Tuesday, March 30, 2021

 రసజ్ఞ మానసులందరికీ సరస సాయంత్ర సుమాంజలి 

భాషా సాహిత్యాల ప్రయోజనం ఎందుకు? ఏమిటి? 

నవరసాల సారం గ్రహించడానికి 

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

ఎంత చదువుకున్నా, రసఙ్ఞత ఉండాలయ్యా. అది లేనప్పుడు ఎంత చదువుకున్నా ఆ చదువు వ్యర్ధం. రసాప్వాదన చేసే మనసు ఉండాలి. లేనప్పుడు ఎంత చదివీ ఏం లాభం? నలపాకంలాగ ఎంత మంచి కూర ఘుమఘుమలాడేలా చెయ్యి, కాని దానికి రుచిని తెచ్చే ఉప్పు లేకపోతె, ఆ కూరకి మరి రుచేం ఉంటుంది చెప్పు భాస్కరా? "ఇంచుక" అన్న పదంలోనూ, ఈ రసజ్ఞతని ఉప్పుతో పోల్చడంలోనూ ఉంది. అంటే రసజ్ఞత కూడా తగిన పాళ్ళల్లోనే ఉండాలి. రసం లేని జీవనం నీరసమే 

సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! 

ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. 

మడిసన్నాక కుసంత కలాపోస నుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది? 

డబ్బుకోసం ఎంతకైనా తెగించే కరడు కట్టిన కాంట్రాక్టర్‌ పాత్రచేత స్వర్గీయ ముళ్లపూడి వారు ముత్యాలముగ్గులో అనిపించిన డైలాగ్‌ 

అప్పటికీ ఇప్పటికీ నిత్యనూతనం. 

అందుకే మహా కవి కాళీదాసు 

"ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా

విలిఖితాని సహే చతురానన !

అరసికేషు కవిత్వ నివేదనం

శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ !!

ఓ బ్రహ్మ దేవుడా ! ఎన్ని కష్టాలయినా నా నుదుటన రాయి. భరిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం ముమ్మాటికీ రాయవద్దయ్యా. అని ఇలా వాపోయాడు.

సరి సర్లేవో సత్యసాయి పాయింటుకు రా పాయింటుకు రా అంటారా? 

రసజ్ఞ మానసులందరికీ సరస సుమాంజలి అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్ర" లోని ఈ క్రింది పద్యం ఆస్వాదించ మనవి  

ప్రవరునిచే త్రోసివేయబడిన వరూధిని రోదించుట:

తనను కౌగిలించుకోబోయిన వరూధినిని ప్రవరుడు త్రోసివేసినపుడు అప్పుడు ఆ సుందరి ఇలా అంటున్నది.

పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని

చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య

ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో

మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్‌ !

అర్థములు:  పాటునకు = దెబ్బకు (త్రోయబడుటకు); ఇంతులు = స్త్రీలు; ఓర్తురె = సహింతురా; కృపారహితాత్మక = దయలేని మనసు కలవాడా; త్రోవన్ = త్రోయగా; ఇచ్చోట = ఈ స్థానములో; భవన్ = నీయొక్క; నఖాంకురము = కొనగోరు; సోకెన్ = తగిలెను; కనుంగొనుము = చూడుము; అ ప్పాటలగంధి = పాటలపుష్పముల తావి వంటి సువాసన లీను మేనుగల ఆ రమణి; వేదన నెపం బిడి = బాధ(నొప్పి) అనే సాకు కల్పించుకొని; కలస్వనంబుతో = అవ్యక్తమధురమైన ధ్వనితో; మీటిన = కొనగోటితో తాకినమాత్రమున; విచ్చు = పగులు; గుబ్బ = గుండ్రని; చనుమిట్టలన్ = గబ్బిగుబ్బలపై, స్తనములపై; అశ్రులు = కన్నీరు; చిందువందగన్ = చిందుతుండగా.  

భావము:  "ఓ నిర్దయుడైన బ్రాహ్మణుడా!  సుకుమారులైన లలనలు దెబ్బలను సహింపగలుగుదురా?  నీవు త్రోసివేసినపుడు నీయొక్క గోరు నాకు ఈ ప్రదేశములో తగిలినది.  కావాలంటే చూడుము" అని తన చనుకట్టు ప్రదేశమును చూపించి, నొప్పి కలుగుతున్నదనే వంకతో, తన ఉన్నతవక్షోజములపై కన్నీరు చిందుతుండగా, మధురమైన కలస్వనముతో ఏడ్చినది. 

పద్యములో పెద్దనగారు "ఇచ్చోట" అనే పదమును వాడినారుకాని, నిర్దిష్టముగా ఎక్కడో చెప్పలేదు.  సందర్భమునుబట్టి  ఆమె తన స్తనములనే చూపివుంటుందని మనం ఊహింపవచ్చును.  ఆవిధంగానైనా అతడిని రెచ్చగొట్టుటకు చేసిన మరో ప్రయత్నం అది!  "వేదన నెపం బిడి యేడ్చె" అన్నారు కవీంద్రులు.  అనగా, నిజముగా ఆమెకు నొప్పి కలగలేదు; అది ఒక మిష మాత్రమే!  "మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టలన్" అని అన్నారు.  అంటే,  ఆమె వక్షోజములు అంత బిగువుగా ఉన్నవని అర్థం!

అదీ మన మహా కవుల చాతుర్యం మన సాహితీ రసజగత్తు మహత్వం.



No comments:

Post a Comment

Total Pageviews