Saturday, November 10, 2018

కార్తీక పురాణం - ౩వ అధ్యాయం

Image result for కార్తీక పురాణంశ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం!
లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!!



ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసినయెడల ఆస్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులుగాని, అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.
ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రిఅయములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా! ఆబ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుబోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులనుజూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగానున్నది. శరీరము నల్లగానున్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎర్రగానున్నవి. దంతములు పొడుగుగానున్నవి. చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆరాక్షసుల భయముచేత ఆవటవృక్షమునకు ఆరుక్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వతసమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలములయొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను జేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మర్రిచెట్టుమీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను.
Image result for కార్తీక పురాణం ౩వ అధ్యాయం
తత్త్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు దేవేశా౧ నన్ను రక్షించుము. లోకేశా!నారాయణా!అవ్యయా!నామొర ఆలకించుము. సమస్త భయముల నశింపజేయు దేవా! నాభయమును పోగొట్టుము. నాకు నీవే దిక్కు. నీవు తప్ప నన్ను రక్షింపసమర్థులెవ్వరును లేరు. ఈప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మ రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతనివెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆబ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మ రాక్షసులకు జాతి స్మృతిగలిగినది.
ఓరాజా! తరువాత వారు ఆ బ్రహ్మణునిముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లనిస్తుతించిరి. బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము కొరకయినది. అది న్యాయమే, మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకొరకే ఉపకారము కొరకే అగునుగదా. బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియెను. మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆబ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నాకుటుంబలాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడయినను అన్నమును బెట్టియెరుగను. బ్రాహ్మణులసొమ్ము స్నేహముచేత హరించుటచేత ఏడుతరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన యెడల సూర్యచంద్ర నక్షత్రములుండువరకు కుటుంబము నశించును. తరువాత మృతినొంది యమ బాధలను అనేకములనొందితిని. ఆదోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయమును విచారించి క్చెప్పుము.
అందులో రెండవవాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును, నా భార్యాపిల్లలును, షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నాతల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను, బంధువులకుగాని, బ్రాహ్మణులకుగాని, ఒకనాడయినను అన్నమును పెట్టినవాడనుకాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వకు యమబాధలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించితిని. ఓబ్రాహ్మణోత్తమా! నాకీపాపము తొలగు ఉపాయము జెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తనస్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా! నేను ఆంధ్రదేశ నివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను జేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆనేతిని వేశ్యకు యిచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి క్దానితో సంభోగించుచుండువాడను. ఆ దోషముచేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మ రాక్షసుడనై బుట్టి ఈ మర్రిమీద ఉంటిని కనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షించుపు. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము.
Image result for కార్తీక పురాణం ౩వ అధ్యాయంతత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచెమైనను భయములేదు. మీదుఃఖము పోగొట్టెను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను. నాతో మీరుకూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే గూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. "అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్స్నానమహం కరిష్యే" ఇట్లు సంకల్పము చేసి ఆబ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆముగ్గురు దోషవిముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి. ఓ జనకమహారాజా! వినుము. మోహము చేతగాని, అజ్ఞానముచేత గాని కార్తీకమాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు (తెల్లవారుఝామున) సూర్యోదయకాలమందు కావేరీనది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణుపూజను జేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీకమాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నామును తప్పక చేయవలయును. కార్తీకమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్స్నానముజేయని వాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని, పురుషుడుగాని కార్తీకమాసమందు ప్రాతస్స్నానము తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే తృతీయోధ్యాయస్సమాప్తః

Friday, November 9, 2018

శాంతాకారం...! శ్లోకంలోని అద్భుత భావన.


విశ్వానికి మూలమై, సాక్షియై, శక్తియై నడిపిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని బహువిధాలుగా దర్శించి, ఆవిష్కరించిన అద్భుతాలను ధ్యాన శ్లోకాలుగా, స్తోత్రాలుగా మన మహర్షులు అందించారు.
అలాంటి వాటిలో ఒక ధ్యాన శ్లోకాన్ని విశ్లేషించి చూసి అందులోని భగవద్విజ్ఞానాన్ని స్వీకరిద్దాం.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!
ఇందులో సృష్టిక్రమం,
సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.
*శాంతాకారo*
• సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.
• శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయి నట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.
*భుజగ శయనo*
‘భుజగశయనుడు’. అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.
ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలానికి లొంగి ఉన్నవి లోకాలు. కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.
*పద్మనాభం*
సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం. దానికి నాభి (కేంద్రం) విష్ణువే. అందుకే ఆయన ‘పద్మనాభుడు’.
*సురేశo*
విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు, విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు (సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.
*విశ్వాధారo*
కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు. సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.
కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.
నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’. అలల ‘ఆకారం’ అంతా జలమే. జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.
*గగన సదృశo*
ఇది ఎలా సంభవం?
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది. సమస్తమూ ఆకాశము నందే ఉన్నది. అదేవిధంగా ఆకాశంతో సహా, సమస్త విశ్వమూ ఎవరియందు, ఎవరిచే వ్యాప్తమై ఉందో, అతడే పరమాత్మ. అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).
ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది. ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.
*మేఘవర్ణo*
నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం ‘మేఘవర్ణం’
(మబ్బువన్నె)గా ఉన్నది.
*శుభాoగo*
మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయా ల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది. అందుకే అది నీలమేఘశ్యామం.ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే. కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు. తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగల స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు. అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.
*లక్ష్మీ కాంతo*
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయన ను ఆశ్రయించుకున్నాయి. ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి, ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది. అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.
*కమల నయనo*
ఐశ్వర్య దేవతకు ప్రీతికరం. కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవా నుడు ‘కమలనయనుడు’.
*యోగిహృద్యానగమ్యం*
ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు. యోగులు మాత్రమే ఏకాగ్రమై న దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయా లలో దర్శించగలుగుతున్నారు. ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.
*వందే విష్ణుo భవ భయహరo*
విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.
*సర్వలోకైకనాథమ్*
సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.
14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ
శ్లోకం స్పష్టపరుస్తోంది.
ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.
ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని, ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా, మన హృదయాలలోనే ఆయనను దర్శించ గలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.
అర్థస్ఫూర్తితో దీనిని పఠిస్తే, దీనిలో పరిపూర్ణ పరమేశ్వర తత్త్వాన్ని, సులభంగా అందుకోగలం.
ఇలా విశ్లేషిస్తే – ధ్యానశ్లోకాలలో విశ్వ నిర్వాహక విశ్వేశ్వర విజ్ఞానాన్ని మరింతగా తెలుసుకోవచ్చు.
(నది మాసపత్రికలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ , సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాసం)🌹

కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం


Image result for కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయంఅథద్వితీయాధ్యాయ ప్రారంభః
Image result for కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయంశ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. Related image

ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె.
Image result for కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోధ్యాయస్సమాప్తః

అన్నయ్యలకి, తమ్ములకి, అక్కాచెల్లెళ్లకి భగినీహస్తభోజన శుభాకాంక్షలు.

Image may contain: 1 person, textభగినీ హస్త భోజనం, యమద్వితీయ
'భగిని' అంటే తోబుట్టువు అయిన సోదరి అనీ, భాగ్యవంతురాలు అనీ అర్థం. సోదరి చేతివంటను తినడం . ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతి నిత్యం వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎన్నాళ్లకూ తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తికమాసం, శుక్లపక్షం, ద్వితీయాతిథినాడు విరామం దొరికింది. ఆ దినాన యమున ఇంటికి వెళ్లాడు. ఎన్నాళ్లో ఎదురుచూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్థనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడామె- 'అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినివెళ్లాలి. అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తిక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో, అలాంటివాళ్లకు నరకబాధ ఉండరాదు. ఇదే నేను కోరే వరం' అని పలికింది. యముడు 'తథాస్తు' అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక 'యమద్వితీయ' (యముడు తన సోదరి చేతివంటను తిన్న దినం) అనీ, 'భ్రాతృద్వితీయ' (అన్న చెల్లెలి చేతివంట తిన్న పవిత్ర దినం) అనీ ప్రసిద్ధిలోకి వచ్చింది.
'భగినీహస్త భోజనం' అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఇందులో మానవజీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి క్షణంకూడా జీవించలేడు. కుటుంబంలో ముఖ్యులు తల్లిదండ్రులు. వాళ్లు సంతానాన్ని కని, పెంచి, పోషించి, పెద్దచేసి, విద్యాబుద్ధుల్ని ప్రసాదించి, తమ సంతానానికీ కుటుంబాలను సంపాదించిపెడతారు. 
Image may contain: 1 personమనిషికి తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవాళ్లు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కదా! తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక, తమ సంతానం బతికినంతకాలం బతుకలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం వరకు బతికే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేగాక, ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కనుక ఈ భోజన సంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్యన జీవితాంతం వరకు ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకు తెరువుకోసం దూరదూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది. ఇక ఆధునికకాలం ఉపాధికోసం రాష్ట్రాల సరిహద్దులనే కాదు, దేశాలను, ఖండాలను దాటిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదుగదా, రెండు మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? కనుక ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకువెళ్లి, వాళ్ల చేతివంటను భుజించి, వారికి ధనకనక వస్తువాహనాలను యథాశక్తిగా సమర్పించుకొంటే ఆత్మీయబంధాలు వర్ధిల్లుతాయి. ఒకరికొకరం అండగా ఉన్నామనే భావన, విశ్వాసం కలుగుతాయి. ఇవే ఆచారాలు, సంప్రదాయాలు. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమం కోసం ఏర్పాటు చేసినవే ఆచారాలనీ, వాటిని వంశపారంపర్య క్రమంలో పాటించినప్పుడు సంప్రదాయాలవుతాయనీ పెద్దల మాట. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్ఠమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకొని, వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత అంటే.
'ఆత్మా వై పుత్రనామాసి' అన్నది వేదం. అంటే, తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతిరూపాలే. అమ్మ చేతివంట అమృతసమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంట కూడా సుధామయమే. కనుక 'భగినీహస్త భోజనం' అన్ని విధాలా అమృతభక్షణంతో సమానం. ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలు- ఈ పర్వదినంలోని మహిమ బోధపడుతుంది. ఏ సంప్రదాయమైనా, ఆచారమైనా మానవాళి మధ్య సద్భావనలను పెంపొందింపజేసి, స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగా నిలపడంకోసమే. ఇది గ్రహిస్తే భూలోకం అభినవ స్వర్గమే అవుతుంది.
Image may contain: food
అన్నయ్యలకి, తమ్ములకి, అక్కాచెల్లెళ్లకి భగినీహస్తభోజన శుభాకాంక్షలు.

కార్తీక పురాణం - ప్రథమాధ్యాయము


Related imageశ్లో!! వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే!
యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!!
ఋషయ ఊచుః
శ్లో!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే!
శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!!

 తా!! నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి.
సూతుడు ఇట్లు చెప్పెను. శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ కార్తీకమహాత్మ్యమును వశిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జననమరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురు.
ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠమహాముని జనకమహారాజు గృహమునకు జేరెను. అంత జనకమహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామముజేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులయందును దయగలవాడును, బాలసూర్యసమాన కాంతిగలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించెను.
బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తినొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది.
సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠమహర్షి వికసించిన ముఖముగలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞముజరుగును.దానికి ద్రవ్యమును ఈయగోరుదును.
ఆరాజిట్లు పల్కెను. మునీశ్వరా! యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీవలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధికఫలమునిచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా! ధర్మజ్ఞా కార్తీకమాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము.
వశిష్ఠుడిట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాషగలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను. వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును. రాజా! సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీకవ్రతమును తులాసంక్రమణము = సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని, ఆరంభించి నెలరోజులు చేయవలెను. ఆరంభమందు ఓ దామోదరా! నేను కార్తీకవ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము అని సంకల్పము చేసి కార్తీకస్నానమారంభించవలెను. కార్తీకమాసమునందు సూర్యోదయసమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించినతోడనే మూడులోకములను పవిత్రముజేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడుబావులందును, నూతులందును, చిన్నకాలువలందును హరి 

నివసించియుండును. కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాలవారు జేయవచ్చును.Image result for కార్తీక పురాణం
బ్రాహ్మణుడు కార్తీకమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రములచేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షిపితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీజపము చేయవలెను. స్త్రీలు గౌరీజపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రమమందు షోడశోపచారములతో పూజించవలెను. తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వేదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనముగావించి, తరువాత పురాణకాలక్షేపమును చేయవలయును. సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి, విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని, తన శక్తి కొలది దీపములుబెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమును గాని శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయును. ఎవడు కార్తీకవ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తివర్జితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్ను ఈజన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తీకవ్రతమాచరించిన యెడల నశించును. బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడుగాని, స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తీకవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. ఎవ్వడు కార్తీకవ్రతమాచరించు వానిని జూచి సంతోషించునో వానియొక్క పగటికాలమందాచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు.
ఇతి స్మాందపురాణ కార్తీకమహాత్మ్యే ప్రథమాధ్యాయ స్సమాప్తః

Thursday, November 1, 2018

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత: "ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ,...

Total Pageviews