Friday, December 30, 2016

భక్తి అంటే ఏమిటి ? మానవ సేవే మాధవ సేవ

భక్తి అంటే ఏమిటి ?
"భక్తి అంటే ఏమిటి?"అని అడిగారొక రాజుగారు.
"భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం..." చెప్పారు ఒక మహర్షి.
"అవునా, నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి?"
నాయనా! నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కాని, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం... నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ, ఆ దైవం మెచ్చే పని నీవు చేసినప్పుడు , ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం!
" అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా!"
అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే... ఒకరు వంద బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే , శివుడు ప్రత్యక్షం అవుతాడు, అని చెప్పరే అనుకోండి, 98 బిందెలు మోసుకొచ్చి, అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99 వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో, ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు.
అలా ముని నుంచీ ఉపదేశం పొందిన రాజు గారు అనేక దానాలు చేసారు. భూ దానం, గో దానం, సువర్ణ దానం, కన్యా దానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ, ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్త దానాలు చేసారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్ధిస్తూ, ఓర్పుగా సేవ చెయ్యసాగారు.
ఒక రోజు రాజుగారు రాత్రివేళ మారువేషంలో తిరుగుతుండగా, ఒక ఇంటి నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆట బొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలయిన ఆమెకు సరయిన బట్టలే లేవు, బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తోంది. కాని, పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు.
"స్వామి! నేను ఎన్నో గొప్ప దానధర్మాలు చేసినా, ఆలయాలు, సత్రాలు, చెరువులూ త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈ నాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి?"
"రాజా! పూర్ణ మనస్సుతో ఏ చేసే చిన్న పనయినా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి, నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు చేసే దానధర్మాలను ఇలాగే కొనసాగించి, తుదకు నా సన్నిధి చేరతావు," అని దీవించి అదృశ్యం అయ్యారు.
ప్రతీ క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అది గుర్తెరగాలి. దానం చేసేందుకు మరొకరిపై ఆధార పడకండి.ఉన్నంతలో క్రొత్తవి, లేదా పాత బట్టలు, దుప్పట్లు, ఆహారం, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. రోజుకొక మంచి పని చెయ్యడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో, నలుగురికీ సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ

No comments:

Post a Comment

Total Pageviews