Tuesday, November 22, 2022

 పెళ్ళిపిలుపు

**  **  ** 

మా చిన్నతనంలో పల్లెటూరులో అగ్రహారంలో ఎవరి ఇంట్లో ఐనా పెళ్ళి జరగబోయే ముందు 

వీలైనంతవరకు కన్యాదాత భార్యసమేతంగా బయల్దేరి స్వయంగా పిలిచేవారు. 

ఆపిలుపుల్లోకూడా రకరకాల వైవిధ్యం గమనించండి

1. బాగా దగ్గర బంధువులు సన్నిహితులు అయితే ఒక మంచిరోజున వారి ఇంటికివెళ్ళి

(దృశ్యం)

కన్యాదాత: యాజులు బావగారూ

యాజులు గారు (ప్రవేసిస్తూ) ఓహో శాస్త్రిబావగారా రండీ. (ఈలోగా యాజులు గారి భార్య ప్రవేశిస్తుంది)

శాస్త్రి: బావగారూ మీకు తెలుసుగా. పెద్దమ్మాయి వివాహం ఎల్లుండి రాత్రి 7.30 కి. మీరు అక్కయ్యగారు పిల్లలు తప్పకరావాలి. ఈ ఐదురోజులూ మీరు దగ్గరవుండి వివాహం జరిపించాలి

యాజులు: అలాగే బావగారు.

శాస్త్రి భార్య: (యాజులు గారి భార్యకు బొట్టుపెట్టి) వదినా  రేపు  మీమేనకోడలుని పెళ్ళికూతురుని చేస్తాం. వచ్చి పిల్లను ఆశీర్వదించాలి. తర్వాత పెల్లికి వచ్చి ఐదురోజులూ వుండి ..

యాజులు భార్య: అలాగే వదినా. 

యాజులు: అన్నట్టు శాస్త్రీ దొడ్లో పనస చెట్టు కూరకాయలు నాలుగు పంపుతాను. పాదుని గుమ్మడి కాయలు  ఆనపకాయలు కూడా పంపుతాను

యాజులు భార్య: అన్నట్టు వదినా వంటకు..

శాస్త్రిభార్య: తణుకు నుంచి సుబ్బన్నగారు వస్తున్నారు.

యాజులు భార్య: ఆహితాగ్నుల మాటేమిటి?

శాస్త్రిభార్య: మాపిన్ని వుంది వదినా

యాజులు భార్య: అదేమిటీ అత్తయ్యగారు వక్కరివల్లా అవుతుందా? నేనూ మడికట్టుకుని .........

2 వ దృశ్యం

వూరిలో తెలిసిన  దూరపు చుట్టాలని స్నేహితులను పిలవడం 

శాస్త్రి: శర్మగారూ

శర్మ ప్రవేశిస్తూ ఓహో శాస్త్రి గారా. రండి రండి

శాస్త్రి: శర్మగారూ ఎల్లుండి రాత్రి 7.30 కి మాపెద్దమ్మాయి వివాహం. తాము బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి వధూవరులను ఆశీవర్దించాలి. మర్నాడు మధ్యాహ్నం దేవతార్చనకు  దయచేయాలి. అక్కయ్యగారు లోపలవున్నారా

శర్మతలవూపుతారు. శాస్త్రిగారి భార్య లోపలిలికి వెళ్ళి 

వదినగారూ రేపు మాపెద్దమ్మాయిని పెళికూతుర్ని చేస్తాం. మీరు వచ్చి పిల్లని ఆశీర్వదించాలి. ఎల్లుండి రాత్రి 7.30 కి పెళ్ళికి మర్నాడు మధ్యాహ్నం సంతర్పణకి తప్పక రావాలి

సాధారణంగా ఆరోజుల్లో వివాహమహోత్సవ ఆహ్వాన పత్రికలు అంటూ వుండేవి కావు

ఇతరగ్రామాలలో వున్న బంధువర్గానికి పోస్టు కార్డు వ్రాయడమే

మరో విషయం. భోజనాని కి అని గాని విందు అనిగాని పిలిచేవారుకాదు. దేవతార్చనకి అనే మాటే వాడేవారు

ఈ పద్ధతి 1936 వరకే అని గుర్తు.

రాను రాను కాలంతో మార్పులు వచ్చాయి. 

అవి తమకే తెలుసు కదా

కొసమెరుపు: 1. మార్చి 1945 నాపెళ్ళికి కార్డు ప్రింటైన శుభలేఖే 

మరోకొసమెరుపు: ఈమధ్య అంతర్జాలంలో పిలిచేస్తున్నారు

భవదీయుడు

25-12-2022 న 96 లోకి దేవుని దయవల్ల అడుగిడబోయే

కాలనాధభట్టవీరభద్రశాఅస్త్రి

హ్యూస్టన్ అమెరికా’


No comments:

Post a Comment

Total Pageviews