Wednesday, March 25, 2020

కరోనా

సమస్త మానవాళికి  కరోనా నా జీవన పాఠం

మనిషి మేధస్సు పెరుగుతోంది.. అందులో అనుమానమే లేదు. భూమిపై పుట్టి.. చంద్రమండలంపై విహరించే స్థాయికీ.. క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడైనా స్మార్ట్­గా చేరుకునే స్థాయికీ మనిషి ఎదిగాడు. ప్రతి పనికీ టెక్నాలజీని వాడుకుంటున్నాడు. శరీరాన్ని ఏ మాత్రం కష్టపెట్టకుండా అన్ని పనులూ చక్కపెట్టేస్తున్నాడు. ఈ సుఖ జీవితం నిజంగా మనిషిని నిర్భయంగా ఉంచుతోందా...? మనిషిని ఆరోగ్యవంతుడిగా మార్చుతోందా...? మనిషి కట్టుకున్న సుఖాల సోపానం ఎంత వరకు సేఫ్..? కరోనా వైరస్ ప్రపంచాన్ని కదిలీ మెదలకుండా చేసి చెప్తున్న విలువైన పాఠం ఏంటనేది అర్థం చేసుకోవాలి.

కరోనా మానవుడికి కొత్త పాఠాలు నేర్పుతోంది. మనిషి లక్ష్యాలను, గమ్యాలనూ మార్చుకోవాలంటోంది. సుఖ జీవనం వైపు, ఆధునిక పోకడలవైపే కాదు గమనం.. ప్రకృతినీ, శరీరాన్ని దృఢపరుచుకోవడంపై ఉండాలంటోంది. మనిషి కరోనాపై పోరాడి గెలుస్తాడా..? ఎన్ని రోజుల్లో మనిషి కరోనాను తరిమికొడతాడు అనే చర్చను పక్కన పెడితే.. మనిషి సుఖం కోసం పాకులాడుతూ... శరీరాన్ని నిర్లక్ష్యం చేశాడా అన్న అనుమానం ప్రపంచంలోని ప్రతి మనిషికీ కలిగేలా చేస్తోంది కరోనా వైరస్. మనిషి ఎప్పుడు పుట్టాడో.. జంతువుల మధ్య ఓ జంతువులా ప్రయాణం మొదలు పెట్టాడు. మేధస్సు మానవుణ్ని సుఖజీవిగా మలిచింది. అన్వేషి అయిన మనిషి పంటల నుంచి యంత్రాల నుంచి రాకెట్ల నుంచి టచ్ స్క్రీన్లు.. హుక్ ట్రైన్లు దాటిపోయాడు. అంతరిజ్ఞంలో విహరించినా... అంతర్జాలంలో మునిగితేలినా.. ఓ సారి మనిషి గమనాన్ని పరిశీలిస్తే.. అంతిమ లక్ష్యం శరీరాన్ని పెద్దగా కష్టపెట్టకుండా సుఖవంతమైన జీవతం గడపడమే కదా అనిపిస్తుంది. శరీరానికి శ్రమ తగ్గించుకోవడమనే లక్ష్య సాధన కోసం మనిషి పెట్టుబడి మేధస్సు మాత్రమే కాదు.. తన చుట్టూ ఉన్న సవాలక్ష జీవరాసులు, ప్రకృతితో కూడిన గొప్ప పర్యావరణాన్ని కూడా ఫణంగా పెట్టాడు.

సుఖవంతమైన ప్రయాణంలో తన శరీరాన్ని సున్నితం చేసుకున్నాడు. మట్టిలో పుట్టిన మనిషి ఆ మట్టి పరిమళానికి దూరమైపోయాడు. పాదాలకు ఒక్కసారి కూడా మన్ను అంటని పరిస్థితుల్లో ఇవాళ కోట్లాది మంది బతుకుతున్నారు. ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, పిల్లల క్లాస్ రూంలో ఏసీ.. పని చేసే ఆఫీసులో ఏసీ.. తిరిగి పడుకునే పడకపక్కనే ఏసీ... ఇలా శరీరాలకు సహజమైన గాలి, సహజమైన ఎండ, సహజసిద్ధంగా పట్టాల్సిన చెమట దూరమైపోతోంది. ఇప్పటికీ శ్రమజీవులు ఉన్నారు, ఎండల్లో మండిపోతూ శ్రమ చేస్తున్నారు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది విమానాల్లో తిరిగే మోడ్రన్ మ్యాన్­ నుంచి బదిలీ అవుతున్న కరోనా వ్యాప్తి గురించి. కరోనా చెమటలో పుట్టిన వ్యాధి కాదు.. సుఖాన్ని మరిగిన మనిషి చర్యల ఫలితంగా పుట్టిన మహమ్మారి. అల్లం, మిరియాలతో తగ్గిపోవాల్సిన జలుబు దగ్గు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెట్టే  అతిపెద్ద వ్యాధై కూర్చుంది. పక్కనున్న మనిషి తుమ్ముతుంటే... ఓ శత్రువులా భావించి తప్పుకుంటున్నాం. బిడ్డను ఎవరైనా ఆప్యాయంగా పలకరిస్తే.. అవతలి వ్యక్తికి ఎక్కడ కరోనా ఉంటుందోనని భయపడుతున్నాం. మనిషిని ఆప్యాయంగా హత్తుకోవాలన్నా... అయిన వాళ్లతో ఆనందంగా వేడుక చేసుకోవాలన్నా కరోనాను కలవరించాల్సిన దుస్థితిలోకి నేడు ప్రపంచం చేరుకుంది.

మన దేశంలో స్వచ్ఛమైన గాలిని అమ్మే దుకాణాలు కూడా ఎప్పుడో మొదలైపోయాయి. ఒకటి రెండు దశాబ్దాల క్రితం నుంచే తాగునీటిని కొంటున్నాం. అంటే.. ప్రకృతి సిద్ధంగా దొరకాల్సిన గాలి కలుషితం, నీరు కలుషితం... అడవిలో పుట్టిన మనిషి ఆ అడవుల్ని నరుక్కుతినేశాడు. వాటిలో ఉండే జంతువుల్ని చంపేశాడు. నదుల్నీ, సముద్రాల్నీ ప్లాస్టిక్ యార్డులుగా మార్చేశాడు. తనకు తప్ప ఈ ప్రపంచంలో ఏ జీవికీ భద్రమైన బతుకే లేని పరిస్థితిలోకి మనిషి సమస్త సృష్టినీ నెట్టేశాడు. చుట్టూ ఉన్న ఆవరణను ధ్వంసం చేస్తే.. తనను తాను అన్యాయం చేసుకున్నట్లేనని తెలియంది కాదు. కానీ మనుషులందరికీ సొంత బుర్ర ఉంది.. ఆ బుర్రలో ఎవరి స్వార్థం వారికి ఉంటుంది. అందరికీ శరీరం అలసిపోని సుఖమయ జీవనం కావాలి. చెమట పట్టని జీవన విధానం కావాలి. అస్సలు అలసిపోకుండా కూర్చొని తినడం కావాలి. అలా కష్టపడని జీవితం కోసమే మనిషి పాటుపడ్డాడేమోనని కరోనా కోణంలో చూస్తే తెలిసి వస్తుంది. మనిషి బలవంతుడు కావడం అంటే.. శరీరాన్ని సుఖపెట్టడం.. జలుబు దగ్గులకే వేల మంది చనిపోవడం కాదు.. మనిషి బలపడటం అంటే.. శారీరకంగా కూడా బలంగా ఉండటం.. ప్రకృతినీ, మిగతా జీవుల్నీ తనతో పాటు మరింత బలోపేతం చేయడం మనిషి కనీస ధర్మం. ఈ ధర్మాన్ని మొత్తం మానవ సమూహకమే పక్కన పెట్టేసిందా అన్న అనుమానం కలుగుతోంది.

అంతెందుకు.. ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్న విధానాన్నే తీసుకుందాం. మట్టిలో ఆడుకోవాల్సిన పిల్లలు.. ఏసీ గదుల్లో స్మార్ట్ ఫోన్లలో బంధీలైపోతున్నారు. పల్లె పట్నం అనే తేడా లేదు. స్మార్ట్ ఫోన్ అందరి శరీరాలనూ గంటలకు గంటలు కూర్చోపెట్టేస్తోంది. పైగా ఇప్పుడు తినే తిండి నేరుగా ప్రకృతి నుంచి వచ్చింది కాదు.. అంతా ప్రాసెస్డ్ ఫుడ్. ఎక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ఆహారం ఉండాలి. కానీ ప్రపంచం కుగ్రామమైపోవడంతో వ్యవహారాలే కాదు.. ఆహార అలవాట్లూ మారిపోయాయి. మన దగ్గర పిజ్జాబర్గర్లతో కడుపులు నింపేస్తున్నారు. గ్రామాల్లోకి కూడా ఇన్ స్టెంట్ ఫుడ్.. నూడిల్స్ వెళ్లిపోయాయి. పిల్లల చిరుతిండ్ల స్థానంలో ప్యాక్డ్ ఫుడ్ ఉంటోంది. బెళ్లం పప్పుల్ని ఇష్టంగా తినే రోజులూ.. సహజంగా పండించిన పళ్లను ఇష్టంగా తినే రోజులు కావివి. అందుకే.. సాంకేతిక పరిజ్ఞానం బలపడుతున్నా.. మానవుల శరీరాలు బలహీనపడుతూనే ఉన్నాయి. ఆ బలహీన శరీరాలను కొత్త కొత్త పేర్లతో వచ్చే రోగాలొచ్చి కుదిపేస్తున్నాయ్.

కాలి నడకతోనే వేల కిలోమీటర్లు నడిచిన రోజులు పోయి ఒళ్ల కదిలించకుండా.. ఇంట్లోని వస్తువులన్నీ దగ్గరికి రప్పించుకునే రోబోటిక్ రోజుల్లోకి ప్రవేశించాం. మనిషి తనకు బలమైన శరీరం ఉంది.. శ్రమ చెయ్యడం దాని ప్రాధమిక ధర్మం అన్న మాటను మరచిపోయి చాలా కాలమైపోయింది. కరోనా ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా సోకే వ్యాధే అయినా.. మానవుల శరీరాలు గాలికీ ధూళికీ ప్రభావితం అయ్యేంత బలహీన పడిపోవడమే కరోనా మరణాలకు కారణంగా చెప్పుకోవచ్చు.

ప్రభుత్వాలు మేల్కొంటాయి.. అన్ని దేశాలూ తమ ప్రజల్ని రక్షించుకోవడం కోసం పాటుపడతాయి. ప్రపంచం మొత్తం మొబైల్ ఫోన్లోకి వచ్చేశాక.. దేశాలతో ప్రయాణ సంబంధాలు తాత్కాలికంగా ఆగిపోయినంత మాత్రాన వెంటనే వచ్చేనష్టమేమీ ఉండదు. సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టవచ్చు... ఈ మహమ్మారి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొన్నాళ్లకో, కొన్నేళ్లకో కరోనా లేదా కొవిడ్ పేర్లు వినిపించనంత గట్టి చర్యలు తీసుకోవచ్చు. కానీ మరో మహమ్మారి మానవులపై దాడి చెయ్యదన్న గ్యారెంటీ ఉందా..? ఎయిడ్స్ చూశాం, ఎబోలా చూశాం, సార్స్ చూశాం, స్వైన్ ఫ్లూ చూశాం.. మొన్ననే నిఫా వైరస్ కూడా పలకరించింది.. అదే క్రమంలోనే ఇప్పుడు కరోనా పేరుతో వచ్చిన కొవిడ్ 19... రేపు ఇంకేదో వైరస్ కొత్త పేరుతో కొత్త వైరస్ వస్తే మనిషి గతి ఏంటి.. మన భవిష్యత్తు తరాల సంగతేంటి..?  మనిషి తన వారసులకు.. తర్వాతి తరాలవారికీ ఇవ్వాల్సిన సంపద శరీరం కష్టపడని జీవనమేనా..? లేదా.. ఆ శరీరాలను ఎలాంటి వైరస్­లూ కబలించని గొప్ప ఆరోగ్యాన్నీ పర్యావరణాన్నీ, ప్రకృతినీ సంపదగా ఇవ్వాలా..? కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికే ఓ గొప్ప పాఠం చెబుతోంది.. ఎవరి ఇళ్లలో వాళ్లను బంధించి.. ప్రపంచాన్ని స్తంభింపజేసి మరీ.. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండీ అంటోంది. వెనక్కి నడవడం అంటే అజ్ఞానాంధకారంలోకి అని కాదు... రూట్స్­ని వెదుక్కోవడం చిన్నతనం కాదు.. ప్రకృతిలో నుంచి పుట్టిన మనిషి తిరిగి ఆ ప్రకృతిని ప్రేమించడం.. ప్రకృతితో కలిసి సాగడం. పర్యావరణ అనుకూలంగా మనిషి జీవించాలి..  స్వచ్ఛమైన గాలి, నీరు, ఎండ.. చెమటతో శరీరాన్ని పరిపుష్టం చేసుకోవాలి.  వెయ్యి ఏనుగుల్ని తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు నేలకొరుగుతుంది.. మనిషి రాబందులా కాదు ఉండాల్సింది.. ఎంతటి గాలి వాన వచ్చినా.. తట్టుకొని నిలబడగలిగే గడ్డిపోచలు స్ఫూర్తి కావాలి. బతుకుతున్న పర్యావరణానికి హాని చెయ్యని ఆహారంతో ఆరోగ్యం సొంతమౌతుంది. బతుకు.. బతికించు అనే విధంగా మనిషి తన జీవన విధానాన్ని మార్చుకోవాలి. విధ్వంసం తర్వాత సరికొత్తగా మొలకెత్తకపోతే మిగిలేది శూన్యం.. ఇదే కరోనా కల్లోలం తర్వాత మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠం.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment

Total Pageviews