Friday, May 29, 2020

మీ జీవితం టీ అయితే..... మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా టీ కప్పులాంటివి...no limit for them. కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని ఆస్వాధించటం నేర్చుకొండి.

చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న
స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తోంది . బాగా సెటిల్ అయ్యారు . కానీ జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఇదే విషయం గురించి చర్చించారు...
కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.

ఆ మాస్టారూ పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...! ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....
అతనొక స్పూర్తి ! అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...

ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!

ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!

ఆయన చెప్పిన పాఠాల మూలంగానే  ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,
సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.

ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!

ఇదంతా విన్న ఆ గురువు
కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.

కొద్ది సేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి  వేడి వేడి టీ ని  ఓ కేటిల్‌లో తీసుకుని వచ్చింది.

ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను
(పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.

వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!

వాళ్లంతా టీ  తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..

‘‘మీరంతా గమనించారా...
టీ మీ ముందుకు రాగానే ,  ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ  తాగారు..ఫలితం...
ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!

అందరూ తాగే టీ
ఒకటేఅయినా... తాగుతూ..
ఇతరుల టీ  కప్పు,
దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...
 ఫలితం...తాగే
 "టీ"ని  అస్వాధించడం" మరిచిపోయారు..

అదే సకల సమస్యలకు మూలం....

ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...
వాటి వెంట పరిగెడితే ఇక అంతే...!

మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!

ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,
ఎంత రిచ్‌గా ఉన్నారో...
ఏ హోదాలో ఉన్నారో,
ఏం కొంటున్నారో
అని పొల్చుకొని...
మధన పడుతూ...
వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ
మీ ఇష్టాఇష్టాలను,
మీ అభిరుచులను
అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...

మీ జీవితం టీ అయితే.....
మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా
టీ కప్పులాంటివి...no limit for them.

కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని  ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు. Finally understand difference between being rich and being happy. Dont struggle much, do your interests and try to be happy

 అదే జీవిత సత్యం...

🙏🏼🙏🏻🙏🏻

Thursday, May 28, 2020

- కుప్పిలి పద్మ

రెడ్ బ్యాoగిల్స్:
.........

చుట్టూ కాగితాలు. యెదుట లాప్ టాప్. మరో పక్క లాగేస్తోన్న మల్లె పూలవనం. లోపల అల్లరి పెడుతోన్న పాటలెన్నో.

యేకకాలంలో యెన్నెన్ని భావాలో. మనకి పరిచయం అయిన ఆ తొలి వసంత కాలంలో మనిద్దరం కడియం మల్లెపువ్వుల తోటల్ని చూడటానికి వెళ్లాం. ముదురాకుపచ్చని గుబుర్ల నడుమ చిన్నివి, కొంచెం పెద్దవి, బాగ పెద్దవి మల్లెలు. పందిరి మొగ్గలు. ఆ మొగ్గలని బుట్టల్లోకి చకచక కోయటం చూసి నువ్వెంతగానో ఆ స్కిల్ ని మెచ్చుకున్నావ్.

యెన్నిన్ని కాంబినేషన్స్ తో మాలలు అల్లేవారో కదా! మల్లె దవనం. మల్లె మరువం. మల్లెలు కనకాంబరాలు. మల్లెలు మరువం కనకాంబరాలు… ఆ కలబోత మాలలు యెంత అందంగానో వుండేవి. వాటి పరిమళాలు సుమధురం. వదులు జుట్టుని అల్లుకొంటే యెంచక్కగా పువ్వులు పెట్టుకోవచ్చు కదా అనేవారు ఆ వూరిలో పరిచయం అయిన బామ్మ గారు. తిరిగి ఆమె నవ్వుతూ యిప్పుడు పువ్వులు యెవ్వరూ పెట్టుకోవటం లేదు అనేవారు. ఆమెతో వొక రోజు మల్లెపూల జడ అల్లించుకొంటే బరువే తెలియనివ్వ లేదు ఆ పూలపరిమళం.
పూల జడ అల్లటం వో కళ. వరుస తప్పకుండా అల్లాలి. యెన్ని మల్లెల వరసల తరువాత యే రంగు పువ్వులు పూలజడ సొగసుని మరింత ఎన్హాన్స్ చేస్తాయోననే రంగులచూపు వుండాలి.

ఆ అనేక తీపి సువాసనలు మనలని చుట్టుకొంటుంటే ఆ జడపై పై నుంచి కిందనున్న జడ గంటల వరకు యెన్ని ముద్దులు వస్తాయోనని లెక్క పెడుతూ, మధ్యలో లెక్క తప్పిందని ఆగి, మొదటి నుంచి ముద్దులు పెట్టాలని, తిరిగి లెక్క పెట్టాలని నువ్వు మళ్లీమళ్లీ లెక్క పెట్టే పని చేస్తుంటే, నువ్వు కావాలనే చేస్తున్నావని గుర్తు పట్టి కూడా గుర్తుపట్టనట్టే వున్నాను. ఆ నీ పూల ముద్దులు యేమో కాని నా మెడ పై నుంచి వీపు పైకి జారుతోన్న నీ లేత వెచ్చని వూపిరి పూయించే గిలిగింత కావాలనిపించేది. మళ్లీ మళ్లీ నువ్వు యెన్ని సార్లు యెన్నెన్నో ముద్దులు పెట్టినా ఆ గిలిగింత యిప్పటికి పచ్చని పులకరింతే.

తప్పదు యిక్కడ ఆగాలి. పనుంది. చాల రాయాలి యింకా… పంచుకోవలసినవి చాలున్నాయి.

***

హమ్మయ! సమయం చిక్కపట్టుకొని వచ్చేసాను నీకు రాయాలని.
నీదెంత సునిశితమైన సున్నితమైన మనసు. ఆ ఆఫ్ఫీషియల్ మీటింగ్ మధ్యలో టీ బ్రేక్ లో చిటికేసిన మోహాన్ని నీకు మెసేజెస్ పంపించినప్పుడు పని వొత్తిడిలోనే ఆ మెసేజ్ ని పంపానని నీకు భలే తెలిసిపోయింది. అవును అలాంటప్పుడే ఆ మెసేజ్ ని పంపాను. నువ్వన్నట్టు పనొక్కటే కాదు మనసులో కూడా అనేక ప్రశ్నలున్నాయి.

యిప్పటి వరకు యెర్రని యెండ. యెండ ఛాయే. యెండ చుర్రుమంటుంది. వేసవి వచ్చింది అనుకొన్నానో లేదో చూస్తుండగానే అర్ధరాత్రిలా మిట్ట మధ్యాహ్నం నల్లని మబ్బులు దట్టంగా. అంత తొందరగా కమ్ముకొన్న చీకట్లని చూసి గూడు చేరుకొనే వేళ యింత తొందరగా అయిందేమిటి అనుకున్నాయేమో తేనె పిట్టలు గూళ్ళకి వచ్చేసాయి త్వరత్వరగా.

వడగళ్ళ వాన.

వడగళ్ళు అంటే నాకు స్నో వైట్ కథ గుర్తొస్తుంది. స్నో వైట్ గుర్తొస్తే వడగళ్ళు కురుస్తాయి కళ్ళ ముందు. వొకప్పుడు వడగళ్ళ వాన చాల అరుదుగా కురిసేదట. ఆ వాన వొక మంచి ముచ్చట. ఆ వాన కోసం యెదురు చూసేవాళ్ళం. యిప్పుడు తరచు వడగళ్ళ వానే. అదీ మాములుగా కాదు. పంటంతా ధ్వంసం చేస్తూ. మళ్లీ కాసేపటికి వాన కురిసిన ఆనవాలే లేని యెండ. తిరిగి వాన. పగలు రాత్రి యిదే వరస.

ప్రభాత వేళ విచ్చుకొనే పువ్వులని దాదాపు ప్రతి వుదయం చూస్తాను. అదే మెరుపు. అదే రంగు. అదే సుగంధం. యెన్నెన్నో రంగులని సువాసనలని వెదజల్లే స్థాయికి రావడానికి తను యెన్నెన్ని వడగాలుల్ని మంచు రాత్రులని చూసి వుంటాయో కదా పూల తోటలు. అడ్డదిడ్డంగా పెనవేసుకొంటు సరసరా పాకే తీగలు అనేక రంగుల పువ్వులతో మనలని పలకరిస్తుంటాయి, యెన్నెన్నో అవరోధాల నడుమ. వాటిని చూసినప్పుడు కొందరు మనుష్యులు సాటి మనుష్యుల మీద చిమ్మే చేదుని పెద్దగా పట్టించుకోకుండా యెంతటి వ్యతిరేక పరిస్థితుల్లోనైన స్నేహం ప్రేమలాంటి మానవీయపుష్పాలపై మరింత విశ్వాసాన్ని పెంచుకొంటూ ఆ సుపరిమళాన్ని మనం శ్వాసిస్తూ మన చుట్టూ వున్న వాళ్ళు శ్వాసించేట్టు మన మనసులు విరబూయాలి రుతువు యేదైనా …
---- కుప్పిలి పద్మ.
29.5.2019
Fb Memory.... Thank you.
.........
(తీరిక చేసుకొని చదవండి)

**పిత్రార్జితం**
 
*‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*

వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.

‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.

విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.

విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.

భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.

తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.

‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.

‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా?

మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.

‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.

‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.

‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.

‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.

‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.

‘‘మీ చదువుల కోసం’’.

‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.

‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు.

ఆ అప్పు అలాగే నిలిచిపోయింది.

అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.

‘‘ఇంకా ఎంత కట్టాలట?’’

విజయ్‌ అడిగాడు.

‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.

‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.

పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.

‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.

‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.

ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

*   *   *

ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.

‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.

తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.

షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.

‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.

అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.

సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.

‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.

‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.

రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?

ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.

వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు.

‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు  పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.

*     *     *

వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది.

ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.

‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.

‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.

‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.

‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.

‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

*   *   *

సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.

సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.

‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.

సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.

‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.

*   *   *

ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.

ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.

అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.

తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు.
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.

ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.

ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి.  నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి పెద్ద వాడిగా అన్ని బాధ్యతలు  తీసుకోమంటారు బంధువులు. అలా తీసుకోవడం నాకు సంతోషమే కానీ
ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు అవుతా ఉన్నాయి.

మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని మా తమ్ముల్లను, మా అమ్మ ను ఇందులో చేర్చితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. ఆస్తులకంటేరక్తసంబందాలు,ఆప్యాయత లు, మమకారాలే ముఖ్యమని నమ్మేవ్యక్తి ని నేను.   మా నాన్నగారి రుణం కొంత లో కొంత అయినా నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుంది " అన్నాడు రామారావు.

*    *   *

రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.

రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.

వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.

‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.

‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.

సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సం తోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.
     * *మిత్రులారా సమాజంలో ఇలాంటి యధార్థ సంఘటనలు కోకొల్లలు. ఈ రోజు మీరు మంచి హోదా లో ఉండవచ్చు గాక . మీరు ఈ భూమి మీద కు రావటానికి జన్మను ఇచ్చింది ఎవరు? మీరు అనుభవిస్తున్న   ప్రస్తుత   హోదా మీకు రావటానికి కారణం ఎవరు? కేవలం ఆస్తులు మాత్రమే పంచుకుంటాం. వారి బాగోగులు మాకెందుకు అంటూ  జన్మనిచ్చి,కష్టపడి  పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన కనపడే ఆ దేవుళ్ళ ను మరిస్తే ఎలా?* 
     *ఈరోజు మీ తల్లిదండ్రుల ను ఎలా చూస్తున్నారో రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కధ చదివిన తర్వాత అయినా సరే కొంతమంది కొడుకుల మనఃస్తత్వం అయినా మారుతుంది అని ఆశిస్తున్నాను*.
*తమ స్వంతం   గురించి పట్టించుకోకుండా పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తు గా భావించి వారిని మంచి ప్రయోజకులు గా చేసిన ప్రతి ఒక్క  తల్లితండ్రి కి ఈ కధ అంకితం* 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

Tuesday, May 26, 2020

పిత్రార్జితం** *‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*

Sunday, May 24, 2020

తారకరామునికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..గొడవర్తి శ్రీనివాసు.

శ్రీ నందమూరి హరికృష్ణుండొసగిన
దుర్జయవంశ దివ్యతేజం..
మహోన్నత మాతృమూర్తి శాలినీదేవీ ప్రసాదిత
కన్నడ కస్తూరికా పరిమళద్వయ బ్రహ్మజ్ఞానం..
తెలుగువారి చరిత్రకే వన్నెలద్దిన రేచర్లగోత్ర రాజసం..
తాతకు తగ్గ మనవడంటూ అభిమానులందరూ
చూసుకుని మురిసే సమ్మోహనరూపం..
నృత్య,గాన,వకృత్వాది జనరంజక కళలలో
తనకు మాత్రమే సొంతమగు మహోత్సాహ కళాకోశలం..
నవరస నటవిన్యాసాలను తన క్రీగంటి చూపులోనే పలికించగల అద్వితీయ నేర్పరితనం ..
కోట్లాది జనహృదయాలను అనుమోదమొనొర్చు సరిసాటిలేని నటనైపుణ్యం..
పసిబాలుని మనస్తత్వం..
వసివాడని ఘన వారసత్వం..
వెరసి మా నందమూరి తారకరాముడంటేనే
తెలుగుసొబగుల సౌరభం..
అఖిలాంధ్ర అభిమాన జనహృదయ ఆనందనందక
నటతేజోవిరాజ అభినయధురీణుడు
మా అన్న నందమూరి తారకరామునికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..గొడవర్తి శ్రీనివాసు.
 #HappyBirthdayNTR
@Tarak9999Official

Sunday, May 17, 2020

ఇదీ బెజవాడ అని ....భండారు శ్రీనివాసరావు అనే సీనియర్ పాత్రికేయులు

బెజవాడ అంటే తెలియనివారు.
బెంజి సర్కిల్, రింగురోడ్డు.
మాత్రమే అనుకునేవారికి.

ఒకసారి తెలుసుకోండి. 
 ఇదీ బెజవాడ అని ....

భండారు శ్రీనివాసరావు అనే సీనియర్ పాత్రికేయులు కొన్ని సంవత్సరాల క్రితం రాసింది ...

మీరు చూసిన, విన్న బెజవాడ మారిపోయి చాలా కాలం అయిపొయింది ...
మీకు తెలిసిన బెజవాడ చాలా తక్కువ, ఇదిగో భండారు శ్రీనివాసరావు గారు రాసింది చూడండి ...
బెజవాడ అంటే ఇది ...
🔥🔥🔥🔥🔥🔥
"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే వ్యక్తుల మధ్య రగిలే పగలు, సెగలు ఇవాళ బెజవాడ అంటే. బహుశా దాన్ని విజయవాడ అనాలేమో.

బెజవాడ కాదేమో ...  నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన బెజవాడ మాత్రం కాదు.

నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు.

సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు.

అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ,
కే.ఎల్.రావు,
టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ దక్షిణా మూర్తి,
మరుపిళ్ళచిట్టి,
కాకాని వెంకట రత్నం,
కాకరపర్తి భావన్నారాయణ,
ఖుద్దూస్,
ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో
ఆణి ముత్యాలు ...
బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.

🎼🎼🎼
సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు,
చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు,
మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు, శ్రీరంగం గోపాల రత్నం.

బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.

📖📖📖
సాహిత్యంలో.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ,
పేరాల భరత శర్మ,
చెరుకుపల్లి జమదగ్ని శర్మ
వంటి కవి పండిత శ్రేష్ఠులు,

🏯🏯🏯🗼🗼🗼
పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన
చుండూరు వెంకటరెడ్డి,
కౌతా పూర్ణానందం,
మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు,

🎥🎥🎥📽📽📽🎞🎞🎞

సినీ రంగం ప్రముఖులు.
పోతిన శ్రీనివాసరావు,
పూర్ణ మంగరాజు కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు,
నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య,
తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల -

 బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.

💰💰💰💰💰💰

ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు,
తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు,

📖📖📖🏢🏢🏢
జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన.
అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా,
నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని అద్దంకి శ్రీరామమూర్తి,
విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప,
బి.వి. రంగారావు,
సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య,
సీడీ కృష్ణమూర్తి,
నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య,

🥊🥊🥊🏋🏋🏋🤼‍♂🤼‍♂🤼‍♂

వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు,

🎓🎓🎓⚖⚖⚖
ప్లీడర్లు
కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి, చక్రవర్తి,
పాటిబండ సుందరరావు,
ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు,

📰📰📰✒✒✒

పత్రికా సంపాదకులు.
 నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్,
నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి,
ఏబీకె ప్రసాద్,
పీ.ఎస్. ప్రకాశరావు,

అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన
భండారు పర్వతాలరావు -

వీరిదీ బెజవాడ.

బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!

ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు,

వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు,

లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు

తెన్నేటి లత,
కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు,

 నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు,
నిమ్మగడ్డ వారి ఎంవీకేఆర్ పబ్లిసిటీస్,

దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే నేషనల్ లితో ప్రింటర్స్

బెజవాడకు లాండ్ మార్కులు.

టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్,

వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు,

కాళేశ్వరరావు మార్కెట్ లో గుండపు చలపతిరావు,
తలుపులమ్మల కమీషన్ కొట్టు,

శ్రీ రామనవమి పందిళ్ళు,
రామకోటి సప్తాహాలు,
నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే

అదీ బెజవాడ.

🏞🌇🌆🏙🌃🎆🛣🌉

తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్,
తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం,
డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్,
కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి,
సామారంగం చౌక్,
చల్లపల్లి బంగ్లా,
బోడెమ్మ హోటల్,
న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు,
అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్, అలంకార్ సెంటర్,
మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్,
బీసెంట్ రోడ్డు,
ఏలూరు రోడ్డు,
వీధి రాజయ్య మేడ,
బందర్ రోడ్డు,
పాత శివాలయం,
కొత్త గుళ్ళు,
జెండా పంజా బస్ స్టాఫ్,
అక్కడ గుమిగూడే జనం.

ఇవీ బెజవాడ అంటే.

లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు,
ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు రోడ్డు సెంటర్,
అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్,
మోడర్న్ కేఫ్ లో మినప దోసె, దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా,
ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా,
రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం.
మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,

కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం, సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది,
వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల,
నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం. ,
మారుతి సినిమా,
జైహింద్ టాకీసు,
లక్ష్మీ టాకీసు,

ఎప్పుడూ హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్,

ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్,

పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్-

ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.

రాఘవయ్య పార్క్,
 రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం,
దివ్యజ్ఞాన సమాజం,
అన్నదాన సమాజం,
కాళేశ్వర రావు మార్కెట్,
 గాంధీ కొండ,
పప్పుల మిల్లు,
శరభయ్య గుళ్ళు,
అరండల్ సత్రం,
చెట్ల బజారు,
గోరీల దొడ్డి,

కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ,
ప్రకాశం బరాజు, 🚟🚟🚟
(సుంకర వెంకట రమణ)
🕉🕉🕉🕉🕉🕉
అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ,
✝✝✝
గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట,
రేడియో స్టేషన్, 🎙🎙🎙
నక్కలరోడ్డు
అచ్చమాంబ ఆసుపత్రి,
అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి,
మాంటిసోరి స్కూలు,
బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ,
మొగల్రాజపురం గుహలు,
ప్రెస్ క్లబ్.
పి.డబ్ల్యూ. డి. గ్రౌండ్స్.
..............
ఇంకా, ఇంకా ఎన్నెన్నో.

🏥🏥🏥🚌🚌🚌
 ఎస్.ఆర్.ఆర్. కాలేజి,
లయోలా కాలేజి,
శాతవాహన కాలేజి,
గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, సి.వి.ఆర్. స్కూలు,

ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.

అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో తెలియనివాళ్లు తీసిన సినిమాలు, చెప్పే మాటలు విని,
చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి.

మా బెజవాడ చాలా గొప్పది. “అరవ వాళ్లకి మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”

🙏🙏🙏

ఈ పోస్ట్ మరో గ్రూపు నుండి వచ్చింది. మీతో పంచుకోవాలనిపించి షేర్ చేస్తున్నా....
ముందు తరం వాళ్లకి పంపిస్తే గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతారు. గ్యారంటీ నాది.

Saturday, May 16, 2020

"వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు "

దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు. బతుకు తీపి అనేదే ఒక అద్భుతం. మనం అల్పం అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ తీపి ఉంటుంది. చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ బతుకు తీపి. జీవితానికి ఉన్న విలువ అపారం-లౌకికమైన ప్రయోజనాలతోపాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం ` జీవితం ' అనే అంశంలో ఇమిడి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావల్సిన నైతికసూత్రాలు, నియమాలుం అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు. "ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. ఈ రెండింటినీ సాధించడమే అసలైన ప్రయోజనం " అన్నది స్పష్టమైన నిర్వచనం. అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు. ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బతుకునే పూర్తిచేసుకోవాలనుకుంటాడు. ఈ ఆత్మహత్యా ప్రయత్నధోరణి ఉద్రేకం వల్ల, ఒత్తిడివల్ల కలుగుతుంటుంది. జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, `ప్రశాంతత ' అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని పోగుట్టుకుంటున్నాం.
హనుమంతునికి సీతాదేవి జాడ తెలియక నిరాశతో తిరిగివెళ్ళడంకన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుంటాడు. కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయట పడ్డాడు. సక్రమంగా అలోచించాడు. "వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు ".. ఇది హనుమంతుని మాట. ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మననం చెస్తే చాలు. నేటితరం అంతా వాళ్ళ గది గోడల మీదనో, డైరీ మొదటి పేజీలోనో మొత్తానికి హృదయఫలకంపై బలంగా లిఖించుకోదగిన వాక్యమిది. "చనిపోవడంలో చాలా దోషాలున్నాయి. జీవించి ఉంటే చాలు శుభాలను చూడవచ్చు " ఒక్కొక్కసారి అంతా శున్యమే అనిపిస్తుంది. కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కలగవచ్చు. ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే మిగలదు. ఈ వాక్యంతో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం ఫలించింది. అశోకవనంలో సీతజాడ దొరికింది. ఆశావాదానికున్న సత్ఫలం అది.
"అలలా వచ్చిన దిగులే అంతాకాదు".
తనకుమారులందరూ విశ్వామిత్రుని కారణంగా మరణించాక వసిష్ఠునికి దు:ఖోద్రేకం కలుగుతుంది. కొండపైనుండి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు. ఈ లోపల భూదేవి ఆయనను చేతితో పట్టి కాపాడి మందలిస్తుంది-" ఓ వెర్రీ! చచ్చిపొతే జీవితం తీరిపోతుందా?" అని ప్రశ్నిస్తుంది. ఇది చాలా సూటి ప్రశ్న. మరణిస్తే దేహాన్ని కోల్పోతాం. కానీ మరో ఉపాధితో జీవించక తప్పదు. అప్పుడు ఇప్పటి ఆత్మహత్యాపాపఫలాన్ని సైతం అనుభవించవలసిందే. నిజంగా జీవితం పై విరక్తి వస్తే `శాశ్వతశాంతి ' కి చేరువయ్యేందుకు ఈ జీవితాన్ని వినియోగించుకోవాలి. ఙ్ఞానాన్ని సంపాదించాలి. దీనితో తపస్సుచేసి బ్రహ్మఙ్ఞానంతో సుస్థిర శాంతిని పొందుతాడు. ఈ కథలో జీవుని పరంగా తాత్త్విక స్పృహతో ఆత్మహత్యా ప్రయత్నం అవివేకం అని స్పష్టపరచారు.
ఇలా ధార్మికంగా, లౌకికంగా, తాత్త్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది లేదు. ముందు మనం-అటు తరువతే లోకం. బయట వస్తువులపై, వ్యక్తులపై మమకారం, ఆశా పెంచుకొని అవికోల్పోతే బతుకునే బలి చేసుకొనడం మూర్ఖత్వం. బయట వస్తువు లభించక ముందూ మనం ఉన్నాం. అది పోయినా ఉంటాం. మనల్ని నాశనం చేసుకొనే హక్కు మనకే లేదు. " ఓర్చినమ్మకి తేటనీరు ' అన్నట్లు సహనానికి ఫలం సౌభాగ్య

Friday, May 15, 2020

"మళ్లీ కవిగానే పుడతా.... తెలుగు దేశంలో మాత్రం కాదు!!"..... తనికెళ్ల భరణి....

"మళ్లీ కవిగానే పుడతా.... తెలుగు దేశంలో మాత్రం కాదు!!"
ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు.....  తనికెళ్ల భరణి....
ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు.... అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో.... ఆయన మాటల్లోనే.....
"అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం" అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.
వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లోో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.
గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే..... తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే..... 'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.
కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.... వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు.
తెలుగుకు ఆ శక్తి ఉంది....
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.
"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ.
అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"
ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే.... చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయటం అంటారా.... అబ్బో అదో బ్రహ్మ విద్య.
ఓ సినిమాలో చెప్పినట్టు... దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి... షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం.
మారాలి.... మనం మారాలి. మన ఆలోచన మారాలి.  మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.
అమ్మ  చేతి  గోరుముద్ద  తెలుగు.
రుచి  రాగాల పాల ముద్ద తెలుగు.
వాట్స్ ప్  ద్వారా  వచ్చినది.
రాసిన వారికి  కృతజ్ఞతలు.

Total Pageviews