Monday, November 29, 2021

అమ్మా శ్రీ మాత్రై నమ: అమ్మలా ఇలా ప్రదోష వేళ శివ శివానీ ఆరాధన మా తరమా! 1

అమ్మా శ్రీ మాత్రై నమ:




అమ్మలా ఇలా ప్రదోష వేళ శివ శివానీ ఆరాధన మా తరమా!
1) https://www.youtube.com/watch?v=CH_ur268TmQ

అమ్మ పూజలు లేని కార్తికం నమ్మ లేకుండా వుంది.
నింగీ, నేల, నీరు, నిప్పూ, గాలి,
గుళ్ళు, గోపురాలు, నదులు, సముద్రాలు
చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, రాయి, రప్ప, సకల జీవాల్లొ
సర్వే సర్వత్రా నిండివున్న ఆ సర్వేస్వరుణ్ణి ప్రార్ధించేందుకు
వయస్సు, వాతావరణం అడ్డంకి కాదు ఆవిడకి
నోములూ, పూజలు, వ్రతాలు, పండుగలు, పబ్బాలు
తెల్లవారు ఝామున చన్నీటి స్నానాలు, ఉపవాసాలు
మధు మేహం వున్నా, హృద్రోగం వున్నా దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినకుండా
ఇంటిలోను, పెరట్లో తులసికోటకు పూజలు అయినాక
రుబ్బురోలు కూడా శివ శివానీ స్వరూపమైపోతుంది పూజలందుకుంటుంది.
ఆ భక్తి సంకల్పం ముక్కోటి దేవతలూ ఆవిడ చేత
నిత్యనీరాజనల పూజలందుకుని ఆనందించి ఆవిడ కోరుకున్న
"పువ్వులా తీసుకు వెళ్ళిపోండి" అన్న ఆవిడ ప్రార్ధనలు
విని వారి సన్నిధిలో నిత్య కైంకర్యాలకు నియమించుకున్నారు.
చిన్నప్పటి నుంచి ఏ మాసమైనా,
ఏ పండుగైనా ఆవిడ హాడావుడి అవిడదే
అందరికీ సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానాలు అయిపోవాల్సిందే
ఎప్పుడూ మా అందరి క్షేమం కోసం అదుర్ధా పడే దానివి
అలా ఎలా వెళ్ళిపోగలిగావు, అనాయాసంగా
అర్ధాంతరంగా, నిర్దయగా,
మమ్మల్ని ఈ లోకంలో పడేసి
అయ్యో పిల్లలు ఏమైపోతారు అన్న బెంగ లేకుండా
అమ్మా శ్రీమాత్రై నమ:

మాతృదేవోభవ! అమ్మా నీ విలువ ఇప్పుడే తెలుస్తోంది. వెలుగు చూపిన అమ్మ అంటే ఎందుకో అంత చిన్న చూపు. అమ్మ జ్ఞాపకంగా మారిపోడం వ్యక్తి జీవనంలో అత్యంత దురదృష్టకరం. చిన్నప్పుడు ఆటపాటల్లో మురుస్తూ అమ్మను మరుస్తాం. అది తెలియని తనం పెద్దయ్యాక బతుకు తెరువుబాటలో మరోమారు అమ్మను మరుస్తాం అది తెలిసిన తనం. అమ్మేకదా అన్నచులకన భావం అమ్మ విలువ అమ్మ ఉండగా తెలుసు కోలేము తల మీద తైలం పెట్టి అమ్మ కడుపు చల్లగా అంటూ వెన్ను నిమురుతూ ఆశీర్వదించిన ఆ ఆ చెయ్యి, ఆ స్పర్స, ఆ సుస్వరం ఒక్కసారిగా మాయమై స్వర్గానికి చేరుకోవడం ఎంత దురదృష్టకరం శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష!! అన్న అభ్యంగన స్నానానంతర ఆశీర్వచన అనుభూతి అనిర్వచనీయం ఇక సదా స్మరణీయం! కోరితేగానీ, కోరినాగాని వరమీయడు ఆ దైవం కోరకుండానే ఎల్లప్పుడూ మన బాగుకోరే అమ్మే మన దైవం అమరపురికేగిన అమ్మ ఆశీర్వచనం మాత్రం అమరం మాతృదేవోభవ! అమ్మ కనుమరుగైన వేళ ఆదరంతో అనునయించిన బంధు మిత్రులందరికీ శతసహస్ర వందనాలు🙏🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment

Total Pageviews