Wednesday, July 1, 2020

ఆషాడ మేఘాలు - వాడ్రేవు చినవీరభద్రుడు

జూలై రోజులు మొదలయ్యాయి. ఎన్ని ఆషాడ మేఘాలో నా హృదయాన్ని కమ్ముకుంటున్నాయి. కాని, ఇవాళ నేను నా కవిత్వాన్నే తలుచుకోవాలనుకుంటున్నాను. 'పునర్యానం' లో ఒక సర్గ మొత్తం పది కవితలు ఆషాడమేఘం మీదనే రాసుకోకుండా ఉండలేకపోయాను.

~

తొలి ఆషాడమేఘానిదొక వింత ఉయ్యెల
ఎంతదూరం పాటు ఎందరిని ఊగించిందని.
తొలకరివేళల కాంతిని చిత్రించడానికి
వెతికానొక కాన్వాసు కోసం నేనూ ఎన్నాళ్ళో.

గిరిశిఖరసానువు మీద, అడవి మద్దెలల సంగీతానికి
పురివిప్పిందొక నెమలి, రూపెత్తిన ఆషాడ జలద
కంఠం నుంచి వెన్నుదాకా అదొక నీలి తరగ
విప్పారిన పింఛంలో అడవుల ఆకుపచ్చ, దాగిన శ్రావణ శోభ
తొంగిచూసే సూర్యనేత్రం, విరబూసే విద్యున్మాల.

నెమలిని చూస్తూనే ఉన్నావనుకో
ఎవరో నీ

రు
వు
ని
తీసేసుకుంటారు.

~

మామూలుగా కవులకి ఆషాడం ప్రియస్మృతుల్ని గుర్తుచేస్తుంది. నాకు నా బాల్యాన్ని. ఈ కవిత చూడండి, నాకెంతో ఇష్టమైన కవిత.

~

చిన్నప్పుడు ఆ రేగుచెట్టు కింద నీకు తలంటి
నీళ్ళు పోసింది అమ్మ, గుర్తుందా
అప్పుడు నీవెంత మారాం చేసావని.
తొలి వానచినుకులు తనని తాకగానే
చూడు, పృథ్వి తీస్తున్న వేడి శ్వాసలు
మారాం చేస్తున్నావింకా
మొదలయ్యిందింతలో అభ్యంగన స్నానం

ముందు కళ్ళెత్తి తేరిపారచూసావు, అప్పుడు రెండు చేతుల్తో కళ్ళు మూసుకుని
తలదాల్చావు మీద పడుతున్న స్నానజలాల్ని
పరిశుభ్రపడుతున్నావనుకున్నావేమో
ఇక వదిలేస్తావా చేతుల్ని కూడా
వళ్ళంతా ఒకటే ధారలు
అప్పుడు తల తుడిచింది, చెదిరాయి నీటితుకునకలు చుట్టూ
కళ్ళు కొద్దిగా ఎరుపెక్కాయి.

'ఒక ఉప్పు రాయి నోట్లో వేసుకో, తగ్గుతుంద'న్నారెవరో
వానవెలిసిన లోకంలాగా మహరాజులా ఉన్నావందమ్మ.

~

ఆషాడం ప్రవేశించిన అవనిని చిత్రించడం చాలా కష్టం. అందుకనే జూలైని పాడిన కవులున్నారు, గాయకులున్నారు, కాని చిత్రించిన చిత్రకారులే లేరు. నేను కుంచెతో కాక మాటల్తో చిత్రించగలనేమో చూతామనుకున్నాను:

~

చిత్రకారుడు ఆకాశాన్ని చిత్రించాలని నీలాన్నీ, అడవిని చిత్రించాలని ఆకుపచ్చనీ పరుచుకున్నాడు
నేల సొగసులు మరీ మరీ దిద్దాలని పచ్చికల పసుపు,
మృత్తికల ఎరుపు జతపరుచుకున్నాడు.
ఎక్కణ్ణుంచి మొదలెట్టేదా రేఖల విన్యాసమని చూస్తూండగానే వేసవిగడిచిపోయింది.

లేత రంగుల్లో ముదురు వర్ణాన్ని కలుపుతుండగా
కుంచె చెదిరి పడిందొక నీటి చుక్క.

చిత్రపటం ఊహ చెదురుతుందని అదాటుగా
ఆ కుంచె నట్లే విదిలించాడా
మరింత నీలం మరింత హరితం కలిసి మరింత ముదురెక్కింది
ఆగలేని చిత్రకారుడు కలిపేసాడా రంగులన్నీ,
ఆకాశాన్ని అవనితో
అవనిని అడవితో,
అడవిని మబ్బుతో,
మబ్బుని మెరుపుతో,
మెరుపుని
చినుకుతో.

అంతా ఇప్పుడొకటే రంగు, ఆగని ముసురు పొంగు.

తమాషా చూసి చప్పట్లు కొట్టినట్టు
ఆ రాత్రంతా చెరువులో కప్పల బెక బెక.

~

'నీటి రంగుల చిత్రం' కవితల్లో ఆషాడం మరింత ప్రస్ఫుటం, ఆ సంపుటంలోంచి ఒకటి రెండు కవితలు:

~

ఆషాడ ప్రథమ దివసం, మరొకసారి నా
జీవితాకాశం మీద మేఘ సాక్షాత్కారం
ఆశ, ఆశీర్వాదం, ప్రేమతో తడిసిన
పలకరింపు, తెరతీసిన పులకరింత.

పూర్తిగా ఎండి నెర్రెలు విచ్చిన వేళ, ఏ
దూర సముద్రాలమీంచో శుభలేఖ
ఏ శాపవశాన్నో అస్తంగమిత మహిమతో
నిల్చున్నాను నేనిక్కడ, నేడొక ప్రవాసిగా

ఏ కొండల మీద, ఏ సాంధ్యరాగ ఛాయల్లో
నేను నా ప్రియసన్నిధిని పోగొట్టుకున్నానో-
జీవితమిప్పుడు విస్మృతమూర్ఛన, మాటలు
ఎండి పెళుసుబారి తునుగుతున్న విషాదం.

పురాతన మందాక్రాంత వృత్తంలాగా,
ప్రయాణించు మేఘమా, ప్రయాణించు
చీకటిదారిన లాంతరు పట్టుకు నడిచినట్టు
నువ్వు కదిలినంతమేరా వెలుతురు వాన.

~

'పునర్యానం'లో ఆషాడానిది బాల్యం. 'నీటిరంగుల చిత్రం'లో ఆషాడానిది యవ్వనం. ఈ కవిత చూడండి:

~

పాలుగారే పసిదేహంలోకి యవ్వనం ప్రవేశించినట్టు
ఆకాశమంతా నల్లమబ్బు. అకస్మాత్తుగా బాల్యమొక
జ్ఞాపకంగా మారిపోయినట్టు, నీలో ఏదో కలవరం.
దిక్కులు దగ్గరగా జరీగినట్టొక ఉక్కిరిబిక్కిరి.

గుర్తుందా, మేడ మీద ఆ రాత్రి, ఆకాశపు ఈ
కొసనుంచి ఆ కొసకి వెండికావడి మోసిన వెలుగు.
వెలుతురొక్కటే అప్పుడు మనకి తెలిసిన భాష
ఇప్పుడు కొంత మెరుపు, చుట్టూ చల్లని నీడ.

ఆడుకున్నంత ఆడుకున్నాక పిల్లవాడు
మిగిలిన సెలవులు లెక్కపెట్టుకున్నట్టొక ఆతృత.
సుప్తబీజం సూర్యకాంతిని కలగన్నట్టు, ఇప్పుడు
సముద్రమొక మేఘంగా నిన్ను స్వప్నిస్తున్నది.

~

ఇంకొక కవిత కూడా వినిపించాలని మనసు ప్రలోభపడుతున్నది:

~

ఈ నిప్పునెవరు ఎప్పుడు రగిలించారో, శీతల
మేఘాలింకా ఎగసనదోస్తున్నాయి, ఇన్నాళ్ళూ
కోకిల పాడిన దుఃఖం ఆకాశమెలా భరించిందో
దిక్కులన్నీ ఇప్పుడు కరిగి నీరై కురుస్తున్నాయి.

ఆకాశమంతా మబ్బు కమ్మినప్పుడు నీకేం చేయాలో
తెలియదు. రాత్రంతా నీ కిటికీ దగ్గర నిలబడి
కోకిల అరుస్తూనే ఉంది. అది నీ నిద్రలో చొరబడి
కలలు తుంచేస్తుంటే నీకేం చేయాలో తెలియదు.

ఈ విచిత్రమైన ఋతువు ప్రతి ఒక్కరికీ ఒక
పిలుపు పట్టుకొస్తుంది. తూనీగలకు పచ్చిక
రైతుకి పొలం, పిల్లలకి బడి, ఒక్క కవిని మాత్రమే
సోమరిగా కూచోబెట్టి ఆకాశాన్ని కానుక చేస్తుంది.

ఈ కానుకనేం చేసుకోవాలో నీకిప్పటికీ తెలియదు.
ఒదులుకోలేని ఇష్టంతో నీ ముందొక స్త్రీ నిల్చుంటే
నీకేం మాట్లాడాలో తెలియదు. ఏది వక్షఃస్థలమో
ఏది హృదయమో నీకిప్పటికీ తేడా తెలియదు.

No comments:

Post a Comment

Total Pageviews