Friday, July 31, 2020

దీపావళి

ఏమైపోయాయండి ఆ రోజులు

దీపావళి వస్తుంది అంటే 3 నెలలు ముందు నుండే పిల్లలలో ఒకటే సందడి , అరేయ్ ఇంకా 3 నెలలే ఉంది దీపావళి రేపు వెళ్లి సిసింద్రీ మందు, పటాస్ మందు తెచ్చుకుందాం అని మొదలుపెట్టిన మాటల నుండి అనుకోవడం ఆలస్యం వెంటనే వెళ్ళి వాటిని కొని ఊరిలో ఎక్కడ తాటాకులు ఉంటాయా అని నెత్తుక్కొని అవసరమైతే పొలాలకు వెళ్లి తెచ్చుకొని వాటిని ఎండబెట్టి అలాగే సోవియట్ పేపరు కోసం ఎక్కడ ఉన్నదా అని షాప్ ల చుట్టూ తిరిగి ఆ సోవియట్ పేపర్ కొని, పేకలు కొని వాటన్నింటినీ ఒకచోట చేర్చి ఎండబెట్టడం దగ్గరనుండి వాటిని తయారు చేసేవరకు ఒకటే ఆత్రం ఉండేది. ఆ ఆత్రంలోనే తయారుచేసినవి అసలు ఎలా పేలుతున్నాయి అని ఒక్కొక్కటిగా వేస్తూ చివరికి మొత్తం అన్ని అవగొట్టేవాళ్ళం తిరిగి మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ అవన్నీ కొని తయారు చేసేవాళ్ళం ...

పండగ దగ్గరకి వచ్చేసరికి పేక పెటేబులు, తాటాకు పెటేబులు, సిచ్చిబుడ్డులు, సిసింద్రీలు, జువ్వలు ఇలా ఎన్నో రకాలు సొంతంగా తయారు చేయడం ఉండేది...

పండగ దగ్గరకి వచ్చేసరికి నాన్న ఎప్పుడు మందుగుండు సామాను కొంటార అని ఎదురుచూసిన చూపులు ఎన్నో , వాటిని కొని తీసుకొచ్చాక నాన్న హీరో నుండి సూపర్ హీరో అయ్యేవారు మన దృష్టిలో వాటిని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు ఇలా వాటాలు వేసుకొని పంచుకుంటే వచ్చే ఆనందం, పండగకి కొత్త బట్టలు కొంటే కలిగిన ఆనందం, అయిదు రోజుల దీపావళి కి అయిదు రోజులు వచ్చేలా ఆ మందుగుండు సామాను రోజుకి ఇన్ని అన్ని పక్కన పెట్టుకొని వాటిని కాలుస్తున్నప్పుడు పొందిన  ఆనందం, నేను అన్ని కాల్చాను మా నాన్న ఆ మందులు  తెచ్చారు, ఇవి తెచ్చారు అని మన స్నేహితులకు గొప్పగా చెప్పుకున్నప్పుడు వచ్చిన ఆనందం ,,, పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయి మనతో పాటు వాటిని కాల్చుతున్నప్పుడు మనం చూసిన ఆనందం ఎక్కడికి పోయాయి ఇవన్నీ ...

మనమే ఇవన్నీ అనుభవించాము అనుకుంటే మనపెద్దవారు ఇంతకు రెండింతలు సంతోషాన్ని పొందారు ...

వారితో పోల్చుకుంటే మనం తక్కువే కానీ మనతో పోల్చుకుంటే ఇప్పటివారు ఆ విషయాలలో పిసరంత ఆనందమైన పొందడం లేదు అనే చెప్పాలి

అప్పుడు అన్ని చాలా తక్కువ కాలుష్యరహితంగా ఉండేవి ఎందుకంటే ఎవరికి వారు సొంతతయారు చేసుకునేవారు , ఉన్నవాటిలో సంతోషంగా గడిపేవారు ... ఇప్పుడన్ని కాలుష్యాన్ని పదింతలు పెంచేలా ఉంటున్నాయి అయిన కానీ మనుషుల్లో సంతోషాలు ఉండటం లేదు

మా నాన్నగారు వంద రూపాయలు పెట్టి దీపావళి సామానం కొంటె ఇంట్లో అందరం కాల్చుకునేవాళ్ళం , ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి కొన్నా సరే అప్పటి ఆనందంలో ఒక్కశాతం కూడా ఉండటం లేదు

కాలం మారింది అనడానికి ఇలాంటివి మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి

కాస్త నిజమైన ఆనందంగా,  ఉండేలా నేర్పండయ్యా పిల్లలకి మీ ఫణి కందాళ

Monday, July 27, 2020

ఏ ఘట్టంబున నైన కోపమను మాటే లేని శాంతమ్ము వా చాఘర్షస్థితినైన .....

నేను ఫోర్త్ ఫాం లో ఉన్నప్పుడు యం యల్ నరసింహారావు గారని మా స్కూల్లో ఒక సెకండరీ గ్రేడ్ మాస్టారు వచ్చారు. ఆయన లోయర్ ఫాంస్- అంటే ఫస్ట్, సెకండ్, ధర్డ్ ఫాంస్ కి మాత్రమే పాఠాలు చెప్పాలి. హయ్యర్ ఫాంస్ - అంటే ఫోర్త్, ఫిఫ్త్, యస్ యస్ యల్ సి లకి చెప్పరాదు.కాని ఆయన ఫోర్త్ ఫాం స్పెషల్ తెలుగు, కాంపోజిట్ మ్యాథ్స్ గూడా చెప్పేవారు. ఆ సబ్జెక్ట్స్ లో అంత పట్టు ఉండేది ఆయనకి. పొట్టిగా ఉండేవారు. స్పోర్ట్స్ ఆక పోయినా స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ గా ఉండేవారు.
మేమంతా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం.
ఓ రోజు ఒకాయన వచ్చి బైటివాళ్ళు ఆడుకోడానికి నెట్టూ, బాల్సూ అడిగారు. స్కూల్ ప్రాపర్టీ బైటికి యివ్వడం మాష్టారికి యిష్టంలేదు. నెట్ లేదనిచెప్పారు. ఆ సంగతి తెలీని మేము ఉందని చెప్పాం. ఆయన యిరుకున బడ్డారు. చేసేది లేక నెట్, బాల్స్ యిచ్చి పంపించి ఆయన వెళ్ళాక మామీద బాగా కోప్పడ్డారు. వెంటనే యీపద్యం బోర్డ్ మీద రాసి వెళ్ళి పోయారు. ఆ పద్యం యిది.

ఏ ఘట్టంబున నైన కోపమను మాటే లేని శాంతమ్ము వా
చాఘర్షస్థితినైన .....

ఇంతవరకే గుర్తుంది.
ఎందుకో ఇన్నేళ్ళ తరవాత అది గుర్తొచ్చి ఆపద్యం మిగతాది పూరించి ఆయనకే అంకితం ఇస్తున్నాను.

శార్దూలం
ఏ ఘట్టంబున నైన కోపమను మాటేలేని శాంతంబు వా
చాఘర్షస్థితి నైన నోటను నవాచ్యం బైన వాక్యంబు నై
దాఘౌష్ణ్యమ్ము మనస్సునందు బొడమం దావీక యుష్మన్మహా
మోఘాశీర్వచనమ్మునన్ మనుచు మమ్మున్ నారసింహా గురూ!

భావం: ఎప్పుడూ కోపంలేని శాంతం, ఏదైనా గొడవ పడేటప్పుడు గూడా అనరాని మాటలు నోట రానీక, వేసవికాలపువేడి( అంత ఔద్ధత్యం) మనసులో ప్రవేశించకుండా , ఓ గురువు గారూ! మమ్మల్ని ఆశీర్వదించండి

కోయంది కోయిల (బులుసు

కోయంది కోయిల (బులుసు)
***************
 నా రాణి పిలుపులా
 కోయంది కోయిల
 నందనోద్యానాల
 ఊగె మది ఊయెల !!
          కొమ్మకొమ్మన చిగురు
          చిగురు చిగురున ఒగరు
           వగల కొమ్మావిపై
           రాగాల - గారాల!!
 తలపువిరిసే వేళ
కలలు పండే లీల
రసవాయులీనాల
రవళించు నాదాల  !!
          పాటలే బ్రతుకైన
           ఓ కోయిలా
           నిలువవే సిరికోన
            కొక నీడలా!!
********************************

ఆశీర్వాద శాంతి మంత్రములు, మన ఉపనిష

వేదములు మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు.
మానవ సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.

ఈ క్రింద ఇవ్వబడిన ఆశీర్వాద శాంతి మంత్రములు, మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి విశ్వం శాంతి, శుభం మరియు క్షేమం కొరకు పఠించేవారు. వేదపండితులు మరియు బ్రాహ్మణుల ద్వారా పఠించబడే ఈ ఆశీర్వాద శాంతి మంత్రములు సమాజంలో, శ్రేయస్సును, శాంతిని, శుభాన్ని పెంచడానికి ఖచ్చితంగా దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఆవశ్యకత వుంది

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
సర్వ జీవులు రక్షింపబడుదురు గాక.! సర్వ జీవులు పోషింపబడుదురు గాక.!
అందరూ కలిసి పని చేయుగాక.!
(అందరూ సమాజ శ్రేయస్సు కోసం)
మన మేధస్సు వృద్ది చెందు గాక.!
మన మధ్య విద్వేషాలు రాకుండుగాక..!
ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.!
*****************************

👉ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..!
ఓం సర్వేషాం శాంతిర్భవతు..!
ఓం సర్వేషాం పూర్ణం భవతు..!
ఓం సర్వేషాం మంగళం భవతు..!

తాత్పర్యం:
అందరికి ఆయురారోగ్య సుఖసంతోషములు కలుగుగాక..!
అందరికి శాంతి కలుగు గాక..!
అందరికి పూర్ణ స్థితి కలుగుగాక..! సర్వులకు శుభము కలుగుగాక..!
*****************************

👉ఓం సర్వేత్ర సుఖిన: సంతు,
సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:
అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..!
అందరూ ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..!
అందరికీ ఉన్నత స్థితి కలుగు గాక..!
ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక..!
*****************************

👉కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:

తాత్పర్యం:
మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశములో ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి  నిర్భయులై జీవింతురు గాక. 
*****************************

👉ఓం అసతోమా సద్గమయ..!
తమసోమా జ్యోతిర్గమయ..!మృత్యోర్మా అమృతంగమయ..!
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అందరినీ, అన్యాయము, అధర్మం మరియు అసత్యము నుంచి న్యాయం, ధర్మం మరియు సత్యము వైపునకు గొనిపొమ్ము. అజ్ఞానమనే అంధకారము నుండి సజ్ఞానస్వరూపమైన వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.
*****************************

👉స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు..!

తాత్పర్యం:
ప్రజలకు శుభము కలుగు గాక..!
ఈ భూమిని పాలించే ప్రభువులందరూ ధర్మం మరియు న్యాయ మార్గంలో పాలింతురు గాక..!
గోవులకు, బ్రాహ్మణులకు సర్వదా క్షేమము, సంతోషము మరియు శుభము ప్రతిరోజూ కలుగునట్లుగా పాలింపబడుదురుగాక..!
జగతి లోని సర్వ జనులందరూ సదా సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక..!
*****************************

👉ఓం శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం శం నో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి:
శం నో విష్ణు రురుక్రమ:
నమో బ్రాహ్మణః
నమో వాయు:
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం, అవతు మక్తారం
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక..!
బ్రాహ్మణులకు వందనం. వాయుదేవునకు వందనం.
నీవే ప్రత్యక్ష బ్రహ్మవు.
నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను.
సత్యము మరియు బ్రహ్మము నన్ను రక్షించు గాక..!
నా గురువులను, సంరక్షకులను రక్షించు గాక..!
*****************************

👉ఓం ద్యౌ శాంతి:..!
అంతరిక్షం శాంతి:..!
పృథివీ శాంతి:..!
ఆపా శాంతి:..!
ఔషదయ శాంతి:..!
వనస్పతయ: శాంతి:‌..!
విశ్వే దేవా: శాంతి:..!
బ్రహ్మ శాంతి:..!
సర్వం శాంతి:..!
శాంతి రేవా: శాంతి:..!
సామా: శాంతిరేది :..!
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై ఉన్న ఓషధులు మరియు వనమూలికలు,
అన్ని లోకము లందలి దేవతలయందు, బ్రహ్మ యందు, సర్వ జనులయందు, శాంతి నెలకొను గాక..!
పంచభూతముల ప్రకృతి వలన కాని,  బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక..! శాంతి యందె శాంతి నెలకొను గాక..! నాయందు శాంతి నెలకొను గాక..!

పైన చెప్పిన ఆశీర్వాద శాంతి మంత్రములు అందరూ తప్పక చదివి అర్ధం చేసుకోండి. మన భారతీయ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం పఠింపబడుతున్నవి.

ధర్మో రక్షతి రక్షితః...!
ధర్మో రక్షతి రక్షితః...!
ధర్మో రక్షతి రక్షితః...!

అనగా, అందరూ వారి వారికి నిర్దేశించిన ధర్మమార్గములో జీవనం కొనసాగిస్తూ వుంటే, ఆ ధర్మమే, ఎలాంటి దుష్టాంతరాలు రాకుండా, మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలా తప్పక కాపాడుతుంది అని..!


* * * సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు * * *

*****************************

🙏భవదీయుడు🙏
ముక్తాపురం వేంకట కృష్ణమోహన్
+91 9704440791
👉 ఇప్పటికి దాదాపు 2490 మంది సభ్యులు వున్న మా గ్రూపులు👇
(శ్రీవైష్ణవం శరణాగతి 1/2/3/4/5/6,
ఆధ్యాత్మికం సనాతనం 1/2/3/4
ఓం శైవం శివోహం 1/2 )

Tuesday, July 21, 2020

శ్రావణ లక్ష్మికి పద్య కుసుమం

శ్రావణ లక్ష్మికి పద్య కుసుమం

సిరుల నిచ్చెడి తల్లివి సింధు పుత్రి
సకల సౌభాగ్య లక్ష్మివి సరసిజాక్షి
కొలువు తీరగ రావమ్మ కోమలాంగి 
సర్వ మంగళ మూర్తివై  శ్రావణమున!!   
   
సర్వ మంగళ నీవెగ శంభు పత్ని
సర్వ శుభముల నొసగెడు శక్తి  వౌగ
సర్వ జనులార్తి తీర్చగ సత్వరమున 
సర్వ మంగళ మూర్తివై  శ్రావణమున! 

మొదటి వాయనమ్మును గొను మోక్ష దాయి
పసుపు కుంకుమ కోరెడి పడతులంత
గౌరి పూజలు చేతుము కదలి రావె         
సర్వ మంగళ మూర్తివై  శ్రావణమున!

పూలు పళ్ళను తేలేను బుణ్య శీల
మనసు పుష్పంబు నీకిత్తు మాన్య వౌగ
మమ్ము గావగ దివినుండి మరలిరావె
సర్వ మంగళ మూర్తివై  శ్రావణమున!
***

Saturday, July 11, 2020

పురోహితుడి కి #దక్షిణ

ఈ మధ్య కొత్త జాడ్యం ఒకటి అందరిలోనూ కనిపిస్తోంది.

శుభకార్యం అయినవెంటనే  #పురోహితుడి కి #దక్షిణ ఇవ్వకుండా , కనీసం చెప్పకుండా, ఆశీర్వచనం తీసుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోవడం,

వివాహాంలో అయితే కనీసం కంకణం విప్పాలి కాబట్టి ఉంటున్నారు.

తరువాత వాళ్ళమాట!....
" తరువాత కలుస్తాము"
శుభకార్యం అయిన చోటే.. సభా తాంబూలం ఇద్దాం అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు.

వివాహం లో చేసే ఆర్ర్భాటాలు:---.
*****************************

Dj పేరుతో రోడ్డుమీద తాగి గెంతడం ఖర్చు 50,000/-

ఫ్రెండ్స్ కోసం మందు  ఖర్చు అక్షరాలా లక్ష..100,000/--

పనికిమాలిన డెకరేషన్ కోసం.(పచ్చని తోరణం ఉండదు) ఖర్చు మరో లక్ష..100,000/-

భోజనాలు ఖర్చు. 5  లకారాలు దాటిన మాటే (lacs)

పెద్దిళ్లలో..ఈవెంట్ పేరుతో ఆర్డనగ్న నృత్యాలు. వాళ్ళు వేసే వెకిలి వేషాలు , మాట్లాడే తీరు కోసం ఖర్చు లక్ష.100,000/-

                 పెళ్లి మండపంలో.
పువ్వులు ఉండవు,

అరటిపళ్ళు ఉండవు,

తమలపాకులు ఉండవు,

మంచినీళ్లు ఉండవు,

పసుపు,కుంకుమ చిన్న పొట్లాలు తో ఉంటాయి,

ద్రవ్యాలు వేసుకోవడానికి పళ్ళాలు ఉండవు,

కూర్చొడానికి పీటలు ఆసనాలు ఉండవు,

అసలు పెళ్లికి కనీసం గంట ముందు ఎవరు ఉండరు

మండపమ్ లో ఉండేవి ఏంటి?
***************************

తలంబ్రాలు పేరుతో తర్మోకోల్ ముక్కలు, రంగు బియ్యం,

Foam స్ప్రేలు,

పేలిస్తే అందరిమీద పడే కాయితం ముక్కలు

తాగేసిన ఫ్రెండ్స్ కేకలు ,

ఇంకా ఇలాంటి దరిద్రాలు ఎన్నో!!!!

ఆట్లా ఇట్లా... కిందా మీద పడి ..పెళ్లి అయిపోతుంది పురోహితుడికి దక్షిణ కోసం 36 మంది వస్తారు. వాళ్ళు చెప్పే మాట

" బాబు మీరే దయ చూడాలి చాలా ఖర్చు అయ్యింది #అప్పులు చేసి పెళ్లి చేస్తున్నాం"" 

అక్కడ 50 బేరాలు మా దక్షిణ అడగాలంటే #అసహ్యం వేస్తుంది.

పైగా ఎవడో ఒక వెధవ ఉంటాడు వాడు అంటాడు ... ఈమధ్య.#పంతుళ్ళకి గొప్ప సొమ్ము అని... ఆ వెధవకి తెలీదు మూఢమ్ 6 మాసాలు పంతులు ఎలా బ్రతుకుతాడు అని.
ఆఖరికి కట్నం సూన్యం, ఇస్తాడో??  ఇవ్వడో?? తెలీదు.

ఇక. గృహప్రవేశం ఇదో విధంగా  ఉంటుంది.
*********************************

మొత్తం కార్యక్రమం అయిపోతుంది, వ్రతం అయిపోతుంది,
ప్రసాదం తీసుకోవడం వెళ్లిపోవడం అంతే దక్షిణ ఇద్దాము అనే స్పృహ అసలు ఉండదు

అసలు అక్కడ పురోహితులు ఉన్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కుర్చీల మీద కూర్చొని సొల్లు బాతాకాని చేస్తూ ఉండడం

"మేము వెళతాం" అని చెపితే కనీసంతాంబూలం ఇచ్చి, దణ్ణం పెట్టి  ఆశీర్వచనం తీసుకుందాం అనే #ఆలోచన ఉండదు.

శంఖం వాడికి
మేళాలు వాళ్ళకి
క్యాటరింగ్ వాళ్ళకి. Etc etc వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చేస్తారు. ఒక్క పురోహితుడే ఆఖర్లో అడిగిన కూడా ఇస్తారాకులు ఎత్తే వాడిలాగా యూడిపోవాలి...
వాడికి దక్షిణ ఇవ్వకుండా ఉండే ఇలాంటివాళ్లను ఏమనాలి??

ఈమధ్య కొందరు... బ్రాహ్మణ వ్యవస్థను బ్రష్టు పట్టించాలని... వివాహాది శుభకార్యాలు కొందరు పనిగట్టుకుని మేమూ చేస్తాం అంటూ వీధి కూడళ్లలో జంధ్యంధరించి ముఖాన విభూదిరేఖలు పెట్టుకుని... అపుడపుడూ తాగి తూలుతూ కనిపించి.... చూసేవారికి అసహ్యంగా కనిపిస్తుంటారు వీళ్ళను చూసి అందరూ బ్రాహ్మణులు ఇలాగే తయారయ్యారని మిగతావారిని దూషించడం మంచిదికాదు.

* పైపైన ప్రార్ధనలు చెప్పే పాస్టర్ల కు క్రైస్తవులు గౌరవాలిస్తారు.

* ఖురాన్ చదివి సూరత్ పలికే ముల్లాలకు ముస్లింలు మర్యాద లిస్తారు.

* ఈమధ్య గృహప్రవేశాలకు... వివహకార్యాస్తలాల దగ్గరకూ ఆడ, మగ కానీ మూడో రకమైన హిజ్రాలు వచ్చి కేవలం 5 నిముషాలు నానా హంగామా/ రభస చేసేస్తే... వాళ్ళ శాపనార్ధాలకు భయపడి పోయి ఉచ్చోసుకుని... గజ గజ వనిపిపోయికి వాళ్ళను బ్రతిమాలి,భామాలి 5,000,10,000,15000 ఇస్తున్నారే??

మరి!..ప్రతీ తంతు ని తూ,చ తప్పకుండా... మీ శ్రేయస్సుకు,మీ అష్టైశ్వర్య సిధ్ధికోసం ,మీ సంతాన సుభిక్షంకోసం శ్రమించే బ్రాహ్మణులే మీకు లోకువయ్యారా???

పురోహితుల్ని దుఃఖపడితే  కార్యం చేయించుకున్నోళ్లకు శుభం అవుతుందా??

కొసమెరుపు:
కొన్నిచోట్ల కార్యక్రమము  అంతా అయ్యిన తరువాత. మేము మీకు దక్షిణ ఇవ్వలేము ఎందుకంటే మాకు కలెక్షన్ తక్కువ అయ్యింది అనీ అనేవాళ్ళు కూడా అక్కడక్కడా ఉంటారు..

పుడమి దేవుణ్ణి బాధించి... పుణ్యాలేల మూటగట్టు కుంటారయ్యా???...ఆలోచించండి.పుణ్యాత్ములారా...
🙏🙏🙏

బాపలను,అర్చకులనూ, పుతోహితులను #వెనకేసుకొస్తున్నా అనుకునేరూ....
#మన కార్యసిధ్ధికోసం చేసే తంతుల్లో వాళ్ళు చెప్పినట్టుగానే గంటలతరబడి #వింటాం... కానీ కార్యమయ్యాక వాళ్ళ మాటను మనం #వినం.... ఇక నుండైనా విందాం.. #మనవాళ్లకు అండగా ఉందాం... మన #పునాదులను కాపాడుకుందాం..

Wednesday, July 8, 2020

జన్మదిన శుభాకాంక్షలు.తేటగీతి పద్యాలు:

ఆదరణీయురాలైన సునీత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మీపై అభిమానంతో మీ గురించి నేను వ్రాసిన రెండు తేటగీతి పద్యాలు:

బోసిపోవు మీ సరసన బాపు బొమ్మ
కరిగిపోవు మీ గళమున కోకిలమ్మ
వెలిగిపోవు మీ నవ్వున వెన్నెలమ్మ
స్వఛ్ఛమైన మనస్సు మీ సొంతమమ్మ

మురియు తెలుగు పలుకులు మీ మాటలోన
పులకరించు స్వరములు మీ పాటలోన
మంచినెంచు తలపులె మీ మనసులోన
తెలుగుదనము పొంగారు మీ తీరులోన

కట్టుబొట్టులో లక్ష్మియె కానిపించు
కళలయందున శారదె గోచరించు
ఆత్మ స్థైర్యమున గిరిజ యనుచు తోచు
ముగ్గురమ్మలేకమయిన మూర్తి మీరు

Tuesday, July 7, 2020

రావూరి భరద్వాజ జన్మదినంఅక్షర నీరాజనం

జులై 5
ఆ సాహితీమూర్తికి అక్షర నీరాజనం !
జులై 5
జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డాక్టర్
రావూరి భరద్వాజ గారి జన్మదినం!
ఆ సాహితీమూర్తికి అక్షర నీరాజనం !

మొగుల్తూరు మీరు పుట్టినూరు!
తాడికొండ మీరు చదివినూరు!
హైదరాబాదు మీరు ఎదిగినూరు!
సాహిత్యంలో మీరు కోహినూరు !!

గడ్డం ఎదిగిన జ్ఞానం మీరు !
ఖద్దరు తొడిగిన ఖడ్గం మీరు !
నిజం చెప్పాలంటే మాష్టారూ
మీరు అచ్చ తెలుగు ఠాగూరు !!

దరిద్రాన్ని నావలా మోసిన
అక్షర సముద్రం మీరు !
మీ 'పాకుడురాళ్ళ' మీద అడుగేసి
జారిపడని వాళ్ళు ఎవరు !!

మీరు రావూరి భరద్వాజ కాదు!
మా ఊరి భరద్వాజ! వాళ్లూరి భరద్వాజ!
వీళ్లూరి భరద్వాజ! నెల్లూరి భరద్వాజ!
తెలుగు తల్లూరి భరద్వాజ !!

మీరు రాసిన 'జీవన సమరం'
'కాదంబరి' పాకుడురాళ్ళు !
తెలుగు సాహితీ వనంలో
మీరు ఎగరేసిన పావురాళ్ళు !!

రేడియోలో నాడు మీరు
ప్రసారించిన తెలుగు ప్రసంగాలు !
అవి నేటికీ గాలి తరంగాలలో
ఎగురుతున్న నిశ్శబ్ద పతంగాలు !!

ఆకాశవాణి అంటే మీకు
పక్షి రెక్క విప్పినంత పరవశం !
అందుకే వచ్చేది మీ దగ్గర
రే"డియోడెరెంట్ "పరిమళం !!

మీకు కధలు రాయడం తప్ప
కలలు కనడం తెలీదు !
మీకు నవలలు రాయడం తప్ప
నలుగురితో కలవడం తెలీదు !!

మీకు నాటకాలు రాయడం తప్ప
జీవితంలో నటించడం తెలీదు !
గడ్డం చేసుకోవడం తెలీనట్టే మీకు
డబ్బు చేసుకోవడం కూడా తెలీదు !!

మీకు ఆశల్లేవు ఆశయాలు తప్ప
ఆభరణాల్లేవు అక్షరాలు తప్ప!
ఆస్తుల్లేవు పుస్తకాలు తప్ప
ఇంకేముంది మీ గురించి చెప్ప ??

ఎన్నో కధలు రాయడం మీ గొప్ప
ఎన్నెన్నో నవలలు రాయడం మీ గొప్ప
మరెన్నో నాటకాలు రాయడం మీ గొప్ప
మీరు తెలుగువారు కావడం మా గొప్ప !!
మొగుల్తూరు మీరు పుట్టినూరు!
తాడికొండ మీరు చదివినూరు!
హైదరాబాదు మీరు ఎదిగినూరు!
సాహిత్యంలో మీరు కోహినూరు !!

గడ్డం ఎదిగిన జ్ఞానం మీరు !
ఖద్దరు తొడిగిన ఖడ్గం మీరు !
నిజం చెప్పాలంటే మాష్టారూ
మీరు అచ్చ తెలుగు ఠాగూరు !!

దరిద్రాన్ని నావలా మోసిన
అక్షర సముద్రం మీరు !
మీ 'పాకుడురాళ్ళ' మీద అడుగేసి
జారిపడని వాళ్ళు ఎవరు !!

మీరు రావూరి భరద్వాజ కాదు!
మా ఊరి భరద్వాజ! వాళ్లూరి భరద్వాజ!
వీళ్లూరి భరద్వాజ! నెల్లూరి భరద్వాజ!
తెలుగు తల్లూరి భరద్వాజ !!

మీరు రాసిన 'జీవన సమరం'
'కాదంబరి' పాకుడురాళ్ళు !
తెలుగు సాహితీ వనంలో
మీరు ఎగరేసిన పావురాళ్ళు !!

రేడియోలో నాడు మీరు
ప్రసారించిన తెలుగు ప్రసంగాలు !
అవి నేటికీ గాలి తరంగాలలో
ఎగురుతున్న నిశ్శబ్ద పతంగాలు !!

ఆకాశవాణి అంటే మీకు
పక్షి రెక్క విప్పినంత పరవశం !
అందుకే వచ్చేది మీ దగ్గర
రే"డియోడెరెంట్ "పరిమళం !!

మీకు కధలు రాయడం తప్ప
కలలు కనడం తెలీదు !
మీకు నవలలు రాయడం తప్ప
నలుగురితో కలవడం తెలీదు !!

మీకు నాటకాలు రాయడం తప్ప
జీవితంలో నటించడం తెలీదు !
గడ్డం చేసుకోవడం తెలీనట్టే మీకు
డబ్బు చేసుకోవడం కూడా తెలీదు !!

మీకు ఆశల్లేవు ఆశయాలు తప్ప
ఆభరణాల్లేవు అక్షరాలు తప్ప!
ఆస్తుల్లేవు పుస్తకాలు తప్ప
ఇంకేముంది మీ గురించి చెప్ప ??

ఎన్నో కధలు రాయడం మీ గొప్ప
ఎన్నెన్నో నవలలు రాయడం మీ గొప్ప
మరెన్నో నాటకాలు రాయడం మీ గొప్ప
మీరు తెలుగువారు కావడం మా గొప్ప !!

Monday, July 6, 2020

#ప్రతాప్ Dron part 2

#మోదీ మెచ్చుకుని
#DRDO లో ఉద్యోగం ఇప్పించిన ఈ బాలుడు ఎవరో తెలుసా..??
****************************************************

ఇతని పేరు #ప్రతాప్, వయస్సు కేవలం 21 ఏళ్ళు..
కర్ణాటక మైసూరు సమీపంలోని #కాడైకుడి స్వంత గ్రామం..
తండ్రి ఒక సాధారణ రైతు కూలీ..
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి..
ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్, కానీ పూట గడవని పరిస్థితి..
స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి వచ్చిన 100-150/- డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్ళి #ISRO, #NASA, #BOEING, #ROLLS_ROYCE, #HOWITZER Etc గురించి సోధించేవాడు, అక్కడి సైంటిస్టులకు ఈ-మెయిళ్ళు పంపేవాడు..
రిప్లై మాత్రం వచ్చేది కాదు, అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు..
#ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ, #ఇంజనీరింగ్_ఇన్_ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కల, కానీ పేదరికం కారణంగా B.Sc (Physics) కోర్సులో చేరవలసివచ్చింది.. అయినా నిరాశపడలేదు..
హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవడంతో, బయటకు తోసేశారు..
బస్టాపుల్లో ఉండి, పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి, ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, Java, Python వగైరా నేర్చుకున్నాడు..
మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి e-waste రూపంలో కీ బోర్డులు, మౌస్‌లూ తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు..
మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి e-waste రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు..
పగలు చదువు మరియు పనులు, రాత్రి ఆవిధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు..
ఈవిధంగా సుమారు ఓ 80 ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది.. ఇ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట..
డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు..
అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్‌లు ఉన్నాయి..
ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయన్న వార్త తెలిసింది..
దానితో కూలి పనులకు వెళ్ళి ఓ 2000/- కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం కట్టాడు..
ఆ కాంపిటిషన్‌లో 2nd ప్రైజ్ వచ్చింది.. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటిషన్‌లో పాల్గొనే అవకాశం లభించింది..
ఆ ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు..

#జపాన్‌కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం..
అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి..
చైన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు..
విమాన టికెట్లకు మైసూరు లోని ఒక దాత ముందుకు వచ్చాడు..
ఇతర ఖర్చుల కోసం తన #తల్లిగారు తన #మంగళసూత్రాన్ని మరియు #కమ్మలు అమ్మగా 60,000/- ఇచ్చింది..
బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు..
బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు, సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్ళు మారి చివరి స్టేషన్లో దిగాడు..
అక్కడి నుంచి మరో 8 కి.మీ లగేజీ మోసుకుంటూ నడిచివెళ్ళి చివరకు గమ్యం చేరాడు..

అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు..
అత్యంత సోఫెస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి..
కాంపిటిషన్‌లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్‌రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు..
అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, #పక్షికన్ను మాత్రమే కనపడింది..
అలాగే మన #ప్రతాప్‌కు కూడా తన మనస్సు తన డ్రోన్ మోడల్‌పైనే ఉంది..
తన మోడల్స్ వారికి సమర్పించి, డ్రోన్ పనితీరు చూపించాడు..
వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యానర్‌లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు..
మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు..
రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు..
ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు..
నిరాశకు గురయ్యాడు, తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రునయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు..
ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది ఫ్రాన్స్‌కు వెళ్ళింది..
తరువాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది అమెరికాకు వెళ్ళింది..
అప్పిటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు..

ఇంతలో చివరి అనౌన్స్‌మెంట్ వినిపించింది: "Please Welcome #Mr_Pratap, First Prize, From INDIA.."
అంతే లగేజీ అక్కడే వదిలేశాడు, కిందపడిపోయాడు, బిగ్గరగా ఏడ్చేశాడు, తన #తల్లిదండ్రులు, #గురువులు, #మిత్రులు, ధన సహాయం చేసిన #దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు..
రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ, మొదటి స్థానం సంపాదించిన భారత్ ఫ్లాగ్ పైకి పోతూ ఉన్నది..
ఇటు కాళ్ళూ చేతులూ వణికిపోతూ చెమటలు పట్టిన ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు..
మొదటి ప్రైజ్ తోపాటు 10,000 డాలర్లు అతనికి బహుమతిగా అందాయి. (సమారు 7 లక్షల రూపాయలు)

3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు..
"నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్‌లో ప్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయ్.." అన్నారు
"నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా మాత్రృభూమికి సేవచేయడమే నా సంకల్పం.." అని వారికి క్రుతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు..
ఈవిషయం స్థానిక #BJP MLA మరియు MP లకు తెలిసింది..
వారు అతని ఇంటికెళ్ళి అభినందించి, ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీజీతో అపాయింట్‌మెంట్ ఇప్పించారు..
మోదీజీ అతనిని అభినందించి #DRDO కు రెఫర్ చేశారు..
ఇప్పుడు అతను DRDO లో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు..
నెలకు 28 రోజులు విదేశాలు తిరుగుతూ DRDO కు డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు....!!

Source: Asthram News

🌹డ్రోన్ బాయ్ ప్రతాప్🌹

"ప్రతాప్" - ప్రతిభావంతుడైన యువ శాస్త్రవేత్త. ఈ ప్రతాప్ వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే! ఇతనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ DRDO లో నియమించారు!!

ఇంతకూ ప్రతాప్ ఏమి సాధించాడు? 
🌹డ్రోన్ బాయ్ ప్రతాప్🌹https://www.youtube.com/watch?v=py9o-0kpjng

ప్రతాప్ కర్ణాటకలోని ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు. తండ్రి ఒక బీద వ్యవసాయదారుడు. తండ్రి నెలవారీ ఆదాయం సుమారు రూ.2000 మాత్రమే! ప్రతాప్ చిన్న వయస్సులోనే ఎలక్ట్రానిక్స్ ఇష్టపడేవాడు.

ప్రతాప్ డ్రోన్ కు సంబంధిత సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించేవాడు. శాస్త్రవేత్తల యొక్క మెయిలుకు తన సందేహాలను ఈమెయిల్‌ పంపేవాడు బట్లర్ ఇంగ్లీషులో. తను 100 మెయిల్స్ పంపితే తనకు 1 సమాధానం వచ్చేది. గత 2 సంవత్సరాల్లో మాత్రమే తను ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించారు.

ప్రతాప్ కాలేజీలో బిఎస్సి ఫిజిక్స్ చేరాడు. మైసూర్‌లో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు హాస్టల్ ఫీజు కట్టలేదు. బయటకు పంపించేసారు. అతను బస్‌స్టాండ్‌లో, వీధిలో ప్లాట్‌ఫాంపై ఉండి చదివాడు! అతను మైసూర్ నగరాన్ని ఎప్పుడూ చూడలేదు. మైసూర్ బస్‌స్టాండ్ ఒక ప్యాలెస్ లాంటిదని చెప్పేవాడు. అక్కడ పబ్లిక్ టాయిలెట్లో తన బట్టలు ఉతికేవాడు. ట్యూషన్ ద్వారా వచ్చే ఆదాయంతో చదువును కొనసాగించాడు.

ఏదో ఒకవిధంగా తక్కువ ఖర్చుతో ఎగిరే యంత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. దాని పేరు డ్రోన్ అని కూడా అతనికి తెలియదు. కోర్సులో చేరడానికి డబ్బు లేనందున సి ++, జావాకోర్ పైథాన్ అడోబ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకున్నాడు. అప్పుడు అతను బొంబాయి, విశాఖపట్టణం వంటి పట్టణాల్లో అధికంగా పోగుపడిన ఇవాస్ట్ స్క్రాప్ యార్డ్‌లో శోధించాడు. అందువలన అతను తన డ్రోన్ ప్రాజెక్టుకు ఖర్చును 40% తగ్గించాడు. ప్రతాప్ తన డ్రోన్ తయారీ ప్రయత్నాలలో ఎన్నోసార్లు విఫలమై, తన 80వ ప్రయత్నంలో విజయం సాధించాడు.

ఐఐటి పెట్టిన డ్రోన్ పోటీలో పాల్గొనడానికి అతను జనరల్ కంపార్ట్మెంట్లో 3 రోజులు రైలులో ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్తాడు. సరైన బూట్లు లేవు. మంచి దుస్తులు లేవు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు పాల్గొన్న పోటీలో అతనికి 2వ బహుమతి లభించింది. దానితో అతనికి ఉత్సాహం వచ్చింది.

"జపాన్‌లో ఇలాంటి పోటీ ఉంది. నేను పాల్గొంటాను" అని ఒకరికి చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ పాస్పోర్ట్, వీసా కొనవలసి ఉందని అతనికి తెలియదు. ప్రతాప్ తన 10th, ఇంటర్ మార్క్‌షీట్‌ను తనఖా పెట్టి కొంత డబ్బు సంపాదించాడు. వివిధ వ్యక్తులు (కళాశాల స్నేహితులు, ప్రొఫెసర్లు) అతనికి వీలైనంత వరకు సహాయం చేసారు. చివరిగా తత్కాల్‌ పాస్‌పోర్ట్, వీసా సంపాదించాడు. 

కానీ జపాన్‌లో జరిగే పోటీలో పాల్గొనడానికి, ఒక ప్రొఫెసర్ కు తన ప్రాజెక్ట్ నివేదికను సమర్పించి, ఆమోదం పొందటం తప్పనిసరని తెలిసింది. అతను ఆ పని మీద  మద్రాస్ కు 300 రూపాయలతో వెళ్ళాడు. చెన్నై అతనికి కొత్తది. ఏలాగో ఒక ప్రొఫెసర్‌ ఇంటికి వెళ్ళాడు. ఆ ప్రొఫెసర్ ఇంట్లో లేడు. 4 రోజులు తిరిగాడు. చేతిలో ఉన్న డబ్బు కరుగుతోంది. చివరకు ప్రొఫెసర్‌ను కలుస్తాడు.‌ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసిన ప్రొఫెసర్ నిరాకరించారు. "నీవు బిఎస్సి ఆర్ట్స్ గ్రూప్. మీ అధ్యయనం మరియు నువు పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఏమిటి?" అని. చేతిలో డబ్బులన్నీ అయిపోయినా, పట్టువిడవకుండా చివరికి సంతకం సాధించి 31 రోజుల తరువాత మైసూర్‌కు తిరిగి వస్తాడు.

*జపాన్ ప్రయాణం : భారతదేశం తరపున పోటీ చేయడానికి ప్రయాణ ఖర్చులు (కనిష్టంగా) రూ.60,000 అవసరం. ప్రభుత్వాలకు మెయిల్ పంపాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మైసూర్‌లో ఉన్న స్వామీజీ ఒకరు విమాన టికెట్ ఇప్పించారు. చివరకు అతను తన తల్లిగారి "మాంగల్యమును అమ్మేస్తాడు".

ప్రతాప్ ఒంటరిగా డిసెంబరు 2017లో టోక్యోకు వెళ్తాడు. అప్పుడు అతని వయస్సు 18 సంవత్సరాలు. కేవలం రూ.1400 మాత్రమే చేతిలో ఉంది. విమానాశ్రయం నుండి ఎగ్జిబిషన్ సెంటర్‌కు బుల్లెట్ రైలు 2 గంటలు మాత్రమే. సాధారణ రైలుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే బుల్లెట్ రైలు ప్రయాణం ఖరీదైనది. రైలు దిగాడు. ఎగ్జిబిషన్ సెంటర్ అక్కడి నుండి 8 కి.మీ. అన్ని పెట్టెల లగేజ్ మోసుకుంటూ, 8 కి.మీ. దూరంలో ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్కు చేరుకుంటాడు.

127కు పైగా దేశాలు పాల్గొంటున్న ఎక్స్‌పోలో తనకు ఏ స్ధానం లభిస్తుందో ప్రతాప్ కు తెలియదు! 70వ స్ధానం నుండి ఫలితాలు ప్రకటిస్తున్నారు! వాటిలో ప్రతాప్ పేరు లేదు. 60-50 వ స్థానం విజేతల ప్రకటన వస్తోంది. ప్రతాప్ ఫలితాన్ని చూస్తాడు. ఆయన పేరు లేదు. 30వ స్థానం ప్రకటన వస్తోంది. అతను ఫలితాన్ని చూస్తాడు. చైనా విశ్వవిద్యాలయాలు దీనిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రతాప్ పేరు లేదు.

20వ స్థానంలో వచ్చిన వారి పేర్లు ప్రకటన వస్తోంది. అతను ఫలితాలను చూస్తాడు. ఆ ఫలితాల్లో యూరప్ మరియు జర్మన్ విశ్వవిద్యాలయాల ఆధిపత్యం.

ప్రతాప్ నిరాశతో చివరి వరుసకు వెళ్లి కూర్చున్నాడు. టాప్ 10 జాబితాను ప్రకటించారు. ఆ ఫలితాలన్నీ అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ఆధిపత్యం.

అందరూ మొదటి ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2 వ బహుమతి "స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం" కు ప్రకటించబడింది!

ఆ తరువాత # 1 ఎవరు?

"దయచేసి భారతదేశం నుండి మిస్టర్ ప్రతాప్, గోల్డ్ మెడలిస్ట్ కు స్వాగతం"

ఏడుపే మన హీరో కోసం ఏడుస్తోంది...

పట్టరాని ఆనందం... పరమానంద పరిపూర్ణత్వం...

అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి...

 భారతదేశ జెండా పైన అవరోహణం....

తన "తల్లి మాంగల్యం" కన్నీటి తెరలో మసకబారి కనపడుతుంది.

భారత మాతా పరవశించి పోతుంది. 10,000 డాలర్ల బహుమతి. ఆ తరువాత ఒక ఉల్లాసమైన వేడుక. అతని ప్రతిభ బయటి ప్రపంచానికి తెలుస్తుంది.

ఫ్రాన్స్‌లో మొదటి బహుమతి. ఫ్రాన్స్ దేశం నుండి ఆహ్వానం! మేము నెలకు 16 లక్షలు ఇస్తాము. మేము 5 బెడ్ రూమ్ ఇంటిని ఇస్తాము. మేము 2.5 కోట్ల విలువైన కారును కూడా ఇస్తాము. కానీ ప్రతాప్ తిరస్కరించాడు!!

 "భారతదేశ ప్రధానమంత్రి మోడీ ప్రతాప్ ని పిలిచారు. తన ప్రతిభ దేశానికి ప్రయోజనం. రక్షణశాఖకు చెందిన DRDO తో కలిసి పనిచేసే అవకాశంతో గౌరవించబడినాడు" 🌹🌺🌹
(DRDO - Defence Research Dovelopment Organization. భారతదేశ రక్షణశాఖకు మిలటరీకు సంబంధించిన ఆయుధాల పరిశోధన, అభివృద్ధి కేంద్రం)

Sunday, July 5, 2020

వేంగీక్షేత్ర వైభవం వాడ్రేవు చినవీరభద్రుడు

నిమ్మ, అరటి, కొబ్బరి తోటల మధ్య, అప్పుడే కొన్ని చోట్ల నాట్లు, కొన్ని చోట్ల ఊడ్పులు నడుస్తున్న పొలాల మధ్య, ఆకాశమంతా కమ్మిన కారుమబ్బుల కళకళ మధ్య పెదవేగిలో అడుగుపెట్టాను. ఒకప్పుడు ఆరేడు శతాబ్దాల నుండి పదకొండు పన్నెండు శతాబ్దాల దాకా తెలుగు వారి రాజధానిగా విలసిల్లిన ఊరు, ఆంధ్ర సాహిత్యానికీ, సంస్కృతికీ ఊయెలతొట్టిలాంటి వేంగీక్షేత్రాన్ని ఇన్నాళ్ళకు చూడగలుగుతున్నానని నాకు నేను చెప్పుకుంటూ ఆ పల్లెలో అడుగుపెట్టాను.

'ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితి నాళ్ళ..' ఎప్పటి పద్యమిది! ఇంటర్మీడియేటు లో వేంగీక్షేత్రం పాఠంగా చదువుకుని నలభయ్యేళ్ళు దాటింది. విశ్వనాథ ఆంధ్రప్రశస్తి 1924 లో పుస్తక రూపంలో వెలువడిందిగాని, ఈ పద్యాలు 1919-21 కాలం నాటివి. అంటే ఆయన వేంగిలో అడుగుపెట్టి 'ఈ నా శరీమందు ఇవతళించిన గాలి ఎంత పౌరాతన్యమేచికొనెనొ' అనుకుని ఇప్పటికి వందేళ్ళు గడిచాయి.

ఇప్పుడు ఆ పద్యాల్ని స్మరించుకుంటూ ఇప్పటికి వేంగీక్షేత్రంలో అడుగుపెట్టగాలిగాను. ఇంత దగ్గరగా ఉన్న ఆ ప్రాచీన ఆంధ్ర రాజధానీ భూమిని సందర్శించడానికి ఇన్నాళ్ళు పట్టింది నాకు.

~

ఇట వేగీశుల పాదచిహ్నములు లేవే,లేవు పో,
భావనాస్ఫుట మూర్తిత్వమునైన పొందవు
ఏదో పూర్వాహ్ణ దుష్కాలంపుంఘటికల్ గర్భమునందిమిడ్చుకొనియెం కాబోలు
ఈ పల్లె చోటట!
లోకాద్భుత దివ్యదర్శనమటే!
ఆ భోగమేలాటిదో!?

~

అన్నాడు కవి. నిజమే ఇప్పుడక్కడ వేగీశుల పాదచిహ్నములు లేవు. కాని, అపారమైన సమృద్ధి ఉంది. పోలవరం కాలువ నీళ్ళు ఆ పల్లె పక్కగా ప్రవహిస్తున్నాయి. 'ఈ పొలాలెంత చేవెక్కించుకున్నవో గుండె వ్రయ్య సముద్రగుప్తుడడలె' అనుకున్నాడు కవి, కానీ, ఇప్పుడా పొలాలంతటా లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఒక సామ్రాజ్యానికి, సంస్కృతికి కొనసాగింపు మనుషులు సుభిక్షంగా బతకడమే అయితే, అక్కడ వేంగీ సామ్రాజ్యమింకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి.

కాని ఒక చారిత్రిక ప్రదేశంగా మాత్రం అక్కడ ఉన్న ఆనవాళ్ళనీ, ఆ శిథిలాలనీ చూస్తే మటుకు తమ గతం గురించీ, తమ సంస్కృతి గురించీ ఏమీ పట్టని తెలుగుజాతిని చూసి సిగ్గు కలిగింది. సుమారు 500 ఏళ్ళ పాటు రాజధానిగా కొనసాగిన ఏకైక నగరం అది అని చెప్తున్నారు ఈమని శివనాగిరెడ్డి. ఆ రాజ్యానికి సమకాలికంగా వర్ధిల్లిన బాదామి, మహాబలిపురం, కాంచీపురం, శ్రీముఖలింగం వంటి వాటితో పోలిస్తే వేంగి ని చూసి మనమెంత గర్వపడాలి! ఆ క్షేత్రంలో ఎటువంటి స్మృతి స్తంభాలు లేవనెత్తి ఉండాలి! ఏటా ఎటువంటి ఉత్సవాలు జరుగుతుండాలి!

మొదట శాలంకాయనులు, ఆ తర్వాత వేంగీ చాళుక్యులూ ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోక పూర్వం, అది గొప్ప బౌద్ధ క్షేత్రం. దక్షిణభారతదేశంలో ఆంధ్రా అజంతా గుహలుగా పేరుపొందిన గుంటుపల్లి, జీలకర్రగూడెం గుహాలయాలు అక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. వేంగిలో అడుగుపెట్టగానే నన్ను మొదట బౌద్ధ చైత్యాలయ శిథిలాల దగ్గరకే తీసుకువెళ్ళారు.

ఆ బౌద్ధ క్షేత్రంలో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది శాలంకాయనులకి అని అడిగాను శివనాగిరెడ్డిగారిని. ఆయన తెలుగు వాళ్ళ విజ్ఞాన సర్వస్వం. మనం కదపాలే గాని, అసంఖ్యాకమైన విశేషాలు ఆయన్నించి జలజలా రాలిపడతాయి.

'శాతవాహనుల తోనే సముద్ర వాణిజ్యం తగ్గుముఖం పట్టినప్పటికీ, శాలంకాయనులు  సముద్ర వర్తకాన్ని కొనసాగించారు.  వాళ్ళు వస్త్రాల్ని ఎగుమతి చేసేవారు. వారి నాణేలు మయన్మారులోనూ, సయాంలోనూ కూడా దొరికాయి. రేవుపట్టణానికి దగ్గరలోనూ, భూమ్మీద సాగే వాణిజ్యానికి కేంద్రంలోనూ ఉంటుందనే ఉద్దేశ్యంతో వారు వేంగిని ఎంచుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ చాళుక్యులు తమ ప్రతినిధిగా నిలబెట్టిన కుబ్జ విష్ణువర్ధనుడు మొదట్లో పిఠాపురం కేంద్రంగా పాలనసాగించినప్పటికీ, తర్వాత వేంగికే తరలివచ్చేసాడు. అప్పణ్ణుంచీ, తిరిగి రాజరాజ నరేంద్రుడు రాజమండ్రికి రాజధాని తరలించేదాకా, సుమారు అయిదు శతాబ్దాల పాటు వేంగి అంధ్రుల రాజధానిగా విలసిల్లింది' అన్నారాయన.

గోదావరీ, కృష్ణా నదుల మధ్య ప్రాంతానికి కేంద్రంగా వేంగిని ఏ ముహూర్తాన రాజధానిగా ఎంచుకున్నారో గాని, అయిదు శతాబ్దాల పాటు ఆ ఒండ్రుమట్టినేలల మీద ఆధిపత్యం కోసం రాష్ట్రకూటులు, తూర్పుగాంగులు, పశ్చిమ చాళుక్యులు, పల్లవులు, చోళులు ఒకదాని వెనక ఒకటి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఆ యుద్ధాలు కేవలం రాజకీయ సంగ్రామాలు మాత్రమే కాదు. తమదైన భాషని, తమదైన సంస్కృతిని అక్కడ నెలకొల్పాలని చేసిన పోరాటాలు కూడా. ఆ ఆటుపోట్ల మధ్య మధ్యలో కూలిపోతూ, మళ్ళా నిలబడుతూ, తనని తాను సంభాళించుకుంటూ, సంరక్షించుకుంటూ వేంగి సాగించిన చరిత్ర అసామాన్యమైనది. సంస్కృతం, తమిళం, ప్రాకృతం, కన్నడం  అనే మహాభాషల మధ్య తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే స్థానిక ప్రజలు మాట్లాడుకునే తెలుగుని పాలనాభాషగా మార్చుకోక తప్పదని గ్రహించిన వాడు గుణగ విజయాదిత్యుడు. అతడి సేనాని అద్దంకి పండరంగడు వేయించిన శాసనాల్లోని తెలుగు పద్యాలే ఇప్పటికి మనకి లభిస్తున్న తొలి తెలుగు పద్యాలు.

ఆ తర్వాత రాజరాజు కాలానికి వచ్చేటప్పటికి తెలుగుని సాహిత్యభాషగా రూపొందించగలమనే ఆత్మవిశ్వాసం కలిగింది వేంగీ చాళుక్యులకి. దాని ఫలితమే నారాయణభట్టు ప్రోత్సాహంతో మహాభారతానికి నన్నయ చేసిన ఆంధ్రీకరణ. అప్పటికి తెలుగు భాష పటిష్టమైన రాజకీయ శక్తిగా ఎదగగలిగింది. ఆ తర్వాత వెయ్యేళ్ళుగా అప్రతిహతంగా కొనసాగుతున్న తెలుగు సాహిత్యం ప్రపంచంలోని అత్యున్నత సాహిత్యభాషల్లో తెలుగుని కూడా ముందువరసలో నిలబెడుతూ వచ్చింది.

ఆ కాలానికీ, ఆ సంస్కృతికీ, ఆ ఆరంభ దినాలకీ ఇప్పుడక్కడ ఆనవాళ్ళుగా మిగిలినవి ఒక శివాలయమూ, చిత్రరథస్వామిగా పిలవబడే సూర్యుడికోసం నిర్మించిన ఒక చిన్ని దేవాలయమూనూ. 'మధ్యలో శివాలయమూ, చుట్టూ గణపతి, సూర్యుడూ, శక్తి, కుమారస్వామిల దేవాలయాలతో అదొక శివపంచాయతన క్షేత్రం కూడా. శంకరాచార్యుల కన్నా ముందే పంచాయతన సంస్కృతి ఉండేదనడానికి ఆ దేవాలయాలే సాక్ష్యం ' అని కూడా చెప్పారు శివనాగిరెడ్డి.

శివాలయంలో అర్చకులు పూజలు చేసారు. ఎన్ని వేల ఏళ్ళుగా ఆ పార్వతీపరమేశ్వరులు అక్కడ పూజలందుకుంటూ ఉన్నారో. ఆ దేవాలయమే అక్కడ లేకపోయుంటే, ఒకప్పటి వేంగీనగరానికి మరే ఆనవాలూ అక్కడ మిగిలి ఉండేది కాదు కదా అనిపించింది. అక్కడ తవ్వకాల్లో దొరికిన శిల్పాల్ని ఆ దేవాలయ ప్రాంగణంలోనే పెట్టి ఉంచారు. ఆరేడు శతాబ్దాలనుంచి పదకొండో శతాబ్ది మధ్యకాలానికి చెందిన దేవీ దేవతా ప్రతిమలు, ద్వారపాలకులు, మకరతోరణాలు, పూజాపీఠాలు అక్కడ ఎండకి ఎండి వానకి తడుస్తున్నాయి. 'మూజియం కట్టి అందులో పెట్టాలని ఈ విగ్రహాల్ని ఇక్కడే ఉంచేసారు. ఇరవై సెంట్లు భూమి దొరికితే చాలు మూజియం కట్టడం మొదలుపెట్టొచ్చు. ఇరవై సెంట్ల భూమికోసం కలెక్టరుగారికి ఉత్తరం రాసాం. ఇంకా జవాబు రాలేదు ' అన్నాడు ఆలయ ధర్మకర్త నాతో,

ఇరవై సెంట్లు! కటకం నుంచి కాంచీపురం దాకా సేనల్ని నడిపించిన తొలి ఆంధ్ర చక్రవర్తుల అనవాళ్ళని భద్రపరచడానికి ఇవాళ ఇరవై సెంట్లు కూడా దొరకని రోజు వచ్చింది. ఒకప్పుడు ఉజ్జయిని గురించి తలుచుకుంటూ భర్తృహరి చెప్పిన శ్లోకం గుర్తొచ్చింది నాకు:

~

సా రమ్యా నగరీ మహాన్ స నృపతిః, సామంతచక్రం చ తత్
పార్శ్వే తస్య సా చ విదగ్ధ పరిషత్, తాశ్చంద్ర బింబాననా
ఉన్మత్తః స చ రాజపుత్ర నివహః, తే వందినః తాః కథాః
సర్వం యస్య వశాదగాత్ స్మృతి పథం, కాలాయః తస్మై నమః

(ఎంత అందమైన నగరం! ఎంత గొప్ప రాజు! ఆయన చుట్టూ ఎటువంటి సామంత వర్గం! ఇరుగడలా ఎటువంటి పండితులు, ఎంత చక్కటి సుందరాంగులు!
ఎంత ఉన్మత్తులైన రాజపుత్ర సమూహం! వాళ్ళని కీర్తించే కవిగాయకులు, ఆ కథలు! ఇప్పుడన్నీ వట్టి జ్ఞాపకంగా మారిపోయాయి! కాలమా! నీకు నమస్కారము!)

~

విశ్వనాథ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు బహుశా అయనకి ఇరవై అయిదేళ్ళు, ఇరవై ఆరెళ్ళు ఉండవచ్చు. తెలుగు వాళ్ళు ఒకవైపు బ్రిటిషు వాళ్ళ దాస్యంలోనూ, మరొక వైపు పాలనాపరంగా మద్రాసు ఏలుబడిలోనూ ఉన్న కాలం అది. తన పూర్వీకుల చరిత్ర ఒకవైపూ, తామనుభవిస్తున్న దాస్యం మరొక వైపూ విచలితుణ్ణి చేస్తుంటే ఆయన ఎంత వివశుడు కాకపోతే ఇట్లాంటి పద్యాలు రాస్తాడు!

~

ఈ పొదలం చరించుచుం అహీన మహా మహిమనుభావమౌ
నే పురవీథులందొ చరియించుచు నుంటి నటంచు పారతం
త్య్రాపతితుండనయ్యును పురామహదాంధ్రమునన్ స్వతంత్రుడౌ
ఏ పురుషుండనో యనుచు ఈ భ్రమ సత్యముగా తలంచుచున్.

~

కవి తన భ్రమలోనే స్వతంత్రుడు. తన భ్రమవల్లనే స్వతంత్రుడు. కాబట్టే-

~

ఇమ్ముగ కాకుళమ్ము మొదలీవరకుంగల ఆంధ్ర పూర్వ
రాజ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలొ చలించిపోవు ఆ
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవనిర్ణయమేని ఎన్ని జ
న్మమ్ములు కాగ ఈ తనువునన్ ప్రవహించునొ ఆంధ్ర రక్తముల్.

~

ఒకప్పుడు ఈ పద్యాలు తెలుగువాళ్ళని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత ఇవి సాహిత్యంగా మిగిలిపోయాయి. నువ్వూ, నీ జాతీ, నీ ప్రాంతమూ అనే సంకుచిత భావాలకు నువ్వు దూరంగా జరగాలనే మెలకువ కలిగిన తర్వాత ఈ పద్యాల నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. కాని, ఇవి జాతికీ, జాతి స్వాతంత్య్రానికీ సంబంధించిన పద్యాలు కావు. ఒక మనిషి భావనాబలానికీ,అతడి ఉద్వేగప్రాబల్యానికీ సంబంధించిన  పద్యాలు. ఒక చెట్టుగాని, ఒక పుట్టగాని, ఒక జెండాగాని, ఒక న్యాయంగాని, ఒక అన్యాయం గాని నీలో ఇటువంటి స్పందన రేకెత్తించగలిగితే చాలు, నువ్వు మనిషిగా పుట్టినందుకు, భాష నేర్చుకున్నందుకు, నీ జన్మ సార్థకం.

~

ఇది వినిపింతు నంచు మదినెంచెద మిత్రులకున్, గళస్థ గా
ద్గదికము, లోచనాంత బహుధాస్రుత బాష్ప నదమ్ము, స్పందనా
స్పద హృదయమ్ము, నా పనికి జాలక చేసెడు, నన్ను నింతగా
నెద పదిలించుకున్న, దిది యెక్కడి పూర్వజన్మ వాసనో!

(మిత్రులకి ఇది వినిపిద్దామనుకుంటాను, కాని గొంతు బొంగురుపోతుంది. కళ్ళకొసలనుండి ఆగకుండా ఒకటే కన్నీరు ధారలు కడుతుంది. అదేపనిగా కంపిస్తున్న హృదయం నాకు మాట పెగలకుండా అడ్డుపడుతుంటుంది. నా హృదయంలో ఇంతగా తిష్టవేసుకున్న ఈ భావనాసంస్కారం ఏ పూర్వజన్మనుంచీ మోసుకొస్తున్న వాసననో కదా!)

~

ఒకప్పుడు హ్యూయెన్ త్సాంగ్ ఇక్కడికి వచ్చాడట. నాకెందుకో వేంగి అన్నప్పుడలా చాంగాన్ తలపులో మెదులుతుంది. ఒకప్పటి ప్రాచీన తాంగ్ సామ్రాజ్యపు రాజధాని చాంగాన్ మీద దు-ఫూ, లి-బాయి లాంటి కవులు చెప్పిన కవిత్వం గుర్తొస్తుంది. వేంగిలో చిత్రరథస్వామి గుడి దగ్గర నిల్చునేటప్పటికి ఆకాశమంతా కారుమబ్బుల పందిరి పరిచింది. చూస్తూండగానే ఒక మహావర్షం మమ్మల్ని నిలువునా ముంచెత్తింది. చాంగాన్ ని తలుచుకున్న దు-ఫూ లాగా వేంగిపైన నేను కూడా ఒక కవిత చెప్పకుండా ఉండలేకపోయాను.

~

వేంగీ క్షేత్రం మీద మహావర్షం
____________________

ఒక మహాసామ్రాజ్యానికి ఆనవాళ్ళుగా
ఇప్పుడక్కడ కొన్ని భగ్నప్రతిమలు.
ఒరిగిపోతున్న చరిత్ర జయస్తంభాన్ని
నా పూర్వకవి ఒక పద్యంతో నిలబెట్టాడు.

పద్యం పలకలేని కవిని నేను
నా బదులు ఆకాశం కరిగినీరయ్యింది

Saturday, July 4, 2020

సామెతల్లో ఆయుర్వేదం!

సామెతల్లో ఆయుర్వేదం!
.
"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
.
పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !
.
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
.
"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట
.
 వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..
.
అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే  ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "
.
పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే  గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...
.
వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "
.
కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత
.
ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "
.
అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...
.
 ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !

భాషను చంపితే సంస్కృతి చస్తుంది!
జాతి జీవనాడి నశిస్తుంది!

Wednesday, July 1, 2020

ఆషాడ మేఘాలు - వాడ్రేవు చినవీరభద్రుడు

జూలై రోజులు మొదలయ్యాయి. ఎన్ని ఆషాడ మేఘాలో నా హృదయాన్ని కమ్ముకుంటున్నాయి. కాని, ఇవాళ నేను నా కవిత్వాన్నే తలుచుకోవాలనుకుంటున్నాను. 'పునర్యానం' లో ఒక సర్గ మొత్తం పది కవితలు ఆషాడమేఘం మీదనే రాసుకోకుండా ఉండలేకపోయాను.

~

తొలి ఆషాడమేఘానిదొక వింత ఉయ్యెల
ఎంతదూరం పాటు ఎందరిని ఊగించిందని.
తొలకరివేళల కాంతిని చిత్రించడానికి
వెతికానొక కాన్వాసు కోసం నేనూ ఎన్నాళ్ళో.

గిరిశిఖరసానువు మీద, అడవి మద్దెలల సంగీతానికి
పురివిప్పిందొక నెమలి, రూపెత్తిన ఆషాడ జలద
కంఠం నుంచి వెన్నుదాకా అదొక నీలి తరగ
విప్పారిన పింఛంలో అడవుల ఆకుపచ్చ, దాగిన శ్రావణ శోభ
తొంగిచూసే సూర్యనేత్రం, విరబూసే విద్యున్మాల.

నెమలిని చూస్తూనే ఉన్నావనుకో
ఎవరో నీ

రు
వు
ని
తీసేసుకుంటారు.

~

మామూలుగా కవులకి ఆషాడం ప్రియస్మృతుల్ని గుర్తుచేస్తుంది. నాకు నా బాల్యాన్ని. ఈ కవిత చూడండి, నాకెంతో ఇష్టమైన కవిత.

~

చిన్నప్పుడు ఆ రేగుచెట్టు కింద నీకు తలంటి
నీళ్ళు పోసింది అమ్మ, గుర్తుందా
అప్పుడు నీవెంత మారాం చేసావని.
తొలి వానచినుకులు తనని తాకగానే
చూడు, పృథ్వి తీస్తున్న వేడి శ్వాసలు
మారాం చేస్తున్నావింకా
మొదలయ్యిందింతలో అభ్యంగన స్నానం

ముందు కళ్ళెత్తి తేరిపారచూసావు, అప్పుడు రెండు చేతుల్తో కళ్ళు మూసుకుని
తలదాల్చావు మీద పడుతున్న స్నానజలాల్ని
పరిశుభ్రపడుతున్నావనుకున్నావేమో
ఇక వదిలేస్తావా చేతుల్ని కూడా
వళ్ళంతా ఒకటే ధారలు
అప్పుడు తల తుడిచింది, చెదిరాయి నీటితుకునకలు చుట్టూ
కళ్ళు కొద్దిగా ఎరుపెక్కాయి.

'ఒక ఉప్పు రాయి నోట్లో వేసుకో, తగ్గుతుంద'న్నారెవరో
వానవెలిసిన లోకంలాగా మహరాజులా ఉన్నావందమ్మ.

~

ఆషాడం ప్రవేశించిన అవనిని చిత్రించడం చాలా కష్టం. అందుకనే జూలైని పాడిన కవులున్నారు, గాయకులున్నారు, కాని చిత్రించిన చిత్రకారులే లేరు. నేను కుంచెతో కాక మాటల్తో చిత్రించగలనేమో చూతామనుకున్నాను:

~

చిత్రకారుడు ఆకాశాన్ని చిత్రించాలని నీలాన్నీ, అడవిని చిత్రించాలని ఆకుపచ్చనీ పరుచుకున్నాడు
నేల సొగసులు మరీ మరీ దిద్దాలని పచ్చికల పసుపు,
మృత్తికల ఎరుపు జతపరుచుకున్నాడు.
ఎక్కణ్ణుంచి మొదలెట్టేదా రేఖల విన్యాసమని చూస్తూండగానే వేసవిగడిచిపోయింది.

లేత రంగుల్లో ముదురు వర్ణాన్ని కలుపుతుండగా
కుంచె చెదిరి పడిందొక నీటి చుక్క.

చిత్రపటం ఊహ చెదురుతుందని అదాటుగా
ఆ కుంచె నట్లే విదిలించాడా
మరింత నీలం మరింత హరితం కలిసి మరింత ముదురెక్కింది
ఆగలేని చిత్రకారుడు కలిపేసాడా రంగులన్నీ,
ఆకాశాన్ని అవనితో
అవనిని అడవితో,
అడవిని మబ్బుతో,
మబ్బుని మెరుపుతో,
మెరుపుని
చినుకుతో.

అంతా ఇప్పుడొకటే రంగు, ఆగని ముసురు పొంగు.

తమాషా చూసి చప్పట్లు కొట్టినట్టు
ఆ రాత్రంతా చెరువులో కప్పల బెక బెక.

~

'నీటి రంగుల చిత్రం' కవితల్లో ఆషాడం మరింత ప్రస్ఫుటం, ఆ సంపుటంలోంచి ఒకటి రెండు కవితలు:

~

ఆషాడ ప్రథమ దివసం, మరొకసారి నా
జీవితాకాశం మీద మేఘ సాక్షాత్కారం
ఆశ, ఆశీర్వాదం, ప్రేమతో తడిసిన
పలకరింపు, తెరతీసిన పులకరింత.

పూర్తిగా ఎండి నెర్రెలు విచ్చిన వేళ, ఏ
దూర సముద్రాలమీంచో శుభలేఖ
ఏ శాపవశాన్నో అస్తంగమిత మహిమతో
నిల్చున్నాను నేనిక్కడ, నేడొక ప్రవాసిగా

ఏ కొండల మీద, ఏ సాంధ్యరాగ ఛాయల్లో
నేను నా ప్రియసన్నిధిని పోగొట్టుకున్నానో-
జీవితమిప్పుడు విస్మృతమూర్ఛన, మాటలు
ఎండి పెళుసుబారి తునుగుతున్న విషాదం.

పురాతన మందాక్రాంత వృత్తంలాగా,
ప్రయాణించు మేఘమా, ప్రయాణించు
చీకటిదారిన లాంతరు పట్టుకు నడిచినట్టు
నువ్వు కదిలినంతమేరా వెలుతురు వాన.

~

'పునర్యానం'లో ఆషాడానిది బాల్యం. 'నీటిరంగుల చిత్రం'లో ఆషాడానిది యవ్వనం. ఈ కవిత చూడండి:

~

పాలుగారే పసిదేహంలోకి యవ్వనం ప్రవేశించినట్టు
ఆకాశమంతా నల్లమబ్బు. అకస్మాత్తుగా బాల్యమొక
జ్ఞాపకంగా మారిపోయినట్టు, నీలో ఏదో కలవరం.
దిక్కులు దగ్గరగా జరీగినట్టొక ఉక్కిరిబిక్కిరి.

గుర్తుందా, మేడ మీద ఆ రాత్రి, ఆకాశపు ఈ
కొసనుంచి ఆ కొసకి వెండికావడి మోసిన వెలుగు.
వెలుతురొక్కటే అప్పుడు మనకి తెలిసిన భాష
ఇప్పుడు కొంత మెరుపు, చుట్టూ చల్లని నీడ.

ఆడుకున్నంత ఆడుకున్నాక పిల్లవాడు
మిగిలిన సెలవులు లెక్కపెట్టుకున్నట్టొక ఆతృత.
సుప్తబీజం సూర్యకాంతిని కలగన్నట్టు, ఇప్పుడు
సముద్రమొక మేఘంగా నిన్ను స్వప్నిస్తున్నది.

~

ఇంకొక కవిత కూడా వినిపించాలని మనసు ప్రలోభపడుతున్నది:

~

ఈ నిప్పునెవరు ఎప్పుడు రగిలించారో, శీతల
మేఘాలింకా ఎగసనదోస్తున్నాయి, ఇన్నాళ్ళూ
కోకిల పాడిన దుఃఖం ఆకాశమెలా భరించిందో
దిక్కులన్నీ ఇప్పుడు కరిగి నీరై కురుస్తున్నాయి.

ఆకాశమంతా మబ్బు కమ్మినప్పుడు నీకేం చేయాలో
తెలియదు. రాత్రంతా నీ కిటికీ దగ్గర నిలబడి
కోకిల అరుస్తూనే ఉంది. అది నీ నిద్రలో చొరబడి
కలలు తుంచేస్తుంటే నీకేం చేయాలో తెలియదు.

ఈ విచిత్రమైన ఋతువు ప్రతి ఒక్కరికీ ఒక
పిలుపు పట్టుకొస్తుంది. తూనీగలకు పచ్చిక
రైతుకి పొలం, పిల్లలకి బడి, ఒక్క కవిని మాత్రమే
సోమరిగా కూచోబెట్టి ఆకాశాన్ని కానుక చేస్తుంది.

ఈ కానుకనేం చేసుకోవాలో నీకిప్పటికీ తెలియదు.
ఒదులుకోలేని ఇష్టంతో నీ ముందొక స్త్రీ నిల్చుంటే
నీకేం మాట్లాడాలో తెలియదు. ఏది వక్షఃస్థలమో
ఏది హృదయమో నీకిప్పటికీ తేడా తెలియదు.

Total Pageviews