Wednesday, November 1, 2017

రెండక్షరాల జీవిత0

రెండక్షరాల జీవిత0
-------------------------------
"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి
"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని
రెండక్షరాల "అవ్వ "తాత "
"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "
అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ
రెండక్షరాల "గురు " వు దగ్గర
రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని
రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి
రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే
బంధాలను ఏర్పరచుకొని
రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ
రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ
రెండక్షరాల "బాధ "ని భరిస్తూ
రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని
రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి
రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి
రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ
రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ
రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ
రెండక్షరాల "ముప్పు " వచ్చి
రెండక్షరాల "చావు " వచ్చే వరకు
రెండక్షరాల "ముఖం "పైన
రెండక్షరాల "నవ్వు "ఉంటే
రెండక్షరాల "స్వర్గం "మన
అరచేతిలో ఉన్నట్లే..!!
ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే అదే జీవితం ....

కార్తిక పురాణము 14వ అధ్యాయం



కార్తిక పురాణము -పదునాల్గవ అధ్యాయము
కార్తీక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును(ఆబోతు, అచ్చుపోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని, దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును. కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, హాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీకపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తీకమాసమందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవఋణ మనుష్యఋణ పితృ ఋణములనుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో గూడ ధాత్రీఫలమును(ఉసిరి) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి ప్రభువగును. కార్తీకపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమపదము నొందును. దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును. ఈరోజు ఈశ్వర లింగదానమాచరించువాడు ఈజన్మమందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు లింగానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము - బాణము). కార్తీకవ్రతము అనంత ఫలప్రదము. సామాన్యముగ దొరకనిది. కనుక కార్తీకమాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భక్షించు, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగానుండుట, తిలదానము గ్రహించుట ఈఅయిదును విడువవలెను. కార్తీకమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకులయన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విథవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్ చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములందును జ్రాత్రి భుజించరాదు. అప్పుడు చాయానక్తమును జేయవలెను గాని రాత్రి భోజనము చేయగూడదు. చాయానక్తమే రాత్రి భోజనఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీకవ్రతము చేయువాడు చాయా నక్తమునే గ్రహించవలెను. చాయానక్తమనగా తన శరీరము కొలతము రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతి విధవలకు చాయనక్తము విహితము. సమస్త పుణ్యములను యిచ్చు కార్తీకమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆపాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీకవ్రతమును ఆచరించవలెను. కార్తీకమామందు ౧. తలంటుకొనుట ౨. పగలునిద్రయు, ౩. కంచుపాత్రలో భోజనము, ౪. మఠాన్న భోజనము, ౫. గృహమందు స్నానము, ౬. నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, ౭. వేదశాస్త్ర నింద యీ ఏడునూ జరుపగూడదు. తలంటుకొనుట-తైలాభ్యంగము.
ఈమాసమందు శరీర సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును, మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి తరువాత ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, ౪. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ౬. గంగాధరాయ స్నానం సమర్పయామి. ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ౮. జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి ౯. కపాలధరిణే గంధం సమర్పయామి. ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. ౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి ౧౩. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి ౧౫. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు
శ్లో!! పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః!
అర్ఘ్యం గృహాణ దైత్యారేదత్తంచేదముమాపతే!!
అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా! తనశక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు

1. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?
జ. గ్రానైట్
2. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?
జ. న్యూస్ పేపర్.
3. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?
జ. ఫైరింగ్
4. అందరూ భయపడే బడి ఏమిటి?
జ. చేతబడి.
5. అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
జ. పుస్తకాలు
6. వీసా అడగని దేశమేమిటి?
జ. సందేశం.
7. ఆయుధంలేని పోరాటమేమిటి?
జ. మౌనపోరాటం.
8. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
జ. పకోడి
9. కనిపించని వనం ఏమిటి?
జ. పవనం.
10. నీరు లేని వెల్ ఏమిటి?
జ. ట్రావెల్
11. నారి లేని విల్లు ఏమిటి?
జ. హరివిల్లు
12. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?
జ. బ్లడ్ బ్యాంక్
13. వేసుకోలేని గొడుగు ఏమిటి?
జ. పుట్టగొడుగు.
14. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?
జ. బ్రౌన్ షుగర్
15. వేయలేని టెంట్ ఏమిటి?
జ. మిలిటెంట్
16. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?
జ. శిరోజాలు.
17. రుచి లేని కారం ఏమిటి?
జ. ఆకారం
18. చారలు లేని జీబ్రా ఏమిటి?
జ. ఆల్జీబ్రా
19. అందరూ కోరుకునే సతి ఏమిటి?
జ. వసతి.
20. అందరికి నచ్చే బడి ఏమిటి?
జ. రాబడి.
21. తాజ్ మహల్ ఎక్కడుంది?
జ. భూమ్మీద.
22. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?
జ. ఇంటరాగేట్
23. అంకెల్లో లేని పది?
జ. ద్రౌపది.
24. చేపల్ని తినే రాయి ఏమిటి?
జ. కొక్కిరాయి.
25. వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?
జ. సెటైర్లు
26. భార్య లేని పతి ఎవరు?
జ. అల్లోపతి
27. అన్నం తినకపోతే ఏమవుతుంది?
జ. మిగిలిపోతుంది.
28. కూర్చోలేని హాలు ఏమిటి?
జ. వరహాలు.
29. వాహనాలకు ఉండని టైర్ ఏమిటి?
జ. రిటైర్
30. తినలేని కాయ ఏమిటి?
జ. లెంపకాయ
31. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?
జ. ఉపకారం.
32. కరవలేని పాము?
జ. వెన్నుపాము.
33. కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి?
జ. వడదెబ్బ
34. తాగలేని పాలు ఏమిటి?
జ. పాపాలు.
35. పూజకు పనికిరాని పత్రి ఏమిటి?
జ. ఆసుపత్రి
36.గీయలేని కోణం ఏమిటి?
జ. కుంభకోణం.
37. చెట్లు లేని వనం?
జ. భవనం.
38.వెలిగించలేని క్యాండిల్?
జ. ఫిల్డర్ క్యాండిల్.
39. కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?
జ. ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది.
40. స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు
జ. రిక్టర్ స్కేలు
41. తాగలేని రసం ఏమిటి?
జ. పాదరసం.
42. పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?
జ. డ్రైవింగ్ స్కూల్
43. నడవలేని కాలు ఏమిటి?
జ. పంపకాలు
44. ఆడలేని బ్యాట్ ఏమిటి?
జ. దోమల బ్యాట్
45.. కనిపించని గ్రహం ఏమిటి?
జ. నిగ్రహం.
46.. భోజనంలో పనికి రాని రసం ఏమిటి?
జ. పాదరసం.
47. తాగలేని రమ్ ఏమిటి?
జ. తగరం.
48. దేవుడు లేని మతం ఏమిటి?
జ. కమతం
49. దున్నలేని హలం?
జ. కుతూహలం.
50. రాజులు నివశించని కోట ఏమిటి?
జ. తులసి కోట
51. వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు?
జ. ఎవరు చేశారో తెలియకూడదని
52. నోరు లేకపోయినా కరిచేవి?
జ. చెప్పులు
53. చేయడానికి ఇష్టపడానికి ధర్మం
జ. కాలధర్మం
54. డబ్బులు ఉండని బ్యాంకు
జ. బ్లడ్ బ్యాంక్
55. ఓకే చోదకుడితో నడిచే బస్సులు
జ. డబుల్ డెక్కర్ బస్సు
56. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర
జ. విసనకర్ర
57. ఉత్తరానికి, దక్షిణానికి తేడా?
జ. ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్నిo వేయలేం.

కార్తిక పురాణం 13వ అధ్యాయం

కార్తిక పురాణం 13
వశిష్టుడిట్లు చెప్పెను. జనకరాజా! కార్తీకమాసమందు చేయదగిన ధర్మములను జెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో విుు. ఆధర్మములన్నియు ఆవశ్యకములైనవి. రాజా! కార్తీక ధర్మములు మా తండ్రియైన బ్రహ్మచేత నాకు జెప్పబడినవి. అవియన్నియు చేయదగినవి చేయనియెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రమునుండి దాటగోరువారును, నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతఃస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్ర దానము, అన్నదానము, ఇవి ముఖ్యములు. కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును జేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రీజప ఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేదవిద్యాదానము వీటిఫలమును జెప్పుటకు నాకు శక్యముగాు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడుబావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్మును ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడ సరిపోవు. కార్తీకమాసమందు ఉపనయనదానమును జేసి తరువాత మాఘమాసమందుగాని, వైశాఖమాసమందుగాని, ఉపనయనమును జేయించవలయును. సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంతఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను. అట్లు చేసిన యెడల గలిగెడి ఫలమును జెప్పుటకు భూమియందు గాని, స్వర్గమందుగాని యెవ్వనికి సామర్ధ్యము గలదు? పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసినయెడల ఆపుణ్యము ద్రవ్యదాతకు గలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చియొక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును జేయించిన యెడల అనంత ఫలము గలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాపవిముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలో ప్రాప్తి కలిగించినవాడగును. ఓ జనకరాజా! ఈవిషయమై పురాతన కథ యొకటి గలదు. చెప్పెదను. సావధానుడవై వినుము.
ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆరాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదులచేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై "అర్థోవా ఏషా ఆత్మనోయత్పత్నీ" అను శ్రుత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకుబోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆయరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతియాయెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆపర్ణశాలయందామె సుందరియైన ఒక కన్యను గనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత పూర్వ పుణ్యవశముచేత ఆకన్యక వృద్ధినొంది సౌందర్యముతోనుజ్ లావణ్యముతోను ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణియై యుండెను. ఆచిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను జూసియొక ముని కుమారుడు సువీరా! నీకూతును నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆమాటవిని రాజు మునికుమారకా! నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈకన్యను నీకిచ్చెదను. ఓ జనకమహారాజా! ఈమాటను విని మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓరాజా! నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను బొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆమాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదననెను. తరువాత మునికుమారుడు ఆనర్మదాతీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను. రాజు ఆధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తినొంది ఆ మునికుమారునకు తన కూతునిచ్చి తనయొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను. ఆకన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరును. రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగియొక కుమార్తెను కనెను. రాజు దానిని జూచి సంతోషించి యీసారి యీ కన్యకను విక్రయించిన యెడల చాలా ద్రవ్యము రావచ్చును. దానితో నాజన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజిట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికివచ్చి పర్ణశాలముందు ఉన్న రాజును, రాజుభార్యను, రాజుకూతును జూచెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆయతీశ్వరుడు దయతో ఓయీ నీవెవ్వడవు ఈఅరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నాు చెప్పుమనియడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యావియోగముతో సమానమయిన వియోగదుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈవనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈయరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆచిన్నదానిని యౌవనమురాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహముచేసి ఆధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకయేమివినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి యిట్లనియెను. రాజా! ఎంతపనిచేసితివి. మూఢునివలె పాపములను సంపాదించుకొంటివి. కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమను నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి జేయుచున్న వానికి పితృదేవతలు ప్రతిజన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవనరకమును పొందును. సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది కాని కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా జెప్పబడియుండలేదు. కాబట్టి ఈకార్తీకమాసమందు శుక్లపక్షమందు ఈరెండవ కూతునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము. కార్తీకమాసమందు విద్యాతేజశ్శీలయుక్తుడయిన వరునకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును, యధోక్ దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను జేిన వాడు పొందెడి ఫలమును బొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనియె. బ్రాహ్మణుడా ఇదియేమి మాట. పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా యేమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? నాయీ రెండవ కూతును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆద్రవ్యముతో సుఖభోగములను బొందెదను. నీకెందుకు నీదారిని నీవుపొమ్ము. ఆమాటవిని యతి స్నానముకొరకు నర్మదానదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆయరణ్యమందే సువీరుడు మృతినొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొనిపోయిరి. అచ్చట యముడు వానిని జూసి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలనుబొందించి అసిపత్రవనమందు రాజును రాజు పితరులను గూడ పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతోగూడిన చిక్కనివనము. ఈసువీరుని వంశమందు శ్రుతకీర్తి యనువాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను. స్వర్గమునకుబోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను. ఈశ్రుతకీర్తి సువీరుని పాపశేషముచేత స్వర్గమునుండి తాను నరకమున పడి యమయాతనలనొందుచు యొకనాడు యిదియేమియన్యాయము, పుణ్యముజేసిన నన్ను యమలోకమందుంచినారని విచారించుకుని ధైర్యముతో యమునితోనిట్లనియె. సర్వమును దెలిసిన ధర్మరాజా! నా మనవి వినుము. ఎంతమాత్రమును పాపమును జేయని నాకు ఈనరకమెందుకు వచ్చినది? అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు గలిగినది? శ్రుతకీర్తి యిట్లు చెప్పిన మాటలను విని యముడు పల్కెను. శ్రుతకీర్తీ! నీవన్న మాట సత్యమే గాని నీవంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు. ఆపాపముచేత వాని పితరులైన మీరు స్వర్తస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీతీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది. దానికింకను వివాహము కాలేదు. కాబట్టి నీవు నాప్రసాదము వలన ఈదేహముతో అచ్చటికిబోయి అచ్చటనున్న మునులతో యీమాటను జెప్పి కార్తీకమాసమందు ఆకన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీకమాసమందు సర్వాలంకార యుక్తమయిన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతాము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన యెడ ధనదాతయును, లోకాధిపతియునగును. కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసికొని వరునికిచ్చి వివాహము చేసిన యెడల కన్యాదాన ఫలమును బొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము. దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సంతోషింతురు. శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందుఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆపుణ్యమహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుబోయి సుఖముగానుండెను. తరువాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును యిచ్చెను. దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకుబోయిరి. తానును యథాగతముగా స్వర్గమును జేరెను. కాబట్టి కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు విగతపాపుడగును. ఇందుకు సందేహములేదు. కన్యామూల్యము యివ్వలేని వారు మాటతోనయినా వివాహమునకు సహాయము జేసిరేని వారి పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరించువాడు హరి సాయుజ్యమును బొందును. ఇది నిజము. నామాట నమ్ముము. ఈప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవనరకమును బొందుదురు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీహాత్మ్యే త్రయోదశోధ్యాయస్సమాప్తః

జై తెలుగు తల్లీ! 🙏🙏

[23:28, 10/31/2017] +91 90000 08008: కామేశ్వరరావు అనే తెలుగు భాషా ప్రేమికుడు  వాట్స్ ఆప్ లోఈ సందేశం పంపించారు.

అమ్మ చిక్కిపోతోంది.

తెలుగు భాషకు 56 అక్షరాలు ఉన్నాయంటే అవునా!  అని ఆశ్చర్య పడేవారూ, అవును గాబోలు! అని సర్ధుకుపోయేవారూ, కాదేమో! అని అనుమాన పడేవారూ, కానే కాదు! అని ఖచ్చితంగా చెప్పేవారూ, చాలా మందే ఉన్నారు ఈ మధ్య.

మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది. అమ్మా! బాగున్నావా? అంటే కంట నీరు పెట్టుకుంది. ఏమమ్మా, ఎందుకా కన్నీరు?  అంటే ఇలా చెప్పుకొచ్చింది.

కామేశం!

అచ్చులలో ఋ ఋ, ఌ , ౡ లను ఎప్పుడో తీసేసేరు.ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ తెలియక దాని అర్ధమూ తెలియక  ఌ, ౡ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది.
ఇక హల్లుల విషయానికి వస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండాపోయింది

"చ" వర్గంలో ఉన్న మరో ౘ, ౙ లను అందరూ మరచిపోయేరు.

ఇక ఉభయాక్షరాలకొస్తే శకట రేఫ అదేరా!  బండి  "ఱ" వాడకమే లేదు. అందరూ 'ర' తో సరిపెట్టుకుంటున్నారు.

పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా!
'ళ' బదులు 'ల', 'ణ' బదులు 'న' వాడేస్తున్నార్రా!
కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు. కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ.

ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన,జాన అంటునారు, వేణుని వేను అంటున్నారు.

ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు! అంటూ వాపోయింది.

పోతనగారైతే కాటుక కంటినీరు అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక, నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా!

ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్‌  మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ నాటికి తల్లినెంతగనొ నవ్వుల పాలొనరించు చుండ తా కాటుక కంట నీరొల్కగా తెలుగమ్మయె కుంగి పోదొకో

మిత్రులూ, అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుకుందాం. తెలుగు టంకణం (టైపింగ్) నేర్చుకుందాం. వ్యాఖ్యలన్నీ చక్కగా తెలుగులోనే వ్రాసుకుందాం. ఏమంటారు? తెలుగుకు పట్టిన తెగులుకు దేహశుద్ధి చేద్దాం.

జై తెలుగు తల్లీ! 🙏🙏

కార్తీకపురాణము12వ అధ్యాయం

 -- 12
వశిష్ఠమహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓరాజా! కార్తీకమాసమందు సోమవారమహాత్మ్యమును వినుము. సోమవారముకంటే శనిత్రయోదశి నూరురెట్లు ఫలముగలది. శనిత్రయోదశికంటె కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు ఫలముగలది. పూర్ణిమకంటే శుద్ధ పాడ్యమి లక్షరెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమికంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమైకాదశికంటే కార్తీకద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశియనగా కార్తీకబహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన యెడల కార్తీకశుద్ధ ఏకాదశియేయగును. వింధ్యోత్తరదేశమందు అంతిమైకాదశియనగా కార్తీకశుద్ధైకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీకశుద్ధైకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధైకాదశియే గ్రహించబడినది. మోహముచేతనైనా అంతిమైకాదశినాడు ఉపవాసముచేసి గీతవాద్య పురాణములచేత జాగరణమాచరించువాడు సమస్త పాపవిముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశినాడు ఉపవాసమాచరించి క్ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడా పారణచేయువాడు సాయుజ్యముక్తిపొందును. ద్వాదశినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిబొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. వేయి గ్రహణములును, పదివేల వ్యతీపాతయోగములును, లక్ష అమావాస్యలును కలిపి ద్వాదశీ వ్రతఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటె అధికఫలప్రదము. క్షీరాబ్దిద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు అనగా ఏకాదశినాడు రాత్రి యామముండగా హరి పాల సముద్రమునుండి నిద్ర లేచును గాన ఆద్వాదశి హరిబోధినియనబడును. ఆద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకయినను అన్నదాన మాచరించువాడు యిచ్చట భోగములనుబొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీకమాసమందు ద్వాదశినాడు పెరుగు అన్నమును దానముచేసిన యెడల సమస్త ధర్మములకంటే అధిక ఫలమునుబొందును. స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీక శుక్ల ద్వాదశినాడు పాలిచ్చెడియావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతోగూడ గోదానమాచరించిన యెడల ఆగోవుకు యెన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల యేండ్లు స్వర్గనివాసు కలుగును. కార్తీకమాసమందు ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరించు వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసికొని వైకుంఠలోకమునకుబోవును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ద్వాదశియందుగాని, పూర్ణిమయందుగాని, పాడ్యమియందుగాని, కంచుపాత్రలో ఆవునెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశినాడు ఫలమును, యజ్ఞోపవీతమును, 
తాంబూలమును, దక్షిణను, యిచ్చువాడు ఈలోకమందు అనేక భోగములను బొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో గూడా చికాలము సుఖించును. కార్తీక ద్వాదశినాడు బంగారపు తులసీవృక్షును, సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తీకద్వాదశినాడు పూర్వోక్తానమును జేసినవాడు ాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయి దానమిచ్చువాడు పొందిన ఫలమును బొందును. ఈవిషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదవరి తీరమందు దురాచారవంతుడైన యొక కోమటిగలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు. ానైనను అనుభవించుటయును లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనిందచేయు వాడు, పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆకోమటియొక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ ఋణమును తిరిగి పుచ్చుకొనుటకొరకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలిసికొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా! నాసొమ్ము నాకిమ్ము అనియడిగెను. బ్రాహ్మణుడా మాటవిని ఓయీ! యీనెలాఖరుకు నీ సొమ్మును నీకు యేదోయొక విధముగా యిచ్చెద్దను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసికొని పొమ్మనెను. ఋణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలనొంది తిరిగి ఋణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును యివ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పినమాటను విని వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢా! బ్రాహ్మణాధమా! నాధనము నాకిప్పుడేయిమ్ము లేనియెడల యీకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టుకొని లాగి క్రిందపడద్రోసి పాపబుద్ధిగలవాడగుటచేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆకత్తిదెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహముదెబ్బచేత లేడివలె మృతినొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చటనుండి పరిగెత్తి యింటికిపోయి క్బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినొందెను. అంత కరాళముఖులును, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును, భయంకరులును, నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆవైశ్యుని యమపాశములచేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞచొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగవిశేషము. దాని సంబంధమైనది రౌరవము. అనగా రురు మృగములచేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరము రౌరవనరకమనబడును. ఆవైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనముచేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను జేయింుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్నిజాతుల వారికి ఆకలిగలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను జేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆధర్మవీరుడు హరిని బూజించుసమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచు ఆనాడు యమలోకమునుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై "గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణో, అనంత. వైకుంఠ, శ్రీనివాస, శ్రీ వత్స భూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే" ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరు జూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రములవెంట ఆనంద భాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదుు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను.
తరువాత ఆవైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలినిబట్టినవాడై అర్ఘ్యాదులచేత పూజించి హేనారదా మీరు మాగృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు యేమిపుణ్యు చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్ా! మీకు దాసుడను ఏమిసేవచేయవలెనో చెప్పుము చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియె. నారదుడిట్లు పల్కెను. ధర్మవీరా! నామాటను జాగ్రత్తగా వినుము. కార్తీకద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆరోజున చేసిన స్నానదానాదికము అనంతఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశినాడు ధనికుడుగాని, దరిద్రుడుగాని, యతిగాని, వానప్రస్థుడుగాని, బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడు గాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, స్త్రీగాని, సాలగ్రామదానమాచరించువారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీరా! వినుము. నీతండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాపవిశుద్ధికొరకు కార్తీకద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానమును జేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియె. మునీంద్రా! గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలయిన మహాదానములచేత కాని ముక్తి శిలాదానము చేత యెట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట యెందుకు? అది భోజ్యముగాదు. భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారదమహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడ మూఢుడై సాలగ్రామ దానమును జేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్థానమయ్యెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోషముచేతను, సాలగ్రామ దానము చేయని దోషముచేతను నరకమందు బాధలనొంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరుాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము అయిదు మారులు వృషభమై యుండి తరువాత పదిమార్లు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును బొందియుండెను. ఇట్లు పదిజన్మలు గడచిన తరువాత పదకొండవ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనమురాగానే తండ్రి తగినవరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మవలన ఆవరుడపుడే మృతుడయ్యెను. దానిని, మృతినొందిన ఆఅల్లుని బందువులందరు వచ్చి చూచి అట్టి బాల్యవైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో జూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును దెలిసికొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యమును, పూర్వపాపమును జెప్పెను. ఇట్లు చెప్పి కూతురుయొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీకసోమవారమందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆసాలగ్రామ శిలా దానమహిమ చేత కూతురభర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరు సుఖముగా చిరకాలమునుండి స్వర్గమునకు బోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యముచేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీకసోమవారమున సాలగ్రామశిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను. రౌరవనరకమందున్ వాని తండ్రియు ఆసాలగ్రామ దాన మహిమ చేతముక్తుడాయెను. కాబట్టి జనకమహారాజా! కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందియములేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశీ సాలగ్రామదానాదులచేత పోగొట్టుకొన గల్గుదురు. కార్తీకమాసమందు సాలగ్రామదానమువలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తములేదు. ఇందుకు సందియము లేదు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వాదశోధ్యాయః

ముళ్ళపూడి ..వారు పేల్చిన జోకులు !

 ముళ్ళపూడి ..వారు పేల్చిన జోకులు !
.
టీచర్ పిల్లవాడిని ‘గుఱ్ఱము’ అని రాయమంటాడు.

పిల్లవాడు ‘గఱ్ఱమ’ అని రాసుకొస్తాడు. ‘ఇదేమిట్రా?’ అని టీచర్ కేకలేస్తాడు.

పిల్లవాడు అంటాడు : ‘మీరే కదా అన్నారు టీచర్ - ‘గుఱ్ఱము’ నకు కొమ్ములుండవు అని’
( అసాధ్యమిది వేరే భాషలో)
.
కృష్ణుడు తలుపు తీసి చూస్తే ఎదురుగా స్త్రీ మూర్తి ఉంటుంది. ‘అరె మీరా?’ అంటాడు కృష్ణుడు.
.
‘మీరా కాదు సక్కుబాయి’ –ఆ స్త్రీ సమాధానం (ఎలాగండి- వేరే భాష వారికి ఈ జోక్ చెప్పేది?)

Total Pageviews