Monday, July 27, 2020

ఏ ఘట్టంబున నైన కోపమను మాటే లేని శాంతమ్ము వా చాఘర్షస్థితినైన .....

నేను ఫోర్త్ ఫాం లో ఉన్నప్పుడు యం యల్ నరసింహారావు గారని మా స్కూల్లో ఒక సెకండరీ గ్రేడ్ మాస్టారు వచ్చారు. ఆయన లోయర్ ఫాంస్- అంటే ఫస్ట్, సెకండ్, ధర్డ్ ఫాంస్ కి మాత్రమే పాఠాలు చెప్పాలి. హయ్యర్ ఫాంస్ - అంటే ఫోర్త్, ఫిఫ్త్, యస్ యస్ యల్ సి లకి చెప్పరాదు.కాని ఆయన ఫోర్త్ ఫాం స్పెషల్ తెలుగు, కాంపోజిట్ మ్యాథ్స్ గూడా చెప్పేవారు. ఆ సబ్జెక్ట్స్ లో అంత పట్టు ఉండేది ఆయనకి. పొట్టిగా ఉండేవారు. స్పోర్ట్స్ ఆక పోయినా స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ గా ఉండేవారు.
మేమంతా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం.
ఓ రోజు ఒకాయన వచ్చి బైటివాళ్ళు ఆడుకోడానికి నెట్టూ, బాల్సూ అడిగారు. స్కూల్ ప్రాపర్టీ బైటికి యివ్వడం మాష్టారికి యిష్టంలేదు. నెట్ లేదనిచెప్పారు. ఆ సంగతి తెలీని మేము ఉందని చెప్పాం. ఆయన యిరుకున బడ్డారు. చేసేది లేక నెట్, బాల్స్ యిచ్చి పంపించి ఆయన వెళ్ళాక మామీద బాగా కోప్పడ్డారు. వెంటనే యీపద్యం బోర్డ్ మీద రాసి వెళ్ళి పోయారు. ఆ పద్యం యిది.

ఏ ఘట్టంబున నైన కోపమను మాటే లేని శాంతమ్ము వా
చాఘర్షస్థితినైన .....

ఇంతవరకే గుర్తుంది.
ఎందుకో ఇన్నేళ్ళ తరవాత అది గుర్తొచ్చి ఆపద్యం మిగతాది పూరించి ఆయనకే అంకితం ఇస్తున్నాను.

శార్దూలం
ఏ ఘట్టంబున నైన కోపమను మాటేలేని శాంతంబు వా
చాఘర్షస్థితి నైన నోటను నవాచ్యం బైన వాక్యంబు నై
దాఘౌష్ణ్యమ్ము మనస్సునందు బొడమం దావీక యుష్మన్మహా
మోఘాశీర్వచనమ్మునన్ మనుచు మమ్మున్ నారసింహా గురూ!

భావం: ఎప్పుడూ కోపంలేని శాంతం, ఏదైనా గొడవ పడేటప్పుడు గూడా అనరాని మాటలు నోట రానీక, వేసవికాలపువేడి( అంత ఔద్ధత్యం) మనసులో ప్రవేశించకుండా , ఓ గురువు గారూ! మమ్మల్ని ఆశీర్వదించండి

No comments:

Post a Comment

Total Pageviews