Tuesday, December 13, 2016

అందరికీ (ఎనర్జీ కన్సర్వేషన్ డే) ఇంధన పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు! రేపటి వెలుగుకు నేడే పొదుపు!



అందరికీ (ఎనర్జీ కన్సర్వేషన్ డే) ఇంధన పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు!
రేపటి వెలుగుకు నేడే పొదుపు!
దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్తు ఇవ్వాలంటే ఆ మేరకు ఇంధన ఉత్పత్తి జరగాలి. అదే సమయంలో సరఫరాకు, పంపిణీకి తగిన స్థాయిలో సమర్థమైన వ్యవస్థలు అవసరం. విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా పటిష్ఠ స్థితిలో ఉండటం తప్పనిసరి. ఆ పరిస్థితికి భారత్‌ ఇంకా చేరుకోలేదనే చెప్పాలి. ఇవ్వాళ ఇంధన పరిరక్షణ దినోత్సవం. అన్ని స్థాయుల్లోనూ ఇంధన వినియోగంపట్ల సదవగాహన మొగ్గతొడిగితే దేశ విద్యుత్‌ అవసరాలను సమర్థంగా తీర్చడం పెద్ద కష్టం కాబోదు.
నూతన సాంకేతిక విజ్ఞానం మానవ జీవనాన్ని ఎంత సౌకర్యవంతంగా మారుస్తోందో అంత సంక్లిష్టమైన మలుపులూ తిప్పుతోంది. పెరుగుతున్న అవసరాలకు పరిమిత వనరులు వేగంగా కరిగిపోతున్నాయి. దేశ విద్యుత్‌ రంగాన్ని ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో పరిపుష్టం చేసుకోకపోతే సమస్యలు ముమ్మరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే విద్యుత్‌ రంగంలో భారత్‌ చాలావరకు కొరతను అధిగమించింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ లోటునుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఇటీవల పార్లమెంటుకు వెల్లడించిన వివరాలు ఇదే విషయం ధ్రువీకరిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక నాలుగు శాతంమేర లోటు ఎదుర్కొన్నట్లు వెల్లడవుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల గిరాకీ మేరకు విద్యుత్తును సరఫరా చేయగలిగినట్లు కేంద్ర విద్యుత్‌ అథారిటీ విశ్లేషణ తెలియజేస్తోంది. దేశంలో నేటికీ వేల గ్రామాలకు విద్యుత్‌ అందని పరిస్థితి ఉన్నప్పటికీ- ప్రతి గ్రామానికి, ఇంటికి విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వ కృషి ముమ్మరమైందన్నది నిజం. 2019నాటికి ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని మోదీ సర్కారు లక్ష్య నిర్దేశం చేసుకొంది. నిరంతరాయంగా 24 గంటలూ విద్యుత్‌ అందించాలన్నది మరో సంకల్పం. ఈ విషయమై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.
పర్యావరణానికీ ప్రాధాన్యం
పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలు నెరవేరుస్తూనే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కృషి చేయాల్సిన తరుణమిది. ఆ క్రమంలోనే దేశంలో పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం పెరిగింది. దేశ విద్యుత్తు అవసరాలు ఇప్పటికీ చాలావరకు థర్మల్‌ విద్యుత్‌ ద్వారానే తీరుతున్నాయి. మన దేశంలో ప్రస్తుతం విద్యుత్‌ స్థాపక సామర్థ్యం 3.07 లక్షల మెగావాట్లు. అందులో 1.86 లక్షల మెగావాట్లు బొగ్గు ఆధారితమే. అంటే సుమారు 61 శాతమన్నమాట! బొగ్గుతోపాటు గ్యాస్‌ వంటి ప్రాజెక్టులనూ కలిపినప్పుడు థర్మల్‌ విద్యుత్‌ వాటా 69 శాతానికి చేరుతుంది. దేశంలో సుమారు 74వేల మెగావాట్ల స్థాపక సామర్థ్య లక్ష్యంతో చేపట్టిన థర్మల్‌ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరోవైపు పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం ఇప్పటికే జల విద్యుత్తును అధిగమించింది. ఆరో దశకం తొలినాళ్లలో దేశ మొత్తం విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యంలో జల విద్యుత్‌ వాటా 51 శాతం. ఇప్పుడది 14 శాతానికి చేరింది. పునరుత్పాదక ఇంధన వనరుల వాటా ఇప్పటికే 15 శాతానికి చేరుకుంది. ఈ రంగంలో విద్యుత్‌ ఉత్పాదన సైతం నిరుటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చినపుడు 28 శాతం పెరిగినట్లు కేంద్ర విద్యుత్‌ అథారిటీ తాజా లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో సంప్రదాయ ఇంధన వనరుల విద్యుత్‌ ఉత్పత్తిలో పెరుగుదల కేవలం 4.52 శాతంగా తేలింది. థర్మల్‌ ప్రాజెక్టుల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే ప్రక్రియ. సౌర విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు అంత సమయం అక్కర్లేదు. ప్రతి నెలా దేశంలో సౌర విద్యుత్తు సామర్థ్యం పెరుగుతుండటానికి కారణమదే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలల్లోనే దేశంలో దాదాపు రెండు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ స్థాపకత పెరిగిందని అంచనా! దేశ సౌర విద్యుత్‌ స్థాపక సామర్థ్యం తొమ్మిది వేల మెగావాట్లకు చేరువలో ఉంది. వచ్చే ఏడాది ఇదే కాలానికి అది రెట్టింపయ్యే అవకాశాలూ ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన వనరులుగా చిన్న జల విద్యుత్‌ కేంద్రాలనే పరిగణించేవారు. పెద్ద జల విద్యుత్‌ కేంద్రాలనూ ఆ పరిధిలో చేర్చాలని ఇటీవల గుజరాత్‌లోని వదోదరలో జరిగిన రాష్ట్రాల విద్యుత్‌ మంత్రుల సమావేశం అభిప్రాయపడింది. పెద్ద జల విద్యుత్‌ కేంద్రాలనూ ఆ పరిధిలోకి తీసుకువస్తే దేశ విద్యుత్తులో దాని వాటా దాదాపు 30 శాతానికి చేరుతుంది. పునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌర, పవన విద్యుత్‌ ప్రధానమైంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకే పవన విద్యుత్‌ ప్రధానంగా పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణలోనే పవన విద్యుత్‌కు ఎక్కువ అవకాశముందని విశ్లేషణల్లో వెల్లడైంది. దేశంలో పవన విద్యుత్‌ స్థాపక సామర్థ్యం ఇప్పటికి 28 వేల మెగావాట్లకు చేరుకుంది. ఈ విషయంలో తమిళనాడు దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్ర పవన విద్యుత్తు సామర్థ్యం ఏడున్నర వేల మెగావాట్లపైనే. తరవాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ ఉన్నాయి. దేశంలో పవన విద్యుత్తు సామర్థ్యం మూడు లక్షల మెగావాట్ల వరకు ఉన్నట్లు ఓ అంచనా. ఇప్పటివరకూ అందులో ఉపయోగించుకుంది పరిమితమే. లక్షా నలభై అయిదు వేల మెగావాట్లతో ప్రపంచ పవన విద్యుత్‌ రంగంలో చైనా అగ్రభాగాన నిలుస్తోంది. ప్రపంచ పవన వినియోగ పటంలో భారత్‌ది నాలుగో స్థానం. ఇక దేశవ్యాప్తంగా అనంతంగా లభించే సౌరశక్తిని వినియోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయడమన్నది రాష్ట్రాల చొరవపై ఆధారపడిన అంశం. సౌర విద్యుత్తు ధర అందుబాటులోకి రావడం ఉత్సాహం కలిగించే పరిణామం. ఒకప్పుడు యూనిట్‌ ధర పన్నెండు రూపాయలకుపైగా ఉంటే, నేడది అటుఇటుగా అయిదు రూపాయలకు చేరింది. సౌర ఫలకాల రేటూ తగ్గుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూత అందించడమూ ఇందుకు కారణం. భవనాల పైకప్పుల మీద సౌర ఫలకాలు అమర్చి నలభై వేల మెగావాట్ల విద్యుత్తు సాధించే లక్ష్యంతో కేంద్ర సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ భవనాల మీద సౌర వ్యవస్థలను అమర్చడం ద్వారా ఒకేసారి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తును సాధించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలూ ఈ తరహా కార్యక్రమాలను చురుగ్గా అందిపుచ్చుకొంటున్నాయి. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్‌ పంపుసెట్లకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, దేశంలోని 55వేల పెట్రోలు బంకులను సౌర ఆధారిత కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర సర్కారు సంకల్పించింది.
పునరుత్పాదక ఇంధనానికి ప్రోత్సాహం
దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం క్రమంగా ఇనుమడిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు గ్రిడ్‌కు ఈ వ్యవస్థలను అనుసంధానించడం, స్థిరీకరించడం చాలా ముఖ్యం. గాలి లేకుంటే పవన విద్యుత్తు ఆగిపోతుంది. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ లోటును పూడ్చుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానంలో ఏమాత్రం లెక్క తప్పినా విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలుతుంది. తమిళనాడులో పవన విద్యుత్‌ సామర్థ్యం అత్యధికం. కాబట్టి ఈ రాష్ట్రం చాలావరకు గ్రిడ్‌కు సంబంధించి సుస్థిరతను సాధించింది. విద్యుత్‌ మిగులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ఇది కత్తిమీద సాము లాంటి వ్యవహారమేనని చెప్పవచ్చు. పునరుత్పాదక ఇంధన వనరులను వాడుకోవడానికి సంప్రదాయ (థర్మల్‌) విద్యుత్తును తగ్గించాలి. ఈ తరహాలో కోత పెట్టడమంటే అది ఒకరకంగా పూర్తిస్థాయిలో విద్యుత్తును వాడుకోలేకపోవడం కిందికే వస్తుంది. ఆ మేరకు భారం వినియోగదారుడిపై పడుతుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సాహం ఇస్తున్న రాష్ట్రాలు- నిర్దిష్ట ప్రణాళిక, నిర్మాణాత్మక వ్యూహం, పకడ్బందీ ఆచరణతో అడుగులు కదపకపోతే వినియోగదారులకు చివరకు మిగిలేది కష్టాలే!
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
దేశంలో అందరికీ విద్యుత్తు అందించడం ఓ సవాలే. ఇప్పటికీ దేశంలో ఎనిమిది వేలకుపైగా గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. ఉత్పాదన పెంచుకోవడంతోపాటు సమర్థంగా విద్యుత్తును వినియోగించుకోవడమూ కీలకమే అని గుర్తించాల్సిన తరుణమిది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన పారిస్‌ ఒప్పందంలో అధికారికంగా చేరుతూ భారత ప్రభుత్వం ఇదే విషయం స్పష్టం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సాహం, కర్బన ఉద్గారాల తగ్గింపు ఆ వ్యూహంలో ఒక భాగం. ఇంధన సమర్థ వినియోగం మరో భాగం. విద్యుత్తు పొదుపు చర్యలకు కేంద్రం తగిన సానుకూల వాతావరణం కల్పిస్తోంది. పొదుపు చర్యలను ముమ్మరం చేయడం ద్వారా ఏడాదికి అదనంగా 19,598 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం తగ్గించాలని లక్షిస్తోంది. 2018-19 సంవత్సరానికి 10 శాతం విద్యుత్‌ ఆదా చేయాలని భావిస్తోంది. విద్యుత్‌ బల్బుల వ్యవస్థలో సమూల మార్పులు ఇందులో భాగం. ఎల్‌ఈడీ బల్బుల వాడకం దేశంలో పెరిగింది. గృహ రంగంలో 18.25 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ జరిగింది. దీనివల్ల ఏడాదికి 23వేల మిలియన్‌ యూనిట్లకుపైగా విద్యుత్తు ఆదా అవుతోందని అంచనా! ఎల్‌ఈడీ బల్బుల ధరలూ బాగా దిగివచ్చాయి. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థ కొలువుతీరనుంది. తద్వారా విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గడంతోపాటు, కర్బన ఉద్గారాలకూ కోతపడుతుంది. గృహోపకరణాల విద్యుత్‌ సామర్థ్యం ఎంతో తెలియజేసే లేబుల్‌ వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 21 రకాల పరికరాలకు లేబుల్‌ పద్ధతి అమలవుతోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి వాటిలో గతంతో పోలిస్తే ఇంధన సామర్థ్య పెరుగుదల 30 శాతం వరకూ ఉన్నట్లు అంచనా. వ్యవసాయ రంగంలో నాసి రకం పంపుసెట్ల వల్ల విద్యుత్‌ వృథా అవుతోంది. ఇంధన సామర్థ్యం 30 శాతం మేర ఉన్న పంపుసెట్ల ప్రవేశాన్ని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రైతులకు ఈ తరహా పంపుసెట్లను ఉచితంగా అందించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దేశంలో రెండు కోట్లకుపైగా పంపుసెట్లు ఉన్న నేపథ్యంలో పొదుపు చర్యల ద్వారా పెద్దయెత్తున ఇంధనం ఆదా చేయవచ్చు. ఈ క్రమంలో రైతుల భాగస్వామ్యం కీలకం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఇంధన పొదుపు పంపుసెట్ల కార్యక్రమం అంతంతమాత్రంగా సాగుతోంది. ఈ ప్రాంత రైతులకు 2,496 పంపుసెట్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం సగమైనా పూర్తి కాలేదు. రాష్ట్రాలు ఇలాంటి అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందడుగు వేయాలి. విద్యుత్తు పొదుపును దృష్టిలో పెట్టుకుని వాణిజ్య భవనాలకు కేంద్రం ఇంధన వాడక స్మృతిని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఎనిమిది రాష్ట్రాలు ఈ ప్రమాణాలు పాటించేందుకు ముందుకు వచ్చాయి. మరీ ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవడంపై కేంద్ర సర్కారు చురుగ్గా కదులుతోంది. దేశంలో వనరులకు కొదవలేదు. వాటిని జాగ్రత్తగా, సమర్థంగా ఉపయోగించుకుంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఇంధన వనరుల వినియోగంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భవిష్యత్తు తరాలకు చీకటి మిగులుతుంది. ప్రభుత్వాలు, ప్రజలు ఇది గుర్తెరిగి వ్యవహరించాలి!
- వల్లభనేని సురేశ్‌

No comments:

Post a Comment

Total Pageviews