Saturday, February 28, 2015

మారిషస్ లోవున్న తెలుగుబందువు లందరికీ శ్రీ మన్మధనామ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది కవితద్వారా అందించడం జరిగింది. మణిసాయి - విస్సా ఫౌండేషన్.


మారిషస్ లోవున్న తెలుగుబందువు లందరికీ శ్రీ మన్మధనామ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది కవితద్వారా అందించడం జరిగింది. 
మణిసాయి - విస్సా ఫౌండేషన్. 




పరమత సహనం



అతి సర్వత్ర వర్జయేత్!! ఇతర మతాలను, ఆచారాలను అవమానించమని ఏ మతమూ, ఏ దేవుడూ చెప్పలేదు. ఇలా జాతి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా...భాషా సంస్కృతులు అవమానించేలా... ఇటువంటి చర్యలతో ఈ లౌకిక రాజ్యం లో పరమత సహనం కలిగిన వారి సహనాన్ని ఎక్కువగా పరిక్షించ వద్దని ఇతర మత సోదరులకి మా వినమ్ర విన్నపం...ఏ ప్రాంతం వారైనా ఏ మతం వారైనా తాను నిలవడానికి...తన ఉనికికి, తన అభ్యున్నతికి కారణమైన, ఆధారమైన ఆ ప్రాంతపు ఆచార వ్యవహారాలను గౌరవించడం అనేది... కనీస కృతజ్ణతా ధర్మం. అటువంటి సంస్కారం ఆయా మతాల ఔన్నత్యాన్ని మరింత పెంచుతుంది. ...ఇటువంటి చర్యలు పునరావృతమైతే ఇతర మతస్తులు ఆ పాఠశాల కు దూరమైపోతారు. తస్మాత్ జాగ్రత్త!! విజ్ఞతతో వ్యవహరించమని మరోసారి మా ఇతర మత సోదరులకు మా వినమ్ర విజ్ఞప్తి!!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.





'అమ్మ వడి'

'అమ్మ వడిలో ఆ కర్ణామృతాలు' చవిచూసి...రాసి..అందరికీ అందించిన ఆ తాతయ్యకి తగిన మనవడిగా... అమ్మ వడిలో... ధీమాగా...గర్వంగా ఆ వాత్సల్యామృతాన్నిచవి చూస్తున్న నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది. ఇప్పటికప్పుడు మాయమై పోయి... నీలా అయిపోయి...మాతృ ప్రేమామృతాన్ని మళ్ళీ చవిచూడాలని ఉంది...."ఓ దెవుడా... ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నాకిచ్చెయ్! ఉందో లేదో స్వర్గం...నా బాల్యం నాకిచ్చెయ్..!! నా సర్వస్వం నీకిస్తా...ఆ సౌఖ్యం నాకిచ్చెయ్...!!! అన్న గజల్ శ్రీనివాస్ గానం గుర్తొస్తోంది!! చిన్నారికి తల్లి తండ్రులకి... మా శుభాశీస్సులు! ఓం శతమానం భవతి శతాయు పురుష శ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతీ!!!...బామ్మతాతలకి మా నమోవాకాలు!! మణిసాయి విస్సా.



Friday, February 27, 2015

భార్యలు చేయకూడని కొన్ని విషయాలు తెలుసుకుందామా !!!

భార్యలు చేయకూడని కొన్ని విషయాలు చూద్దాం ______________________________ 1. భర్తను గురించి ఎప్పుడు నలుగురిలో మాట్లాడకుండటం. మీ భర్తలో మీకే తెలిసిన భలహీనతలు ఉండొచ్చు వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేయకండి. చాల మంది స్త్రీలకు కుటుంభంలో చిన్న విషయం జరిగినా వెంటనే తల్లికో , తోబుట్టువుకో చెప్పుకుంటారు. అది అంతటితో ఆగితే సరి కాని వాళ్ళు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు. అది ప్రయివేట్ గా మాట్లాడితే సరి కాని కొద్ది మంది అందరి ముందు మాట్లాడి రచ్చ రచ్చ చేయడమో లేదా హేళన చేయడమో చేస్తే ఆయన పరువు పోతుంది. 2.ఆయన పరువే కదా పోనియ్ అని అనుకోకండి. ఆయన పరువు పొతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయం గుర్తుంచుకోండి. 3. ఎప్పుడు మీరు అది గుర్తు పెట్టు కోరు ఇది గుర్తు పెట్టుకోరు అని పదే పదే నిందించకండి. తన పనులతో పాటు ఇంటి విషయాలు కూడా చూడాలంటే కుదరకపోవచ్చు. గృహ సంభంద భాద్యతలలో పడి మర్చిపోవచ్చు అర్ధం చేసుకోండి. 4. మీ అవసరం కోసం, మీ కోరికల చిట్టా తెరవడానికి శృంగారాన్ని వాడకండి. మీ మీద ఏహ్య భావం కలిగే అవకాశం ఉంది. 5. మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు సరిదిద్దుతారా అని ఏ వ్యక్తి గురించో , పుస్తకం గురించో వెతక్కండి. వాటివల్ల ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. మీకు ఆ విషయమై పశ్చాతాపం ఉంటే మీరే ముందు క్షమాపణ చెప్పండి. మీ తప్పు కాక మీ సహచారుడిదే తప్పైతే ఆయనకు ఏమి జరిగింది ఎలా జరిగిందో ఒక ఉత్తరం రాయండి. 6. ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయం దగ్గరే. తిట్టి కసురుకునే కన్నా అతనితో కూర్చోండి అతనికి తెలియకుండా ఒక నెల ఒక డ్రాఫ్ట్ తయారు చేసి చూపించి మీ మార్గంలో అయితే మీరేమి చేసేవారో చెప్పి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. 7. మీ ఇద్దరు మాట్లాడుకునేప్పుడో , లేదా బయట వారు అంటే మీ స్నేహితులో చుట్టాలో ఇంటికి వచ్చినప్పుడు అతని మాటలు కూడా మీరే మాట్లాడకండి. మీ భర్తను కూడా మాట్లాడనీయండి. అతని నోరు మీరయ్యే పరిస్థితి కలిగితే బయటివారి ముందు అతను చులకన అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. 8.మీరు మైండ్ రీడర్ లాగా ప్రవర్తించకండి. తను చెప్పాలనుకున్నది మీరనుకున్నది కాదేమో. మీరే ముందు మైండ్ రీడర్ లాగా గెస్ కొడుతూ మాట్లాడితే ఆయనకు మీతో పంచుకోవాలి అని అనిపించిన విషయం కూడా చెప్పాలని పించదు. 9. మీ భర్తే కాదు , ఏ మనిషి కూడా మైండ్ రీడర్ కాదు. మీకు ఏదైనా కావాల్సివచ్చిన , ఏదైనా చెప్పాలనుకున్న పంచుకోండి. అతడు ఇలా చేస్తాడో లేదో చూద్దాం అని మీతో మీరే పోటి పెట్టుకోకండి. మనుషులు భవిష్యత్తును తెలుసుకునే దేవతలు కారు. 10. ఎప్పుడైనా బయటి విషయాలు ఒత్తిడి వల్ల మీ భర్త చాలా కోపంగా ఉంటే అతన్ని కదిలించకండి. అతను నిమ్మలించే వరకు అతన్ని అలా వదిలేయండి. లేదంటే ఆ కోపం మీపై చూపించేస్తే మీరు హర్ట్ అవుతారు. 11. మీ భర్త బంధువుల గురించిన తప్పుడు మాటలు , వాళ్ళపై లేనిపోనివి చెప్పకండి మీ మీద నమ్మకం పోయే ప్రమాదముంది. 12. ఒక మంచి పని గురించి ఆలోచిస్తూ మీ సలహా అడిగినప్పుడు మీరిలా కాదు ఇలా చేయండి అని మీకు తెలిసిన విషయమైతే మీ నేర్పు ప్రదర్శించి అతన్ని నొప్పించకండి. మంచి స్నేహితురాలిలా మెత్తగా తెలుసుకునేలా చెప్పండి. ఇది మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటాను.

శుభోదయం!!! సంతోషంతో సమానమైన ధనం మరొకటిలేదు సంతోషమే నందనవనం.. శాంతియే కామధేనువు సంతోషంకన్నాఉత్తమమైన సుఖం లేదు మానవునికి సంతోషమే శ్రేష్టమైన మూలధనం.


శుభోదయం!!!
సంతోషంతో సమానమైన ధనం మరొకటిలేదు
సంతోషమే నందనవనం.. శాంతియే కామధేనువు
సంతోషంకన్నాఉత్తమమైన సుఖం లేదు 
మానవునికి సంతోషమే శ్రేష్టమైన మూలధనం.




శుభ సాయంత్రం!!!











శుభ సాయంత్రం!!!



Monday, February 23, 2015

శుభోదయం సంపద పెరిగేకొద్ది ధనవంతుడు మాత్రమే అవుతావు సంవత్సరాలు పెరిగేకొద్ది ముసలివాడవుమాత్రమే అవుతావు కానీ మంచితనం పెరిగేకొద్ది మనిషిగా మారతావు.


పిల్లలను దృష్టిదోషాలనుంచి కాపాడే శ్లోకం :

పిల్లలను దృష్టిదోషాలనుంచి కాపాడే శ్లోకం :
వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వేంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు:- 21వ పద్యం - 40

21)ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో
కోపము నిన్నారతముకొల్చి  భజించుట యేమి మాయయో
తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్
మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!!
22) కర్మలచేత కల్గునని కష్టము సౌఖ్యము పాపపుణ్యముల్
మర్మమెరింగియున్ నరులు మానకచేతురు ఘోరపాపముల్
దుర్గతులైయఘంబులను దుష్టపు కర్మలచేయనేల స
త్కర్మలపూని జీవితమూ ధన్యత గాంచక వేంకటేశ్వరా!!
23) మున్ను గజెంద్రుడా మొసలి ముష్కర చర్యకు పాల్పడంగ మా
పన్న శరణ్య దీనజన బాంధవ కేశవ కావుమంచునిన్
సన్నుతిజేయగా కరిని చయ్యన కావగ లేద చక్రివై
సన్నుతమూర్తి  మోక్షమిడి సత్కృపతోడుత వేంకటేశ్వరా!!
24) పాపులు నీతిబాహ్యులకు భాగ్యముభోగములబ్బుటేలనో
నీపయి భారముంచి కడునిష్టగ నిన్విడనాడకుండగా
నీపద సన్నిధిన్ నిలిచి నిన్ భజియించెడి వారికేలనో
చూపవుయెట్టి యోగ్యతలు చోద్యముకాక మరేమిసత్ప్రభూ!!
25) జూదరి లంచగొండులును చోరులు జారులు తాగుబోతులు 
న్మాదులరీతి నిత్యము నమానుష చర్యలు సల్పుచుండగా 
కాదనువారులేరు సరికట్టడిసేయగ నీ ఒకండవే
నీదయలేనిచో నిలువనీడయే లేదిక భక్తకోటికిన్.
26వ పద్యం.
తాతల నాటినుండి నినుదల్పగ మాయిలవేల్పు తండ్రిగా
మాతగ మమ్మునేలు మహిమాన్విత దాయక కల్పకంబుగా
చేతుము పూజలన్ వ్రతముచేతుము నిత్యమఖండ పూజలన్
నేతగనిల్చి మాకిడవే నిత్య శుభంబుల నీప్సితంబులన్.
28)   సర్పమునోట జిక్కి తనచావు నెరుంగనికప్ప తానటన్
దర్పముతోడ ఋర్వులను దండి భుజించెడి మాడ్కి కాలమున్
సర్పము నోట జిక్కియును సంపద సౌఖ్యము కేలపుత్తురో
తిర్పతివాస నిన్గొలిచి త్రుప్తిపొందక వేంకటేశ్వరా!!! 
29) కోరగలేదు భూములను కోరను భూరియశస్సు భోగముల్ 

కోరలేదు సౌఖ్యమును కోరను భౌతికతుచ్ఛసంపదల్

తేరగనిత్తువంచు నిను తెల్సియు కోరనవేవియున్ ప్రభూ
కూరిమి ని కృపామ్రుతము కూర్చినచాలు భవాబ్ది దాటగన్!

30) ధర్మము గానమెందు కలిదారుణ మారణ దుష్టశక్తులే

మర్మమెరుంగ నేరని యమాయక జీవుల హింసపెట్టెడిన్
నిర్మలచిత్తులన్ పరమనీచులకు న్నెరగాక యుండగా
ధర్మమునుద్ధరించి  మము ధన్యులజేయవే వేంకటేశ్వరా! 

31) కంటికి యింపుగా జగతికల్పనజేసి ముదంబుమీరగా
నంటియునంటనట్లుగను ఆవలలోపల నుంటివంటతన్
కంటికగోచరంబగుచు కామిని కాంచనదూత విర్వురన్
గెంటితినీవు మాకడకు గెలవగా వాటి నిముక్తికోసమై!! 
32) కాయము పాంచబౌతికము కర్మలు చేయగ నుద్భవించె నా
కాయములో సమర్చితివి కాననిదొంగల నార్వురన్ సదా
మాయకులో పడంగని  మమ్ములన్నేడ్చును బాహ్యదృష్టికే
మాయనుగెల్వగాతరమె మాకును నీకృపలేక యుండియున్!!   
33) అంగటనన్నియున్న మరియల్లునినోట శనన్నసామెతన్
అంగట వస్తువుల్ ధరలు ఆకశమంటె సధర్మపాలనన్
బంగరుపండుదేశమున పాపముపండుచునుండెనేడు మా
ముంగట విస్తరుంచి తిన మూతికి బీగమువేయధర్మమే!!

34) ఇంటను బైట తస్కరులు నీగతిమమ్ముల దోచుచుండగా కంటికినిద్రదోచకను కాయలు కాచెను శాంతికోసమై
కంటిని ముక్కును మూసుకొని కాంచనియట్టుల మౌనమూనక
తుంటరిమూకలన్ దునిమి తోడుగా నీడగ నిల్వుమో ప్రభూ!!
35) సంపదలున్నచో కలుగుసంకటముల్ పలు రోగభాధలన్
పెంపును జేయు పాపముల పెంచును దుఃఖము కష్టనష్టముల్
సంపదలెన్నియున్న యవి శాంతినిగూర్పగజాల వెన్నడున్ 
సంపదకోసమై నెరపుసంధ్యలు పూజలు నిష్ఫలంబులే !  
36) పుట్టుచుచచ్చుచున్ మరల పుట్టుచు గిట్టుట కంటె మానవుల్ 
పుట్టుకలేకపోవుటది పుణ్యము మోక్షము కావునన్ ప్రభూ 
పుట్టినదాది కష్టములపోరును బాధల నొందకుండ ఏ 
పుట్టుకలేని భాగ్యమును పొందుగా గూర్చుము వేంకటేశ్వరా!
37) ప్రభువులు పండితుల్ పరమభాగావతో త్తములైనగాని తా 
విభవముతోడ సంపదల వేడుకమీర  సుఖింత్రుగాక  నీ 
యభయముకోరుకున్న  నవియన్నియు కల్లలు కల్పితంబులే 
శుభములు నీపదార్చవలె సూరిజనావళికి ముక్తి మార్గముల్.
38) భక్తియెలేని పూజలవి పత్రికిచేటనిచెప్పు సామెతన్
భక్తులు కామ్యసిద్ధికయి ప్రార్ధనపూజలు సల్పుచుందు రా 
యుక్తిని నీవెరింగి పరమోన్నతిగూర్తువు వాంచితంబులన్
ముక్తిని గోరకుండుతది మూర్ఖతకయేయగు  వేంకటేశ్వరా!!
39) నీటను నానినట్టి యొకనిప్పులపెట్టెను  యగ్గిపుల్లతో 
ధాటిగా గీసినన్ వెలిగి దర్శనమీయదు నిప్పురవ్వయున్ 
కోటులజన్మలెత్తి తగ కూడగబెట్టిన దుష్టకర్మల 
న్నీటనుమున్గి భక్తి మెయి నిన్ను తలంచిన మోక్షమబ్బునే !
40) ముక్తియు మోక్షమంచు తగముక్కునుమూసి జపించినంతనే 
దక్కునే ముక్తి మోక్షములు దక్కునె శాంతియొకింత యేని ఆ 
శక్తిని వీడగావలయు సంపద సౌఖ్యములందు యన్నిటన్ 
ముక్తి యనంగ నర్దమది మోహమువీడుట లోకవాంఛలన్!!!  

Sunday, February 22, 2015

శుభోదయం 'అ' అంటే అమృతం 'మ' అంటే మమకారం అమృతాన్ని చిలికి మమకారాన్ని పంచేదే "అమ్మ"

శుభోదయం
'అ' అంటే అమృతం 
'మ' అంటే మమకారం

అమృతాన్ని చిలికి మమకారాన్ని పంచేదే "అమ్మ"

Friday, February 20, 2015

మురళి మనోహర రాధేశ్యాం ! గోపీవల్లభ మేఘశ్యాం


మురళి మనోహర రాధేశ్యాం ! గోపీవల్లభ మేఘశ్యాం 
కృష్ణమురారీ రాధేశ్యాం ! కరుణాసాగర మేఘశ్యాం 
నందనందనా రాధేశ్యాం ! నవనీతచోర మేఘశ్యాం 
విశ్వాధార రాధేశ్యాం ! రాధా రమణా మేఘశ్యాం 
దేవకీనందన రాధేశ్యాం ! కుంజవిహరి మేఘశ్యాం 
సచ్చిదానందా రాధేశ్యాం ! సద్గురురూప మేఘశ్యాం
గోవిందకృష్ణా రాధేశ్యాం ! యదుకులదీపక మేఘశ్యాం
ముక్తిదాయకా రాధేశ్యాం ! మునిజనవందిత మేఘశ్యాం
రాధేశ్యాం జయ రాధేశ్యాం ! మేఘశ్యాం జయ మేఘశ్యాం !!!

శుభోదయం../\.. ముఖ పుస్తక బంధు మిత్రులందరికీ ...అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!! With Vissanagamani

శుభోదయం../\..
ముఖ పుస్తక బంధు మిత్రులందరికీ ...అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!! ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు. ఐక్య రాజ్య సమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో ఈ రోజును 17 నవంబర్ 1999న తొలిసారి ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించి, 2008 ని అంతర్జాతీయ భాష సంవత్సరంగా ప్రకటించింది. మాతృభాష గురించి గాంధీజీ గుజరాతీలో రాసుకుంటూ -‘మాతృభాషా తృణీకారం మాతృదేవీ తిరస్కారం’ అని అన్నారు. ఉన్న ఊరిని, కన్నతల్లిని, తల్లి భాషనీ ప్రేమిద్దాం! గౌరవిద్దాం!! అంతర్జాతీయంగా తెలుగు నిలిచేందుకు దేశవిదేశాల్లో తెలుగువారు ఎంతో కృషి చేస్తున్నారు, అలాగే మనమూ పూనుకోవాలి. మనదైన కమ్మనైన అమ్మభాషని పదికాలాలు పరిరక్షించు కోవాలి.. ఇది ప్రజలూ, ప్రభుత్వమూ కలసి కట్టుగా పూనుకోవాలి. జై తెలుగు తల్లి!!!!
నవరసా లొలికించే నాట్య మయూరి
ఫల రసాలు పండించే నిత్య సుకుమారి
గలగలా పొంగి పొరలే కావేరి
నిగ నిగా వంపుసొంపుల వయ్యారి
ప్రకృతి వడిలో ప్రియపుత్రిక ఈ జనని
వికృతి చేష్టలకు తల వొగ్గదు నా జనని
రాక్షసులను ఋషులుగా మహర్షులుగా
మార్చిన నా భారతి
వీరనారీ శిరోమణులను కన్న భాగ్యవతి
పుణ్య పురుషులను కన్న భూమి భారతి
నీ త్యాగ నిరతికి ఇదే మా మంగళహారతి .

Monday, February 16, 2015

శుభోదయం

శుభోదయం 
అనునిత్యం జగతికి అనంత చైతన్యోత్సవ జాగృత గీతానికి 
కంటి సంగీత సందేశాన్ని అందించేందుకు ఆత్రుతగా అరుదెంచు అహర్పతికి శుభోదయం తోఆహ్వానంపలుకుదాం!!!

అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".
హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అనగా స్వర్గ లోక నివాసులు, పరమ పవిత్రులు, పూజింపదగిన వారు. హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం.ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.
ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు.
మంత్రములలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంత్రరాజమే... నమఃశివాయ.
ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి , ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు .మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట! రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది.
ఆ పరమేశ్వరుని అనుగ్రహం మన అందరిపైనా ఎల్లవేళలా వుండాలని కోరుకొంటున్నాను.

Sunday, February 15, 2015

ఈ రోజు 15/02/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

ఈ రోజు 15/02/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

ఈ రోజు 15/02/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో  'రేడియో కేక' అనంత పురం నుంచి ఉదయం 9 గంటల నుంచి 10 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారంలో మేము నిర్వహించిన సాహితీ కార్యక్రమం ఈ లంకె నొక్కి   మీరు కూడా వినండి. మీ అమూల్య అభిప్రాయాలు తెలియచెయ్యండి...ప్రతి ఆదివారం రేడియో కేక లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' లో మీరు కూడా  పాల్గొనవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. మా విశ్వ వ్యాప్త ముఖపుస్తక బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం!!
ఈ లంకె నొక్కి వినండి!

https://www.youtube.com/watch?v=emBpDJfB-bQ

Friday, February 6, 2015

పిల్లవాడు వర్షములో తడిసి ఇంటికి వచ్చినప్పుడు..... అన్నయ్య అన్నాడు ...గొడుగు ఎందుకు తీసుకు వెళ్ళలేదు! అక్క అన్నది ...వర్షం తగ్గిన తరువాత రావచ్చుకదా! నాన్న కోపముగా అన్నాడు...జలుబు చేసినప్పుడు నీకు తెలిసివస్తుంది! అమ్మ తలతుడుస్తూ అంటోంది... మాయదారి వాన పిల్లవాడు ఇంటికి వచ్చేదాకా ఆగవచ్చుకదా! అదీ... అమ్మంటే ...అదే అమ్మతనములోని కమ్మదనమంటే..With Vissanagamani


శుభోదయం../\.. నిన్నటి శరత్ చంద్రికా వెన్నెల సుధారస ధారల తనివితీరా తడిసి మురిసిన... ఓ వన వయ్యారి! గువ్వల కువ కువల నేపద్యగానానికి..నీ వసంత లాస్య ..హాస విలాసపు హొయలు...నేటి ఈ వేకువ వెలుగుల సోయగంలో చూసి నా మనసు మయూరమై..నా మానస సరోవరాన కవన కమలమై విరిసెలే!!!With Vissanagamani


Thursday, February 5, 2015

మన్మధ మధుమాసం! సాయి మానసం



        శ్రీ మన్మధ మధుమాసారంభానికి వనాల వసంత సంరంభం!! మొన్నటి మావి పూత...పిందెగా మారింది... ఇదిగో చూడండి రేపటి ఆమని కోయిల పల్లవికి మాధుర్యాన్ని అందించే మావి పసందు విందులు...

        ఈ పిందెలు....శ్రీ మన్మధ నామ ఉగాదికి స్వాగత గీతికలు!

        ఎర్రని సూరీడుకి ధీటుగా...చిగురాకుల సిగల్లో ఎర్రగా తురుముకున్న మొదుగలు!!  

        రోజు రోజుకి మారే ఈ మహాద్భుత సన్నివేశాన్ని ఎప్పటి కప్పుడు మా vissafoundation.blogspot.com లో మీరు చూడవచ్చు. సత్యసాయి విస్సా.

















రేపటి తీపి ఉగాదికి ఆహ్వానం పలుకుతున్న వేప, మామిడి పూతలు ఆస్వాదించండి! మన్మధ మధుమాసారంభానికి వనాల వసంత సంరంభం!! రోజు రోజుకి మారే ఈ మహాద్భుత సన్నివేశాన్ని ఎప్పటి కప్పుడు మా vissafoundation.blogspot.com లో మీరు చూడవచ్చు









Monday, February 2, 2015


శుభోదయం../\.. జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితంరోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది.ఏ దేశానికైనా పెద్ద సంఖ్యా బలం ఉంటే చాలదు. ప్రజలు విద్యావంతులై , చైతన్యవంతులై, ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే 'జాతి' జాగృతమవుతుంది, బాగుపడుతుంది

శుభోదయం../\..

జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితంరోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది.ఏ దేశానికైనా పెద్ద సంఖ్యా బలం ఉంటే చాలదు. ప్రజలు విద్యావంతులై , చైతన్యవంతులై, ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే 'జాతి' జాగృతమవుతుంది, బాగుపడుతుంది

అమ్మ మనస్సు!!!


Sunday, February 1, 2015

ఈ రోజు 01/02/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

ఈ రోజు 01/02/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో  'రేడియో కేక' అనంత పురం నుంచి ఉదయం 9 గంటల నుంచి 10 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారంలో మేము నిర్వహించిన సాహితీ కార్యక్రమం ఈ లంకె నొక్కి   మీరు కూడా వినండి. మీ అమూల్య అభిప్రాయాలు తెలియచెయ్యండి...ప్రతి ఆదివారం రేడియో కేక లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' లో మీరు కూడా  పాల్గొనవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. మా విశ్వ వ్యాప్త ముఖపుస్తక బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం!!
ఈ లంకె నొక్కి వినండి!

https://www.youtube.com/watch?v=xI8NXgzanWQ

Total Pageviews