కందిపప్పు పచ్చడి ఎలా తింటే బాగుంటుంది! అని శ్రీ గోటేటి వెంకటేశ్వరరావుగారి సూచనపై నాస్పందన
ఇక్కడే చిన్న మార్పిడి చేద్దాం
ముందు కూర అన్నం తింటే కందిపప్పు పచ్చడి మోతాదు తగ్గదూ?
కనుక అరవ వాళ్ళు సాంబారు ముందుగా అన్నంలో పోసుకొని దాంతోటే కూర పచ్చడి వగైరాలు తినేసి చివర్లో తైరు సాదం అనగా పెరు అన్నం తింటారు
అల్లా కందిపప్పు పచ్చడి ముందుగా అన్నంలో కలుపుకొని దానిపైన పురిషెడు కరిగిన ఘుమఘుమలాడే నెయ్యివేసుకొని ఆకలిపిన అన్నంతోబాటే ఒక సారి ఉల్లిపాయ తీపి పులుసు, మరొకసారి కూర ఇంకొకసారి ఉల్లావకాయ ఇత్యాది దినుసులతో తింటే
అది అహో అద్భుతం కదండీ
ఇక్కడ తమకో చిన్న ఉపాఖ్యానంమనవిచేస్తా (ఇది నేను ఏభై సంవత్సరాలక్రితంవిన్న సంఘటన కల్పితమేమో మరి)
ఒక బ్రాహ్మణ బడిపంతులు ఇస్కూలుతణిఖీకి వచ్చిన ఇనస్పెక్టరుగారిని (ఆయనా బ్రాహ్మణుడే) ఆరాత్రికి తనయింట్లో భోజనం ఏర్పాటుచేసాడు
పల్లెటూరుకదా. నో హోటల్స్
అందుకని ముందుగా ఒక కుర్రాణ్ణి యింటికి పంపి భార్యను రాత్రికి కందిపచ్చడి, బెల్లం వేసి వంకాయ పులుసుపచ్చడి చెయ్యమని పురమాయిస్తాడు.
సరే రాత్రికి ఇద్దరూ భోజనానికి ఉపక్రమించి పంతులు భార్య చాటుగా చేసే సంకేతనలు గమనించకుండా కొసరి కొసరి కందిపప్పు పచ్చడి వేయమని వంకాయ పులుసు పచ్చడితో మొత్తం ఖతం చేసేసారు ఇద్దరూ కలిసి
చీకటిగావుంది. అందుకని ఇనస్పెక్టరుగార్ని దొడ్డిగుమ్మందగ్గరే వున్న కాకరపాదులో చెయ్యికడుక్కోమని తీసుకు వెళ్ళి తను కొంచేందూరంలోవున్న దొండపాదుదగ్గరకి వెళ్తాడు పంతులు .
అక్కడ రోజూ ఇతగాడే చేయికడుక్కోవడం ఆనవాయితీ
ఇకపోతే భార్యకు కూడా కందిపప్పు పచ్చడి అంటే ఎంతో ఇష్టం. తనకు మిగల్చకుండా అంతా తినేసారని అసలే కోపంతో రగిలిపోతున్న భార్య దొడ్డి గుమ్మందగ్గరకు వెళ్ళి మొగుడనుకొని ఇనస్పెక్టరుగారి చెవిపట్టుకొని
ఏం నాక్కూడా కందిపప్పు పచ్చడి ఇష్టం అనితెలిసీ కూడా నాకు మిగల్చకుండా మొత్తం తినేస్తారా అంది
పాపం ఇన్స్పెక్టరుగారు బాధతో విలవిల్లాడిపోతూ పొరపాటమ్మా రుచిగావుందని తినేసాను తప్పైపోయింది అన్నాడు.
తరువాత ఏంజరిగిందో వ్రాయడానికి కంప్యూటరుమీద నావ్రేళ్ళు సహకరించడంలేదు. మొద్దుబారిపోయాయి.
No comments:
Post a Comment