Wednesday, May 29, 2019

మా గ్యాంగ్ టక్, డార్జిలింగ్ యాత్ర అనుభవాలు!

మా గ్యాంగ్ టక్, డార్జిలింగ్ యాత్ర అనుభవాలు
విహార యాత్రల వల్ల ‘అందమైన ప్రాంతాలను, ప్రకృతి అందాలను ఆయా ప్రాంత ప్రజల భాష, కట్టూబొట్టు, ఆహారపుటలవాట్లు... ఇలా ఎన్నో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అటువంటిదే డార్జిలింగ్
హైదరాబాద్ నుంచి రైల్లో కోల్‌కతా చేరుకుని ఆ రాత్రి హోటల్ లో బస చేసి, మరునాడు విమానంలో బాగ్డోగ్రా వెళ్ళాము. అక్కడ మా టూర్ ఏజెంట్ ఏర్పాటు చేసిన వాహన ప్రయాణంలో దారి పొడుగునా కొండలు, కోనలు, వాగులు, వంకలు చిత్రమైన ఆ దారిలో అన్నీ తేయాకూ, యాలకులూ, కమలా తోటల కనువిందు. గ్యాంగ్ టాక్ చేరుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకుని తక్కువ దూరాలైనా ఆ వంపుసొంపుల ఘాట్‌ రోడ్లమీద గంటల ప్రయాణిస్తూ దారివెంటే వచ్చే ఆ తోటల్నీ నీటి ప్రవాహాల... అల్లంత దూరంలోని హిమాలయాల సోయగాలు మనల్ని మరో ప్రపంచానికి తీసుకువెళతాయి. కవులకు చిత్రకారులకు ఆ సుందర సుకుమార దృశ్యాలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి.
కొండ ప్రదేశమైన డార్జిలింగ్‌లో నేపాలీలూ, లెప్చాలూ, గోర్ఖాలూ, భూటియాలూ, టిబెటన్లూ, తమంగ్‌లూ... ఇలా భిన్న తెగలకు చెందిన ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటూ నివసిస్తున్నారు. అసలైన స్థానికులు లెప్చాలే. మిగిలినవాళ్లంతా వలస వచ్చినవాళ్లే. కూరగాయలు, చికెన్‌, పోర్క్‌ నింపిన మోమోలూ; వాయ్‌వాయ్‌లు ఎక్కువగా తింటారు. సూప్‌ నూడుల్స్‌, దమ్‌ ఆలూ, సాల్‌ రోటీ కూడా ఎక్కువే. వస్త్రధారణ కూడా ఎవరికి వాళ్లదే. పెళ్లయిన స్త్రీలు మాత్రం కాలర్‌తో కూడిన యాప్రాన్‌ కట్టుకుంటారు. ఫ్యాషన్లూ ఎక్కువే.
టాయ్‌ ట్రెయిన్‌! హిమాలయన్‌ రైల్వే ఆధ్వర్యంలో- కేవలం రెండే బోగీలతో ఆవిరితోనూ డీజిల్‌తోనూ నడిచే అక్కడి టాయ్‌ రైళ్లని చూడగానే వింతగా అనిపించింది. ఇది ఎక్కితే డార్జిలింగ్‌ నుంచి గూమ్‌ రైల్వేస్టేషన్‌, గూమ్‌ నుంచి తిరిగి డార్జిలింగ్‌ చేరుకుంటాం. కానీ సమయంలేక ఎక్కలేక పోయాము. ఆ రైల్ పట్టాలు కొండప్రాంతంలో నివాసగృహాల మధ్యలొంచి ఉంటాయి. ఆ పట్టాలమీద వర్తకులు వివిధ వస్తువులు అమ్ముతుంటారు రైల్ వస్తున్నప్పుడు హడావుడిగా లేచి ఆ సరుకులు తీసి దారి ఇచ్చి రైల్ వెళ్ళగానే తిరిగి అమ్ముతుంటారు. ఈ మొత్తం ప్రయాణం 16 కి.మీ. కానీ ఒక్క ట్రిప్పుకి రెండు గంటల సమయం పడుతుంది. కొండల్లోనుంచీ ఇళ్ల మధ్యలోంచీ వేసిన చిన్నపట్టాల మీదుగా ప్రయాణిస్తూ డార్జిలింగ్‌, గూమ్‌ పట్టణ అందాలను చూడటం మంచి అనుభూతిని కలిగిస్తుంది. గూమ్‌ దేశంలోకెల్లా ఎత్తైన రైల్వేస్టేషన్‌. అంతేకాదు ఎత్తుకు వెళుతున్న కొద్దీ మనల్ని తాకుతూ వెళ్లే మబ్బులు. మబ్బులను చీల్చుకుంటూ మన ప్రయాణం ఎంత ఉత్తేజభరితంగా ఉంటుందో. ఆగలేక వాహనం ఆపించి ఆ మబ్బులలో కొంత దూరం నడిచాం ఫోటోలు తీసుకున్నాం. అదో అందమైన అనుభూతి.
ఇక వాతావరణం విషయానికి వస్తే..వేడి వాతావరణంలో నివసించే మనకు అక్కడి చలికి కొయ్యబారిపోవడం ఖాయం. కాళ్లకు సాక్సులూ చేతులకి గ్లోవ్సూ తలకి మఫ్లర్లూ చుట్టుకుని జెర్కిన్లు వేసుకుంటే తప్ప రాత్రిపూట నిద్రపోలేం. ఉదయం 16 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉండే ఉష్ణోగ్రత, రాత్రయ్యేసరికి 6 నుంచి 1 డిగ్రీకి పడిపోతుంది. రగ్గులు కప్పుకున్నా రూములో హీటరు ఉన్నా చలి చలే.
ఉదయం రెండుగంటలకు చలిలో ముంచుకొస్తున్ననిద్రను జయించి నాలుగు గంటలకే లేచి 8,400 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్‌హిల్స్‌కు చేరుకున్నాం. సూర్యోదయ సమయంలో 28,208 అడుగుల ఎత్తులోని కంచన్‌జంగ శిఖరం మీదుగా వచ్చే భానుడి తొలికిరణాలను ఓ అనిర్వచనీయమైన అనుభూతి సాధారణంగా ఆ భాగ్యం అందరికీ లభించదు ఎందుకంటే వాతావరణాన్ని బట్టి, మబ్బులు పట్టి ఉంటే ఆ సుందర దృశ్యం చూసే అవకాశం లేదు. అప్పటివరకు చీకటిగా ఉన్న ఆ సుదూరంలో లీలగా వెండి కొండల ఆనవాలు అంతలోనే కొంతసేపటికి ఆ వెండి కొండలు బంగారు వర్ణంలో మారడం ఓహ్ వర్ణించనలవికాని మనోహర సుందర దృశ్యం, చలిలో వెచ్చని తేనీటిని సేవించాము. మా అదృష్టవశాత్తు 15 రౌజులనుండి కనపడని ఆ సుందర దృశ్యం చూసే భాగ్యం కలిగింది. దేశవిదేశాలనుంచి ఎందరో పర్యటకులు ఆ ఉదయశోభలు తిలకించి పులకించడానికి వస్తుంటారక్కడికి. ఎత్తుకు వెళ్ళేకొలదీ ఆక్సిజన్ తక్కువ గా ఉండటం వల్ల ఎత్తులు ఎక్కేటప్పుడు వడివడిగా నడిచేటప్పుడు త్వరగా అలసటకు గురి అవుతాం.
తరవాత గూమ్‌ మొనాస్టరీకీ వెళ్లాం. అక్కడ బౌద్ధ మతస్తుల ఆచారాలు తెలుసుకుంటూ ఓ మానా పేమీను అంటూ ప్రదక్షిణంగా వెళుతూ ఆ గంటలు మ్రోగిస్తూ వెళ్ళాము.

మరో సుందర ప్రదేశం బటాసియా లూప్‌...డార్జిలింగ్‌ను 360 డిగ్రీల కోణంలో చూడ్డానికి దీన్ని మించిన ప్రదేశం లేదు. బటాసియా అంటే గాలితో కూడిన ప్రదేశం అని అర్థం. దీన్ని టాయ్‌ ట్రెయిన్‌ రైడ్‌ కోసమే రూపొందించారట. ఎత్తైన కొండమీద వృత్తాకారంలో ఉద్యానవనాన్ని పెంచి దాని చుట్టూ రైల్వే పట్టాలు నిర్మించారు. కొండప్రాంతాల్లో పెరిగే మొక్కలతో కూడిన ఉద్యానవనమూ ఉంది. లూప్‌ మధ్యలో తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గూర్ఖ సైనికుల స్మారకార్థం వార్‌ మెమోరియల్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తే మార్కెట్‌ ఉంటుంది. స్థానికులు సమోసాలూ కూరగాయలతో స్టఫ్‌ చేసిన స్నాక్స్‌ అమ్ముతుంటారు.

తేయాకు తోటలు .. మకైబరి, హ్యాపీ ఎస్టేట్స్‌గా పేరొందిన అక్కడి కొండలమీద ఆకుపచ్చని శాలువాలు కప్పినట్లుగా ఉన్న ఆ తోటల్ని చూడడం అందమైన అనుభూతి. వేల ఎకరాల్లో పరచుకున్న ఆ తేయాకు కొండల్లో తిరుగుతుంటే చల్లని వానచినుకులతో కూడిన గాలి మనల్ని గిలిగింతలకు గురిచేస్తుంది. అక్కడ పెరిగే టీ రుచికి మరేదీ సాటి రాదట. అందుకే ఇది వరల్డ్‌ గ్రేటేస్ట్‌ టీగా పేరొందింది. మనదేశంలో తయారయ్యే టీలలో డార్జిలింగ్‌ నుంచి వచ్చేది ఒక శాతమే. కానీ దాన్ని వేలంవేసి మరీ కొంటుంటారు. ఆ గాలిలో నేలలో ఏదో మ్యాజిక్‌ ఉంది. అందుకే ఆ టీకి అంత రుచి అంటుంటారు దాని రుచి చూసినవాళ్లు. పైగా అక్కడి తేయాకు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించినది. టీ ఎస్టేట్స్‌ దగ్గరే ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌లో రకరకాల టీ పొడుల తయారీని చూసి అక్కడ ఉన్న అవుట్‌లెట్స్‌లో నచ్చిన టీ పొడులనీ కొనుక్కోవచ్చు. కిలో ఏడు వందల రూపాయల బ్లాక్‌ టీ నుంచి 50 వేల ఖరీదు చేసే వైట్‌ టీ వరకూ అన్నీ దొరుకుతాయి. తోటల్లో రాత్రివేళ హోమ్‌స్టేల్లో ఉండాలనుకునేవాళ్లు టీ ఆకును తుంచే వాళ్ల ఇళ్లలోనే ఉంటారు. విలాసవంతమైన హోటళ్లలో కూడా ఉండచ్చు.


జపనీస్‌ పీస్‌ పగోడాకి బౌద్ధులు రోజూ నాలుగు గంటలకే లేచి డ్రమ్ములు వాయించుకుంటూ ఈ గుడికి నడిచి వస్తారట. డార్జిలింగ్‌ రైల్వే స్టేషన్‌కి కాస్త దిగువన ఉన్న ధీర్‌ధామ్‌ ఆలయాన్ని చూసి రాక్‌గార్డెన్‌కి వెళ్లాం. ఓ చిన్న జలపాతం, రాళ్లు, రంగురంగుల పూలమొక్కలతో నిర్మించిన ఈ ఉద్యానవనంలో స్థానిక దుస్తుల్ని అద్దెకు ఇస్తారు. ఇష్టమైనవాళ్లు వాటిని ధరించి ఫొటోలు దిగుతుంటారు. అక్కడి నుంచి అబ్జర్వేటరీ కొండమీద ఉన్న మహాకాళ్‌ ఆలయాన్ని చూశాం. హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేసేవాళ్లకి డార్జిలింగ్‌ అనువైన ప్రదేశం. ప్రకృతి పచ్చని తివాచీ పరిచి, అందులో పూలబాట వేసి మరీ స్వాగతిస్తుంటుంది. కొండలనిండా రోడోడెండ్రాన్‌లూ మాగ్నోలియాలతోబాటు దాదాపు వందల రకాల ఆర్కిడ్లు అక్కడి నేలమీద విరబూస్తూ కనువిందు చేస్తుంటాయి. లాల్‌కోతి, ధీర్‌దాం టెంపుల్‌, ఇలా ఎన్నో అద్భుతమైన సుందర దృశ్యాలు బ్రిటీషర్స్ వేసవి విడుదుల బంగళాలు. ఓహ్ ఒకటేమిటి ఎన్నో వింతలూ విశేషాలు. అక్కడ బాగా ఆశ్చర్య కరమైన అంశాలు ఏమంటే పిల్లలు మహిళలు మైదాన ప్రాంతాలనుంచి కొండల్లోని తమ నివాస ప్రాంతాలకు గ్యాస్ సిలెండర్లు వంటి బరువైన వస్తువులను, నిత్యావసర వస్తువులను నుదురు భాగం భుజాలను ఆధారంగా చేసుకుని వీపుకు ప్రత్యేక సంచులలో తరలించడం, అలాగే ఆ సన్నని ఘాట్ రోడ్లలో వివిధ వాహనాల డ్రైవర్స్ ఏంటో సహనంతో ఎదురుగా వచ్చేవారికి దారి ఇస్తూ హరన్స్ అనవసరంగా మోగించకుండా, ట్రాఫిక్ జామ్స్ జరగకుండా జాగ్రత్తగా ఎంతో బాధ్యతతో మెలగడం మన మైదాన ప్రాంతం వారికి వింతగా అనిపిస్తుంది. మరిన్ని వివరాలు మరో రోజు మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews