Monday, February 16, 2015

అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".
హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అనగా స్వర్గ లోక నివాసులు, పరమ పవిత్రులు, పూజింపదగిన వారు. హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం.ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.
ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు.
మంత్రములలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంత్రరాజమే... నమఃశివాయ.
ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి , ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు .మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట! రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది.
ఆ పరమేశ్వరుని అనుగ్రహం మన అందరిపైనా ఎల్లవేళలా వుండాలని కోరుకొంటున్నాను.

No comments:

Post a Comment

Total Pageviews