Thursday, March 3, 2016

పరగడపున వేడినీళ్లు తాగితే... వెలకట్టలేనన్ని ప్రయోజనాలు..!
ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. అంతేకాదు.. రోజూ ఇది కంపల్సరీ. ఒక్కరోజు ఈ కాఫీ, టీ మిస్సయిందంటే.. ఏం తోచదు. కానీ... ఉదయాన్నే పరగడపున వేడి నీళ్లు తాగితే.. అమోఘమైన ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. వేడినీళ్లు తీసుకుంటే.. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట.
సాధారణంగా ఉదయాన్నే నీళ్లు తాగాలనిపిస్తే.. చల్లటినీళ్లు తాగుతాం. వీటినే అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇవి రిఫ్రెష్ చేస్తాయి. కానీ.. ఉదయాన్నే పరగడపున వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, శరీరంలోని టాక్సిన్స్ తొలగిస్తుంది.
అలాగే.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆర్టికల్ చదివాక మీరు తప్పకుండా.. ఉదయాన్నే వేడినీళ్లు తాగడం మొదలుపెడతారు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి అనుకుంటున్నారా ? ఇందులో ప్రయోజనాలు అంత అమూల్యమైనవి కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆర్టికల్ చదివేయండి...
రక్తప్రసరణ పరగడపున వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంటే.. దీనివల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.
అవయవాలను శుద్ధిచేస్తుంది ఒక కప్పుు వేడినీళ్లు పరగడపున తీసుకోవడం వల్ల శరీరంలోని విషపూరిత టాక్సిన్స్ తొలగిస్తుంది. పొట్టలోని ఆహారం, లిక్విడ్స్ ని డీకంపోజ్ చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడానికి ఒక గ్లాసు వేడినీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించడం తేలికవుతుంది. దీనివల్ల కిడ్నీలకు, ఇతర అవయవాలకు మంచిది.
మెటబాలిజం ఉదయం అల్పాహారానికి ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కడుపునొప్పి ఉంటే తగ్గిపోతుంది. అలాగే మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. కడుపునొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.
మలబద్ధకం మనం తీసుకునే ఆహారాల్లో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల అనేకమంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. పైల్స్ ఉన్నవాళ్లకు నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడుతాయి. ఈజీగా జీర్ణమవుతుంది.
గొంతునొప్పి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడినీళ్లు చక్కటి పరిష్కారం. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శ్వాసనాళాలను శుభ్రం చేసి.. శ్వాస తేలికగా ఆడటానికి సహాయపడుతుంది.
.
గాడిద గుడ్డు కధ
'గాడిద గుడ్డు..' అంటూ ఉంటారు. అసలు గాడిద గుడ్డు పెట్టదు కదా! మరి ఎందుకలా అంటారు ? చదవండి .
జోగులుకి చదువు అబ్బలేదు. ఆరుశాస్త్రాలలో ఉద్దండులయిన పండితులు ఉన్న ముంగండ అగ్రహారంలో, ఇరవై ఏళ్ళు వచ్చిన తాను ఒక్కడే, ఇలా చదువు రాక మిగిలిపోవడం అతనికి తలవంపులుగా అనిపించింది .దూర దేశానికి వెళ్లయినా సరే, పిలక్కి తాడు కట్టుకుని అయినా సరే( నిద్ర మానుకుని కష్టపడటం అనేందుకు ఈ ఉపమానమ్... నిద్ర పొతే, తూలి , పిలక్కి ఉన్న తాడు వెనక్కి లాగడంతో మెలకువ వస్తుంది కదా...) మహా పండితుడయ్యి తిరిగి రావాలని సంకల్పించాడు .
దూర దేశానికి వెళ్లి, ఒక సత్రంలో బస చేసి, తోటి ప్రయాణికుడిని ' అయ్యా! నన్ను ఆరు మాసాల్లో పండితుడిని చెయ్యగల గురువు కావాలి,' అని అడి గాడు .
'ఓ లేకేం, నేను విద్య నేర్పిన శిష్యులు అంతా ఇప్పుడు రాజాస్థానాల్లో కొలువు చెస్తున్నారు. మరి, గురుదక్షిణ ఏమి ఇస్తావ్ ?' అని అడిగాడు ఆ గురువు.
' నా బంగారు మురుగులు ఇస్తాను. గురువర్యా! వెంటనే నాకు విద్య నేర్పండి,' అంటూ సాష్టాంగ పడ్డాడు జొగులు.
'నీకు శబ్దాలూ, సంధులూ వచ్చునా?'
'వాటిల్తోనే అసలు చిక్కండీ . సంధులూ- సమాసాల జోలికి పోకుండా పండితుడిని కాలేనా?'
'అసలు వాటితో అవసరం లేకుండా పండితుడిని చెయ్యడమే నా ప్రత్యెకత. శత శ్లోకేన పండితః ' అన్నారు పెద్దలు. అంటే వంద శ్లోకాలు నేర్చినవాడు పండితుడు అవుతాడని శాస్త్రమ్...
"గురువుగారు, మరీ వంద శ్లోకాలు నేర్చుకోవడం కష్టం . కాసిన్ని శ్లోకాలు తగ్గిస్తే పండితులు కాలేరా?" దీనంగా అడిగాడు జోగులు .
" తగ్గకేమి? చతుః శ్లోకేన పండితః " , అన్నారు శాకటాయనుల వారు. అంటే, నోటికి నాలుగు శ్లోకాలు వచ్చిన వాడు కూడా పండితుడే,"
"అయితే, నాకు నెలకు ఒక శ్లోకం చప్పున నాలుగు నెలలకు నాలుగు శ్లోకాలు చెప్తే చాలు," అంటూ మురిసిపోయి, విద్యాభ్యాసం మొదలెట్టాడు జోగులు .
నాలుగు నెలల తర్వాత గురువుగారు 'పండితుడివయి పోయావు, ఇక నీకు తిరుగు లేదు పో,' అంటూ సెలవిచ్చారు. వెంటనే జోగులు తన వేలికున్న బంగారు ఉంగరం అమ్మి, కాశ్మీరు శాలువా భుజాల నిండుగా కప్పుకుని, కళ్ళు ఎగరేస్తూ, దర్జాగా అడుగులేస్తూ ఇంటి ముఖం పట్టాడు .
దారిలో అతడికి ఒక చచ్చిన గాడిద కనిపించింది . 'అనాధ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్ .. ' అంటూ తను నేర్చుకున్న మొదటి శ్లోకం గుర్తుకు వచ్చింది . వెంటనే ఒక తాడు తీసుకుని, గాడిద మెడకు కట్టి, ఈడ్చుకుని వెల్లసాగాడు . అది చాలా బరువుగా ఉండడంతో ఈడ్చలేక ఆయాసపడ సాగాడు .
వెంటనే రెండవ శ్లోకం గుర్తుకు వచ్చింది . "సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్..." అంటే, శరీరం అంతటిలో తలే ముఖ్యమయినది . కనుక, రంపం లాంటి కొమ్మ తీసుకుని, గాడిద తల నరికి దాన్ని తీసుకు పోసాగాడు . కాసేపటికి అది కూడా బరువు అనిపించింది .
అప్పుడు మూడవ శ్లోకం గుర్తుకు వచ్చింది . సర్వేంద్రియాణాం నయనం ప్రధానం ...' అన్ని ఇంద్రియాల కంటే కళ్ళే ముఖ్యమయినవి. వెంటనే, సన్నటి వెదురు బద్దతో గాడిద కన్ను గుడ్డు పెకిలించి, అది చేతిలో పెట్టుకు వెళ్ళసాగాడు . దారిలో ఒక పలివెల అనే దేశం వచ్చింది . ఆ దేశపు రాజు పండిత ప్రియుడు అని విని, రాజు వద్ద తన పాండిత్యం ప్రదర్శించాలని అనుకున్నాడు .
అప్పుడు జోగులుకి నాలుగోవ శ్లోకం గుర్తుకు వచ్చింది . ' రిక్తహస్తేన నో పెయాట్ రాజానం దైవతం గురుమ్... ', రాజును, దైవాన్ని, గురువును, వట్టి చేతులతో దర్శించకూడదు . ఏదో వొకటి ఇవ్వాలి, అనుకుని, రాజు వద్దకు వెళ్లి, తన చేతిలో ఉన్న గాడిద గుడ్డును ఇచ్చాడు .
ఆ వింత వస్తువును చూసి, బెదిరిన రాజు జోగులుకి బాగా దేహశుద్ధి చెయ్యమని, నౌకర్లకు ఆజ్ఞాపించాడు . తాను ఇంత శ్రమ పడి నేర్చిన పాండిత్యం, గాడిద గుడ్డు వల్ల వికటించిందని గొల్లుమన్నాడు జోగులు .
అదండీ సంగతి, గాడిద గుడ్డంటే , గాడిద కన్ను గుడ్డు అన్నమాట .
                          మంచిమాట!!

ఒక మంచి పుస్తకం మనకు విజ్ఞానాన్ని, వినోదాన్ని ప్రసాదిస్తుంది. 

అదేవిదంగా ఒక మంచి స్నేహితుడు లేక స్నేహితురాలితో గడిపిన 

సమయం 
మనకు ఆహ్లాదకరంగా, ఉపయోగంగా వుంటుంది. పుస్తకాలను, 

స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి. వారి ప్రభావం మన 

జీవితమంతా వుంటుంది.

శుభోదయం../\..


Wednesday, March 2, 2016

పిడికెడు ఉప్పు
"స్వామీజీ...
నా జీవితమంతా కష్టాలే.
ఈ జీవితాన్ని భరింoచలేకపోతున్నాను.
దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."
గురువు ఆ యువకుడి వైపు చూశాడు.
ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు.
యువకుడు అలాగే చేశాడు.
"తాగు"
యువకుడు గ్లాసు పైకెత్తాడు. నీటిని తాగాడు.
వెంటనే ఉమ్మేశాడు...
"అబ్బ... భరిoచలేని ఉప్పు...."
ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు.
"ఈ ఉప్పు ఈ చెరువులో వెయ్యి. ఈ నీటిని తాగు"
యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు.
"ఎలా ఉంది?"
"నీరు తీయగా ఉంది"
"అదే పిడికెడు ఉప్పు. అప్పుడెందుకు భరించలేకపోయావు.
ఇప్పుడెలా భరించావు?"
అది తక్కువ నీరు.
గ్లాసుడు నీరు.
అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు.
అంటే ఎక్కువ నీరు...
అందుకే ఉప్పదనం లేదు."
అన్నాడు యువకుడు.
"నాయనా...
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి.
అది గ్లాసులోనూ పిడికెడే.
చెరువులోనూ పిడికెడే.
కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...
చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి.
నీ పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది.
నీ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది"
అన్నాడు గురువు.
 తెలుగు విశ్వరూపం 
--------------------
అచ్చులతో అల్లికలు నేర్చి 
హల్లులతో మాలికలు కూర్చింది 
గుణింతాలతో సుగుణాలు చెక్కి 
ద్విత్వాలతో శిల్పాలు మలిచింది
సంధులతో సంబంధాలు పేర్చి
సమాసాలతో విశేషాలు చెప్పింది
సంయుక్తాలతో యుక్తులు పన్ని
అలంకారాలతో అందలమెక్కింది
విభక్తులతో ఆకర్షణ చేసి
ప్రత్యయాలతో ప్రతిమ చేసింది
యతులతో గతులు మార్చి
ప్రాసలతో ప్రతిభ చూపింది
చందస్సులతో ఉషస్సు నింపి
పద్యాలతో కదం తొక్కింది
అవధానాలతో వేదికలెక్కి
ఆశువుగా ధారణ చేసింది
నుడికారాలతో నుదుటి బొట్టై
తలకట్టులతో అందాలు చిందింది
సామెతలతో వాసికెక్కి
జాతీయాలతో రాశి పెంచింది
ఏమని వర్ణింతు
నా తెలుగు భాష ప్రతిభాపాటవం
సుమధుర సుందర అక్షర విశ్వరూపం !!

శుభోదయం../\..
చిన్న పిల్లలు తప్పు చేసినప్పుడు దండించే కన్నా, మంచి చేసినప్పుడు గుర్తించి మెచ్చుకోవడమూ, ప్రోత్సాహపూర్వకమైన బహుమతులను ఇవ్వడమూ చేయాలి. ఏ పిల్లవాడిలోనూ దండించి సత్‌ప్రవర్తనను నేర్పలేము. ముందుగా మనం ఆచరించి నేర్పించాలి. అలాగే ప్రేమాప్యాయతలను ఇవ్వడమూ, పుచ్చుకోవడమూ నేర్పించాలి.





Total Pageviews