Tuesday, March 30, 2021

 “Die Empty”


పెద్ద నీతితో కూడిన ఈ  చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు. 

ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.


టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్న వేస్తాడు.


‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.

‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.


అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.


‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం.. ఎందుకంటే..' అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.


‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢంగా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి.’


డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి. ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die Empty” అనే  పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.


ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట..

‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.’


నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:


‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.   

‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.

‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.

‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.

‘ప్రేమను పంచండి, మీలోనే  దాచుకుని వృధా చేయకండి.’


వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలో ఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం! అప్పుడు హాయిగా.. ప్రశాంతంగా... 

“Let Us Die Empty...”

 రసజ్ఞ మానసులందరికీ సరస సాయంత్ర సుమాంజలి 

భాషా సాహిత్యాల ప్రయోజనం ఎందుకు? ఏమిటి? 

నవరసాల సారం గ్రహించడానికి 

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

ఎంత చదువుకున్నా, రసఙ్ఞత ఉండాలయ్యా. అది లేనప్పుడు ఎంత చదువుకున్నా ఆ చదువు వ్యర్ధం. రసాప్వాదన చేసే మనసు ఉండాలి. లేనప్పుడు ఎంత చదివీ ఏం లాభం? నలపాకంలాగ ఎంత మంచి కూర ఘుమఘుమలాడేలా చెయ్యి, కాని దానికి రుచిని తెచ్చే ఉప్పు లేకపోతె, ఆ కూరకి మరి రుచేం ఉంటుంది చెప్పు భాస్కరా? "ఇంచుక" అన్న పదంలోనూ, ఈ రసజ్ఞతని ఉప్పుతో పోల్చడంలోనూ ఉంది. అంటే రసజ్ఞత కూడా తగిన పాళ్ళల్లోనే ఉండాలి. రసం లేని జీవనం నీరసమే 

సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! 

ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. 

మడిసన్నాక కుసంత కలాపోస నుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది? 

డబ్బుకోసం ఎంతకైనా తెగించే కరడు కట్టిన కాంట్రాక్టర్‌ పాత్రచేత స్వర్గీయ ముళ్లపూడి వారు ముత్యాలముగ్గులో అనిపించిన డైలాగ్‌ 

అప్పటికీ ఇప్పటికీ నిత్యనూతనం. 

అందుకే మహా కవి కాళీదాసు 

"ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా

విలిఖితాని సహే చతురానన !

అరసికేషు కవిత్వ నివేదనం

శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ !!

ఓ బ్రహ్మ దేవుడా ! ఎన్ని కష్టాలయినా నా నుదుటన రాయి. భరిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం ముమ్మాటికీ రాయవద్దయ్యా. అని ఇలా వాపోయాడు.

సరి సర్లేవో సత్యసాయి పాయింటుకు రా పాయింటుకు రా అంటారా? 

రసజ్ఞ మానసులందరికీ సరస సుమాంజలి అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్ర" లోని ఈ క్రింది పద్యం ఆస్వాదించ మనవి  

ప్రవరునిచే త్రోసివేయబడిన వరూధిని రోదించుట:

తనను కౌగిలించుకోబోయిన వరూధినిని ప్రవరుడు త్రోసివేసినపుడు అప్పుడు ఆ సుందరి ఇలా అంటున్నది.

పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని

చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య

ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో

మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్‌ !

అర్థములు:  పాటునకు = దెబ్బకు (త్రోయబడుటకు); ఇంతులు = స్త్రీలు; ఓర్తురె = సహింతురా; కృపారహితాత్మక = దయలేని మనసు కలవాడా; త్రోవన్ = త్రోయగా; ఇచ్చోట = ఈ స్థానములో; భవన్ = నీయొక్క; నఖాంకురము = కొనగోరు; సోకెన్ = తగిలెను; కనుంగొనుము = చూడుము; అ ప్పాటలగంధి = పాటలపుష్పముల తావి వంటి సువాసన లీను మేనుగల ఆ రమణి; వేదన నెపం బిడి = బాధ(నొప్పి) అనే సాకు కల్పించుకొని; కలస్వనంబుతో = అవ్యక్తమధురమైన ధ్వనితో; మీటిన = కొనగోటితో తాకినమాత్రమున; విచ్చు = పగులు; గుబ్బ = గుండ్రని; చనుమిట్టలన్ = గబ్బిగుబ్బలపై, స్తనములపై; అశ్రులు = కన్నీరు; చిందువందగన్ = చిందుతుండగా.  

భావము:  "ఓ నిర్దయుడైన బ్రాహ్మణుడా!  సుకుమారులైన లలనలు దెబ్బలను సహింపగలుగుదురా?  నీవు త్రోసివేసినపుడు నీయొక్క గోరు నాకు ఈ ప్రదేశములో తగిలినది.  కావాలంటే చూడుము" అని తన చనుకట్టు ప్రదేశమును చూపించి, నొప్పి కలుగుతున్నదనే వంకతో, తన ఉన్నతవక్షోజములపై కన్నీరు చిందుతుండగా, మధురమైన కలస్వనముతో ఏడ్చినది. 

పద్యములో పెద్దనగారు "ఇచ్చోట" అనే పదమును వాడినారుకాని, నిర్దిష్టముగా ఎక్కడో చెప్పలేదు.  సందర్భమునుబట్టి  ఆమె తన స్తనములనే చూపివుంటుందని మనం ఊహింపవచ్చును.  ఆవిధంగానైనా అతడిని రెచ్చగొట్టుటకు చేసిన మరో ప్రయత్నం అది!  "వేదన నెపం బిడి యేడ్చె" అన్నారు కవీంద్రులు.  అనగా, నిజముగా ఆమెకు నొప్పి కలగలేదు; అది ఒక మిష మాత్రమే!  "మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టలన్" అని అన్నారు.  అంటే,  ఆమె వక్షోజములు అంత బిగువుగా ఉన్నవని అర్థం!

అదీ మన మహా కవుల చాతుర్యం మన సాహితీ రసజగత్తు మహత్వం.



 *త్వరలో అంతరించబోతున్న పాత తరం... 😢🙏*


        రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.

             అవును ఇది ఒక చేదు నిజం ।

ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.  

రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !

ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !

నడక అలవాటు ఉన్నవాళ్ళు! 

మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు

 ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !

ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! 

మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!

 పూజకు పూలు కోసే వాళ్ళు !

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !

మడిగా వంట వండేవాళ్ళు !

దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! 

దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !

దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!

మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!

 అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! 

కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !

స్నేహంగా మెలిగే వాళ్ళు!

తోచిన సాయం చేసేవాళ్ళు !

చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !

ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !

ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !

పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! 

ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!

కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !

సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !

పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! 

తీర్థయాత్రలు చేసేవాళ్ళు !

ఆచారాలు పాటించే వాళ్ళు !

తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !

పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !

చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !

లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !

చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!

అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !  

వాళ్ళు ....

తలకు నూనె రాసుకునే వాళ్ళు !

జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !

కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !

చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....

.

ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు

మీకు తెలుసా ?

వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి 

.లేదంటే .....

.లేదంటే .....  

.లేదంటే .....

ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.

.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...

సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!

 స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!

 ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం

ద్వేషం, మోసం లేని స్నేహ  జీవనం గడిపిన తరం అది!

సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే

 

లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊

 తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం

.

వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది 

మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..


*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!*


తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే

సర్కారు చేసే  చట్టాలు కాదు....🙏


*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔*


.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, March 27, 2021

చిన్నవీరభద్రుడా వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు

 ఈ రోజు ఎంత ప్రియమైన రోజు 

నునులేత సుప్రభాత వేళ 

కలల్లోంచి మెలకువ లోకి వస్తున్నపుడు 

పొద్దున్నే కురిసిన వసంత వానలో 

తడిసే స్వాప్నికుడు 

పాలుగారే ప్రపంచం చుట్టూ ఉన్నా 

ఇంకా పాలకోసం గుక్కపెట్టే నవ శైశవ జీవనం 

తాను తిరిగిన దారుల్లో దర్శించిన అనుభూతులను 

రాతైనా గీతైనా సృజించి దర్శించడం

నీటి రంగుల చిత్రాల మేటి చిత్రకారుడా 

ఆ మధ్యాహ్నం అడ్డతీగల అడవుల్లో 

మబ్బుల మాటలు వినగల మొనగాడా 

గోరంత గొంతుతో 

అదొక పులకింతగా 

భువనమోహన నిశ్శబ్ధాన్ని 

భగ్నం చెయ్యగల వీరభద్రుడా 

వయసు పెరిగేకొద్ది చిన్నవాడుగా 

నిండుగా పూసిన మామిడి చెట్టు ఎదట మరింత పసివాడిగా 

వసివాడని సాహితీ కుసుమాలను పండించే కృషీవలా  

మా మామూలు వీధుల్లొ మామూలు ఉదయాల్లో 

ఆకుపచ్చ జీవకాంతులు అందించు 

వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు 

వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు 

వెయ్యేళ్ళు జీవించు మమ్మల్ని జీవింపచేసేందుకు 

Total Pageviews