Thursday, November 3, 2016

కార్తిక మాస వ్రతము. 4 వ అధ్యాయము... దీపారాధన మహిమ.

4 వ అధ్యాయము...     దీపారాధన మహిమ

ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తిక మాసమున ముఖ్యముగ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తిక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

శతృజిత్ కథ
పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు ఒక ముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నీ వెందుల కింత తపమాచరించు చున్నావు? నీ కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. అంత ముని పుంగవుడు ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నెర వేరగలదు' యని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో నియమాను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మాదులు జేసి, ఆ బాలునకు 'శతృజిత్' యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాకుమారుడు శతృజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునకు రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండి౦చుచు తన
కామవా౦ఛ తీర్చుకోనుచుండెను.
తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శతృజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦చుట మన్మధున కైననూ శక్యము గాదు. అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో నామెను సమీపించి తన కామవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములనుభవించెను.
ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్దరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.
ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలు దేరి గర్భగుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహాదానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామా౦ధకారముతో కన్ను మిన్నుతెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను. అంత యమకింకరులు' ఓ బాపడా ఎవరెంతటి నీచులైననూ, యీ పవిత్ర దినమున, అనగా, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అలా యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నప్పటికి మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆయనకు దానము చేసెను. శివదూతలు వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన వారి పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
నాలుగో అధ్యాయము - నాల్గవ రోజు పారాయణము సమాప్తం.

Wednesday, November 2, 2016

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం.

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||

నాగుల చవితి (గురువారం, 03.11.2016)

నాగుల చవితి (గురువారం, 03.11.2016)
కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు.నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.
నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||
సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ.
శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లా డింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది.
ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.

కార్తిక పురాణం 3వ అధ్యాయము - కార్తీకమాస స్నాన మహిమ

కార్తిక పురాణం
3వ అధ్యాయము - కార్తీకమాస స్నాన మహిమ
జనక మహరాజా! కార్తిక మాసమున యే ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు.
అధమము కార్తీకమాస శుక్ల పార్ణమి రోజు నయిననూ స్నానదాన జపతపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకి౦పుము.
బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట
ఈ భారతఖండమందలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వటవృక్ష౦బుపై భయంకర ముఖములతోను, దీర్ఘ కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయక౦పితము జేయుచు౦డిరి. తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పఠించుచు "ప్రభో! ఆర్తత్రాణపరాయణ! ఆనాధరక్షకా! ఆపదలోనున్న గజేంద్రుని, ని౦డుసభలో అవమానాలు పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ!"యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులుకు జ్ఞానోదయ౦ కలిగి "మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయ౦ అయినది మమ్ము రక్షింపుడు" యని ప్రాధేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని "ఓయీ! మీరెవరు? ఎందులకు మికీ రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు" యని పలుకగా వారు "విప్రపుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపదా కలగదు" అని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును యీ విధముగా చెప్పసాగెను.
"నాది ద్రావిడ దేశం. బ్రహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యంగా ధనంలాగుకోనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంట కుడిగానుంటిని.
ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తల౦పుతొ పదార్ధసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని యింటినుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి "ఓరి నీచుడా! అన్యాక్రా౦తముగా డబ్బుకూడాబెట్టినది చాలక, మంచిచెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివి గాన, నివు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు"గాక! యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమి౦పుమని వానిని ప్రార్ధి౦చితిని. అందుల కాతాడు దయదలచి "ఓయీ! గోదావరి క్షేత్రమ౦దొక వటవృక్షము గలదు. నెవందు నివసించుచూ యే బ్రాహ్మణుడు కార్తీకవ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణునివలన పునర్జన్మ నొ౦దుదువు గాక" యని వేడలిపోయెను. ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్నూ నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.
ఇక రెండవ రాక్షసుడు "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మణుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా యనునటులచేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచు౦డెడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవర్తి౦చితిని. కాన, నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము" అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను. "మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేయుచు మధ్యమాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాన౦తరము యీ రూపమును ధరించితిని, కావున నన్ను కూడా పాపవిముక్తుని కావి౦పు"మని ప్రార్ధించెను.
ఓ జనక మహారాజా! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి "ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోరకృత్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతును"యని, వారినోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనావిముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంటమునకేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦తురు. అందువలన, ఎంత ప్రయత్నించినాసరే కార్తిక స్నానాలనాచరించాలి.
ఇట్లు స్కాందపురాణా౦తర్గత, వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యముందలి మూడవ రోజు అధ్యాయము - మూడవ రోజు పారాయణము సమాప్తము.

Monday, October 31, 2016

కార్తిక పురాణం 2వ అధ్యాయము - సోమవార వ్రత మహిమ.

కార్తిక పురాణం
2వ అధ్యాయము - సోమవార వ్రత మహిమ
శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః |
తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః ||
జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.
కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నదీ స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తీసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను శ్రద్దగా వినుము.
కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట
పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి', తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అభ్యసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొనుచు౦డేడివారు. ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దుషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, ఛీ పోమ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెకు 'కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.
ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి తన భర్త గాడా నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలుగాని లేక, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచి పైన చెత్త చెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచు వర్ణసంకరు రాలయ్యెను. అంతేయే గాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భుదులు నేర్పి పాడు చేసి, విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను.
జనక రాజా! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా! కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణములనుండి చీము, రక్తము రాసికారుట ప్రార౦భమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయ౦కర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులుయే ఒక్కరు ఇప్పుడామెను తొ౦గి చూడ రైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొఘమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలనుభవించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, "భటులారా! ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన యినుప స్త౦భమునకు కట్టబెట్టుడు" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦దులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్త౦భమునూ కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండ రాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారిణిలుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లితండ్రులకు, అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦భీపాకమను నరకములో వేయగా, అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు ఏడు తరాలవాళ్లు అటు ఏడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.
ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మమెత్తి, ఆకలిబాధ పడలేక యిల్లిలు తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమవార వ్రతమాచరించి ఉపవసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నాము నరుగుపై పెట్టి, కాళ్లు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తికమాస సోమవారమగుట వలను, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుటవలననూ, శివ పూజ పవిత్ర స్థానమైన ఆ యింట దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మ౦తరజ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోతమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకోనేను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరు లేన౦దున లోనికేగాను. మరల 'రక్షింపుము రంక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులా౦గనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్యములో కుష్టురాలనై తనువు చాలించిన తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వికుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తిక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను"యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను.
వింటివా జనక మహారాజా! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధచేసి, ఇంకను ఇట్లు చెప్పదొడ౦గిరి.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.

కార్తీకమాసం.

   కార్తీకమాసం పండుగలు  -  - భక్తజనం ఆనందం
ఒక పండుగ ముగిసిన వెంటనే మరొక పండుగ వస్తోంది.. అది ఒక రోజు పండుగ కాదు.. నెల రోజుల పండుగ.. అదే కార్తీక పండుగ. కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగలో ఈ సారి చాలా ప్రత్యేకతలున్నాయి. కార్తీక మాసం ప్రారంభం కావడమే సోమవారం ప్రారంభమవుతుంది. అందునా కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ప్రత్యేకత.. మరొక ప్రత్యేక ఏమిటంటే ఈ ఏడాది కార్తీకమాసంలో 5 సోమవారాలు వచ్చాయి.ఈ పండుగ ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30 తేదీ వరకు ఉంటుంది.. అటువంటి ఆధ్యాత్మిక పండగ నెలలో వచ్చే వాటి గురించి తెలుసుకుందాం... ఆచరిద్దాం.. పండుగను ఆనందంగా చేసుకుంటాం..

  కార్తీకమాసం పండుగలు :-

1న భగినీహస్తభోజనం సోదరి ఇంట భోజనం చేయాలి.. 

కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నా చెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు.ఈ పండుగ నవంబరు 1వ తేదీన వస్తోంది. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒక రోజు అలక చెందగా ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు.అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

3న నాగుల చవితి... 

మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు.ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుంది. అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు.

10న ఏకాదశి ఉపవాసాలు 

కార్తీక మాసంలో  ఈనెల 10వ తేదీన ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఉపవాసాలు ఉంటారు.మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మ ణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.

11న క్షీరాబ్ది ద్వాదశి 

11వ తేదీ సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి (ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. 12,16,21 దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు.ఆ రోజున ప్రతీ ఇంటా ఈ దీపాల వెలుగులతో నిండిపోతుంది.

14న కార్తీక పౌర్ణమి

కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలి తం ఉంటుందని పండితులు చెబుతున్నారు.వచ్చే నెల 14వ తేదీన ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరున్ని పూజించి 365 ఒత్తులు వెలిగించి చం ద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతే కాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయం పాకం ఇప్పిస్తారు.

30న పోలి స్వర్గం 

కార్తీక మాసం ఆఖరి రోజు 30న అమావాస్య వెళ్లిన మరుసటిరోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వా రా విని వారికి స్వయంపాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాల్వలో గానీ, చెరువులోగానీ వదులు తా రు.దాంతోకార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి.

భగినీ హస్త భోజనం విశిష్టత.!

సోదర సోదరీమణులు అందరికీ భగినీ హస్త భోజనం శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు!!
భగినీ హస్త భోజనం విశిష్టత.!
సోదరుల, సోదరీమణుల ప్రేమకి అద్దంపట్టే పండుగలలో రాఖీ పండుగ వంటి విశిష్ట పండుగ ఈ భగినీ హస్త భోజనం! కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం. సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు, చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజుకార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమనగా... యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి *యమ ద్వితీయ* అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మనుపరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు, ఘనంగా సారె పెట్టి చెల్లెలిని పంపించాడు.
ఒకప్పుడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి- మర్యాద, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ * భగినీ హస్త భోజన * విశిష్టత.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.
మరొక్కసారి సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు!!

Total Pageviews