Saturday, December 31, 2016

పుష్య మాసం వచ్చేసింది...... భోగిపిడకలు

పుష్య మాసం వచ్చేసింది
సంక్రాంతి పండుగంటే మూడురోజుల పండుగ కాదు,
ఒక సంవత్సరం ఎదురుచూపు,
ధాన్యరాశులు ఇళ్లకు చేరే వేళ, పాడిపంటల సిరులు
బంతులు, చేమంతులు, రంగవల్లులు తీర్చే ఇంతుల సోయగాలు
రంగవల్లులు , హరిదాసులు, డూడూ బసవన్నలు,
ఓహ్ అవన్నీ తెలుగు నాట ఇంటింటా ఒకప్పటి మధురానుభూతులు
వాటిని ఇప్పటికీ పరిరక్షిస్తున్నాయి కొన్ని ఊళ్లు
అలాంటి వాటిలో మా ఊరు, మా ఇల్లు రుజువులు కావాలా?
ఇదిగో చూడండి ప్రతి రోజూ
ఈ రోజు








భోగిపిడకలు గురించి
భోగిపిడకలు తయారీ సంక్రాంతికి భోగిపిడకలు
అదిగో సంక్రాతి సందడి మొదలైంది...మా ఊరు పినపళ్ల లో మా విస్సా నిలయంలో...మా మహి మిత్రబృందం ఆవు పేడతో భోగి పిడకలు తయారీ లో నిమగ్నమై ఉన్నారు. ఇవి ఎండిన తరువాత దండలుగా కూర్చి భోగి పండుగ రోజు పిల్లలు అందరూ భోగిమంటలో వేస్తారు.

Friday, December 30, 2016

భక్తి అంటే ఏమిటి ? మానవ సేవే మాధవ సేవ

భక్తి అంటే ఏమిటి ?
"భక్తి అంటే ఏమిటి?"అని అడిగారొక రాజుగారు.
"భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం..." చెప్పారు ఒక మహర్షి.
"అవునా, నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి?"
నాయనా! నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కాని, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం... నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ, ఆ దైవం మెచ్చే పని నీవు చేసినప్పుడు , ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం!
" అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా!"
అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే... ఒకరు వంద బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే , శివుడు ప్రత్యక్షం అవుతాడు, అని చెప్పరే అనుకోండి, 98 బిందెలు మోసుకొచ్చి, అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99 వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో, ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు.
అలా ముని నుంచీ ఉపదేశం పొందిన రాజు గారు అనేక దానాలు చేసారు. భూ దానం, గో దానం, సువర్ణ దానం, కన్యా దానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ, ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్త దానాలు చేసారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్ధిస్తూ, ఓర్పుగా సేవ చెయ్యసాగారు.
ఒక రోజు రాజుగారు రాత్రివేళ మారువేషంలో తిరుగుతుండగా, ఒక ఇంటి నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆట బొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలయిన ఆమెకు సరయిన బట్టలే లేవు, బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తోంది. కాని, పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు.
"స్వామి! నేను ఎన్నో గొప్ప దానధర్మాలు చేసినా, ఆలయాలు, సత్రాలు, చెరువులూ త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈ నాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి?"
"రాజా! పూర్ణ మనస్సుతో ఏ చేసే చిన్న పనయినా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి, నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు చేసే దానధర్మాలను ఇలాగే కొనసాగించి, తుదకు నా సన్నిధి చేరతావు," అని దీవించి అదృశ్యం అయ్యారు.
ప్రతీ క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అది గుర్తెరగాలి. దానం చేసేందుకు మరొకరిపై ఆధార పడకండి.ఉన్నంతలో క్రొత్తవి, లేదా పాత బట్టలు, దుప్పట్లు, ఆహారం, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. రోజుకొక మంచి పని చెయ్యడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో, నలుగురికీ సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ

Thursday, December 29, 2016

గోదారోళ్ల మమకారం

సాధారణం గా గోదారోళ్ళు అంటే ఒక ఆలోచన ఉంటుంది వేరే ప్రాంతాల వారికి, అదేంటి అంటే "అబ్బే!! గోదారోళ్లకు మహా ఎటకారం రా బాబు!!! ఆళ్ళతో మాట్లాడడం కష్టం అని".
ఇంకొంత మంది అంటారు, "మర్యాదలతో చంపేస్తారు రా బాబు, గోదారోళ్ళు"
ఇంకొంత మంది ఉంటారు, "మీరు ఎప్పుడు ఏంటి రా, అండీ అండీ ఆయ్ అంటారు?" అని
మనం అభివృద్ధి చెందాయి అని అనుకుంటున్న పట్టణాల లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే "ఎప్పుడు పోతారు రా బాబు??" అని అనుకుంటున్న ఈ రోజుల్లో, చుట్టం వస్తే వాళ్ళని చూసి పొంగిపోయేది మన గోదారోళ్లే....
లేచీ లేవగానే మొహం కూడా కడుక్కోకుండా అన్నం వండుకుని బాక్సులలో సర్దుకున్న అన్నం తో సరిపెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చాక మిగిలిన చద్ది అన్నం తినే మనుషులు ఉన్న ఈ రోజులలో మన ఇంటికి వచ్చిన చుట్టానికి కడుపు పగిలిపోయేలా అన్నం పెట్టేది మన గోదారోళ్లే.....
ఏందీ రా?? ఏరా?? ఇంకా ఎక్కువ ఐతే పెద్దవాళ్ళని కూడా పేరు పెట్టి పిలిచే సంస్కృతి ఉన్న ఈ రోజుల్లో మనకి తెలియని వారు ఎవరైనా సరే అండీ, ఆండీ, అని పిలిచేది మన గోదారోళ్లే....
వీధికి ఒక చైల్డ్ కేర్ సెంటర్, ఒక వృద్ధాశ్రమం ఉన్న ఈ రోజుల్లో అసలు మన చుట్టుపక్కల అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని వాళ్ళు మన గోదారోళ్లే.....

మాకు ఎటకారం ఎంతో మమకారం కూడా అంతే....
మాకు అమాయకత్వం ఎంతో తెలివి తేటలు అంతే...
మాకు కోపం ఎంతో ప్రేమ కూడా అంతే....

Saturday, December 24, 2016

సహస్రచంద్ర దర్శనం చేసుకున్న బాలచంద్రుడు .........జగదీష్ కొచ్చెర్లకోట

సహస్రచంద్ర దర్శనం చేసుకున్న బాలచంద్రుడు 
మూస చిత్రాల రోత పరిశ్రమలో ‘తొలికోడి కూసింది.'
కాసులకోసం కాదనుకుని ‘అంతులేని కథ'ల్ని వినిపించింది.
ఏ కథ విన్నా ‘ఇది కథకాదు'...జీవితం అనిపించింది.
రసహృదయాలను నలుపుతూ
రంగులవసరం లేదని తెలుపుతూ
నలుపు తెలుపులలోనే ‘మరో చరిత్ర' సృష్టించింది.
గూగులంతా వెదికితే ఏదయినా దొరుకుతుంది.
‘గుప్పెడు మనసు'లో అలజడి మీకే వినబడుతుంది.
మీ పాటలన్నీ ‘కోకిలమ్మ' కూనిరాగాలు తీస్తుంది.
మీతో పనిచెయ్యడం ‘అందమైన అనుభవం' ఇస్తుంది.
సహస్రచంద్ర దర్శనం చేసుకున్న బాలచంద్రుడు మీరు.
శివుని శిరస్సుని చేరగానే ‘రుద్రవీణ'లు మోగు!
మీది ప్రమథగణాదులు సంచరించే శివసాయుజ్యం.
మాది మంచి చిత్రాలకై అలమటించే ‘ఆకలిరాజ్యం.'
.........జగదీష్ కొచ్చెర్లకోట

మావి చిగురు తినగానే కోయిల పలికేనా
మావి చిగురు తినగానే కోయిల పలికేనా 
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునోగాని ఆమని ఈవని అని ఓ కవి అమాయకంగా అనుకున్నట్లు 
మీ ఈ కవిత కోసం బాలచందర్ గారు తన కళా ఖండాలకు 
ఈ పేర్లు పెట్టారా అన్నట్లుగా మీ మధుర మాటల కోట కట్టిన కొచ్చెర్లకోట వారు మీకు మా హృదయపూర్వక శుభాభినందనలు! 
ధర్మశాస్త్రాల ప్రకారం ఏ రోజు తలస్నానం చేయడం వలన ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం…
స్త్రీలకు..
స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదట. ఎంతో తప్పనిపరిస్థితి అయితేనే మాత్రమే చేయాలి.
స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
స్త్రీలు బుధవారం తల స్నానం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.
సోమవారం తలంటు చేస్తే నిత్య సౌభాగ్యంతో వర్దిల్లుతారు.
భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.
మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకోవాలి.
తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదువ ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారు.
పురుషులకు…
పురుషులు శనివారం తల స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది.
ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయి.
సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుంది.
మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది.
బుధవారం తలం స్నానంతో లక్ష్మి దీవెనలు కలుగుతాయి.
గురువారం తలంటు స్నానంతో ఆర్ధిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి.
శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయి.

ఓం శబ్దంతో శరీరంలో అలసట మాయం!!!

*'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*
ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్సు కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.
ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.
అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.
గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.
ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.
అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.
17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.

8 వ రోజు పాశురము

08 వ రోజు - నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెర చాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగం వేగం గా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అదీ కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పోదాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. "అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే" మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పోందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు.
మరి ఎం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది భహుషా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట భయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చేయ్యాలో చెప్పు అని అడిగింది. "ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ" అంటూ ఉపదేషం చేసాడు. హే మైత్రేయీ "ఆత్మావారే ద్రష్టవ్యః " లోపల ఉండే ఆత్మా అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది ? ద్రష్టవ్యః - చూడాలి అనుకున్న దాన్ని మొదట "శ్రోతవ్యః" వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. అండాళ్ తల్లి చెప్పేది ఎదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత.
మొదట పక్షులు అరిస్తున్నాయి అని చెప్పింది, ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది - ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక, ఆలయ పిలుపు శఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వని ని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే ముణులు స్మరించువాడు అని తెపిపింది, వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా ముణుల వద్ద ఉపదేషం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం "ద్రష్టవ్యః" అప్పుడు స్పష్టంగా చూడగలం.
"కీళ్" తూర్పు దిక్కున "వానమ్" ఆకాశం "వెళ్ళెన్ఱ్" తెల్లవారిందని అనుకుని "ఎరు మై" గేదెలన్ని కూడా "శిఱు వీడు మెయ్యాన్" చిన్న మేత మేయడానికి "పరందన కాణ్" పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. సాదారణంగా గేదెలను తామసిక గుణం తో పోలుస్తారు, తెలవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం భాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు-"రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే" మనలోపలుండే సర్వ రసుడు, సర్వ గంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు.
"మిక్కుళ్ళ పిళ్ళైగళుం" మిగతా పిల్లలందరూ "పోవాన్ పోగిన్ఱారై" త్వరత్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే "ప్పోగామల్ కాత్తు" వాళ్ళను ఆపి, "ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం" నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే, "కోదుగలం ఉడైయ పాపాయ్!" శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కల్గించే గోపికవి కదా నివ్వు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా "ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియః" జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకూ జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మావెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. "ఎళుందిరాయ్" లేవమ్మా అందరం కలిసి వెళ్దాం. ఇక్కడకు వెళ్ళి "పాడి ప్పఱై కొండు" మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం.
"మావాయ్ పిళందానై" గుఱ్ఱం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేసాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది. యముడు నచికేతుడికి చెబుతాడు "ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లెంతో బుద్ది అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేసాడు.
"మల్లరై మాట్టియ" మథురా నగరిలో మల్ల యోదులైన చాణూరుడు ముష్టికుడులను ఖంసుడు శ్రీకృష్ణ బలరాములని సంహరించడానికి ఎర్పాటుచేసాడు. వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు, కృష్ణ బలరాములు వారి మద్యకి వెళ్ళి, ఇరువురు వారిని వారే సంహరించుకొనేట్లు చేసారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోదాలు ఈ మల్ల యోదులవంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరణైరేవ కన్యతే- దేనితోనైతె నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి. అగ్నికి కావల్సింది ఇందనం, ఇందనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణ వద అనంతరం, హే రావణా ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు, నిన్నా వీరు అణిచివేసింది, నీలోని కామ క్రోదాలను పైకి లేపుకున్నావు వాటితోనే నిన్ను నేవే చంపుకున్నావు! అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడివైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించివేస్తాడు.
"దేవాది దేవనై" ఆయన దేవాది దేవుడు, మనల్ని ఆయన ఎప్పుడు వదలడు. ఇన్నాళ్ళూ మనం నీవాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్క సారి అను. ఏమని "చ్చెన్ఱు నాం శేవిత్తాల్" ఒక్క సారి మనం చేరి తండ్రీ మేము నీవారవని తెలిపితే చాలు. "ఆవా ఎన్ఱ్ ఆరాయ్ అంద్ అరుళ్" మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణం లోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు, అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొర పెట్టుకున్నారు. రాముడు నేను అయోద్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని, తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గు పడ్డాడు. ఇదీ పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మనకోసం తపిస్తాడు. తిరుమరిసై ఆళ్వార్,ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు, ఆయన కాంచీ పురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయనదేవున్ని పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు అని అన్నాడు, దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారూ బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడం తో, రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చాడట. ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. యదోక్తకారి- ఎలా చెపితే అలా వినే పెరుమాళ్ అని అర్థం ఇది కాంచి పురంలో ఒక ఆలయం.
అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.

Wednesday, December 21, 2016

7 వ రోజు పాశురము.

7 వ రోజు - భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో" పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి "ఆనైచ్చాత్తన్" భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.
ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిస్సు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు. మాళ్ళీ వేద అద్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయిస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది.
గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.
"కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు" గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి, "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. "మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేడా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు.
"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.
కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.
అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?
లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో యే దేవతామూర్తిని యేవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అయిన పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. "భగవంతు వలగొను పదములు పదములు" అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరి - పరమేశ్వరుడు, లక్ష్మీదేవి - శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతాడు. మనం తలవంచి నమస్కారం చేస్తాం. ఆ శఠారి (శఠం అంటే మనలో ఉండే మొండితనం - దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ? అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమః - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమః - పాదౌపూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చు.అని పెద్దలు చెపుతారు. 

శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారి విశ్లేషణాత్మక వివరణాత్మక వ్యాసం

ఒక మిత్రుడు నాకొక మెసేజి పెట్టాడు: 'మీ విశ్లేషణలు చాలా బావుంటాయి, చదువుతుంటే ఒక తన్మయత్వం లాంటిది కలుగుతూంటుంది. కాని వాటి తక్షణ, దీర్ఘకాల ప్రయోజనాలేమిటో అర్థం కావడం లేదు. వాటిని రాయడం వెనక మీ దృక్పథమేమిటో తెలిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది 'అని.
అతడికి వెంటనే నాలుగు మాటలు జవాబురాస్తే సరిపోదనిపించింది. స్పష్టంగా చెప్పకపోయినా చాలామందికి నా పట్ల ఇటువంటి ప్రశ్న ఉందని నాకు తెలుస్తూ ఉంది. కొన్నేళ్ళ కిందట, ఒక ప్రచురణ కర్త, వామపక్షవాది ఇట్లాంటి ప్రశ్ననే అడిగాడు.'ఈ మధ్య రచయితలం చాలామందిమి కలుసుకున్నాం. ఒకరి గురించి ఒకరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకున్నాం. వాళ్ళంతా నాకు చాలా బాగా అర్థమయ్యారు. కాని మీరే నాకిప్పటికీ అర్థం కావడం లేదు, ఎందుకని 'అని.
ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, నేను చేసే విశ్లేషణలు, రాసే కవితలు, కథలు నా కోసం నేను చేసుకుంటున్నవి. లోపల్లోపల మథనపడి, సమాధానం ఒకటి వెతికిపట్టుకుని, ఆ తెలుసుకున్న విషయాన్ని మాత్రమే తక్కిన ప్రపంచంతో పంచుకునేవాళ్ళుంటారు, గురజాడలాగా. వాళ్ళ అంతస్సంగ్రామం ఏమిటో మనకి తెలియదు. కాని తమ సంఘర్షణ తాము పడి వాళ్ళు ప్రపంచానికి చెప్పేది ఒక బుద్ధవాక్యంలాగా తేటగా, స్పష్టంగా, దిక్సూచిగా ఉంటుంది. కాని నాలాంటివాళ్ళు వేరు. నా నలుగులాట నేను నలుగురినుంచీ దాచుకోవాలనుకోలేను, చలంలాగా, బైరాగిలాగా, నేను రాసుకునేదంతా ఒక interior monologue. కాబట్టి, అందులో చాలా సంకీర్ణతా, సంక్లిష్టతా తప్పని సరి.
ఇక రెండవకారణం మరింత ముఖ్యమైంది. అదేమంటే, ఏదైనా విషయం గురించి ఆలోచించడంలో, నలుగురితో చర్చించడంలో మూడు దశలుంటాయనిపిస్తుంది.
మొదటి దశలో, ఆ చర్చకొక తక్షణత (immediacy) ఉంటుంది. అక్కడ స్పష్టమైన దృక్పథం ఏర్పడటం కన్నా ముందు, ఆ విషయం పట్ల సద్య:స్పందన ప్రకటించడమే ముఖ్యంగా ఉంటుంది. ఉదాహరణకి పెద్ద నోట్ల రద్దునే తీసుకుందాం. ఈ విషయమ్మీద, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో,సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ చాలావరకు ఈ స్థాయిలోనే నడుస్తున్నది. తక్కిన పౌరుల్లానే నేను కూడా పెద్దనోట్ల రద్దువల్ల చిల్లరకరెన్సీ చేతికందక ఇబ్బందులు పడుతున్నవాణ్ణే. కరెన్సీ రేషన్ కోసం ప్రజలు పగలూ రాత్రీ క్యూలు కట్టడం చూస్తున్నవాణ్ణే. కాని, ఈ విషయం మీద ఒక స్పష్టమైన దృక్పథం ఏర్పరచుకోకుండా ఏదో ఒకటి మాట్లాడటం నాకు సాధ్యం కాదు. అయితే దీనిగురించి మాట్లాడుతున్నవాళ్ళందరికీ స్పష్టమైన దృక్పథం లేదని కాదు. నిజానికి ఈ అంశం మీద తక్షణ స్పందనలు ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా, ఈ విషయం మీద నా దృక్పథం crystallize కావడానికి తోడ్పడుతున్నవాళ్ళే.
ఇటువంటి అంశాల్లో తక్షణ పరిశీలనల్ని దాటి, దీనిలో ఉన్న సామాజిక-రాజకీయ అంశాల్ని గుర్తించి వివేచించడం చర్చలో రెండవ దశ. పెద్దనోట్ల రద్దు-దాని వెనక ఉన్న ఆర్థిక వివేకం లేదా అవివేకం, దాని వల్ల సంభవించగల క్రమశిక్షణ లేదా కల్లోలం మొదలైన విషయాలతో మొదలుపెట్టి, గ్లోబలైజేషన్ కాలంలో ఆధునిక జాతీయ రాజ్యం బలహీనపడటం, కాని modern nation state మళ్ళా బలాన్ని సంతరించుకోవాలని జాతీయవాదులూ, వామపక్షవాదులూ కూడా ఒక్కలానే కోరుకోవడం, ఆర్థికవ్యవస్థ మీద రాజ్యానికి నియంత్రణ ఉందని చెప్పడానికి ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయం చేసిందనో, లేదా, అర్థికవ్యవస్థ మీద రాజ్యం నియంత్రణ కోల్పోయిందని ఈ చర్యతో పూర్తిగా అర్థమయిందనో-ఇట్లా మరింత లోతుగానూ, మరింత ఉపపత్తులతోనూ చేసే చర్చలో తక్షణ-దీర్ఘకాల ప్రయోజనాలు రెండూ స్పష్టంగా ఉంటాయి.
కాని, నా ఆసక్తి ఇక్కడ లేదు. అది ఇంతకన్నా కూడా మరింత సూక్ష్మ స్థాయిలో సంచరిస్తూ ఉంటుంది. ఏ విషయం మీదనైనా చర్చ మూడవ దశకి చేరుకున్నప్పుడు, అది ఆర్థిక-రాజకీయ-సామాజిక పార్శ్వాల్ని దాటి ఒక తాత్త్విక కోణాన్ని సంతరించుకుంటుంది. అది ఒక విషయం తాలూకు manifestations నుంచి దాని మూలాల్లోకి ప్రయాణించడం తాత్త్వికవివేచనగా మారుతుంది.
ఉదాహరణకి, ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త జాతీయతాధోరణిని సంతరించుకుంటున్న రాజకీయవాతావరణం ఏర్పడుతున్నది. ఇది కొత్త పరిణామంగా కనిపించవచ్చుగాని, ఆదినుంచీ భారతదేశ చరిత్రని నిశితంగా పరిశీలించినవాళ్ళకి, ఈ పరిణామంలో చరిత్ర పునరావృత్తి కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో ఒకసారి కేంద్రంనుంచి అంచులదాకా (centrifugal), మరొకసారి అంచులనుంచి కేంద్రందాకా (centrifugal)రాజకీయ-సాంస్కృతిక నిర్మాణాలు సంభవిస్తూ కనిపిస్తాయి. ఒకసారి బలమైన కేంద్రం కోసం, మనమంతా ఒకే జాతి అనే ధోరణి ప్రబలమవుతుంది. అది మతపరంగా ఏకేశ్వరోపాసనగా, రాజకీయంగా totalitarian గా వ్యక్తమవుతుంది. దాన్ని unity గా ప్రతిపాదించడం జరుగుతుంది. మరొకసారి బలమైన ప్రాంతాలూ, అంచులూ ముఖ్యమై మనమంతా వివిధ సంస్కృతులూ, వివిధ భాషలూ, వివిధ ఆరాధనా సమూహాలూ అనే జాగృతి బలంగా వ్యక్తమవుతుంది. దాన్ని మనం divesity అంటుంటారు.
ఉదాహరణకి పద్ధెనిమిదో శతాబ్దం చివరి రోజులనుంచి ఇరవయ్యవశతాబ్దంలో స్వాతంత్ర్యం వచ్చేదాకా మనమంతా ఒక జాతి, మనదొకటే దేశం అనే జాతీయతావాదం బలంగా ఏర్పడింది. 1950 తర్వాత, మళ్ళా వివిధ ప్రాంతాలూ, వివిధ కులాలూ, వివిధ భాషలూ ఇంతదాకా అప్రధానీకరణకు లోనయ్యాయనీ, ఇంతదాకా జాతీయరాజ్యం పేరుమీద కొన్ని ప్రాంతాలూ, కొన్ని కులాలు, కొన్ని మతాలూ మాత్రమే లభ్ధి పొందాయనే ఆందోళన మొదలయ్యింది.
ఇవన్నీ మనకు తెలిసినవే. కాని నేను చూసేదేమిటంటే,భారతదేశ చరిత్రలో ఈ alternation ఎందుకు సంభవిస్తూ ఉంది, దీనికీ ప్రపంచ పరిణామాలకీ ఏమైనా సంబంధం వుందా అని. చాలా కాలంగా చేస్తూ వచ్చిన అధ్యయనం మీద నేను చేసుకుంటున్న ఊహాగానం (hypothesis) ఏమిటంటే, భారతదేశానికీ, అంతర్జాతీయ విపణికీ మధ్య సంబంధాలు బలంగా ఉన్నప్పుడు, ప్రపంచవిపణిలో భారతదేశం ముఖ్యపాత్ర పోషించగలదనుకున్నప్పుడు బలమైన కేంద్రం గురించి ఆరాటం నడుస్తుందనీ, ప్రపంచ విపణితో సంబంధాలు బలహీనపడ్డప్పుడు అంచులు (periphery) బలపడుతున్నాయనీ. ఒకప్పుడు అంచులే కేంద్రంగా మారవచ్చు కూడా. ఉదాహరణకి డచ్చి,పోర్చుగీసు, ఫ్రెంచి, ఇంగ్లీషు వలసలు భారతదేశంలో అంచులతోనే మొదలైనట్టు.
ఈ క్రమంలో భారతదేశంలో నా కళ్ళముందు సంభవిస్తున్న పరిణామాల్ని చరిత్ర, తత్త్వశాస్త్రం, సాహిత్యం ఆసరాగా మరింత లోతుగా అధ్యయనం చేయాలనేది నా కోరిక.
ఉదాహరణకి నేను ఈ ఏడాది పొడుగునా కబీర్ గురించి మాట్లాడుతూ (మాట్లాడుకుంటూ) ఉన్నాను. పైకి చూడటానికి, ఆ విశ్లేషణకి ఎటువంటి తక్షణ, దీర్ఘకాల ప్రయోజనాలు లేవనిపించవచ్చు. కాని, నేడు భారతదేశమంతా రెండు శిబిరాలుగా చీలి పోయి ఉంది, హిందుత్వవాదమూ, హిందుత్వవాదాన్ని వ్యతిరేకించేవాదాలూ అని. కాని రెండు దృక్పథాల్లోనూ కూడా లోతులేదనీ, వాళ్ళకి సంబంధించని విశాలభారతదేశమొకటి ఉందనీ, దాని గురించి రెండు వర్గాలవాళ్ళకీ తెలిసింది చాలా స్వల్పమనేననీ నా అభిప్రాయం. కాని భారతదేశానికి తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఇట్లా మాట్లాడేవాళ్ళు ఇప్పుడే కొత్తగా రాలేదు. కబీరు కాలంలో కూడా ఈ సమస్య ఇంత బలంగానూ ఉంది. ఆయన ఆ రెండువర్గాల సంకుచితత్త్వాన్నీ ఎట్లా పసిగట్టాడో, ఎత్తి చూపాడో తెలుసుకోవడంలో ఒక మెలకువ ఉంది. అది ఇప్పటి నా చుట్టూ ఉన్న భారతీయ సమాజంలో నా పాత్ర ఏమిటో నాకై నేను స్పష్టం చేసుకోవడానికి నాకు చాలా ఉపకరిస్తుందనిపిస్తుంది.
నా సమకాలిక భారతదేశం గురించి కబీరువల్ల నాకు కలుగుతున్న స్పష్టత, జె.ఎన్.యు ప్రొఫెసర్లవల్లగానీ, ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ రచయితలవల్లగానీ, పత్రికాసంపాదకులవల్లగానీ, పార్టీ అధికారప్రతినిధులవల్లగానీ కలగడం లేదు.
కాబట్టి నేను చదువుతున్న, చర్చిస్తున్న కబీరు పదిహేనో శతాబ్దానికి చెందిన ఒక నిర్గుణభక్తి కవి కాడు, నా ఆధ్యాత్మిక విశ్వాసాలకూ, నా సామాజిక బాధ్యతలకూ మధ్య నా సమకాలిక భారతదేశం రేకెత్తిస్తున్న సంఘర్షణలో నాకు దారి చూపించే నా సమకాలికుడు.
మిత్రుడా, మీకు స్పష్టంగా చెప్పగలిగేనా?

Brhman Bhavan Hyderabad details


తెలుగులో మాట్లాడండి---ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు

Tuesday, December 20, 2016

తిరుప్పావై 6వ రోజు పాశురము

06 వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.
శ్రీకృష్ణ పరమాత్మ రేండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాల్లు పడుకొని ఉంటారు, అందరు పడుకొనే వద్ద వాల్లు మెలుకువగా ఉంటారు. సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దషల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.
ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్ " పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాల్లు ఒక గుర్తుగా చెప్పారు.
లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! " ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. "ఎళుందిరాయ్"- మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్" ముణులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా! మరి వాల్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది.
"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు- దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు.
"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి.
"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.


తిరుప్పావై 5వ రోజు పాశురము

05 వ రోజు - భగవంతుని ఐదో స్థానం - అర్చా స్వరూపం
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం. ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో. అంతటావ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఏదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే. ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు. అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి. ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విష్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు. అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక అణువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది- దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రంల ద్వార గుర్తించగల్గుతున్నాం. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో. రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు- "సమ్షయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంషయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది.
ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు.మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోక క్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తె మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది. ఇకవారంతా శ్రీకృష్ణుడికోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంషయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంషయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది- అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంషయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంషయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ- ఒక తుమ్మెద ఒక పద్మం పై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది ఒక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంషయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది- ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరం పైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లెదో అని సంషయాన్ని తెలియ జేసింది.
ఇలాంటి సంషయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు. ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది. మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు-ఆగామి-ప్రారబ్దం అని అంటారు. ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్దం కుడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది.
"మాయనై మన్ను వడమదురై మైందనై" - చిత్ర విచిత్ర మైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు. అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో. పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. "ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులమ్లో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమి చేతకాని వాడిలా పడి ఉంటాడు- అందుకే ఆయనను దామోదరుడు అంటారు. దామ- ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.
అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం. ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కోలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు " దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది. "నాం తూమలర్ తూవి త్తొళుదు" పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం. "పోయ పిళైయుం " మనం గతంలోచేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం " మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు. ఈపాటలో ఆండాళ్ మాయానై, మన్నువడ మదురై, దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది.
ఆగమములు చెప్పినదేమిటి
పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||
ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మత్రం దానికి సమాధానం ఇస్తుంది. "పూర్ణమిదమ్"- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:"- అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. "పూర్ణాత్ పూర్ణముదచ్యతే"- ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే. సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది. అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా. "పూర్ణస్య పూర్ణమాదాయ" ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా? "పూర్ణమేవా వశిష్యతే"- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి.
ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు.


తిరుప్పావై 4వ రోజు పాశురము

04 వ రోజు - భగవంతుని నాలుగో స్థానం - అంతర్యామి
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్
మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది.దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.
ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది, మనల్ని అట్లానే ఆచరించమంది. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం, అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి, వివిద పదార్థాలలో నే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక, మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు.
సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు, లోకంలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే- అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు: అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా "ఏకైక లభాయ:" కాని "సర్వ లాభాయ కేశవ" అంటారు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు.
అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే, విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా,ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.
అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. ఆళి మళైక్కణ్ణా! - సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా-పర్జన్యా. ఒన్ఱు నీ కై కరవేల్ - ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు-ఉదారంగా ఇవ్వు, ఆళి ఉళ్ పుక్కు - సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , ముగందు కొడార్ త్తేఱి - పిల్చుకో, ముందు నీవు తృప్తిగా కడుపు నిమ్పుకోని - చాలా ఎత్తుకు వెల్లాలి.
ఊళి ముదల్వన్-సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో, ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు - అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో, పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ ఆళిపొల్ మిన్ని - బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు, మొదటగా మెరవవలె,తర్వాత ఉరమవలె, తరువాత కురవవలె.
ఆమెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు - ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా-శంఖం ద్వనిలా ఉరుమవలె. ఆద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి. తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ - ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి, అందరు సుఖించెందుకు వర్షించు. ఆంగళుం మార్గళి నీరాడ మగిళుంద్ - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.


తిరుప్పావై 3వ రోజు పాశురము

3 వ రోజు - భగవంతుని మూడో స్థానం - విభవం(అవతారములు)
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
విభవం(అవతారములు)
ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.
"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.
ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు.
మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.
వ్రత ఫలితములు
ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు. పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక యంత్రాలు,వాహనాలు ఉంటే సుఖమా! లేక సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.
మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు. మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు. అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.
ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది, ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.
ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.
"నాంగళ్" ఏం కోరిక లేని "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది "చ్చాత్తి నీర్ ఆడినాల్" వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.
"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి "ఊడు కయల్ ఉగళ" ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి. "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప" అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్" పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.

శుభోదయం.../\... దనుర్మాస సోయగం!! నుదిటికి కుంకుమ ఎంత అందాన్నిస్తుందో ఇంటిముందర రంగవల్లిక అంత అందాన్నిస్తుంది!!!!

శుభోదయం.../\...
దనుర్మాస సోయగం!!
నుదిటికి కుంకుమ ఎంత అందాన్నిస్తుందో
 ఇంటిముందర రంగవల్లిక అంత  అందాన్నిస్తుంది!!!!




hindusampradayalu.blogspot.in: తిరుప్పావై 2వ రోజు పాశురము

hindusampradayalu.blogspot.in: తిరుప్పావై 2వ రోజు పాశురము: 2వ రోజు - భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి) పాశురము వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు  శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ...

hindusampradayalu.blogspot.in: తిరుప్పావై 1వ రోజు పాశురము

hindusampradayalu.blogspot.in: తిరుప్పావై 1వ రోజు పాశురము: 1వ రోజు - భగవంతుని మొదటి స్థానం నారాయణతత్వం మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్ శీర్ మల్గుం ఆయ్...

hindusampradayalu.blogspot.in: తిరుప్పావై పాశురములు

hindusampradayalu.blogspot.in: తిరుప్పావై పాశురములు: తిరుప్పావై తిరుప్పావై విష్ణువు ను కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడం లో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన ...

Saturday, December 17, 2016

గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు

గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు
గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.
ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...
సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.
కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.
గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,
ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,
|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు
---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ
.........................శర్మన్ అహం భో అభివాదయే ||
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక ' సగోత్రము ' అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.
మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. తర్వాత ,
* ఎవరికైతే ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్య తో వివాహము తగదు.
* ఎవరికైతే ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఐదుగురు ఋషులు ఉంటారో , ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
ఇదీ , సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు... అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..
మాతృ గోత్రాన్ని వర్జించాలి. అంటే , తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి , ఆ ప్రకారముగా సగోత్రమైతే వివాహమాడరాదు.
ఏఎ గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది... ఇక్కడ రాయడము వీలు పడదు.
ఇక నిబంధనల సడలింపులు
ఈ విషయములో సడలింపులు అంటు ఏవీ లేవు.
గోత్రము తెలియనిచో , తనని తాను ఎవరికో ఒకరికి ఇచ్చుకొని , వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో , ఈ పద్దతి తగదు.
తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే , ప్రాయశ్చిత్తం చేసుకొని , ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.
తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు.
తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా , ఒక నెలలోని శుక్ల పక్షం లో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు , మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షం లో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్య కు పూర్తి ఉపవాసం ఉండాలి... ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం తాను శుధ్ధుడవటానికి మాత్రమే... ఇది ఒక వెసులుబాటు కాదు.

Total Pageviews