Wednesday, May 29, 2019

మా గ్యాంగ్ టక్, డార్జిలింగ్ యాత్ర అనుభవాలు!

మా గ్యాంగ్ టక్, డార్జిలింగ్ యాత్ర అనుభవాలు
విహార యాత్రల వల్ల ‘అందమైన ప్రాంతాలను, ప్రకృతి అందాలను ఆయా ప్రాంత ప్రజల భాష, కట్టూబొట్టు, ఆహారపుటలవాట్లు... ఇలా ఎన్నో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అటువంటిదే డార్జిలింగ్
హైదరాబాద్ నుంచి రైల్లో కోల్‌కతా చేరుకుని ఆ రాత్రి హోటల్ లో బస చేసి, మరునాడు విమానంలో బాగ్డోగ్రా వెళ్ళాము. అక్కడ మా టూర్ ఏజెంట్ ఏర్పాటు చేసిన వాహన ప్రయాణంలో దారి పొడుగునా కొండలు, కోనలు, వాగులు, వంకలు చిత్రమైన ఆ దారిలో అన్నీ తేయాకూ, యాలకులూ, కమలా తోటల కనువిందు. గ్యాంగ్ టాక్ చేరుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకుని తక్కువ దూరాలైనా ఆ వంపుసొంపుల ఘాట్‌ రోడ్లమీద గంటల ప్రయాణిస్తూ దారివెంటే వచ్చే ఆ తోటల్నీ నీటి ప్రవాహాల... అల్లంత దూరంలోని హిమాలయాల సోయగాలు మనల్ని మరో ప్రపంచానికి తీసుకువెళతాయి. కవులకు చిత్రకారులకు ఆ సుందర సుకుమార దృశ్యాలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి.
కొండ ప్రదేశమైన డార్జిలింగ్‌లో నేపాలీలూ, లెప్చాలూ, గోర్ఖాలూ, భూటియాలూ, టిబెటన్లూ, తమంగ్‌లూ... ఇలా భిన్న తెగలకు చెందిన ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటూ నివసిస్తున్నారు. అసలైన స్థానికులు లెప్చాలే. మిగిలినవాళ్లంతా వలస వచ్చినవాళ్లే. కూరగాయలు, చికెన్‌, పోర్క్‌ నింపిన మోమోలూ; వాయ్‌వాయ్‌లు ఎక్కువగా తింటారు. సూప్‌ నూడుల్స్‌, దమ్‌ ఆలూ, సాల్‌ రోటీ కూడా ఎక్కువే. వస్త్రధారణ కూడా ఎవరికి వాళ్లదే. పెళ్లయిన స్త్రీలు మాత్రం కాలర్‌తో కూడిన యాప్రాన్‌ కట్టుకుంటారు. ఫ్యాషన్లూ ఎక్కువే.
టాయ్‌ ట్రెయిన్‌! హిమాలయన్‌ రైల్వే ఆధ్వర్యంలో- కేవలం రెండే బోగీలతో ఆవిరితోనూ డీజిల్‌తోనూ నడిచే అక్కడి టాయ్‌ రైళ్లని చూడగానే వింతగా అనిపించింది. ఇది ఎక్కితే డార్జిలింగ్‌ నుంచి గూమ్‌ రైల్వేస్టేషన్‌, గూమ్‌ నుంచి తిరిగి డార్జిలింగ్‌ చేరుకుంటాం. కానీ సమయంలేక ఎక్కలేక పోయాము. ఆ రైల్ పట్టాలు కొండప్రాంతంలో నివాసగృహాల మధ్యలొంచి ఉంటాయి. ఆ పట్టాలమీద వర్తకులు వివిధ వస్తువులు అమ్ముతుంటారు రైల్ వస్తున్నప్పుడు హడావుడిగా లేచి ఆ సరుకులు తీసి దారి ఇచ్చి రైల్ వెళ్ళగానే తిరిగి అమ్ముతుంటారు. ఈ మొత్తం ప్రయాణం 16 కి.మీ. కానీ ఒక్క ట్రిప్పుకి రెండు గంటల సమయం పడుతుంది. కొండల్లోనుంచీ ఇళ్ల మధ్యలోంచీ వేసిన చిన్నపట్టాల మీదుగా ప్రయాణిస్తూ డార్జిలింగ్‌, గూమ్‌ పట్టణ అందాలను చూడటం మంచి అనుభూతిని కలిగిస్తుంది. గూమ్‌ దేశంలోకెల్లా ఎత్తైన రైల్వేస్టేషన్‌. అంతేకాదు ఎత్తుకు వెళుతున్న కొద్దీ మనల్ని తాకుతూ వెళ్లే మబ్బులు. మబ్బులను చీల్చుకుంటూ మన ప్రయాణం ఎంత ఉత్తేజభరితంగా ఉంటుందో. ఆగలేక వాహనం ఆపించి ఆ మబ్బులలో కొంత దూరం నడిచాం ఫోటోలు తీసుకున్నాం. అదో అందమైన అనుభూతి.
ఇక వాతావరణం విషయానికి వస్తే..వేడి వాతావరణంలో నివసించే మనకు అక్కడి చలికి కొయ్యబారిపోవడం ఖాయం. కాళ్లకు సాక్సులూ చేతులకి గ్లోవ్సూ తలకి మఫ్లర్లూ చుట్టుకుని జెర్కిన్లు వేసుకుంటే తప్ప రాత్రిపూట నిద్రపోలేం. ఉదయం 16 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉండే ఉష్ణోగ్రత, రాత్రయ్యేసరికి 6 నుంచి 1 డిగ్రీకి పడిపోతుంది. రగ్గులు కప్పుకున్నా రూములో హీటరు ఉన్నా చలి చలే.
ఉదయం రెండుగంటలకు చలిలో ముంచుకొస్తున్ననిద్రను జయించి నాలుగు గంటలకే లేచి 8,400 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్‌హిల్స్‌కు చేరుకున్నాం. సూర్యోదయ సమయంలో 28,208 అడుగుల ఎత్తులోని కంచన్‌జంగ శిఖరం మీదుగా వచ్చే భానుడి తొలికిరణాలను ఓ అనిర్వచనీయమైన అనుభూతి సాధారణంగా ఆ భాగ్యం అందరికీ లభించదు ఎందుకంటే వాతావరణాన్ని బట్టి, మబ్బులు పట్టి ఉంటే ఆ సుందర దృశ్యం చూసే అవకాశం లేదు. అప్పటివరకు చీకటిగా ఉన్న ఆ సుదూరంలో లీలగా వెండి కొండల ఆనవాలు అంతలోనే కొంతసేపటికి ఆ వెండి కొండలు బంగారు వర్ణంలో మారడం ఓహ్ వర్ణించనలవికాని మనోహర సుందర దృశ్యం, చలిలో వెచ్చని తేనీటిని సేవించాము. మా అదృష్టవశాత్తు 15 రౌజులనుండి కనపడని ఆ సుందర దృశ్యం చూసే భాగ్యం కలిగింది. దేశవిదేశాలనుంచి ఎందరో పర్యటకులు ఆ ఉదయశోభలు తిలకించి పులకించడానికి వస్తుంటారక్కడికి. ఎత్తుకు వెళ్ళేకొలదీ ఆక్సిజన్ తక్కువ గా ఉండటం వల్ల ఎత్తులు ఎక్కేటప్పుడు వడివడిగా నడిచేటప్పుడు త్వరగా అలసటకు గురి అవుతాం.
తరవాత గూమ్‌ మొనాస్టరీకీ వెళ్లాం. అక్కడ బౌద్ధ మతస్తుల ఆచారాలు తెలుసుకుంటూ ఓ మానా పేమీను అంటూ ప్రదక్షిణంగా వెళుతూ ఆ గంటలు మ్రోగిస్తూ వెళ్ళాము.

మరో సుందర ప్రదేశం బటాసియా లూప్‌...డార్జిలింగ్‌ను 360 డిగ్రీల కోణంలో చూడ్డానికి దీన్ని మించిన ప్రదేశం లేదు. బటాసియా అంటే గాలితో కూడిన ప్రదేశం అని అర్థం. దీన్ని టాయ్‌ ట్రెయిన్‌ రైడ్‌ కోసమే రూపొందించారట. ఎత్తైన కొండమీద వృత్తాకారంలో ఉద్యానవనాన్ని పెంచి దాని చుట్టూ రైల్వే పట్టాలు నిర్మించారు. కొండప్రాంతాల్లో పెరిగే మొక్కలతో కూడిన ఉద్యానవనమూ ఉంది. లూప్‌ మధ్యలో తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గూర్ఖ సైనికుల స్మారకార్థం వార్‌ మెమోరియల్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తే మార్కెట్‌ ఉంటుంది. స్థానికులు సమోసాలూ కూరగాయలతో స్టఫ్‌ చేసిన స్నాక్స్‌ అమ్ముతుంటారు.

తేయాకు తోటలు .. మకైబరి, హ్యాపీ ఎస్టేట్స్‌గా పేరొందిన అక్కడి కొండలమీద ఆకుపచ్చని శాలువాలు కప్పినట్లుగా ఉన్న ఆ తోటల్ని చూడడం అందమైన అనుభూతి. వేల ఎకరాల్లో పరచుకున్న ఆ తేయాకు కొండల్లో తిరుగుతుంటే చల్లని వానచినుకులతో కూడిన గాలి మనల్ని గిలిగింతలకు గురిచేస్తుంది. అక్కడ పెరిగే టీ రుచికి మరేదీ సాటి రాదట. అందుకే ఇది వరల్డ్‌ గ్రేటేస్ట్‌ టీగా పేరొందింది. మనదేశంలో తయారయ్యే టీలలో డార్జిలింగ్‌ నుంచి వచ్చేది ఒక శాతమే. కానీ దాన్ని వేలంవేసి మరీ కొంటుంటారు. ఆ గాలిలో నేలలో ఏదో మ్యాజిక్‌ ఉంది. అందుకే ఆ టీకి అంత రుచి అంటుంటారు దాని రుచి చూసినవాళ్లు. పైగా అక్కడి తేయాకు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించినది. టీ ఎస్టేట్స్‌ దగ్గరే ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌లో రకరకాల టీ పొడుల తయారీని చూసి అక్కడ ఉన్న అవుట్‌లెట్స్‌లో నచ్చిన టీ పొడులనీ కొనుక్కోవచ్చు. కిలో ఏడు వందల రూపాయల బ్లాక్‌ టీ నుంచి 50 వేల ఖరీదు చేసే వైట్‌ టీ వరకూ అన్నీ దొరుకుతాయి. తోటల్లో రాత్రివేళ హోమ్‌స్టేల్లో ఉండాలనుకునేవాళ్లు టీ ఆకును తుంచే వాళ్ల ఇళ్లలోనే ఉంటారు. విలాసవంతమైన హోటళ్లలో కూడా ఉండచ్చు.


జపనీస్‌ పీస్‌ పగోడాకి బౌద్ధులు రోజూ నాలుగు గంటలకే లేచి డ్రమ్ములు వాయించుకుంటూ ఈ గుడికి నడిచి వస్తారట. డార్జిలింగ్‌ రైల్వే స్టేషన్‌కి కాస్త దిగువన ఉన్న ధీర్‌ధామ్‌ ఆలయాన్ని చూసి రాక్‌గార్డెన్‌కి వెళ్లాం. ఓ చిన్న జలపాతం, రాళ్లు, రంగురంగుల పూలమొక్కలతో నిర్మించిన ఈ ఉద్యానవనంలో స్థానిక దుస్తుల్ని అద్దెకు ఇస్తారు. ఇష్టమైనవాళ్లు వాటిని ధరించి ఫొటోలు దిగుతుంటారు. అక్కడి నుంచి అబ్జర్వేటరీ కొండమీద ఉన్న మహాకాళ్‌ ఆలయాన్ని చూశాం. హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేసేవాళ్లకి డార్జిలింగ్‌ అనువైన ప్రదేశం. ప్రకృతి పచ్చని తివాచీ పరిచి, అందులో పూలబాట వేసి మరీ స్వాగతిస్తుంటుంది. కొండలనిండా రోడోడెండ్రాన్‌లూ మాగ్నోలియాలతోబాటు దాదాపు వందల రకాల ఆర్కిడ్లు అక్కడి నేలమీద విరబూస్తూ కనువిందు చేస్తుంటాయి. లాల్‌కోతి, ధీర్‌దాం టెంపుల్‌, ఇలా ఎన్నో అద్భుతమైన సుందర దృశ్యాలు బ్రిటీషర్స్ వేసవి విడుదుల బంగళాలు. ఓహ్ ఒకటేమిటి ఎన్నో వింతలూ విశేషాలు. అక్కడ బాగా ఆశ్చర్య కరమైన అంశాలు ఏమంటే పిల్లలు మహిళలు మైదాన ప్రాంతాలనుంచి కొండల్లోని తమ నివాస ప్రాంతాలకు గ్యాస్ సిలెండర్లు వంటి బరువైన వస్తువులను, నిత్యావసర వస్తువులను నుదురు భాగం భుజాలను ఆధారంగా చేసుకుని వీపుకు ప్రత్యేక సంచులలో తరలించడం, అలాగే ఆ సన్నని ఘాట్ రోడ్లలో వివిధ వాహనాల డ్రైవర్స్ ఏంటో సహనంతో ఎదురుగా వచ్చేవారికి దారి ఇస్తూ హరన్స్ అనవసరంగా మోగించకుండా, ట్రాఫిక్ జామ్స్ జరగకుండా జాగ్రత్తగా ఎంతో బాధ్యతతో మెలగడం మన మైదాన ప్రాంతం వారికి వింతగా అనిపిస్తుంది. మరిన్ని వివరాలు మరో రోజు మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్.

Thursday, May 16, 2019

మొన్న ఆఫీసు పనిమీదే దిల్లీ వెళ్ళినా అది మళ్ళా బహిరిసన్స్ చూడటానికి వెళ్ళినట్టే అయింది. అక్కడ కవిత్వసంపుటాలతో పాటు అమృత ప్రీతమ్ పుస్తకమొకటి నన్ను ఆకర్షించింది. Fifty Fragments of Inner self (2019) చేతుల్లోకి తీసుకోగానే అదొక ప్రత్యేకమైన పుస్తకమని అర్థమైపోయింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తయినసందర్భంగా, 1997లో రాసిన పుస్తకం అది. అందులో భారతీయ సంస్కృతికీ, ఆధ్యాత్మిక సంస్కారానికీ సంబంధించిన యాభై భావనలున్నాయి. జెన్ సాధువులు, సూఫీ దర్వేషులు చెప్పే కథల్లాంటి కథలున్నాయి. ఆమె అట్లాంటి పుస్తకమొకటి రాయాలనుకోవడం వెనక ఆమె మీద ఓషో ప్రభావం ఉందని కూడా అనిపించింది. ఓషో తక్కిన ప్రపంచానికి వివాదాస్పదుడైనప్పుడు కూడా, అమృత ప్రీతమ్ ఆయన  పట్ల తన నమ్మకాన్నీ, గౌరవాన్నీ అట్లానే నిలుపుకోగలిగింది. ఎంత గౌరవమంటే, 'మీరా నాట్యమూ, బుద్ధుడి మౌనమూ ఒక్కటయ్యే చోటు ఓషో' అనగలిగేటంత.

ఆ పుస్తకం ఆ సాయంకాలమే, ఎయిర్ పోర్టులోనే, విమానమెక్కేలోపలే పూర్తిచేసేసాను. ఎండవేడికి అలసిపోయిన దేహాన్ని దక్షిణమారుతం తాకినట్లుగా ఉందా పుస్తకం నా మనసుకీ, అంతరాత్మకీ.

అందులోంచి ఒక చిన్న కథ మీకోసం.

*
అంతస్సత్త్వం
________

ఒకప్పుడు మహావీరుడూ, గోశాలకుడూ ఎక్కడికో వెళ్తున్నారట. వాళ్ళొక గ్రామం మీంచి వెళ్తున్నప్పుడు దారిలో ఒక మొక్క కనబడింది. ఆ మొక్కని చూస్తూ గోశాలకుడు 'ఏమంటావు మిత్రమా? ఈ మొక్క గురించి నీ అభిప్రాయమేమిటి? ఇది ఎప్పటికేనా వికసిస్తుందా? పూలు పూసేదాకా బతికి బట్ట కడుతుందా?'
అనడిగాడు.

మహావీరుడు ఆ మొక్కని పరీక్షగా చూసాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అప్పుడు 'తథ్యం. ఈ మొక్క పూలు పూసేదాకా బతికి తీరుతుంది' అన్నాడు.

అతడు ఆ మాటలు అంటూనే, గోశాలకుడు ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మహావీరుడి కళ్ళముందే ఆ మొక్కని వేళ్ళతో ఊడబెరికి, నవ్వుతూ ' ఇప్పుడు చెప్పు, ఇదింక పూలెట్లా పూస్తుంది?' అనడిగాడు. మహావీరుడు ఏమీ మాట్లాడలేదు. చిరుమందహాసం చేసి ఊరుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆ ఊరు దాటి తాము వెళ్ళవలసిన చోటకి నడక కొనసాగించారు. ఈలోపు వాన పడటం మొదలయ్యింది.  కుంభవృష్టిగా మారిపోయింది. దాంతో వాళ్ళు వెళ్ళినచోట ఒక్కరోజు ఉండాలనుకున్నవాళ్ళు వారం రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. వాన తగ్గాక, వారం రోజుల తర్వాత వాళ్ళు  వచ్చిన దారినే తిరుగు ప్రయాణమయ్యారు. ఆ దారమ్మట, వాళ్ళంతకు ముందు ఆ మొక్కదగ్గర ఆగిన చోటకే మళ్ళా చేరుకున్నారు. అక్కడ ఊడబెరికి పక్కన పారేసిన మొక్క నిటారుగా నిలబడి ఉంది. దాని ఆకులమధ్య ఎర్రని పువ్వొకటి నిండారా వికసించి తళుకులీనుతూ ఉంది.

ఆ మొక్కని, ఆ పువ్వుని చూస్తూ గోశాలకుడు నివ్వెరపోయాడు. 'నమ్మలేకుండా ఉన్నాను. నేనే కదా, ఈ మొక్కని వేళ్ళకంటా పెకలించేసింది. ఇది మళ్ళా ఎట్లా వేళ్ళూనగలిగింది? ఇది పూలు పూసేదాకా బతుకుతుందని నువ్వు చెప్పిన జోస్యం ఎట్లా ఫలించింది?' అనడిగాడు మహావీరుణ్ణి.

మహావీరుడు అతడితో ఇట్లా చెప్పాడు:

'అందుకనే నేనా రోజు ఆ మొక్క దగ్గర ఆగి పరీక్షగా చూసింది. నేనా రోజు దాని అంతస్సత్త్వం ఏ మేరకు బలంగా ఉందో పరీక్షించడానికే దాని జీవంలోపలకంటా చూసాను. అది బతకాలని కోరుకుంటోందా లేక చనిపోవాలనుకుంటోందా అని చూసాను. అది చనిపోవాలనుకుని ఉంటే, నువ్వు దాన్ని ఊడబెరికినప్పుడే చచ్చిపోయి ఉండేది. అదట్లా చచ్చిపోడానికి నువ్వు సాయం కూడా చేసావు కదా! నువ్వు నన్నా ప్రశ్న అడిగినప్పుడు, నువ్వు దాన్ని మృత్యుమార్గంలోకి నెడతావనే నేనూహించాను.  కాని ఆ మొక్కకి బతకాలన్న కోరిక చాలా ప్రగాఢంగా ఉంది, కాబట్టే అది మరణం అంచులనుంచి వెనక్కు వచ్చింది. వాననీటికి కొట్టుకొచ్చిన మట్టి దాని వేళ్ళ చుట్టూ పోగవడంతో అది మళ్ళా బలం పుంజుకుని పైకి లేచింది, వేళ్ళూనుకుని పువ్వు పూసింది.'

అది ఆ మొక్క అంతస్సత్త్వం. దాని లోపలి బలం.

Tuesday, May 14, 2019

దశార్ణ దేశపు రాజ హంస -1

పద్దెనిమిదేళ్ల కిందటి మాట. నేను న్యూఢిల్లీలో పనిచేస్తున్న రోజులు  దక్షిణ భారతీయులు ఎక్కువగా ఉండే ఆర్ కె పురం లో ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఆదివారం రాగానే ఎక్కువగా దగ్గర్లో ఉన్న ఢిల్లీ తమిళ సంఘం, కర్ణాటక సంఘానికి వెళ్తుండే వాడిని.  అప్పుడే చాల మంది ప్రముఖులతో పాటు సినీ అభినేత్రులు సుహాసినిని, అర్థాంతరంగా నేల రాలిన సౌందర్యను, సంగీత విధ్వాంసురాలు నిత్యా మహదేవన్ లను పలకరించే  అవకాశం కలిగింది. అయితే తెలుగు వాడిని అయి ఉండి కూడా తెలుగు సంఘానికి చాల తక్కువగా వెళ్ళేవాడిని కారణం దూరం మాత్రమే.   

ఒక రోజు నాకు పరిచయస్తులయిన  ఒక తెలుగాయన  "నిన్న మీరు వస్తే బాగుండేది. తెలుగు సంఘానికి  ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు.  అయన ఉపన్యాసం విన్నాక హాలు మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది" అని చెప్పారు.

ఉత్సాహం ఆపుకోలేక "ఎవరండీ అని అడిగాను" 
"వాడ్రేవు చిన వీరభద్రుడు. రచయిత" అని చెప్పారు.   

"మనిషి చాల చిన్నగా ఉంటాడు. కానీ జ్ఞానంలో అయన ఎవరెస్టు శిఖరం లా కనిపించాడు. ఆ ధైర్యం, ఆత్మ విశ్వాసం ఎలా వచ్చాయో " అని మరింత విపులంగా చెప్పారు.   

" వీరభద్రుడు గారా .....అయితే ఆశ్చర్యం లేదు. అయన బాల మేధావి గా నాకు తెలుసు. మా గురుకులం లోనే చదివారు. అయన స్కూలు వదిలిపెట్టి వెళ్ళాక, పత్రికల్లో అయన రచనలు చూడటమే కానీ ఆయనను చూడ లేదు." అని చెప్పాను.    

ఈ విషయం నాకు గురుకులం గుర్తు వచ్చినపుడల్లా గుర్తు వస్తుంది. గురుకులం గుండెల్లోనే ఉంటుంది. నిజానికి  రెండేళ్ల సీనియర్ గా గురుకులం లో ఉన్న చిన వీరభద్రుడు నా కళ్ళకు ఒక అద్భుతం. నేను ఎప్పటికి చేరు కోలేని శిఖరం లా కనిపించేవాడు. ఒక అద్భుతం అనిపించేవాడు. కలసి ఉన్న ఒక్క సంవత్సరం లో చాల చాల తక్కువ సార్లు మాట్లాడి ఉంటాను. నిజానికి కేవలం చిరు నవ్వుతో పలకరించి ఉంటాను. అయితే చాలా సార్లు పొగిడి ఉంటాను. వీరభద్రుడు వేదిక మీద  చేసిన సాహసాలన్నీ గుర్తున్నాయి కానీ  మౌఖికంగా మాట్లాడిన సంభాషణలేవీ గుర్తు లేవు.   

ఏక పాత్రాభినయం అంటే వీరభద్రుడు గుర్తొచ్చే వాడు "జాక్సన్, రాయల్టీలు, నివాళులు, పన్నులు, వడ్డీలు,? ఎందుకు కట్టాలి మేము...ఆకాశం వర్షిస్తుంది. భూమి హర్షించి పంటలిస్తుంది. పొలాలు దున్ని వరి మొలకలు మీరు నాటారా ? లేక మా ఆడ పడుచులు ఆడుకోవటం కోసం పసుపుకొమ్ము మీరు దంచి ఇచ్చారా? ,సిగ్గు లేకుండా రాయల్టీలు అడుగుతున్నారు. ఎందుకివ్వాలి మీకు రాయల్టీలు ?. మీరు మాకు మేన మామలా ? అన్నదమ్ములా ? కేవలం నా అతిథిగా వచ్చినందుకు బతికి పోయారు.. లేదంటే మా సైనికులు మీ తలలని నేలపై దొర్లించే వారు" 

అసెంబ్లీ ప్రాంతం చప్పట్లతో మారు మోగింది. వీరభద్రుడి ఉచ్చారణ, అభినయం, హావ భావాలు, చాలా బాగున్నాయి. పాత్రలో పూర్తిగా లీనమైపోయాడు. చిరుత పులిలా స్టేజీ మొత్తం తిరుగుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించే మాటలివి. వీర పాండ్య కట్టబ్రహ్మన రామనాథపురం రాజభవనంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కలెక్టర్ జాక్సన్ ను ఎదిరిస్తూ అన్న మాటలివి. ఒళ్ళు గగుర్పొడించింది. 

తరువాత పత్రికల్లో ఎన్నో సార్లు తన పేరు చూసాను. తన గురించి విన్నాను. తను అబ్దుల్ కలాం గారి "Wings of Fire" ను తెలుగులో అనువదించినప్పుడు   చాలా గొప్ప పురస్కారం గా భావించాను. ఎంతో మంది తను రాసిన "కొన్ని కలలు కొన్ని మెళకువలు "  గురించి చెపుతున్నప్పుడు గురుకులం లో నాకూ చోటు దొరికినందుకు చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాను.

వీరభద్రుడు పేస్ బుక్ కు పరిచయం అయినప్పుడే నేను కూడా పరిచయం అయ్యాను. అయితే చాలా కాలం వరకు ఇది జన్మ దిన శుభాకాంక్షలు చెప్పటానికి అని నమ్మే వాడిని. అది కూడా ఆంగ్లంలో. కొన్నాళ్ళకు తెలుగులో టైపు చేయొచ్చని తెలిసింది. లేఖిని అనే సాఫ్ట్వేర్ ద్వారా ..అది కూడా చాల కష్ట మైనది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మూలంగా హిందీ డే జరపటం ఒక ఆనవాయితీ. అందుకోసం యూనికోడ్ లో  India Typing  అన్న ఆప్ ద్వారా లిప్యాంతరీకరణ ద్వారా హిందీ లో కవితలు టైపు చేసుకోవటం అలవాటయ్యింది. విచిత్రం ఏంటంటే అక్కడే పక్కనే ఉన్న తెలుగు ఆప్షన్ చాలా కాలం వరకు గమనించ లేదు.   

ఫిబ్రవరి  2018.  వీరభద్రుడు పేస్ బుక్ లో పెట్టిన ఒక సమీక్ష పై (అమృత సంతానం అనుకుంటా) వ్యాసం పై  చిన్న కామెంట్ పెట్టాను. అది నా జీవిత గమనాన్నే మారుస్తుందని ఆనాడు కలలో కూడా ఊహించ లేదు.  ఆ కామెంట్ చదవ గానే నాకు  మెసేజి పెట్టాడు              "చాలా బాగా రాస్తున్నావు మిత్రమా...ఏదయినా ఒక విషయం మీద ఒక పేజీ రాసి పెట్టు. చూద్దాం" అని.  నా ఆనందానికి హద్దులు లేవు. నేను ఏమి రాయాలన్నా మా ఊరు నాగావళి ...కొండలు ...గుట్టలు ...వాగులు ..వంకలు ...బాల్యం  ఇవి ముందు మనసుని ఆక్రమించేస్తాయి. మనసుకి నచ్చినదే మెప్పిస్తుంది ఎవరినైనా అని అదే విషయం మొదలు పెట్టాను.  "దారి తప్పిన ప్రయాణం" అని ఒక రెండు పేజీల ట్రావెలాగ్ రాసాను. అది ఒక రోజు గిరిజనుల ఇళ్ల కాలనీ చూసేందుకు కొండల్లోకి వెళ్లిన అనుభవం. ఎన్నో సార్లు వెళ్ళాను. కానీ అన్నీ అనుభవాలుగా మిగలవు. కొన్ని ఎప్పటికీ మనల్ని వదలవు.  అది ముందు వీరభద్రుడికి మెస్సేజి పెట్టాను. నిముషాల్లో జవాబు వచ్చింది. "అద్భుతం. పేస్ బుక్ లో పెట్టు మిత్రమా" అని. అంతే. నేను పేస్ బుక్ లో పెట్టటం ఎంతో మంది అభిమానం పొందటం జరిగిపోయాయి.  

ఇక్కడ వీరభద్రుడు కేవలం నన్ను మెచ్చు కోలేదు. నాకు ఒక దారి చూపించాడు. పేస్ బుక్ ని ఎలా వాడాలో ఒక అవగాహన కల్పించాడు. అంతవరకు కవితలు, వ్యాసాలు తప్ప కథలు రాయటం నా వల్ల కాదు అనుకున్న నన్ను పేస్ బుక్ ద్వారా ఉసి గొల్పి నన్ను కథల వైపు, సమీక్షల వైపు దారి మళ్లించటం. ఇప్పుడు నాకు పేస్ బుక్ ఒక సుందర లోకం. నిజానికి దేవ లోకం.  ఎందరో రచయితలతో పరిచయం. నిన్నటి వాళ్ళు.. నేటి వాళ్ళు .. రేపటి వాళ్ళు కూడా.        

వీరభద్రుడు ఒక అద్భుతం అని నేను మరో సారి అంటాను. ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తూ కూడా ...ఇలా ప్రతి రెండు మూడు రోజులకు ఒక వ్యాసం గాని, సమీక్ష గాని, ఒక కవిత గాని పోస్ట్ చేస్తుంటాడు. అద్భుతమైన చిత్రాలు గీస్తుంటాడు. చిన్న పెద్ద అనకుండా తనకున్న వేలాది స్నేహితుల రచనలు చదివి తన అభిప్రాయం రాస్తుంటాడు. తన రచనల మీద కామెంట్లను నిశితంగా పరిశీలిస్తుంటాడు. ఎప్పటికప్పుడే ప్రయాణాలు చేస్తుంటాడు. దాన్ని ట్రావెలాగ్ గా మారుస్తుంటాడు. గాంధీజీ చంపారని యాత్ర.. బ్రహ్మపుత్ర - భూపేన్ హజారికాల పై తన వ్యాసాలు అప్పటి జీవితాలను సంస్కృతిని కళ్ళ ముందు కదలాడించాయి. కళ్ళల్లో నీళ్లు కదిలించాయి.  "కొండ మీది  అతిథి" కవితా సంపుటి వచ్చినప్పుడు "అవును నిజమే .వీర భద్రుడు  కొండ మీద నుండి వచ్చిన అతిథి” అనుకున్నాను.  

తూరుపు కనుమల్లో గోదావరి నదికి తూర్పున దట్టమైన అడవులకు అతి చేరువలో ఒక పల్లెటూరు. పేరు శరభవరం. అప్పుడప్పుడు వీరభద్రుడు చెప్పిన దాన్ని బట్టి నిజంగానే ఆ ఊరు "శరభ" వరం అనిపిస్తుంది.  కొండలన్నీ తెల్ల చీర కట్టినట్టుండే  పాలపూలతో వర్షా కాలం కోసం ఎదురు చూస్తాయట.  వర్షాలు తీసుకు వచ్చే గంగాళమ్మ కు స్వాగతం పలుకుతాయట. మేఘుడు రాగానే సిగ్గుతో మాయమవుతాయట. వేసవి తాపం తీర్చుకుంటూ చల్లబడే ఆ పచ్చని కొండ చరియలు   ఆ పల్లెకు అన్నం పెట్టే   జీవన రేఖలు.   

ఆ పల్లెలో ఒక ఇల్లు. రెండు గదులదా మూడు గదులదా అని మనం ఇప్పుడు అనుకునే ఇల్లు కాదు. ఒక తాటాకుల పొదరిల్లు. చూరు నుండి వాన ధారలు కారుతుంటే అరచేతులు అడ్డం పెట్టి అక్క తమ్ముళ్లు,  అన్న తమ్ముళ్లు ఆడుకునే  అతి సుందరమైన గడప ఉండే పర్ణశాల. గాలి వాన వస్తే ఇంటికంటే ఎక్కువ నమ్మకాన్ని కలిగించే బలమైన చింత చెట్లు చేరువలో ఉన్న పొదరిల్లు. పొద్దున్నే పాలపూలు చూస్తూ ..మధ్యాన్నం చింత చెట్టు గాలిని ఆస్వాదిస్తూ సాయంకాలం కిరసనాయిలు చిమ్నీలు వెతుక్కునే ఇల్లు అది. ఒత్తులు చక్క పెట్టి భోజనాలయ్యే వరకు, పిల్లలు చదువుకున్నంత వరకు  ఒత్తులు పెద్దగా ఉంచి ఆ తరువాత  ఒత్తులు కిందకు లాగి చిన్నగా మార్చి బెడ్ లైట్ లా వాడుకునే ఆ చిమ్నీలలో సాదా జీవితం గడిపే ఒక కుటుంబ సత్యం ఉంది.

ఆ శరభవరం లో, ఆ ఇంటిలో, ఆ దీపం ముందు, ఆ చింత చెట్టు కింద, ఆ పాల పూల గాలిలో, మట్టి అరుగుల మీద తిరుగాడిన ఒక చిన్న బాలుడే మన చిన వీరభద్రుడు. చెట్టు పుట్టలని కొలిచే ఆ గిరిజన పల్లెలో, ఏడాదికో సారి వచ్చే గంగాళమ్మ అనుగ్రహం తో చిన వీరభద్రుడు పెద్దవాడవుతున్నాడు.  

ఈ రోజు మనం చూస్తున్న వీర భద్రుడికి నాలుగున్నర దశాబ్దాల కిందట ఆ పల్లెలో నడయాడిన చిన వీరభద్రుడికి,  ఆ  ఇంటిముందు ఉన్న పాల పూలు కప్పుకున్న ఆ కొండలకు నిత్యం మంచు పొరలు కప్పుకుని ఉన్న హిమశిఖరాలకు  ఉన్న అంతరం ఉంది.  అవును. నేను అన్నది నిజం. చిన్నప్పుడు వీర భద్రుడు ఒక కెరటం.  కేవలం చదువుల్లోనే కాకుండా ఏ కార్యక్రమమైనా ఉరకలేసే ఉత్సాహం. వీర పాండ్య కట్ట బ్రహ్మన  ఏకపాత్రాభినయం వేస్తూ వేదిక మొత్తం కలియతిరుగుతూ డైలాగులు చెపుతుంటే పూనకం పట్టిన చిరుత పులిలా కనిపించే వాడు.  కవిత్వం. కథలు  రాయటం, వక్తృత్వంలో ఇలా అన్ని సాహితీ సంబంధ విషయాల్లో నిరంతరం  పోటీ పడుతుండే వాడు. చివరకు తనకు ఎవ్వరూ పోటీ లేరనిపించుకునే స్థితికి చేరి స్కూలు వదిలి పెట్టాడు.  

ఇప్పుడు మనం చూస్తున్నది పరిచయం అక్కర లేని వీరభద్రుడు. అద్దం అక్కర లేని ముంజేతి కంకణం. దివిటీలు చూపక్కర లేని నిత్యం జ్వలించే సూర్యుడు. అఖండ జ్యోతి గా మారిన ఒకప్పటి చిమ్ని లాంతరు. ఎవరెస్టుగా మారిన ఒక చిన్న కొండ శిఖరం.  

అయితే ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో తాను ఒంటరిగా నడవలేదు. ఎందరో చేయి పట్టి నడిపించారు. “అడుగు ముందుకెయ్యి నేనున్నాను” అని వెన్ను తట్టి ప్రోత్సహించారు.  ఎక్కడైనా కాలు జారినట్టున్నా మాట తడబడినట్టున్నా మొహమాటం అడ్డొచ్చినా ఏదో ఒక చేయూత,  ధైర్యం,  కలివిడితనం  తనకు సమయానుకూలంగా దొరికాయి. తను చేతబట్టిన చిమ్నీ లాంతరుకు అవసరమైనప్పుడల్లా చమురు వేస్తూ ...అరచేతులు అడ్డు పెట్టి దాన్ని గాలి ఆరిపోకుండా వర్షం లో తడిసిపోకుండా కాపాడుతూ ఎన్నో చేతులు ముందుకొచ్చి ఉంటాయి.     

తను స్కూలులో ఉన్నప్పుడు మాష్టార్లను తండ్రుల్లా ...వాళ్ళ చేయి  పట్టుకుని వదిలి పెట్టక తిరిగే వాడు. ఉదోగా రీత్యా తను ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉండాల్సి వచ్చినప్పుడు కనిపించే చెట్టును పుట్టను వాగును వంకను కూడా గురువుగా భావించి  గిరిజనులను దైవాంశ సంభూతులుగా భావించే వాడు. ఎన్నో దేశాల సాహిత్య కారుల రచనలను చదువుతూ, దేశ భాషల్లోని ఎన్నో గ్రంథాలను చదువుతూ కనిపించిన ప్రతి అక్షరం ఒక గురువుగా భావించేవాడు. వేదాలను, వేదాంగాలను,  వేదాంతాన్ని, ఉపనిషత్తులను చాలా లోతుగా అధ్యయనం చేసి తను రచయితగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒక గొప్ప పాఠకుడిగా మాత్రమే లోకానికి కనిపించే నిరాడంబర కవి, రచయిత మన వీర భద్రుడు.

అయితే వీరభద్రుడు మామూలు శిష్యుడు కాదు. కాయో, పండో; త్రుణమో ఫణమో గురుదక్షిణగా అప్పగించి చేతులు దులుపుకోవటానికి. ఇందులో తన సృజనాత్మకత ఒక అద్భుత ప్రయోగం. తను గురువులుగా భావించిన వాళ్ళందరిని అప్పుడప్పుడు పేస్ బుక్ మాధ్యమంగా పరిచయం చేసాడు.  ఒక్కొక్కరిమీద ఒక వ్యాసం రాస్తూ  పాఠకుల ముందుంచాడు. తన నడకలో కాలికి తగిలిన గులక రాయిని కూడా చేతిలోకి తీసుకుని నడక నేర్పిన గురువుగా భావించి ఈ లోకం ముందు పెట్టాడు.  ఇలా ఒకటి కాదు రెండు కాదు.  కొందరు వ్యక్తులు. కొన్ని పుస్తకాలు. కొన్ని సంఘటనలు.. మొత్తం కలసి నూట ఇరవై అయిదు వరకు పేస్ బుక్ లో ప్రచురించాడు.  కొందరిని గురువులన్నాడు. మరికొందరిని ఋషులన్నాడు. మిగిలిన వాళ్ళను గొప్ప మనుషులన్నాడు.         

అయితే వీళ్లందరినీ ఒక దారంతో కట్టాడు. దాని పేరు సంస్కారం. అవును.  వేలాది టన్నుల సంస్కారం కరగదీసి పోత పోస్తే మన ముందున్న ఈ వీర భద్రుడు. ఒకే దారం తో కట్టి హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ ఒక స్థానం ఇచ్చి దాని పేరు "దశార్ణ దేశపు హంసలు"  అని పెట్టి మన ముందుంచాడు. అయన చెప్పక పోయినా ఇది వాళ్లందరికీ తను ఇచ్చిన గురుదక్షిణగా మిగులుతుంది.  

వీరభద్రుడు ఒక సందర్వ్హంలో అంటాడు. తనకు తెలిసిన గొప్ప నేతగాళ్ళు ముగ్గురున్నారు ఈ ప్రపంచంలో అని. ఒకరు కబీరు. ఒకరు షిర్డీ సాయి బాబా. మూడవ వారు మహాత్మా గాంధీ.  సర్వమానవ సౌభ్రాతృత్వానికీ ఈ ముగ్గురు ప్రతీకలు.   రంగు రంగుల దారాలను ఒక దగ్గర చేర్చి రంగుల చీరగా నేసే నేత గాళ్ళలా వీళ్ళు ముగ్గురు కులం మతం లాంటి ఏ అడ్డు గోడలు లేని మానవ సమాజం నిర్మాణం కోసం పాటు పడ్డ నేత గాళ్ళే.  మరి సాహితీ వినీలాకాశంలో ఎన్నో తారలను ఒకటిగా చేర్చిన గొప్ప నాల్గవ నేతగాడు మన వీరభద్రుడు.

ఎదుటి వారి కోసం తను ఎంత ఆలోచిస్తాడో జుకెర్ బెర్గ్ గురించి రాసిన తన తోలి వ్యాసం లోనే తెలుస్తుంది.   పత్రికల్లో లాగా రేడియోల్లో లాగా మరొకరి స్థలానికి, అవకాశానికి ఏ మాత్రం అడ్డు కాకుండా జుకర్ బెర్గ్ అందించిన పేస్ బుక్ మాధ్యమం అసంఖ్యాక బహుళ దృక్పథాలు ఏక కాలంలో వినిపించగల అవకాశం కల్పించింది అంటూ,  తాను మిత్రుల కోరికపై తన పేస్ బుక్ రచనలను ఇలా ఒక పుస్తక రూపంలో తీసుకు రావటం, పుస్తకానికి మేఘదూతం లోని కాళిదాసు చేసిన ప్రయోగం "దశార్ణ దేశపు హంసలు" గా పేరు పెట్టి, దానిని పేస్ బుక్ ద్వారానే పరిచయం అయిన పండితులు, సంస్కారవంతులైన సాహిత్యాభిమానులు, భావుకులు అయిన శ్రీ సూరపురాజు రాధా కృష్ణ మూర్తి గారి చేతుల్లో పెట్టి ఒక అద్భుతమైన ఒరవడికి నాందీ పలికారు. నిజానికి సూరపురాజు రాధాకృష్ణ మూర్తి గారు తన తీయని సమీక్షల ద్వారా షేక్స్పియర్ రచనలపై తెలుగు వాళ్లకు భయం పోగొట్టి ఇష్టం కలిగించేలా చేసారంటే అతిశయోక్తి కాదు.

ఓ  మేఘమా..నువ్వొస్తూనే ఈ ప్రదేశం మొత్తం దట్టమైన పచ్చని జడలు విరబూసుకుంటుంది. గ్రామాల్లో చెట్లన్నీ పక్షుల గూళ్ళతో సందోహం మొదలవుతుంది.  నల్లని నేరేడు పళ్లతో అడవి  అందంగా కనిపిస్తుంది. అప్పుడు హంసలు కొద్దీ రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అంటూ కాళిదాసు చెపుతుంటే ఒక వైపు ఆనందం మరో వైపు భయం కలుగుతుంది. ఆ హంసలు కొద్ది రోజుల తరువాత  వెళ్లి పొతే ? అందుకే కాకిలా కలకాలం కాదు  హంసలా ఆరు నెలలు చాలు అన్నారేమో....అయినా మళ్ళీ మేఘం వస్తుంది. వర్షిస్తుంది. హంసలు కూడా వస్తాయి. వీరభద్రుడి కవిత కంటే ప్రియురాలు ఎవరుంటారు ? అనుకుంటూ ఆ శరభయ్య మాష్టారు కూడా  మళ్ళీ వస్తారు.  అంతవరకు చిన వీర భద్రుడు చిద్విలాసంగా తన సాహితీ సేద్యం కొనసాగిస్తాడు. ఎందుకంటే తను కూడా దశార్ణ దేశంలో ఒక హంస. కాక పొతే రాజ హంస.  

(ఈ "దశార్ణ దేశపు హంసలు" సంకలనం పైన నాలుగు వాక్యాలు రాయాలని అనుకున్నాను. అయితే రాయటం మొదలు పెట్టాక పుస్తకంలోని వివిధ అంశాలు మాటి మాటికీ వీరభద్రుణ్ణి గుర్తు చేస్తున్నాయి.  అందుకే మొదట అయన గురించి నాలుగు ముక్కలు రాస్తే అప్పుడు పుస్తకం గురించి రాయటంలో విఫలం అయినా నేను క్షమార్హుణ్ణి అవుతాను అనుకుని ఇలా మొదలు పెట్టాను). 

(సశేషం )

Sunday, May 12, 2019

ఎంతటి వేసవి కాలంలోనైనా ఆరుబయట మంచాలేసుకుని ఆకాశంలో చూస్తూ అమ్మమ్మపక్కలో పడుకున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ అవే సప్తరుషులు, ఆపక్కనున్నాయేమో గొల్లకావిడని,అదిగో ఆపక్కది దృవుడని చెప్పిన రోజులు ఏవైపోయినియ్యీవివి.,

చిన్ననాటి మనపల్లెలేం పట్టణాలైపోలేదుగాని.,
ఆరోజుల్లో తోటివారి కష్టసుఖాల్లో స్పందించే హృదయాల్లా మెత్తగావుండే మట్టిరోడ్లు.,
ఈరోజుల్లో ఎటువంటి స్పందనలులేని హృదయాల్లా గట్టిగా సిమెంటురోడ్లుగా మారిపోయినియ్యంతే,

వేసవికాలం సెలవుల్లో పిల్లలంతా కలసి చేలగట్లంటా, కాలవగట్లంటా తిరుగుతూ ఆడుకుంటూ సాయంత్రానికి ఇంటికిజేరుకునే పిల్లలేవయ్యారు?

సాయంత్రమయ్యేసరికి గుడరుగుమీద కూర్చుని గుడిమైకుసెట్లో ఏసే భక్తిపాటలనుంచి భగవద్గీత వరకూ కంఠతా వచ్చేసి కూడా పాడుకుంటూ పోయినరోజులేవీవి?

పెద్దోల్లు గుడికాడ కాలీస్దలంలో వాలీబాలు, బాల్ బేడ్మింటన్  ఆడతుంటే వాల్లకి బంతి అందించటానికి ఎంతలా తోసేసుకునేవాల్లం.,! ఆరోజులేయీవివి?

చేలోమయంగా పోయి ఎండిపోయిన ఆనప్పాదు పుల్లలని బీడిల్లాగ , అరటి ఆకులని చుట్టల్లా దొంగచాటుగా,ఎవరూ చూడకుండా కాల్చినరోజులు ఏవైపోయినియ్?

పిప్పరమెంటు బిల్లతిని నీల్లుతాగుతుంటే సల్లగా వున్నాయని కడుపు పట్టనన్ని మంచినీరు తాగేసివోల్లంకదా! ఆరోజులు ఏవైపోయినియ్యీవివి?

సినిమాహాలుకాడ పాడేసిన సినిమారీల్లుతో బూతద్దం, కరెంటుబలుబుతో తెల్లటి గోడమీద సినిమాలేసుకుని దియేటరు వోనరులా ఫీలైపోయిన ఆరోజులేవైపోయినియ్యిావివి?

బేటరీలైటులో బల్బు బేటరీ బయటకుతీసి ఒకవైరు ముక్క బేటరీకి కిందపైనపెట్టి బేటరీ బొడిపమీద బలుబెట్టి ఆబలుబు ఎలిగినప్పుడు పెద్ద ఇంజనీరులా ఫీలైపోయిన ఆరోజులు ఏవీవివి?

కాలువలో జిగురుమట్టి తెచ్చుకుని దాంతో ఎద్దులు, బండి, ట్రాక్టరు, అలాఎన్నో బొమ్మలుచేసుకుని, మట్టితో బొంగరాలు చేసి మయంగా అగ్గిపుల్ల గుచ్చి తెగతిప్పేసీవోల్లుం., ఆరోజులేవైపోయినియ్యీవివి?

కొబ్బరాకులతో అమ్మాయి,అబ్బాయిల బొమ్మలచేసి వాటికి పెళ్ళిచేసి ఉత్తుత్తి భోజనాలెట్టుకుని., అవితిన్నట్టుగా ఆడుకునే ఆటలుకూడా వున్నాయని ఇప్పటి పిల్లలకు తెలుసంటావా ఇవివి?

ఆటలాడుతూ పడిపోతే మోచిప్పలు,మోకాల్లు పగిలిపోతే దానికి గుంటగరగరాకు పసరు పిండితే కొన్నిసెకన్లపాటు బగ్గుమని మండినాకాని రెండురోజుల్లో ఎంతపెద్ద గాయమైన మాడిపోయే ఆరోజులేవైపోయినియ్యీవివి?

ఏజన్మలో చేసుకున్న పుణ్యవోకాని ఆరోజులని, ఈరోజులని చూసే అదృష్టం దక్కింది., అంతటి అందమైనరోజులు నాకెప్పుడూ మరపురావు.,
వాటిని మీకూ గుర్తుచేద్దావని రాసిందే ఇది..,

Thursday, May 9, 2019

ఒక చిన్న కథ

🌹ఒక చిన్న కథ🌹

ఒక చిన్న హోటల్  చేతిలో గిన్నె  పట్టుకుని ఒక పదేళ్ళ బాబు  "  అన్న ..  అమ్మ పది ఇడ్లిలు తీసుకురమ్మన్నారు,
డబ్బులు రేపు ఇస్తాను  అన్నారు అని చెప్పాడు "

ఆ హోటల్ యజమాని  ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ
అమ్మతో చెప్పు, ఇప్పటికి  తీసుకువెళ్ళు, గిన్నె ఇలా ఇవ్వు  బాబు  సాంబార్  పోసిస్తాను అని చెప్పాడు

ఇడ్లి పొట్లం  కట్టి గిన్నెలో  సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు .
సరే అన్న వెళ్ళొస్తాను,  అమ్మకు చెప్తాను అని చెప్పి బయల్దేరాడు.

అదే హోటల్ లో అన్ని గమనిస్తున్న వ్యక్తి యజమాని  దగ్గరకు వెళ్లి అడిగాడు. ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు మళ్ళీ ఎందుకండీ  ఇచ్చి పంపారు అని ??

ఆ యజమాని  ఆహారమే  కదండీ నేను ఇస్తున్నది..
పెట్టుబడి  వేసే నేను నడుపుతున్నది  కానీ ఇటువంటి  చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు  లేదని చెప్పడానికి  మనసు రావట్లేదు  .
ఈరోజు కాకపోయినా  రేపైనా  నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి.
కాస్త లేటుగా  ఇస్తారు అంతే..
అందరికి డబ్బులు అంత సులభంగా  దొరకదు.
బిడ్డ ఆకలితో  అడిగుంటుంది  అందుకే పంపారేమో..

నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను.

నేను కష్టపడి సంపాదిస్తున్న  డబ్బు అండి ఎలాగైనా నాకు వస్తుందండి  మోసం చేయరు.

కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది  కదండీ అది ముఖ్యం

నేను ఇప్పుడు ఇవ్వను  అంటే

 ఆ బిడ్డ ఆ తల్లికోసం  దొంగతనం చేయొచ్చు

లేదా

ఆ తల్లి ఆ బిడ్డను బిక్షమెత్తడానికి  పంపవచ్చు

లేదా

 ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి  తప్పుడు  మార్గం ఎంచుకోవచ్చు
 
ఇప్పటికి నేను నష్టపోవచ్చు ..

 కానీ..

సమాజంలో జరిగే  మూడు తప్పుడు ప్రయత్నాలను  నేను ఆపగలిగాను  అంతే అన్నాడు .
ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి  మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు  ఆ వ్యక్తి .
 
దేవుడు  లేడని ఎవరండీ చెప్పేది .
ఇలాంటి వారి మనస్సులో  ఉన్నాడండి
వాళ్ళు ఇచ్చేస్తారన్న  నమ్మకంలో  ఉన్నాడండి

ఒక మనిషి మనల్ని వెతుకుంటూ వచ్చారంటే  మనం కచ్చితంగా ఇస్తాము  అనే నమ్మకంతోటె  వస్తారు.

మనకు మించిన  సహాయం చేయమని  చెప్పడంలేదు.
మనకు ఉన్నదంట్లో చిన్న సాయం అయినా చాలు అంటున్నాను.
🙏🙏🙏🙏🙏

(Helping Hands Group Sowjanyamtho)

కాల గణనం:


ఇది మన కాల గణనం. ఇంత నిశిత కాల గణన
ఇతరులకు అసాధ్యం. నానో సేకండ్స్ ని మన
వాళ్ళు ఎంత గా గుణించారో ఆశ్చర్యం వేస్తుంది.
100 తృటికలు – 1వేధ
3 వేధలు – 1 లవము
3 లవములు – 1 నిమిషం
3 నిమిషాలు – 1 క్షణం
5 క్షణాలు – 1 కాష్ట
15 కాష్టలు – 1 లఘువు
15 లఘవులు -- నిశిక
6 నిశికలు – 1 ప్రహర
4 ప్రహరలు – 1 దినం
15 దినాలు -- 1 పక్షం
2 పక్షాలు – 1 మాసం
2 మాసాలు – 1 ఋతువు
3 ఋతువులు – 1 ఆయనం
2 ఆయనాలు – 1 సంవత్సరం
12 సంవత్సరాలు – 1 తప
100 సంవత్సరాలు – 1 శతకం
10 శతకాలు – 1 సహస్రకం
4 సహస్రకాలు – 1 యుగం
4 యుగాలు – 1 మన్వంతరం
100 మన్వంతరాలు—1 బ్రహ్మదినం.
బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?
అనంతమైన ఈకాలమానంలో ఎన్నో
మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో
బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని
పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50
సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత
వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ
మన్వంతరమైన వైవస్వతంలో 27
మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది
అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది. సహస్ర
చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14
మన్వంతరాలుగా విభజించడం జరిగింది.
మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో
ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు,
ఒక్కొక్కరు 76
1/2 చతురుయుగాల చొప్పున
459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల
30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.
కృతయుగం——-17,28,000
త్రేతాయుగం—– 12,96,000
ద్వాపరయుగం— 8,64,000
కలియుగం——- 4,32,000
_______
43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.
_______
మన లెక్కల ప్రకారం
360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.
అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా
43,20,000 సంవత్సరాలు ఒక
చతుర్యుగం (మహాయుగం) అన్నమాట. 2వేల
చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం.
360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా
మనుష్యమానంలో
31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు)
సంవత్సరాలు.
ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని
ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు.
71 మహాయుగాలు కలిపి ఒక
మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14
మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14
మన్వంతరాలు ఒక రాత్రి.
28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు.
360 కల్పాలు బ్రహ్మకు ఒక
సంవత్సరం అవుతుంది. అలాంటి
నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం.
2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ
దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ
సంవత్సరం. ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ
యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో
5108 సంవత్సరాలు
మన్వంతరము:-
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క
పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క
మన్వంతరము
30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక
బ్రహ్మ దినము లో 14
మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి.
ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో
ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి
మన్వంతరము 71
మహాయుగములుగా విభజించబడినది.
ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు
360 రెట్లు అధికము. అనగా మన ఒక
సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30
సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన
360 సంవత్సరములు వారికి ఒక (దివ్య)
సంవత్సరము. ఇట్టి
12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య
యుగము (మహాయుగము). ఇది మనకు ఒక
చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన
43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

• కృత యుగము =
4,800 దివ్య సంవత్సరములు =
17,28,000 మానవ సంవత్సరములు

• త్రేతా యుగము =
3,600 దివ్య సంవత్సరములు =
12,96,000 మానవ సంవత్సరములు

• ద్వాపర యుగము =
2,400 దివ్య సంవత్సరములు =
8,64,000 మానవ సంవత్సరములు

• కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు =
4,32,000 మానవ సంవత్సరములు
• మొత్తము 12,000 దివ్య సంవత్సరములు =
43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య
యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య
యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

ప్రాచీన కవుల అపోహలూ --- అనుమానాలూ!

 ప్రాచీన కవుల అపోహలూ --- అనుమానాలూ!

కం: ఆఱింటను ' త' బెట్టిన ,
వారింటను బీనుగెళ్ళు ! వసుమతిలోనన్;

ఎవరి మీద పద్యం చెప్పినా జాగ్రత్తగా ఆలోచించి పద్యం చెప్పాలి. లేకపోతే వారికి చాలా యిబ్బందులే!
ఆఱవ అక్షరంగా 'త 'కారం ఉంచి యెవరిపైనా పద్యం చెప్పరాదు. అలాచెపితే వారింట్లో శవం లేవటం ఖాయం! యిలా యేవో కొన్ని
అపోహలూ అనుమానాలూ నాటికవులలో ఉండేవట! ఇంతకీ ఇవి అనుమానాలేనా? యిలాజరిగిన దాఖలాలున్నాయా? అనేప్రశ్నకు
ఉన్నవని సమాధానంకూడా చెపుతున్నారు. యేవిటా సమాధానం?

పూర్వం వేముల వాడ భీమకవి యనే ఉద్దండ కవియుండేవాడు. ఆయన సంచార శీలి. నిత్యం సంచారంచేస్తూ, ఆయాప్రభువులను పొగడి ద్రవ్య సమార్జన చేసేవాడు. ఆవిధానంగా ఒకరోజు "గుడిమెట్టలంక" గ్రామానికి వచ్చాడు. "పోతరాజు"-
దానిపాలకుడు. ఆతనికి కవులపై సదభిప్రాయం శూన్యం. వారిని బిచ్చగాండ్రుగా చూచేవాడు. పోతరాజు
భీమకవిని ఆదరింపక పోగా అందంగా ఉన్నదని యతనిగుర్రమును బలిమి తో నపహరించి యవమానించాడు. శాపానుగ్రహ దక్షుఁడైన భీమకవి యూరకుండునా? వెంటనే ఆరవ యక్షరముగా త కారమునుంచి-

చ: " హయమది సీత , పోత వసుధాధిపుఁ డారయ రావణుండు , ని
శ్చయముగ నేను రాఘవుఁడ ! సహ్యజ వారిధి , మారుఁడంజనా
ప్రియ తనయుండు , లచ్చన విభీషణుఁ, డా గుడిమెట్టలంక , నా
జయమును ,పోత రక్కసుని జావును , నేఁడవ నాఁడు జూడుడీ ! -- అనేపద్యం చెప్పాడట!

ఆ తరువాత కోపంతో వెళ్ళి ఆగ్రామ సత్రంలో బసచేశాడు. నాటికి ఏడవ నాడు పోతరాజు అకారణంగానే
విరుచుకు పడిపోయాడట. వైద్యుడు పరిశీలించి ఆశలేదని చెప్పాడట! ఆసమయంలో అంతఃపురకాతల రోదనలను వినలేక బుధ్ధిమంతుడైన యతనిమంత్రి దానికి కారణం భీమకవిశాపమేనని భావించి, గ్రామ సత్రమున కేగి యతనిని బ్రతిమాలి మాయేలికను
తిరిగి బ్రతికింపుమని కోరినాడట. దయాస్వభావుడైన భీమకవి కోటకు వచ్చి మరియొక పద్యమును జెప్పి పోతరాజును బ్రతికించినాడట! పోతరాజు తనయపరాధమును క్షమింపగోరి ,కవిని ఘనముగా సన్మానించి పంపినాడట! ఆరెండవ పద్యము యెంతప్రయత్నించినను గుర్తురాకున్నది. మీలో నెవరికైన వచ్చినచో వ్యాఖ్యలలో వ్రాయగలరు.
ఇంతకీ పోతరాజుపై చెప్పిన పద్యంలో ఆఱవ అక్షరం త కారం !చివరి పాదమూ అంతే!
అప్పటినుండి కృతిభర్తపై చెప్పు పద్యములలో ఆఱవ అక్షరంగా త" కారం నిషేధం!
అది మొదటిది. ఇలాంచిదే మరోటి. వింటారా!? సరే !

కం: మగణంబుఁ గదియ రగణము
వగవకఁ గృతిమొదల నిలుపు వానికి 'మరణం
బగు' నిక్కమండ్రు ,మడియడె!
యగునని యిడి దొల్లి టేంకణాదిత్యు డనిన్!

పద్యంలో మగణం తదుపరి 'రగణాన్ని' వాడరాదు. అలా వాడినందువలననే టేంకణాదిత్యుడు యుధ్ధంలో
మరణించాడు. అనిదీని భావం. సారాంశం:- మగణం తరువాత రగణం వాడరాదని. వాడితే వాడికి మూడినట్లే నని సారాంశం.
అలావాడి నష్టపోయిన వారున్నారా? అన్నదిప్రశ్న? లేకేమి? నన్నెచోడ కవి అలావాడి కృతిని నిర్మించాడు. దానిఫలితమే చోళరాజుల యుధ్ధంలో అతడు కనుమూయటం. అన్నది సమాధానం..
---------------------------
నన్నెచోడ కవికి టేంకణాదిత్యుడు అనిబిరుదం. ఆయన పొత్తపి రాజధానిగా కడప మండలమును పాలించాడు.
వీరశైవుడు. కుమారసంభవము ఇతనికృతి. ఇది స్రగ్ధరా వృత్తముతో ప్రారంభమౌతోంది.

శ్రీ వాణీంద్రామరార్పిత మకుటమణి శ్రేణిధామాంఘ్రిపద్మా
జీవోద్యత్కేసరుండాశ్రిత జన లషితాశేష వస్తు ప్రదుం డా
దేవాధీశుండునిత్యోదితుఁడజుడు మహాదేవుఁ డాద్యుండు విశ్వై
కావాసుండెప్పుడున్ మాకభిమతములు ప్రీతాత్ముఁడై యిచ్చుఁ గాతన్!

కుమార సంభవము--మొదటి పద్యము!
ఈపద్యంలో మగణంతరువాత రగణం వస్తోంది. తప్పదు. దానిలక్షణమది!
నన్నెచోడ మరణానికది కారణమని విజ్ఙులమాట! యిందులో కొంత సత్యమున్నదనిపిస్తోంది. తిక్కన గారు మనుమసిధ్ధి
కృతిపతిగా "నిర్వచనోత్తర రామాణాన్ని రచించారు. అందులో మొదటిశ్లోకం స్రగ్ధర. మగణంతరువాత రగణంవేయక తప్పదు. మనుమ సిద్దికూడా ఆతరువాత అక్కన బయ్యనలనే దాయాదుల యుధ్ధంలో మరణించటం జరిగింది.
కాబట్టి యీప్రవాదాలలో కొంత నిజమున్నమాట నిజం!
అందుకే గాబోలు అనంతామాత్యుడు ఛందోదర్పణం లో శుభా శుభ గణాలను సూచించాడు.

ఉ: నవ్య శుభప్రదాయి భగణంబు , జకారము రుక్ప్రదంబగున్ ,
ద్రవ్యము చేయునా ,లయకరంబు సకారము , ఆశుభంబు ఆ
దివ్య సువర్ణకారి , వెత దెచ్చును రేఫ , శుభంబులిచ్చు దా
కావ్యములందు నాదినిడ కర్తకు భర్తకు నంబుజోదరా!

అంటాడు. అందుచేత నవకవులు యువకవులు ఛందో లక్షణాలను చక్కగా ఆకళింపు చేసికొనిపద్యాలువ్రాయటానికి ఉఫక్రమించటం మంచిదేమో?
స్వస్తి!
(శ్రీ సత్యనారాయణచొప్పకట్ల గారి సౌజన్యముతో మరియు ధన్యవాదములతో)
[10:22 PM, 5/6/2019] +91 98852 71166: యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి - 

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.

1) రథి - ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు -
వీరంతా రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు) -

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు) -

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధులు మహారథులు.

4) అతి మహారథి (మహారథికి 12రెట్లు) -

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు - వీరు అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, అటు ఇంద్రజిత్తు - ఇటు ఆంజనేయుడు. రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) -

ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గా దేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి, వీరు మహామహారథులు.

మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మంచి విషయం.

"బాదరాయణ సంబంధం"

కథ చెబుతా...

మనకి "వేలు విడిచిన సంబంధాలు ", "బీరకాయ పీచు సంబంధాలు" లాగానే "బాదరాయణ సంబంధం" ఒకటి ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బాదరాయణ సంబంధం మీద కొన్ని కథలున్నాయి. అందులో ఒకటి ఇదిగో....

కోనసీమలో కేశనకుర్రు అనే గ్రామం ఒకటుంది. ఆ గ్రామం లో అమాయక బ్రాహ్మణ కుటుంబం ఒకటి. భార్య, భర్త- ఇద్దరే కుటుంబ సభ్యులు. మరీ సంపన్నులు కాక పోయినా కాస్త సంపన్నులే! దేనికీ లోటు లేదు. అతిథి మర్యాదలు సాదరంగా చేస్తారని ఆ పరిసర ప్రాంతాల వారందరికీ తెలుసు. యజమాని పేరు కామయ్య.

ఓరోజు కామయ్య గారి ఇంటి ముందు ఓ గుర్రబ్బండీ ఆగింది. నిగనిగలాడుతూ జరీ పంచె, కండువాతో ఉన్న ఓ పెద్ద మనిషి దిగేడు. బండి తోలే మనిషి పెట్టె తెచ్చి హాల్లో పెట్టేడు. వెనుకనే హుందాగా నడచి వచ్చాడీ పెద్ద మనిషి. బండి తోలే మనిషి తిరిగి వచ్చి గుర్రానికి గడ్డి వేసి బండి లోనే కూర్చున్నాడు. కామయ్య ఏదో పని మీద పై ఊరుకెళ్ళేడు. పెరట్లో పని చేసుకుంటున్న భార్య సీతమ్మ ఈ పెద్దమనిషి ని చూసి హడావుడిగా హాల్లోకొచ్చింది కొంగుతో చేతులు తుడుచుకుంటూ.

"అబ్బాయి ఇంట్లో లేడేమిటమ్మా?" అన్నాడు పెద్ద మనిషి సావకాశంగా కాళ్ళు జాపుకుని కండువా తీసి కుర్చీ మీద పెట్టి.

"పై ఊరు పని మీద వెళ్ళారు. వచ్చేస్తారు." అని వినయంగా చెప్పి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళింది.

ఆమె వివాహమై కొద్ది కాలం మాత్రమే అయింది. పెళ్ళి లో చూడని భర్త తరుఫు బంధువనుకుంది ఆమె.

కాళ్ళు కడుక్కుని, ఆమె పెట్టిన పలహారం సుష్టుగా తాను సేవించడమే కాకుండా బండివాడికి కూడా పెట్టించాడు పెద్ద మనిషి.

ఇంతలో కామయ్య తిరిగి వచ్చాడు." ఇదిగో, ఆయన వచ్చారు. " ఆమె లేచి నిలబడింది అంతవరకు పిచ్చాపాటి కబుర్లు చెప్తున్న సీతమ్మ .

"రావోయ్, అల్లుడూ. ఉదయమే ఎక్కడికో వెళ్లి పోయావ్!" అంటూ చనువుగా పలుకరించాడు.

"అర్జెంటుగా పని పడింది. పక్కూరు వెళ్ళేను. కాఫీ, పలహారం సేవించారా?" అని అభిమానంగా అడిగేడు కామయ్య.

"అన్నీ చక్కగా పెట్టింది అమ్మాయి. అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తూ అన్నపూర్ణ!" అన్నాడు సీతమ్మ ని మెచ్చుకోలుగా చూస్తూ.

"నేను మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళవలసి ఉంది. మీరు కాస్త విశ్రమించండి. భోజనం వేళకు వచ్చేస్తాను. కలసి భోంచేద్దాం. ఏమీ అనుకోకండి. " అని నొచ్చు కుంటూ లేచాడు కామయ్య.

"భలే వాడివే! నిరభ్యంతరంగా వెళ్ళి రా. " నీతో కలసి భోంచేసాక నేను కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను." అన్నాడు పెద్ద మనిషి పత్రిక తిరగేస్తూ.

అతని బాధ్యత  భార్య కప్పజెప్పి వడివడిగా బయటకెళ్ళిపోయాడు కామయ్య. అతడు దినపత్రిక తిరగేస్తూ కూర్చోగా సీతమ్మ వంట పనిలో పడింది.

ఆమె వంట పూర్తి అయ్యేసరికీ బయటకెళ్ళిన కామయ్య తిరిగి వచ్చేసాడు.

ఇద్దరికీ వెండి కంచాలలో వడ్డన చేసింది సీతమ్మ. సుష్టుగా భోజనం చేశాడు పెద్ద మనిషి. అరుగు మీద బండీవాడు కూడా భోంచేశాడు.

పెద్ద మనిషి గదిలో బయలుదేరడానికి సిద్ధమౌతూండగా, "మీ బంధువు మంచి భోజన ప్రియుడే సుమీ. " పెరట్లో మెల్లగా అన్నాడు భార్య తో కామయ్య.

"మా బంధువు అంటారేమిటి? ఆయన మీ తరుఫు వారు కాదూ?" అంది సీతమ్మ విస్తుపోతూ.

"అబ్బే, మావైపు వారు కాదు. " అన్నాడు కామయ్య.

దంపతులు ఇద్దరూ హాల్లోకి వచ్చే సరికి పెద్ద మనిషి పెట్టె బండి లోనికి చేర్చడమూ, అతను బయలుదేరడానికి సిద్దంగా ఉండడమూ గమనించారు.

"వస్తానోయ్. కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను. వస్తాను తల్లీ. మంచి భోజనం పెట్టేవు. " అని బండి వైపు నడిచాడు పెద్ద మనిషి.

అతడి వెనుకనే నడచి వెళ్ళి, "అయ్యా, తమరు ఎవరో పోల్చుకోలేకపోయాను.  మన సంబంధం....." నసుగుతూ సందేహం వెలిబుచ్చాడు కామయ్య.

గట్టిగా ఓ నవ్వు నవ్వి, "మనది బాదరాయణ సంబంధమోయ్. " అన్నాడు పెద్ద మనిషి. ఇతడు తెల్ల ముఖం పెట్టడం చూసి, "అర్థం కాలేదూ? బదరి అంటే రేగు. నీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు రేగు చెట్టు తో చేసినవే! అదే మన సంబంధం!" అని బండి ఎక్కేసాడు పెద్ద మనిషి. అంతే కాదు, కొసమెరుపు గా...
"శ్లో: అస్మాకం బదరీ చక్రం
       యుష్మాకం బదరీ తరుః
       బాదరాయణ సంబంధాత్
       యూయం యూయం వయం వయం. "

అని ఓ శ్లోకం కూడా వదిలేడు. బండి కదిలింది. బండి మలుపు తిరిగే వరకూ నిర్ఘాంతపోయి నిలిచి చూస్తూ ఉండిపోయారా అమాయక దంపతులు!

ఇదండీ బాదరాయణ సంబంధం! కథ కంచికి మనం ఇంటికి!!

Total Pageviews