Monday, January 20, 2020

ఓ గోదారోడి మనసులో మాట.

పండగెళ్ళి పోయి ఇంటికొచ్చినోళ్ళు అళ్ళింటికి ఆళ్ళు ఎళ్ళిపోతా ఉంటే మనసు బిగపెట్టేసి ఏటోలా అయిపోయిందండి.  పరాసికా లాడుకుంటూ, ఏళాకోళం మాట లాడుకుంటూ... ఆనందించినంత సేపు పట్లేదండి, క్షెణాల్లో గడిసి పోయాయి రోజులు.

భీవ్వారం పందెం కోళ్ళని పందెం అయినాక పచ్చడెట్టేసినట్టు,   బంధువుళెళ్ళి పోతావుంటే దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టయిపోయింది.  మళ్ళీ ఈళ్ళంతా  ఎంత కాలానికొస్తారో?

తాపేశ్వరం పూతరేకులు, పెద్దాపురం పాలకోవా, ఏలూరు పెరుగుసెట్టు కాడట్టు కొచ్చిన జున్ను పాలతో తియ్యటి జున్నూ, అన్నీ కబుర్లెట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి, సంబరం గాల్లోకి ఎగిరిపోయింది.   కళ్ళకి మసకేసి చీకటి కమ్మినట్టయి పోయిందండి. 

ఇప్పుడిప్పుడే  దిగుతున్న మావిడి పిందెలతో మెంతి బద్దలెడితే, పిల్లలు ఇరగదీసుకుంటా కంచాలమీద కలబడ్డారు.  ఇయన్నీ రుసి కుదరటం వల్లనుకున్నాం గానీ, చుట్టాల్తో వచ్చిన పిల్లల్తో జతకట్టిన  సరదావల్లే,  అనే నిజం తెలియలేదండి. అదే పచ్చడిపుడెడితే బుడ్డోళ్ళెవరూ కంచంవైపు రావటం లేదు. 

చాలా కాలం తర్వాతొచ్చిన ఆడబిడ్డలు,  కళ్ళనీళ్ళెట్టుకుంటూ,ఇంటికెళ్ళేటప్పుడు, కాళ్ళకి  దండాలెడతా వుంటే లోపల కెలికేసినట్టనిపించింది. 

ఏం చేస్తావండీ?ఎవరి సంసారాలాళ్ళవి.  బరువెక్కిన గుండెతోటే చెంగున చలివిడి కట్టి, కాళ్ళకి పసుపురాసి, కొత్త బట్టలతో కట్నాలెట్టి పంపుతా ఉంటే మళ్ళీ అప్పగింత లప్పుడొచ్చిన దుఃఖం పొగిలి పొగిలి వచ్చిందండి. 

గోదారోళ్ళంటే ఏళాకోళం మడుసు లనుకుంటారు గానీండి, పేమలెక్కువున్న ఎర్రోళ్ళని చాలామందికి తెలియదండి. 

రైతులంతా పెపంచకానికి బువ్వెట్టడానికి పొలంవైపు పోవడానికి సిద్ధవయి పోతున్నారు.  పాలోళ్ళు కేన్లు తోముకుని, రేపట్నించి పాలొయ్యడానికి తయారవుతున్నారు.  కూరగాయాలమ్మేటోళ్ళు పొద్దుగాలే వచ్చే ఆటో బండోళ్ళతో మాట్లాడుకుంటన్నారు.‌‌

పెతీ ఊర్లో జనం గుంపులు గుంపులుగా బస్టాండింగ్ ల్లో,  రైలు స్టేషనింగుల్లోను అవుపడ్తన్నారు.

చూస్తా ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ. 

ఎల్తా ఎల్తా మా మానేళ్ళుల్లు, మేనగోడళ్ళు ఏసంగి సెలవలకి వత్తాం మాయ్యా అంటూ ఏడుత్తూ ఎల్లిపోతావుంటే  గొంతులో ఏదో అడ్డడినట్టు అయిపోయిందండి. 

మా పిల్లల మొకాలు చూస్తే జాలేసింది.  హాయిగా ఆడుకుంటా నవ్వుతూ తుళ్ళుతూ పండగ రోజులు గడిపేశారు.  రేపట్నించి మల్లా మావూలే.‌‌.

అనుకుంటాం గానండీ, సంబరం ఒకేసారి ఎల్లువలా వస్తే,  అదిపోయేటపుడు పుట్టెడు దుఃఖం కూడా ఇత్తాదండి. 

ఈ క్షణంలో గోదారి చూడాలంటే మీరు రాజమెండ్రీ ఎల్లక్కర్లేదండి, మా మడుసుల మనసులూ, కళ్ళూ చూస్తే చాలండి. 

పెతీ మడిసిలోనూ మూడు గోదార్లు కనిపిస్తాయి.  రెండు కళ్ళల్లో రెండుపాయలూ, మనసులో అఖండ గోదారీను.

ఎంత బాధొచ్చినా తప్పదు కదండీ‌. రోజులు గడవాలంటే మళ్ళీ అందరూ ఎవురి పనుల్లోకి ఆళ్ళొచ్చేయాలండి.

ఉంటానండి.  దేవుడు మనందరికీ మంచి చేయాలని కోరుకుంటా....

ఓ గోదారోడు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 19.01.2020

No comments:

Post a Comment

Total Pageviews