Wednesday, December 14, 2016

చెట్టు...చల్లా రామ ఫణి 14.12.2016

చెట్టు
చెట్టు అంటే నీడ కదా!
చెట్టు పక్కన చెప్పకుండా చేరిన పదం నీడ కదా!
చెట్టుతో పాటు పుట్టింది నీడ!
నీతో పాటు పుట్టింది పీడ!
నేలతల్లికి పుట్టిన తల్లి కదా చెట్టు!
తల్లి మీద గొడ్డలితో చెయ్యెత్తమేమిట్రా త్రాష్ఠుడా!
రోడ్డు మీద చెట్టంటే నీ గాలి కోసం నిలచిన నిలువెత్తు విసనకర్ర!
ఆకులు తోరణాలకి
పూలు పూజకి
కాండం వంట కట్టెలకి
నీ బతుక్కి నైవేద్యం పెడుతుంది కదరా చెట్టు!
మొండిదిరా చెట్టు తల్లి!
నీకు నీడనివ్వడానికి నిలబడ్డదాన్ని
మొండెం చేసినా మొండిగా మళ్ళీ చిగురిస్తుంది చెట్టు!
నీ మూర్ఖపు పొగరు మీద నీళ్ళు చల్లుతూ
వేదన పడ్డ వేళ్ళకు నచ్చచెప్పి
చిగుళ్ళై పరిమళిస్తుంది చెట్టు!
పాకే ఉడతలకు, ఎగిరే పక్షులకు
దూకే కోతులకు ఇల్లు కదరా చెట్టు!
కొమ్మల చేతులు చాచి చెట్టంత గొడుగులా
నీడనిచ్చే చెట్టుతల్లి పైకి గొడ్డలి ఎత్తుతావురా గొడ్డలి!
నిలబడి నలుగురికి నీడనివ్వలేని నువ్వు నీడనిచ్చే చెట్టు మీద
అసూయతో గొడ్డలి ఎత్తుతావురా గొడ్డలి!
ఒక్క చోట నిలబడి నింగి దాకా ఎదగాలని
నీడనిస్తూ నేర్పే చెట్టుతల్లిపైకి గొడ్డలి ఎత్తుతావురా గొడ్డలి!
నీ తల్లి నీకు చేతులిచ్చింది గొడ్డలి ఎత్తడానికా!
చేతుల్లేకుండా నువ్వు పుట్టి ఉంటే చెట్లు పండగ చేసుకునేవి!
చెట్టు చేసే ప్రాణాయామ శబ్దం వినబడలేదా!
చెట్టు విషం పీల్చి నీకు అమృత వాయువు నిచ్చే తల్లి!
చెట్టు దుమ్మును పీల్చి నీకు దమ్మునిచ్చే తండ్రి!
నీ చేతి గొడ్డలి దెబ్బ తిన్న చెట్టు నువ్వు చచ్చాక పాడె అవుతుంది!
కాటికి పోయాక నీ కట్టె కాల్చే కాష్టమవుతుంది!
నీ కష్టం తీర్చే కట్టె అవుతుంది!
చెట్టు అంటే ఆయువు!
చెట్టు అంటే ప్రాణం!
చెట్టు అంటే ప్రాణవాయువు!
చెట్టు అంటే జగతికి జీవన దాత!
చెట్టు నేలకు పుట్టిన ఊపిరి మెట్టు!
మనిషిలో మెదిలే ఊపిరి!
మానవ జాతి సిరి!
-చల్లా రామ ఫణి
14.12.2016
9247431892
(పూర్తిగా మా ఇంట్లోకి ఒదిగి నీడనిస్తున్న వారి మామిడి చెట్టుని కొట్టేయడం తమ హక్కుగా మా పక్కింటి వాళ్ళు నిన్న కొట్టేసినపుడు రాసుకున్న కల్లోల కలవరం)

No comments:

Post a Comment

Total Pageviews