దశార్ణ దేశపు రాజ హంస -1
పద్దెనిమిదేళ్ల కిందటి మాట. నేను న్యూఢిల్లీలో పనిచేస్తున్న రోజులు దక్షిణ భారతీయులు ఎక్కువగా ఉండే ఆర్ కె పురం లో ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఆదివారం రాగానే ఎక్కువగా దగ్గర్లో ఉన్న ఢిల్లీ తమిళ సంఘం, కర్ణాటక సంఘానికి వెళ్తుండే వాడిని. అప్పుడే చాల మంది ప్రముఖులతో పాటు సినీ అభినేత్రులు సుహాసినిని, అర్థాంతరంగా నేల రాలిన సౌందర్యను, సంగీత విధ్వాంసురాలు నిత్యా మహదేవన్ లను పలకరించే అవకాశం కలిగింది. అయితే తెలుగు వాడిని అయి ఉండి కూడా తెలుగు సంఘానికి చాల తక్కువగా వెళ్ళేవాడిని కారణం దూరం మాత్రమే.
ఒక రోజు నాకు పరిచయస్తులయిన ఒక తెలుగాయన "నిన్న మీరు వస్తే బాగుండేది. తెలుగు సంఘానికి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు. అయన ఉపన్యాసం విన్నాక హాలు మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది" అని చెప్పారు.
ఉత్సాహం ఆపుకోలేక "ఎవరండీ అని అడిగాను"
"వాడ్రేవు చిన వీరభద్రుడు. రచయిత" అని చెప్పారు.
"మనిషి చాల చిన్నగా ఉంటాడు. కానీ జ్ఞానంలో అయన ఎవరెస్టు శిఖరం లా కనిపించాడు. ఆ ధైర్యం, ఆత్మ విశ్వాసం ఎలా వచ్చాయో " అని మరింత విపులంగా చెప్పారు.
" వీరభద్రుడు గారా .....అయితే ఆశ్చర్యం లేదు. అయన బాల మేధావి గా నాకు తెలుసు. మా గురుకులం లోనే చదివారు. అయన స్కూలు వదిలిపెట్టి వెళ్ళాక, పత్రికల్లో అయన రచనలు చూడటమే కానీ ఆయనను చూడ లేదు." అని చెప్పాను.
ఈ విషయం నాకు గురుకులం గుర్తు వచ్చినపుడల్లా గుర్తు వస్తుంది. గురుకులం గుండెల్లోనే ఉంటుంది. నిజానికి రెండేళ్ల సీనియర్ గా గురుకులం లో ఉన్న చిన వీరభద్రుడు నా కళ్ళకు ఒక అద్భుతం. నేను ఎప్పటికి చేరు కోలేని శిఖరం లా కనిపించేవాడు. ఒక అద్భుతం అనిపించేవాడు. కలసి ఉన్న ఒక్క సంవత్సరం లో చాల చాల తక్కువ సార్లు మాట్లాడి ఉంటాను. నిజానికి కేవలం చిరు నవ్వుతో పలకరించి ఉంటాను. అయితే చాలా సార్లు పొగిడి ఉంటాను. వీరభద్రుడు వేదిక మీద చేసిన సాహసాలన్నీ గుర్తున్నాయి కానీ మౌఖికంగా మాట్లాడిన సంభాషణలేవీ గుర్తు లేవు.
ఏక పాత్రాభినయం అంటే వీరభద్రుడు గుర్తొచ్చే వాడు "జాక్సన్, రాయల్టీలు, నివాళులు, పన్నులు, వడ్డీలు,? ఎందుకు కట్టాలి మేము...ఆకాశం వర్షిస్తుంది. భూమి హర్షించి పంటలిస్తుంది. పొలాలు దున్ని వరి మొలకలు మీరు నాటారా ? లేక మా ఆడ పడుచులు ఆడుకోవటం కోసం పసుపుకొమ్ము మీరు దంచి ఇచ్చారా? ,సిగ్గు లేకుండా రాయల్టీలు అడుగుతున్నారు. ఎందుకివ్వాలి మీకు రాయల్టీలు ?. మీరు మాకు మేన మామలా ? అన్నదమ్ములా ? కేవలం నా అతిథిగా వచ్చినందుకు బతికి పోయారు.. లేదంటే మా సైనికులు మీ తలలని నేలపై దొర్లించే వారు"
అసెంబ్లీ ప్రాంతం చప్పట్లతో మారు మోగింది. వీరభద్రుడి ఉచ్చారణ, అభినయం, హావ భావాలు, చాలా బాగున్నాయి. పాత్రలో పూర్తిగా లీనమైపోయాడు. చిరుత పులిలా స్టేజీ మొత్తం తిరుగుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించే మాటలివి. వీర పాండ్య కట్టబ్రహ్మన రామనాథపురం రాజభవనంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కలెక్టర్ జాక్సన్ ను ఎదిరిస్తూ అన్న మాటలివి. ఒళ్ళు గగుర్పొడించింది.
తరువాత పత్రికల్లో ఎన్నో సార్లు తన పేరు చూసాను. తన గురించి విన్నాను. తను అబ్దుల్ కలాం గారి "Wings of Fire" ను తెలుగులో అనువదించినప్పుడు చాలా గొప్ప పురస్కారం గా భావించాను. ఎంతో మంది తను రాసిన "కొన్ని కలలు కొన్ని మెళకువలు " గురించి చెపుతున్నప్పుడు గురుకులం లో నాకూ చోటు దొరికినందుకు చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాను.
వీరభద్రుడు పేస్ బుక్ కు పరిచయం అయినప్పుడే నేను కూడా పరిచయం అయ్యాను. అయితే చాలా కాలం వరకు ఇది జన్మ దిన శుభాకాంక్షలు చెప్పటానికి అని నమ్మే వాడిని. అది కూడా ఆంగ్లంలో. కొన్నాళ్ళకు తెలుగులో టైపు చేయొచ్చని తెలిసింది. లేఖిని అనే సాఫ్ట్వేర్ ద్వారా ..అది కూడా చాల కష్ట మైనది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మూలంగా హిందీ డే జరపటం ఒక ఆనవాయితీ. అందుకోసం యూనికోడ్ లో India Typing అన్న ఆప్ ద్వారా లిప్యాంతరీకరణ ద్వారా హిందీ లో కవితలు టైపు చేసుకోవటం అలవాటయ్యింది. విచిత్రం ఏంటంటే అక్కడే పక్కనే ఉన్న తెలుగు ఆప్షన్ చాలా కాలం వరకు గమనించ లేదు.
ఫిబ్రవరి 2018. వీరభద్రుడు పేస్ బుక్ లో పెట్టిన ఒక సమీక్ష పై (అమృత సంతానం అనుకుంటా) వ్యాసం పై చిన్న కామెంట్ పెట్టాను. అది నా జీవిత గమనాన్నే మారుస్తుందని ఆనాడు కలలో కూడా ఊహించ లేదు. ఆ కామెంట్ చదవ గానే నాకు మెసేజి పెట్టాడు "చాలా బాగా రాస్తున్నావు మిత్రమా...ఏదయినా ఒక విషయం మీద ఒక పేజీ రాసి పెట్టు. చూద్దాం" అని. నా ఆనందానికి హద్దులు లేవు. నేను ఏమి రాయాలన్నా మా ఊరు నాగావళి ...కొండలు ...గుట్టలు ...వాగులు ..వంకలు ...బాల్యం ఇవి ముందు మనసుని ఆక్రమించేస్తాయి. మనసుకి నచ్చినదే మెప్పిస్తుంది ఎవరినైనా అని అదే విషయం మొదలు పెట్టాను. "దారి తప్పిన ప్రయాణం" అని ఒక రెండు పేజీల ట్రావెలాగ్ రాసాను. అది ఒక రోజు గిరిజనుల ఇళ్ల కాలనీ చూసేందుకు కొండల్లోకి వెళ్లిన అనుభవం. ఎన్నో సార్లు వెళ్ళాను. కానీ అన్నీ అనుభవాలుగా మిగలవు. కొన్ని ఎప్పటికీ మనల్ని వదలవు. అది ముందు వీరభద్రుడికి మెస్సేజి పెట్టాను. నిముషాల్లో జవాబు వచ్చింది. "అద్భుతం. పేస్ బుక్ లో పెట్టు మిత్రమా" అని. అంతే. నేను పేస్ బుక్ లో పెట్టటం ఎంతో మంది అభిమానం పొందటం జరిగిపోయాయి.
ఇక్కడ వీరభద్రుడు కేవలం నన్ను మెచ్చు కోలేదు. నాకు ఒక దారి చూపించాడు. పేస్ బుక్ ని ఎలా వాడాలో ఒక అవగాహన కల్పించాడు. అంతవరకు కవితలు, వ్యాసాలు తప్ప కథలు రాయటం నా వల్ల కాదు అనుకున్న నన్ను పేస్ బుక్ ద్వారా ఉసి గొల్పి నన్ను కథల వైపు, సమీక్షల వైపు దారి మళ్లించటం. ఇప్పుడు నాకు పేస్ బుక్ ఒక సుందర లోకం. నిజానికి దేవ లోకం. ఎందరో రచయితలతో పరిచయం. నిన్నటి వాళ్ళు.. నేటి వాళ్ళు .. రేపటి వాళ్ళు కూడా.
వీరభద్రుడు ఒక అద్భుతం అని నేను మరో సారి అంటాను. ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తూ కూడా ...ఇలా ప్రతి రెండు మూడు రోజులకు ఒక వ్యాసం గాని, సమీక్ష గాని, ఒక కవిత గాని పోస్ట్ చేస్తుంటాడు. అద్భుతమైన చిత్రాలు గీస్తుంటాడు. చిన్న పెద్ద అనకుండా తనకున్న వేలాది స్నేహితుల రచనలు చదివి తన అభిప్రాయం రాస్తుంటాడు. తన రచనల మీద కామెంట్లను నిశితంగా పరిశీలిస్తుంటాడు. ఎప్పటికప్పుడే ప్రయాణాలు చేస్తుంటాడు. దాన్ని ట్రావెలాగ్ గా మారుస్తుంటాడు. గాంధీజీ చంపారని యాత్ర.. బ్రహ్మపుత్ర - భూపేన్ హజారికాల పై తన వ్యాసాలు అప్పటి జీవితాలను సంస్కృతిని కళ్ళ ముందు కదలాడించాయి. కళ్ళల్లో నీళ్లు కదిలించాయి. "కొండ మీది అతిథి" కవితా సంపుటి వచ్చినప్పుడు "అవును నిజమే .వీర భద్రుడు కొండ మీద నుండి వచ్చిన అతిథి” అనుకున్నాను.
తూరుపు కనుమల్లో గోదావరి నదికి తూర్పున దట్టమైన అడవులకు అతి చేరువలో ఒక పల్లెటూరు. పేరు శరభవరం. అప్పుడప్పుడు వీరభద్రుడు చెప్పిన దాన్ని బట్టి నిజంగానే ఆ ఊరు "శరభ" వరం అనిపిస్తుంది. కొండలన్నీ తెల్ల చీర కట్టినట్టుండే పాలపూలతో వర్షా కాలం కోసం ఎదురు చూస్తాయట. వర్షాలు తీసుకు వచ్చే గంగాళమ్మ కు స్వాగతం పలుకుతాయట. మేఘుడు రాగానే సిగ్గుతో మాయమవుతాయట. వేసవి తాపం తీర్చుకుంటూ చల్లబడే ఆ పచ్చని కొండ చరియలు ఆ పల్లెకు అన్నం పెట్టే జీవన రేఖలు.
ఆ పల్లెలో ఒక ఇల్లు. రెండు గదులదా మూడు గదులదా అని మనం ఇప్పుడు అనుకునే ఇల్లు కాదు. ఒక తాటాకుల పొదరిల్లు. చూరు నుండి వాన ధారలు కారుతుంటే అరచేతులు అడ్డం పెట్టి అక్క తమ్ముళ్లు, అన్న తమ్ముళ్లు ఆడుకునే అతి సుందరమైన గడప ఉండే పర్ణశాల. గాలి వాన వస్తే ఇంటికంటే ఎక్కువ నమ్మకాన్ని కలిగించే బలమైన చింత చెట్లు చేరువలో ఉన్న పొదరిల్లు. పొద్దున్నే పాలపూలు చూస్తూ ..మధ్యాన్నం చింత చెట్టు గాలిని ఆస్వాదిస్తూ సాయంకాలం కిరసనాయిలు చిమ్నీలు వెతుక్కునే ఇల్లు అది. ఒత్తులు చక్క పెట్టి భోజనాలయ్యే వరకు, పిల్లలు చదువుకున్నంత వరకు ఒత్తులు పెద్దగా ఉంచి ఆ తరువాత ఒత్తులు కిందకు లాగి చిన్నగా మార్చి బెడ్ లైట్ లా వాడుకునే ఆ చిమ్నీలలో సాదా జీవితం గడిపే ఒక కుటుంబ సత్యం ఉంది.
ఆ శరభవరం లో, ఆ ఇంటిలో, ఆ దీపం ముందు, ఆ చింత చెట్టు కింద, ఆ పాల పూల గాలిలో, మట్టి అరుగుల మీద తిరుగాడిన ఒక చిన్న బాలుడే మన చిన వీరభద్రుడు. చెట్టు పుట్టలని కొలిచే ఆ గిరిజన పల్లెలో, ఏడాదికో సారి వచ్చే గంగాళమ్మ అనుగ్రహం తో చిన వీరభద్రుడు పెద్దవాడవుతున్నాడు.
ఈ రోజు మనం చూస్తున్న వీర భద్రుడికి నాలుగున్నర దశాబ్దాల కిందట ఆ పల్లెలో నడయాడిన చిన వీరభద్రుడికి, ఆ ఇంటిముందు ఉన్న పాల పూలు కప్పుకున్న ఆ కొండలకు నిత్యం మంచు పొరలు కప్పుకుని ఉన్న హిమశిఖరాలకు ఉన్న అంతరం ఉంది. అవును. నేను అన్నది నిజం. చిన్నప్పుడు వీర భద్రుడు ఒక కెరటం. కేవలం చదువుల్లోనే కాకుండా ఏ కార్యక్రమమైనా ఉరకలేసే ఉత్సాహం. వీర పాండ్య కట్ట బ్రహ్మన ఏకపాత్రాభినయం వేస్తూ వేదిక మొత్తం కలియతిరుగుతూ డైలాగులు చెపుతుంటే పూనకం పట్టిన చిరుత పులిలా కనిపించే వాడు. కవిత్వం. కథలు రాయటం, వక్తృత్వంలో ఇలా అన్ని సాహితీ సంబంధ విషయాల్లో నిరంతరం పోటీ పడుతుండే వాడు. చివరకు తనకు ఎవ్వరూ పోటీ లేరనిపించుకునే స్థితికి చేరి స్కూలు వదిలి పెట్టాడు.
ఇప్పుడు మనం చూస్తున్నది పరిచయం అక్కర లేని వీరభద్రుడు. అద్దం అక్కర లేని ముంజేతి కంకణం. దివిటీలు చూపక్కర లేని నిత్యం జ్వలించే సూర్యుడు. అఖండ జ్యోతి గా మారిన ఒకప్పటి చిమ్ని లాంతరు. ఎవరెస్టుగా మారిన ఒక చిన్న కొండ శిఖరం.
అయితే ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో తాను ఒంటరిగా నడవలేదు. ఎందరో చేయి పట్టి నడిపించారు. “అడుగు ముందుకెయ్యి నేనున్నాను” అని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఎక్కడైనా కాలు జారినట్టున్నా మాట తడబడినట్టున్నా మొహమాటం అడ్డొచ్చినా ఏదో ఒక చేయూత, ధైర్యం, కలివిడితనం తనకు సమయానుకూలంగా దొరికాయి. తను చేతబట్టిన చిమ్నీ లాంతరుకు అవసరమైనప్పుడల్లా చమురు వేస్తూ ...అరచేతులు అడ్డు పెట్టి దాన్ని గాలి ఆరిపోకుండా వర్షం లో తడిసిపోకుండా కాపాడుతూ ఎన్నో చేతులు ముందుకొచ్చి ఉంటాయి.
తను స్కూలులో ఉన్నప్పుడు మాష్టార్లను తండ్రుల్లా ...వాళ్ళ చేయి పట్టుకుని వదిలి పెట్టక తిరిగే వాడు. ఉదోగా రీత్యా తను ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉండాల్సి వచ్చినప్పుడు కనిపించే చెట్టును పుట్టను వాగును వంకను కూడా గురువుగా భావించి గిరిజనులను దైవాంశ సంభూతులుగా భావించే వాడు. ఎన్నో దేశాల సాహిత్య కారుల రచనలను చదువుతూ, దేశ భాషల్లోని ఎన్నో గ్రంథాలను చదువుతూ కనిపించిన ప్రతి అక్షరం ఒక గురువుగా భావించేవాడు. వేదాలను, వేదాంగాలను, వేదాంతాన్ని, ఉపనిషత్తులను చాలా లోతుగా అధ్యయనం చేసి తను రచయితగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒక గొప్ప పాఠకుడిగా మాత్రమే లోకానికి కనిపించే నిరాడంబర కవి, రచయిత మన వీర భద్రుడు.
అయితే వీరభద్రుడు మామూలు శిష్యుడు కాదు. కాయో, పండో; త్రుణమో ఫణమో గురుదక్షిణగా అప్పగించి చేతులు దులుపుకోవటానికి. ఇందులో తన సృజనాత్మకత ఒక అద్భుత ప్రయోగం. తను గురువులుగా భావించిన వాళ్ళందరిని అప్పుడప్పుడు పేస్ బుక్ మాధ్యమంగా పరిచయం చేసాడు. ఒక్కొక్కరిమీద ఒక వ్యాసం రాస్తూ పాఠకుల ముందుంచాడు. తన నడకలో కాలికి తగిలిన గులక రాయిని కూడా చేతిలోకి తీసుకుని నడక నేర్పిన గురువుగా భావించి ఈ లోకం ముందు పెట్టాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. కొందరు వ్యక్తులు. కొన్ని పుస్తకాలు. కొన్ని సంఘటనలు.. మొత్తం కలసి నూట ఇరవై అయిదు వరకు పేస్ బుక్ లో ప్రచురించాడు. కొందరిని గురువులన్నాడు. మరికొందరిని ఋషులన్నాడు. మిగిలిన వాళ్ళను గొప్ప మనుషులన్నాడు.
అయితే వీళ్లందరినీ ఒక దారంతో కట్టాడు. దాని పేరు సంస్కారం. అవును. వేలాది టన్నుల సంస్కారం కరగదీసి పోత పోస్తే మన ముందున్న ఈ వీర భద్రుడు. ఒకే దారం తో కట్టి హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ ఒక స్థానం ఇచ్చి దాని పేరు "దశార్ణ దేశపు హంసలు" అని పెట్టి మన ముందుంచాడు. అయన చెప్పక పోయినా ఇది వాళ్లందరికీ తను ఇచ్చిన గురుదక్షిణగా మిగులుతుంది.
వీరభద్రుడు ఒక సందర్వ్హంలో అంటాడు. తనకు తెలిసిన గొప్ప నేతగాళ్ళు ముగ్గురున్నారు ఈ ప్రపంచంలో అని. ఒకరు కబీరు. ఒకరు షిర్డీ సాయి బాబా. మూడవ వారు మహాత్మా గాంధీ. సర్వమానవ సౌభ్రాతృత్వానికీ ఈ ముగ్గురు ప్రతీకలు. రంగు రంగుల దారాలను ఒక దగ్గర చేర్చి రంగుల చీరగా నేసే నేత గాళ్ళలా వీళ్ళు ముగ్గురు కులం మతం లాంటి ఏ అడ్డు గోడలు లేని మానవ సమాజం నిర్మాణం కోసం పాటు పడ్డ నేత గాళ్ళే. మరి సాహితీ వినీలాకాశంలో ఎన్నో తారలను ఒకటిగా చేర్చిన గొప్ప నాల్గవ నేతగాడు మన వీరభద్రుడు.
ఎదుటి వారి కోసం తను ఎంత ఆలోచిస్తాడో జుకెర్ బెర్గ్ గురించి రాసిన తన తోలి వ్యాసం లోనే తెలుస్తుంది. పత్రికల్లో లాగా రేడియోల్లో లాగా మరొకరి స్థలానికి, అవకాశానికి ఏ మాత్రం అడ్డు కాకుండా జుకర్ బెర్గ్ అందించిన పేస్ బుక్ మాధ్యమం అసంఖ్యాక బహుళ దృక్పథాలు ఏక కాలంలో వినిపించగల అవకాశం కల్పించింది అంటూ, తాను మిత్రుల కోరికపై తన పేస్ బుక్ రచనలను ఇలా ఒక పుస్తక రూపంలో తీసుకు రావటం, పుస్తకానికి మేఘదూతం లోని కాళిదాసు చేసిన ప్రయోగం "దశార్ణ దేశపు హంసలు" గా పేరు పెట్టి, దానిని పేస్ బుక్ ద్వారానే పరిచయం అయిన పండితులు, సంస్కారవంతులైన సాహిత్యాభిమానులు, భావుకులు అయిన శ్రీ సూరపురాజు రాధా కృష్ణ మూర్తి గారి చేతుల్లో పెట్టి ఒక అద్భుతమైన ఒరవడికి నాందీ పలికారు. నిజానికి సూరపురాజు రాధాకృష్ణ మూర్తి గారు తన తీయని సమీక్షల ద్వారా షేక్స్పియర్ రచనలపై తెలుగు వాళ్లకు భయం పోగొట్టి ఇష్టం కలిగించేలా చేసారంటే అతిశయోక్తి కాదు.
ఓ మేఘమా..నువ్వొస్తూనే ఈ ప్రదేశం మొత్తం దట్టమైన పచ్చని జడలు విరబూసుకుంటుంది. గ్రామాల్లో చెట్లన్నీ పక్షుల గూళ్ళతో సందోహం మొదలవుతుంది. నల్లని నేరేడు పళ్లతో అడవి అందంగా కనిపిస్తుంది. అప్పుడు హంసలు కొద్దీ రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అంటూ కాళిదాసు చెపుతుంటే ఒక వైపు ఆనందం మరో వైపు భయం కలుగుతుంది. ఆ హంసలు కొద్ది రోజుల తరువాత వెళ్లి పొతే ? అందుకే కాకిలా కలకాలం కాదు హంసలా ఆరు నెలలు చాలు అన్నారేమో....అయినా మళ్ళీ మేఘం వస్తుంది. వర్షిస్తుంది. హంసలు కూడా వస్తాయి. వీరభద్రుడి కవిత కంటే ప్రియురాలు ఎవరుంటారు ? అనుకుంటూ ఆ శరభయ్య మాష్టారు కూడా మళ్ళీ వస్తారు. అంతవరకు చిన వీర భద్రుడు చిద్విలాసంగా తన సాహితీ సేద్యం కొనసాగిస్తాడు. ఎందుకంటే తను కూడా దశార్ణ దేశంలో ఒక హంస. కాక పొతే రాజ హంస.
(ఈ "దశార్ణ దేశపు హంసలు" సంకలనం పైన నాలుగు వాక్యాలు రాయాలని అనుకున్నాను. అయితే రాయటం మొదలు పెట్టాక పుస్తకంలోని వివిధ అంశాలు మాటి మాటికీ వీరభద్రుణ్ణి గుర్తు చేస్తున్నాయి. అందుకే మొదట అయన గురించి నాలుగు ముక్కలు రాస్తే అప్పుడు పుస్తకం గురించి రాయటంలో విఫలం అయినా నేను క్షమార్హుణ్ణి అవుతాను అనుకుని ఇలా మొదలు పెట్టాను).
(సశేషం )
No comments:
Post a Comment