Friday, December 2, 2016

సాహిత్యం-రసాస్వాదన పద్ధతులు. Vadrevu Ch Veerabhadrudu

కాకినాడ వెళ్ళినప్పుడు ఆదివారం పొద్దున్న కొంతమంది మిత్రులు ఒక కథాగోష్టి పెట్టుకున్నారు. పిఠాపురం వెళ్ళేదారిలో తిమ్మాపురం దగ్గర ఒక మామిడితోటలో కూచుని కథలెలా చదవాలో చెప్పమని అడిగారు నన్ను.
బావుంది, మామూలుగా, కథలెలా రాయాలో చెప్పమని అడిగేవాళ్ళున్నారుగాని, కథలెలా చదవాలో చెప్పమని అడిగినవాళ్ళు అరుదు.
ఒకప్పుడు సాహిత్యాస్వాదన చిన్నచిన్న బృందాల్లోనూ, గురుకులాల్లోనూ జరిగేది. గొప్ప గురువులు తమ శిష్యులకి అన్నిటికన్నా ముందు ఒక కావ్యాన్నెట్లా చదవాలో చెప్పేవారు. పిల్లవాడు విద్యాభ్యాసం మొదలుపెట్టగానే మేఘసందేశంలో కొన్ని శ్లోకాలో, రఘువంశంలో ఒకటి రెండు సర్గలో మాత్రమే గురువు బోధించేవాడు. అట్లా బోధించేటప్పుడు, వ్యాకరణమో, అలంకారమో, రసమో కాదు, అసలు ఒక పద్యమెట్లా చదవాలో నేర్పేవాడు. ఆ తర్వాత తక్కిందంతా ఆ విద్యార్థి తానే స్వయంగా సాధించుకోవలసి ఉండేది.
ఆధునిక కాలంలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తరువాత,

సాహిత్యం సార్వజనీనం అయినతరువాత, రచనలైతే అందుబాటులోకి వచ్చాయిగాని, రసాస్వాదన పద్ధతులు బోధించేవాళ్ళు కరువై పోయారు. పాఠశాలల్లో భాషలు బోధించవలసిన ఉపాధ్యాయులకు కూడా అట్లాంటి పద్ధతులు తెలియకుండానే ఉపాధ్యాయశిక్షణ పూర్తి చేసుకుంటున్నందువల్ల వాళ్ళనుంచి మనం ఆశించగలిగేది కూడా ఏమీ లేకపోయింది.
ఉదాహరణకి ఒక హైస్కూలు భాషాపండితుడు, తెలుగులోగానీ, ఇంగ్లీషులోగానీ, హిందీలోగానీ నన్నయదో, కీట్స్ దో, కబీరుదో ఒక పద్యాన్ని ఇప్పుడు బోధించే పద్ధతి ఏమిటి? బహుశా ఆ కవిత ఒకటికి రెండు సార్లు చదివి వినిపిస్తాడు, ప్రతిపదార్థ తాత్పర్యాలు చేప్తాడు. కఠినపదాలకి అర్థాలు చెప్తాడు. వ్యాకరణాంశాలు, సమాసాలూ, అలంకారాలు వివరిస్తాడు. ఆ పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయిస్తాడు. ఇంతేకదా! (కాని, ఈ కనీస కార్యక్రమమైనా ఎన్ని పాఠశాలల్లో జరుగుతోందన్నది అనుమానమే).
కాని పూర్వకాలపు గురువులు తమ ఇంట్లోనో, గురుకులంలోనో బోధించే పద్ధతి ఇలా ఉండేది కాదు. వాళ్ళు ఒక పద్యాన్ని శిష్యులకి చెప్పేటప్పుడు, అన్వయక్రమం, వ్యాకరణం, అలంకారాల్ని వివరించడంతో ఆగిపోయేవారు కారు. అవి ప్రాథమిక సామగ్రి. వారు నిజంగా బోధించేది అక్కణ్ణుంచే మొదలయ్యేది. భారతదేశంలోనే కాదు, రినైజాన్సుకాలంలో గ్రీకు క్లాసిక్సు చదవడానికీ, చైనాలో కన్ ఫ్యూసియస్ గ్రంథాల్ని అధ్యయనం చేయడానికి, మధ్యాసియాలో పారశీక వీరగాథలు చదవడానికీ కూడా పాటించింది దాదాపు అట్లాంటి పద్ధతుల్నే.
ఆ రోజు కాకినాడలో ఆ చిన్న గోష్టిలో నేను ఆ పద్ధతుల ప్రకారం ఒక కథ చదివించే ప్రయోగం చేసాను. అట్లా చదవడానికి ఆరు సూత్రాలు వాళ్ళకి పరిచయం చేసాను.
ఆ మిత్రబృందం చేతుల్లో సుప్రసిద్ధ ఇటాలియన్ నాటక కర్త,నోబెల్ బహుమతి స్వీకర్త లూగీ పిరాండెల్లో (1867-1936) రాసిన 'యుద్ధం ' (War) పెట్టబోయే ముందు వారికి మొదటి సూత్రం పరిచయం చేసాను:
_______________
'ఊహించండి' (Predict):
_______________
• ఈ కథ దేనిగురించి అయిఉండవచ్చు?
• దీనిద్వారా మీకెటువంటి భావాలు పరిచయం కాగలవనుకుంటున్నారు?
• ఈ కథని నేను ఎందుకు పరిచయం చేస్తూండవచ్చు?
• మీరు పద్మరాజు గారి 'గాలివాన 'చదివి వచ్చారు కదా, ఆ కథకీ, ఈ కథకీ ఏదైనా సంబంధం ఉండవచ్చనుకుంటున్నారా?
• మీరు కథ చదవడం మొదలుపెట్టాక కూడా మధ్యమధ్యలో ఆగి ఆగి ప్రశ్నించుకుంటూ ఉండండి. తర్వాత ఏమి సంభవించవచ్చు?
• కథని ఎట్లా ముగించబోవచ్చు?
వాళ్ళంతా ఇరవై నిమిషాల పాటు ఆ కథ చాలా శ్రద్ధగా చదివారు. కాని చేతిలో ఒక పెన్సిలు లేకుండా, పక్కన చిన్న నోటు పుస్తకం లేకుండా సాహిత్యం చదవడం తాను ఊహించలేనని అకిరా కురసోవా అన్నాడు. ఆ మాటలు గుర్తు చేసాను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళల్లో ఒకరిద్దరిదగ్గర తప్ప మరెవరిదగ్గరా పెన్నుగాని, పెన్సిలు గాని కనిపించలేదు.
వాళ్ళు చదవడం పూర్తిచేసాక, మరొక నాలుగు సూత్రాలు పరిచయం చేసాను:
_________________
'ప్రశ్నించండి' (Question)
_________________
• ఈ కథ లో రచయిత ఏం చెప్పాలనుకున్నాడు?
• యుద్ధం గురించి చెప్పడానికి రైలు బోగీ ఎందుకు ఎంచుకున్నాడు?
• ప్రతి పాత్రనీ ఎందుకట్లా ఎంచుకున్నాడు? ఆ పద్ధతిలోనే ఎందుకు పరిచయం చేసాడు?
• కథ రోం లో ఎందుకు మొదలైంది? వెనిస్ లో ఎందుకు మొదలవలేదు?
• రచయిత మనతో పంచుకోవాలనుకున్న భావం పూర్తిగా మనతో పంచుకోగలిగాడా?
• ఈ కథ మనం జీవితంలో ఎదుర్కొనే ఏ ప్రశ్నల్ని లేవనెత్తుతోంది?
• ఆ ప్రశ్నల్ని కథకుడు సరిగానే గుర్తుపట్టాడనుకుంటున్నారా?
• ఇందులో కథకుడు వాచ్యంగా చెప్పకుండా సూక్ష్మంగా చెప్పిన సత్యమేదైనా ఉందా?
• ఈ కథ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందా? లేక రచయిత ఊహాగానమా?
• కథ వాస్తవంగానూ, స్వాభావికంగానూ చెప్పాడనుకుంటున్నారా? అయితే ఎందుకని?
• ఈ రచన గొప్ప రచన అని మీకు అనిపిస్తోందా?
• పదేళ్ళ తర్వాత కూడా ఈ కథ మీకు గుర్తుంటుందా? ఎందుకు?
________________________
'మనసులో చిత్రించుకోండి' (Visualize)
________________________
• ఈ కథలో ఏ ఘట్టం మీ కళ్ళకి కట్టినట్టు అనిపించింది?
• ఏ పాత్ర మీకు విస్పష్టంగా కనబడింది?
• కథ చదవగానే మీకు ఆ స్థలం,ఆ టైమూ, ఆ వాతావరణం కళ్ళముందు కనిపించాయా? అయితే ఏ వర్ణన, ఏ విశేషణం, ఏ మెటఫర్ మీకు బాగా ఉపయోగపడ్డాయి?
• దీన్నెవరైనా నాటకంగానో, సినిమాగానో చూపించాలనుకుంటే, మీరు మనసులో చిత్రించుకున్నదానికన్నా బాగా చూపించగలరా?
_______________________________
'ఒకదాన్నొకటి కలుపుకుని చూడండి'' (Connect)
_______________________________
• ఈ కథ చదవగానే మీకిట్లాంటి కథలేవైనా గుర్తొచ్చాయా? సినిమాలు? (సాహిత్యంలో ప్రతి రచనా తనకన్నా పూర్వపు రచనలతోనూ, తన సమకాలిక రచనలతోనూ అల్లుకునే ఉంటుంది. ఆ అల్లికని intertextuality అంటారు. ఒక రచనలో అంతర్వాహినిగా ఉన్న అనేక రచనల్ని గుర్తుపట్టగలగడం గొప్ప సాహిత్యవిద్యార్థి లక్షణం)
• ఈ కథ చదవగానే మీ జీవితంలోనో, మీకు తెలిసినవాళ్ళ జీవితాల్లోనో ఇట్లాంటి అనుభవాలేవైనా మీరు విన్నవి గుర్తొచ్చాయా?
• ఈ కథలో ఏ పదప్రయోగం, ఏ విశేషణం, ఏ రూపకాలంకారం మీకు ఎక్కువ నచ్చింది? ఎందుకు నచ్చింది? అందుకు కారణాలు గుర్తుపట్టగలరా?
• ఏ పాత్ర మీకు ఎక్కువ సన్నిహితంగా తోచింది?
• ఇందులో మీకు నచ్చిన అంశమేది? ఎందుకు నచ్చింది?
• నచ్చనిదేది? ఎందుకు నచ్చలేదు?
• ఈ కథ చదివాక మీలో ఏదైనా మార్పు వచ్చిందా? లేదా రాగలదనుకుంటున్నారా?
________________
'గమనించండి' (Monitor)
________________
• ఈ కథలో మీకు అర్థం కాని భాగం, అంశం ఏదైనా ఉందా?
• కఠినపదాలు ఏవైనా కనిపించాయా?
• కథసారాంశాన్ని పట్టిచ్చే కీలక పదం లేదా వాక్యం ఏదై ఉండవచ్చు?
• కథ ఎక్కడ మొదలయిందనుకుంటున్నారు? (అంటే, మీరు సరిగ్గా ఏ బిందువు దగ్గర కథలోకి మానసైకంగా ప్రవేశించారు?)
• కథ ఎక్కడ మలుపు తిరిగింది?
• కథ ఎక్కడ ముగిసిందనుకుంటున్నారు?
• ఆ ముగింపు సరైనదేనా?
• కథ పూర్తి చేసాక మీకేమైనా అసంతృప్తిగా అనిపించిందా? అయితే ఎందుకనిపించింది?
ఈ నాలుగు సూత్రాల ప్రకారం చాలాసేపే చర్చ జరిగాక, చివరగా ఆరవసూత్రం పరిచయం చేసాను:
_______________________
'సంక్షిప్తంగా చెప్పండి' (Summarize)
_______________________
• ఈ కథ దేనిగురించో ఒక్క వాక్యంలో చెప్పండి (పూరకాలపు నీతికథల్లో చివర 'నీతి ' అని ఒక వాక్యముండేది. ఆధునికకథలో అట్లాంటి వాక్యం రచయిత రాయడుగాని, పాఠకుడు తనకై తాను చెప్పుకోవలసి ఉంటుంది).
• ఈ కథలో ఇతివృత్తమేమిటో మీ మిత్రుడికి రెండు వాక్యాల్లో చెప్పండి.
• ఈ కథని మీరు ఇంతకన్నా బాగా రాయగలరా?
• ఈ కథ ఎక్కడ ఆగిపోయింది? అక్కణ్ణుంచి మొదలుపెట్టి మీరో కథ చెప్పగలరా? అట్లా ఎవరేనా ఏదైనా కథ రాసారా?
• ఈ కథనే మీరు రచయిత దృక్పథంలోంచి కాకుండా, ఇందులో ఏదైనా పాత్ర దృక్పథం నుంచి మళ్ళా చెప్పగలరా?
ఇక చివరి ప్రశ్న:
• మొదటి సూత్రం గుర్తు చేసుకోండి. కథ చదివే ముందు మీరు ఈ కథ గురించి కొంత ఊహ చేసారు. కథ చదివారు కదా? మీ ఊహలు ఎంతమేరకు సరిపోయాయి?
లూగీ పిరాండెల్లో కథ మీద చర్చ పూర్తికాగానే, ఈ ఆరుసూత్రాల ప్రకారం వాళ్ళతో 'గాలివాన ' కథ గురించి మాట్లాడించేను.
నా ప్రయోగం చాలామేరకు ఫలించిందనే అనిపించింది.
______________________________________________
ఈ కథ చదవాలనుకుంటే https://www.scribd.com/document/333050390/Yuddham క్లిక్ చేయండి

No comments:

Post a Comment

Total Pageviews