Sunday, July 5, 2020

వేంగీక్షేత్ర వైభవం వాడ్రేవు చినవీరభద్రుడు

నిమ్మ, అరటి, కొబ్బరి తోటల మధ్య, అప్పుడే కొన్ని చోట్ల నాట్లు, కొన్ని చోట్ల ఊడ్పులు నడుస్తున్న పొలాల మధ్య, ఆకాశమంతా కమ్మిన కారుమబ్బుల కళకళ మధ్య పెదవేగిలో అడుగుపెట్టాను. ఒకప్పుడు ఆరేడు శతాబ్దాల నుండి పదకొండు పన్నెండు శతాబ్దాల దాకా తెలుగు వారి రాజధానిగా విలసిల్లిన ఊరు, ఆంధ్ర సాహిత్యానికీ, సంస్కృతికీ ఊయెలతొట్టిలాంటి వేంగీక్షేత్రాన్ని ఇన్నాళ్ళకు చూడగలుగుతున్నానని నాకు నేను చెప్పుకుంటూ ఆ పల్లెలో అడుగుపెట్టాను.

'ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితి నాళ్ళ..' ఎప్పటి పద్యమిది! ఇంటర్మీడియేటు లో వేంగీక్షేత్రం పాఠంగా చదువుకుని నలభయ్యేళ్ళు దాటింది. విశ్వనాథ ఆంధ్రప్రశస్తి 1924 లో పుస్తక రూపంలో వెలువడిందిగాని, ఈ పద్యాలు 1919-21 కాలం నాటివి. అంటే ఆయన వేంగిలో అడుగుపెట్టి 'ఈ నా శరీమందు ఇవతళించిన గాలి ఎంత పౌరాతన్యమేచికొనెనొ' అనుకుని ఇప్పటికి వందేళ్ళు గడిచాయి.

ఇప్పుడు ఆ పద్యాల్ని స్మరించుకుంటూ ఇప్పటికి వేంగీక్షేత్రంలో అడుగుపెట్టగాలిగాను. ఇంత దగ్గరగా ఉన్న ఆ ప్రాచీన ఆంధ్ర రాజధానీ భూమిని సందర్శించడానికి ఇన్నాళ్ళు పట్టింది నాకు.

~

ఇట వేగీశుల పాదచిహ్నములు లేవే,లేవు పో,
భావనాస్ఫుట మూర్తిత్వమునైన పొందవు
ఏదో పూర్వాహ్ణ దుష్కాలంపుంఘటికల్ గర్భమునందిమిడ్చుకొనియెం కాబోలు
ఈ పల్లె చోటట!
లోకాద్భుత దివ్యదర్శనమటే!
ఆ భోగమేలాటిదో!?

~

అన్నాడు కవి. నిజమే ఇప్పుడక్కడ వేగీశుల పాదచిహ్నములు లేవు. కాని, అపారమైన సమృద్ధి ఉంది. పోలవరం కాలువ నీళ్ళు ఆ పల్లె పక్కగా ప్రవహిస్తున్నాయి. 'ఈ పొలాలెంత చేవెక్కించుకున్నవో గుండె వ్రయ్య సముద్రగుప్తుడడలె' అనుకున్నాడు కవి, కానీ, ఇప్పుడా పొలాలంతటా లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఒక సామ్రాజ్యానికి, సంస్కృతికి కొనసాగింపు మనుషులు సుభిక్షంగా బతకడమే అయితే, అక్కడ వేంగీ సామ్రాజ్యమింకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి.

కాని ఒక చారిత్రిక ప్రదేశంగా మాత్రం అక్కడ ఉన్న ఆనవాళ్ళనీ, ఆ శిథిలాలనీ చూస్తే మటుకు తమ గతం గురించీ, తమ సంస్కృతి గురించీ ఏమీ పట్టని తెలుగుజాతిని చూసి సిగ్గు కలిగింది. సుమారు 500 ఏళ్ళ పాటు రాజధానిగా కొనసాగిన ఏకైక నగరం అది అని చెప్తున్నారు ఈమని శివనాగిరెడ్డి. ఆ రాజ్యానికి సమకాలికంగా వర్ధిల్లిన బాదామి, మహాబలిపురం, కాంచీపురం, శ్రీముఖలింగం వంటి వాటితో పోలిస్తే వేంగి ని చూసి మనమెంత గర్వపడాలి! ఆ క్షేత్రంలో ఎటువంటి స్మృతి స్తంభాలు లేవనెత్తి ఉండాలి! ఏటా ఎటువంటి ఉత్సవాలు జరుగుతుండాలి!

మొదట శాలంకాయనులు, ఆ తర్వాత వేంగీ చాళుక్యులూ ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోక పూర్వం, అది గొప్ప బౌద్ధ క్షేత్రం. దక్షిణభారతదేశంలో ఆంధ్రా అజంతా గుహలుగా పేరుపొందిన గుంటుపల్లి, జీలకర్రగూడెం గుహాలయాలు అక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. వేంగిలో అడుగుపెట్టగానే నన్ను మొదట బౌద్ధ చైత్యాలయ శిథిలాల దగ్గరకే తీసుకువెళ్ళారు.

ఆ బౌద్ధ క్షేత్రంలో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది శాలంకాయనులకి అని అడిగాను శివనాగిరెడ్డిగారిని. ఆయన తెలుగు వాళ్ళ విజ్ఞాన సర్వస్వం. మనం కదపాలే గాని, అసంఖ్యాకమైన విశేషాలు ఆయన్నించి జలజలా రాలిపడతాయి.

'శాతవాహనుల తోనే సముద్ర వాణిజ్యం తగ్గుముఖం పట్టినప్పటికీ, శాలంకాయనులు  సముద్ర వర్తకాన్ని కొనసాగించారు.  వాళ్ళు వస్త్రాల్ని ఎగుమతి చేసేవారు. వారి నాణేలు మయన్మారులోనూ, సయాంలోనూ కూడా దొరికాయి. రేవుపట్టణానికి దగ్గరలోనూ, భూమ్మీద సాగే వాణిజ్యానికి కేంద్రంలోనూ ఉంటుందనే ఉద్దేశ్యంతో వారు వేంగిని ఎంచుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ చాళుక్యులు తమ ప్రతినిధిగా నిలబెట్టిన కుబ్జ విష్ణువర్ధనుడు మొదట్లో పిఠాపురం కేంద్రంగా పాలనసాగించినప్పటికీ, తర్వాత వేంగికే తరలివచ్చేసాడు. అప్పణ్ణుంచీ, తిరిగి రాజరాజ నరేంద్రుడు రాజమండ్రికి రాజధాని తరలించేదాకా, సుమారు అయిదు శతాబ్దాల పాటు వేంగి అంధ్రుల రాజధానిగా విలసిల్లింది' అన్నారాయన.

గోదావరీ, కృష్ణా నదుల మధ్య ప్రాంతానికి కేంద్రంగా వేంగిని ఏ ముహూర్తాన రాజధానిగా ఎంచుకున్నారో గాని, అయిదు శతాబ్దాల పాటు ఆ ఒండ్రుమట్టినేలల మీద ఆధిపత్యం కోసం రాష్ట్రకూటులు, తూర్పుగాంగులు, పశ్చిమ చాళుక్యులు, పల్లవులు, చోళులు ఒకదాని వెనక ఒకటి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఆ యుద్ధాలు కేవలం రాజకీయ సంగ్రామాలు మాత్రమే కాదు. తమదైన భాషని, తమదైన సంస్కృతిని అక్కడ నెలకొల్పాలని చేసిన పోరాటాలు కూడా. ఆ ఆటుపోట్ల మధ్య మధ్యలో కూలిపోతూ, మళ్ళా నిలబడుతూ, తనని తాను సంభాళించుకుంటూ, సంరక్షించుకుంటూ వేంగి సాగించిన చరిత్ర అసామాన్యమైనది. సంస్కృతం, తమిళం, ప్రాకృతం, కన్నడం  అనే మహాభాషల మధ్య తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే స్థానిక ప్రజలు మాట్లాడుకునే తెలుగుని పాలనాభాషగా మార్చుకోక తప్పదని గ్రహించిన వాడు గుణగ విజయాదిత్యుడు. అతడి సేనాని అద్దంకి పండరంగడు వేయించిన శాసనాల్లోని తెలుగు పద్యాలే ఇప్పటికి మనకి లభిస్తున్న తొలి తెలుగు పద్యాలు.

ఆ తర్వాత రాజరాజు కాలానికి వచ్చేటప్పటికి తెలుగుని సాహిత్యభాషగా రూపొందించగలమనే ఆత్మవిశ్వాసం కలిగింది వేంగీ చాళుక్యులకి. దాని ఫలితమే నారాయణభట్టు ప్రోత్సాహంతో మహాభారతానికి నన్నయ చేసిన ఆంధ్రీకరణ. అప్పటికి తెలుగు భాష పటిష్టమైన రాజకీయ శక్తిగా ఎదగగలిగింది. ఆ తర్వాత వెయ్యేళ్ళుగా అప్రతిహతంగా కొనసాగుతున్న తెలుగు సాహిత్యం ప్రపంచంలోని అత్యున్నత సాహిత్యభాషల్లో తెలుగుని కూడా ముందువరసలో నిలబెడుతూ వచ్చింది.

ఆ కాలానికీ, ఆ సంస్కృతికీ, ఆ ఆరంభ దినాలకీ ఇప్పుడక్కడ ఆనవాళ్ళుగా మిగిలినవి ఒక శివాలయమూ, చిత్రరథస్వామిగా పిలవబడే సూర్యుడికోసం నిర్మించిన ఒక చిన్ని దేవాలయమూనూ. 'మధ్యలో శివాలయమూ, చుట్టూ గణపతి, సూర్యుడూ, శక్తి, కుమారస్వామిల దేవాలయాలతో అదొక శివపంచాయతన క్షేత్రం కూడా. శంకరాచార్యుల కన్నా ముందే పంచాయతన సంస్కృతి ఉండేదనడానికి ఆ దేవాలయాలే సాక్ష్యం ' అని కూడా చెప్పారు శివనాగిరెడ్డి.

శివాలయంలో అర్చకులు పూజలు చేసారు. ఎన్ని వేల ఏళ్ళుగా ఆ పార్వతీపరమేశ్వరులు అక్కడ పూజలందుకుంటూ ఉన్నారో. ఆ దేవాలయమే అక్కడ లేకపోయుంటే, ఒకప్పటి వేంగీనగరానికి మరే ఆనవాలూ అక్కడ మిగిలి ఉండేది కాదు కదా అనిపించింది. అక్కడ తవ్వకాల్లో దొరికిన శిల్పాల్ని ఆ దేవాలయ ప్రాంగణంలోనే పెట్టి ఉంచారు. ఆరేడు శతాబ్దాలనుంచి పదకొండో శతాబ్ది మధ్యకాలానికి చెందిన దేవీ దేవతా ప్రతిమలు, ద్వారపాలకులు, మకరతోరణాలు, పూజాపీఠాలు అక్కడ ఎండకి ఎండి వానకి తడుస్తున్నాయి. 'మూజియం కట్టి అందులో పెట్టాలని ఈ విగ్రహాల్ని ఇక్కడే ఉంచేసారు. ఇరవై సెంట్లు భూమి దొరికితే చాలు మూజియం కట్టడం మొదలుపెట్టొచ్చు. ఇరవై సెంట్ల భూమికోసం కలెక్టరుగారికి ఉత్తరం రాసాం. ఇంకా జవాబు రాలేదు ' అన్నాడు ఆలయ ధర్మకర్త నాతో,

ఇరవై సెంట్లు! కటకం నుంచి కాంచీపురం దాకా సేనల్ని నడిపించిన తొలి ఆంధ్ర చక్రవర్తుల అనవాళ్ళని భద్రపరచడానికి ఇవాళ ఇరవై సెంట్లు కూడా దొరకని రోజు వచ్చింది. ఒకప్పుడు ఉజ్జయిని గురించి తలుచుకుంటూ భర్తృహరి చెప్పిన శ్లోకం గుర్తొచ్చింది నాకు:

~

సా రమ్యా నగరీ మహాన్ స నృపతిః, సామంతచక్రం చ తత్
పార్శ్వే తస్య సా చ విదగ్ధ పరిషత్, తాశ్చంద్ర బింబాననా
ఉన్మత్తః స చ రాజపుత్ర నివహః, తే వందినః తాః కథాః
సర్వం యస్య వశాదగాత్ స్మృతి పథం, కాలాయః తస్మై నమః

(ఎంత అందమైన నగరం! ఎంత గొప్ప రాజు! ఆయన చుట్టూ ఎటువంటి సామంత వర్గం! ఇరుగడలా ఎటువంటి పండితులు, ఎంత చక్కటి సుందరాంగులు!
ఎంత ఉన్మత్తులైన రాజపుత్ర సమూహం! వాళ్ళని కీర్తించే కవిగాయకులు, ఆ కథలు! ఇప్పుడన్నీ వట్టి జ్ఞాపకంగా మారిపోయాయి! కాలమా! నీకు నమస్కారము!)

~

విశ్వనాథ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు బహుశా అయనకి ఇరవై అయిదేళ్ళు, ఇరవై ఆరెళ్ళు ఉండవచ్చు. తెలుగు వాళ్ళు ఒకవైపు బ్రిటిషు వాళ్ళ దాస్యంలోనూ, మరొక వైపు పాలనాపరంగా మద్రాసు ఏలుబడిలోనూ ఉన్న కాలం అది. తన పూర్వీకుల చరిత్ర ఒకవైపూ, తామనుభవిస్తున్న దాస్యం మరొక వైపూ విచలితుణ్ణి చేస్తుంటే ఆయన ఎంత వివశుడు కాకపోతే ఇట్లాంటి పద్యాలు రాస్తాడు!

~

ఈ పొదలం చరించుచుం అహీన మహా మహిమనుభావమౌ
నే పురవీథులందొ చరియించుచు నుంటి నటంచు పారతం
త్య్రాపతితుండనయ్యును పురామహదాంధ్రమునన్ స్వతంత్రుడౌ
ఏ పురుషుండనో యనుచు ఈ భ్రమ సత్యముగా తలంచుచున్.

~

కవి తన భ్రమలోనే స్వతంత్రుడు. తన భ్రమవల్లనే స్వతంత్రుడు. కాబట్టే-

~

ఇమ్ముగ కాకుళమ్ము మొదలీవరకుంగల ఆంధ్ర పూర్వ
రాజ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలొ చలించిపోవు ఆ
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవనిర్ణయమేని ఎన్ని జ
న్మమ్ములు కాగ ఈ తనువునన్ ప్రవహించునొ ఆంధ్ర రక్తముల్.

~

ఒకప్పుడు ఈ పద్యాలు తెలుగువాళ్ళని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత ఇవి సాహిత్యంగా మిగిలిపోయాయి. నువ్వూ, నీ జాతీ, నీ ప్రాంతమూ అనే సంకుచిత భావాలకు నువ్వు దూరంగా జరగాలనే మెలకువ కలిగిన తర్వాత ఈ పద్యాల నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. కాని, ఇవి జాతికీ, జాతి స్వాతంత్య్రానికీ సంబంధించిన పద్యాలు కావు. ఒక మనిషి భావనాబలానికీ,అతడి ఉద్వేగప్రాబల్యానికీ సంబంధించిన  పద్యాలు. ఒక చెట్టుగాని, ఒక పుట్టగాని, ఒక జెండాగాని, ఒక న్యాయంగాని, ఒక అన్యాయం గాని నీలో ఇటువంటి స్పందన రేకెత్తించగలిగితే చాలు, నువ్వు మనిషిగా పుట్టినందుకు, భాష నేర్చుకున్నందుకు, నీ జన్మ సార్థకం.

~

ఇది వినిపింతు నంచు మదినెంచెద మిత్రులకున్, గళస్థ గా
ద్గదికము, లోచనాంత బహుధాస్రుత బాష్ప నదమ్ము, స్పందనా
స్పద హృదయమ్ము, నా పనికి జాలక చేసెడు, నన్ను నింతగా
నెద పదిలించుకున్న, దిది యెక్కడి పూర్వజన్మ వాసనో!

(మిత్రులకి ఇది వినిపిద్దామనుకుంటాను, కాని గొంతు బొంగురుపోతుంది. కళ్ళకొసలనుండి ఆగకుండా ఒకటే కన్నీరు ధారలు కడుతుంది. అదేపనిగా కంపిస్తున్న హృదయం నాకు మాట పెగలకుండా అడ్డుపడుతుంటుంది. నా హృదయంలో ఇంతగా తిష్టవేసుకున్న ఈ భావనాసంస్కారం ఏ పూర్వజన్మనుంచీ మోసుకొస్తున్న వాసననో కదా!)

~

ఒకప్పుడు హ్యూయెన్ త్సాంగ్ ఇక్కడికి వచ్చాడట. నాకెందుకో వేంగి అన్నప్పుడలా చాంగాన్ తలపులో మెదులుతుంది. ఒకప్పటి ప్రాచీన తాంగ్ సామ్రాజ్యపు రాజధాని చాంగాన్ మీద దు-ఫూ, లి-బాయి లాంటి కవులు చెప్పిన కవిత్వం గుర్తొస్తుంది. వేంగిలో చిత్రరథస్వామి గుడి దగ్గర నిల్చునేటప్పటికి ఆకాశమంతా కారుమబ్బుల పందిరి పరిచింది. చూస్తూండగానే ఒక మహావర్షం మమ్మల్ని నిలువునా ముంచెత్తింది. చాంగాన్ ని తలుచుకున్న దు-ఫూ లాగా వేంగిపైన నేను కూడా ఒక కవిత చెప్పకుండా ఉండలేకపోయాను.

~

వేంగీ క్షేత్రం మీద మహావర్షం
____________________

ఒక మహాసామ్రాజ్యానికి ఆనవాళ్ళుగా
ఇప్పుడక్కడ కొన్ని భగ్నప్రతిమలు.
ఒరిగిపోతున్న చరిత్ర జయస్తంభాన్ని
నా పూర్వకవి ఒక పద్యంతో నిలబెట్టాడు.

పద్యం పలకలేని కవిని నేను
నా బదులు ఆకాశం కరిగినీరయ్యింది

No comments:

Post a Comment

Total Pageviews