ చలన చిత్ర 
మూర్తిమత్వ పురస్కారాలు విశిష్టమైనవి.

పాటకోసమే పుట్టి, పామర, పండితారాధ్యుడై ప్రభాసిస్తున్న అచ్చ తెలుగు
గళాకారుడు, నిత్యనూతన పథికుడు బాలు మరిన్ని వసంతాలు సంగీతలోకాన
చిరయశస్సుతో జీవించాలి. ఈ గాన గంధర్వుడి ప్రస్థానం నిర్విరామంగా
కొనసాగాలని అశేష అభిమానుల విశేష ఆకాంక్ష!


- పున్నమరా
జు

Thursday, July 4, 2019

అందరికీ నమస్కారం! నా పేరు వైభవ్ గుర్తున్నానా? ఈ రోజు నాపుట్టిన రోజు!

అందరికీ నమస్కారం! నా పేరు వైభవ్ గుర్తున్నానా? నా వీడియోలు చూడాలంటే ఈ లింక్‌ నొక్కండి
ఈ రోజు నాపుట్టిన రోజు! 
ఏ మనిషి జీవితంలోనైనా రెండు గొప్ప రోజులు ఉంటాయి.
ఒకటి అతని పుట్టిన రోజు 
రెండవది ఎందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు! 
మన జీవితాలు అశాశ్వతం అని తెలిసినా
అన్నీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం - ఒక్క ప్రకృతిని తప్ప
ఏడుస్తూ వచ్చి ఏడిపిస్తూ వెళ్ళిపోయే
మధ్యలో నవ్వుతూ నవ్వించే కాలమే మన జీవితం
అందంగా వున్నవారికన్నా...
తన చుట్టూ వున్నపరిసరాల్ని అందంగా
చుట్టూ వున్న వారిని ఆనందంగా
వుంచేవారి జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది!
కొందరిని కొంత కాలం తర్వాత మర్చిపోతాం!
కొందరితో ఉన్నప్పుడు కాలాన్నే మరచిపోతాం!!
అందుకే మన సహచరులతో ఆహ్లాదంగా గడుపుదాం!
పదికాలాలూ మనల్ని గుర్తుంచుకునేలా....ప్రకృతికి ప్రేమిద్దాం
ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం!
అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం!
కానీ మనం ప్రకృతినుంచి ఎంతో తీసుకుని
ప్రకృతికి ఏమీ ఇవ్వడం లేదు.
కొంతైనా తిరిగి ఇచ్చేద్దాం లేకపోతె లావయిపోతాం
మొక్కలు నాటుదాం! వృక్షాలుగా ఎదిగిద్దాం!!
'ఒక పువ్వు రంగు చూస్తూ శతాబ్దాలు బతగ్గలను' అన్నారు కవి శేషేంద్ర.
కానీ మన జీవితంలో కనీసం ఒక్క మొక్కని నాటకుండా
ఒక పువ్వుని పుష్పించకుండా, చూడకుండా బతికేస్తున్నాం!
"మొక్క నాటడానికి అత్యుత్తమ సమయం 20 సంవత్సరాల క్రితం.
రెండవ అత్యుత్తమ సమయం ఇప్పుడు" అని ఒక చైనా సామెత.
ఆనందం అనేది మనం చేసే ఆలోచనల్లోనే ఉంటుంది.
శ్రీశ్రీ గారు చెప్పినట్లు “ఆచరణకు దారి తీస్తేనే ఆశయానికి సార్థక్యం!”
మన సామర్ధ్యాన్ని బట్టి మనల్ని మనం
అంచనా వేసుకుంటాము....
మన మహత్కార్యాలను బట్టి
ఇతరులు మనల్ని అంచనా వేస్తారు
ప్రతి రోజు ఒక సంకల్పంతో నిద్రలేచి
దానిని నెరవేర్చిన సంతృప్తితో నిద్రపోదాం!
మనం సాధారణ వ్యక్తులమే కావచ్చుకనీసం కొంతమందైనా
మనల్ని గొప్పగా భావించేలా జీవించాలి.
డబ్బు దుబారా కన్నా
సమయం వృధా చెయ్యడం మరింత ఎక్కువ నష్టం.
ఎప్పటికప్పుడు మనలో చెడుకలుపు మొక్కలని తొలగించి
మంచి ఆలోచనల విత్తనాలు నాటితే ఆ జీవితం ఆనంద బృందావనం అవుతుంది!
నన్ను చూడాలంటే ఒక మొక్కని నాటండి. అందులో పువ్వులా నవ్వుతూ పలకరిస్తా!
నీటిని వృధా చెయ్యద్దు! అది నా కన్నీరు
రండి మనందరమూ కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం! పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!!
భావితరాలకు మంచి పచ్చదనాన్ని అందిద్దాం!
నా పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపిన
మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
ఎప్పటికీ మీలో, మీతో వుండే
మీ ఆదర్శ ఆశయ కార్యాచరణ సాయి వైభవ్ విస్సా!












Total Pageviews