Tuesday, January 12, 2016

అమ్మ ప్రేమకి, అనురాగానికి వేరేదీ సాటిలేదు ఏమంటారు?


ఓం శ్రీ గోమాతాయై నమో నమహా:


తిరుప్పావై పాశురములు
 28వ రోజు - శ్రీకృష్ణుడే సిద్దోపాయం
ఆండాళ్ తిరువడిగలే శరణం
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్
ఇన్నిరోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా, నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం "గోవిందా" అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్ళకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్దోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ. అందుకే మనవాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం "హే గోవిందా" నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.
అవి ఏమిటంటే
1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.
2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.
3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.
4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.
5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.
6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.
ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!
ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకొనే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నువ్వు అని చెప్పాలి, నిన్ను నమ్ముకుని వచ్చాను అని అయనతో సంబంధం గురించి చెప్పాలి, జబ్బురాకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి, త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి. అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాదిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు, వైద్యుడు వేరే మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాది నివారించాలి అంటే వైద్యుడూ, మందూ అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మనవాళ్ళు శ్రీకృష్ణుడిని "వైద్యో వైద్యః" చక్కటి వైద్యుడు సుమా!! అని చెబుతారు.
అయితే మనవాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు, అయితే ఇంకా వీళ్ళల్లో కర్తుత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరిక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈ రోజు మనవాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమి లేవు అని చెబుతున్నారు, దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు.
మొదట మేం అంటూ ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమి లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయణం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేమో "కఱవైగళ్ పిన్ శెన్ఱు" పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోషిస్తాం. లేకుంటే లేదు.
ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. "కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్" అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేం "అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు" ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు. మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే "ఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్" మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నువ్వు.
"కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా" కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి. మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా. "ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు" నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. "అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్" ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా. "ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం" చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం. "శీఱి యరుళాదే" కోపించక అనుగ్రహించు. "ఇఱైవా! నీ తారాయ్ పఱై" మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు. అనుగ్రహించు.

ఎప్పుడెప్పుడు పండుగ ఏడాది పండుగ,

భోగి మంటల కోసం సామాగ్రి సేకరణ ఇలా పిల్లలందరూ కలసి ఎంతో ఉత్సాహంగా ఇంటింటికి వెళ్లి "ఎప్పుడెప్పుడు పండుగ ఏడాది పండుగ, పండుగెందుకొచ్చింది. పాటలు పాడుతూ పిడకలు, కట్టెలు సేకరిస్తారు; సత్యసాయి - విస్సా ఫౌండేషన్.

ఒక్క సారి ఊరు పోయి రా!...శ్రీ ఘజల్ శ్రీనివాస్ గాన మాధుర్యంలో ఓదార్పు పొందండి.

నిన్న ఒక పాట చూసారు కదా! ఇప్పుడు మరో పాట! ప్రపంచవ్యాప్త తెలుగు బంధువులకు ముందస్తుగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగ శుభాకాంక్షలతో... పల్లెల్లోనే పండుగ సందడి వెల్లి విరిసేది. మరి పండుగకు వెళ్ళాలంటే ముందస్తుగా ప్రణాళిక వేసుకోవాలి. అందునా సంక్రాంతి పెద్దపండుగకు ఎన్ని ఇక్కట్లు పడినా దొరకని టిక్కట్లు వెళ్ళాలన్నా దూరాలు, భారాలు, బాధ్యతలు ఈ సారి నేను కూడా వెళ్ళలేక పోయాను. అందుకే ఈ సంక్రాంతి కానుక ఈ లింక్ నొక్కి ఆనందం అనుభవించండి. శ్రీ ఘజల్ శ్రీనివాస్ గాన మాధుర్యంలో ఓదార్పు పొందండి.
https://www.youtube.com/watch?v=SvHNxw7NZko

Monday, January 11, 2016

తిరుప్పావై పాశురములు
26వ రోజు - శ్రీ కృష్ణుడి సామర్థ్యం
మాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
ఈ రోజు మనవాళ్ళంతా శ్రీ కృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటగా "శెయ్యాదన శెయ్యోం" మన పూర్వులు చేయనివి చెయ్యకూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడుచేస్తున్నాయో అనుభవిస్తున్నవారికి తెలుసు. ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు. సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు, ఇది గుర్తుంచుకోవాలి. ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై "మేలైయార్ శేయ్-వనగళ్"ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారికి ఎదురు చెప్పకుండా "నానే తాన్ ఆయిడుగ" నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు ఆండాళ్ తల్లి "మేలైయార్ శేయ్-వనగళ్" సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాకపోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ.
స్వామిలోని ప్రేమను కనిపెట్టి “మాలే మణివణ్ణా” ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిపెట్టేసారు, ఇక ఎక్కడ లొంగాల్సొస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్తకాదు, మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. “మార్-గరి నీరాడువాన్” మార్గశీర్ష స్నానం చేయాటానికి మేం వచ్చామయా అని చెప్పారు. అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. “మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన” మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు. అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది తను ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు. “కేట్టియేల్” వినబడుతుందా మేం అడిగినది అని అడిగారు. అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి, వీళ్ళు ఒక్కొటి చెప్పడం ప్రారంభించారు. “ఞాలత్తై యెల్లాం” భూమినంతా “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ద్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన”నీ పాంచజన్యాన్ని పోలిన “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం ఈ అసాదారణ ఆయుదాలు ఉంటాయికదా.
ఈ మద్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. శ్రీకృష్ణుడికి సన్నిహితుడుగా ఉండేవాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శణ చక్రం కావాలయ్యా అని అడిగాడట. ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూసాడు, ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీవెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేంచేసాడు. అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమశివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని, ఆదిశేషుడి తోక స్థానం కపిల తీర్థం వద్దకు పంపివేసాడు. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగిచూసాడట, ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేదికాదు, ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట. శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.
ఆనాడు యుద్దరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది, కాని ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి, ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుజ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలికదా, అందుకే మొట్ట మొదట ప్రణవార్థం ప్రకాశించవలెనని కోరుతున్నారు. శంఖాన్ని మనవాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్టించినప్పుడు మన దైన ఈ శరీరమనే భూమి ఒక్కసారి వణుకుతుంది, ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏం చెబుతుందంటే అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్తలయందు వాడి సేవ చేయవలె. ఇదే శేశత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు, ఇది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి, సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు.
మాకు ఇంకా “పోయ్ ప్పాడుడైయనవే శాలప్పెరుం పఱైయే” శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి, ఇంకా “పల్లాండిశైప్పారే” పల్లాండు పాడేవారు కావాలి, ఇంకా “కోలవిళక్కే” ఆరని నిలువు దీపం కావాలి. గోష్టితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు, ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా “కొడియే” ద్వజం కావాలి, ఇంకా “వితానమే” మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టం అని చెప్పేసాడు శ్రీకృష్ణుడు.
ఎమయ్యా నీవెవరవో మాకు తెలియదని అనుకున్నావా, “ఆలిన్-ఇలైయాయ్” అన్నిలోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలంపై శయనించగలిగావు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు, మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, నీవు అనుకుంటే జరగనిది లేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమిలేదు అంతా “యరుళ్” నీ దయ అని స్వామిని కోరారు.
ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ద్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళాడు కనక, తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళకు అదే చాలు.
తిరుప్పావై పాశురములు
25వ రోజు - శ్రీ కృష్ణావతార రహస్యం
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది, అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావై ని మనం విశ్వసించాలి. భగవంతుడు మనకోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి, ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కల్గించి చేసే ఉపకారం. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతక గల్గితే మనం ఉన్నచోట భగవంతుణ్ణి సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా, ఇక సృర్తినిచ్చేవిగా ఉండగల్గుతాయి. గోదాదేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది.
ఈ రోజు మనవాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరిని మీరేదో కోరి వచ్చారుకదా, అదేదో చెప్పండి అని అడిగాడు. వీళ్ళు మేం ఏదికోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు. అబ్బెబ్బే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు. అబద్దాలు ఆడకు, నీవెవరో, ఎందుకిక్కడికి వచ్చావో, ఎట్లావచ్చావో, ఎక్కడినుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు.
అట్లా తెలుసుకొని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి, చివర ఒక మాట చెప్పాడు.
వీత రాగ భయ క్రోదాః మన్మయా మా ఉపాస్రితాః
వహ వహ జ్ఞాన తపసాః పూతాః మద్భావ మాగతాః
రాగం, భయం, క్రోదాలు మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడుతాయి. భగవంతుణ్ణి గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది. ఇక భయం, మనకు రాగం కల్గినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటాం. మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక వాడి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మనం దేన్నుంచి దూరం అవుతాం కనుక. అది ఎప్పుడూ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నేలేదు కదా. నీవు ఏదోక దానియందు పెంచుకున్న రాగం దూరం అవుతుంటే, దాన్ని దూరం చేసే దానియందు నీ మనస్సులో ఏర్పడే స్పందన క్రోదం అంటాం. ఇక నీకు ఏమి దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోదం కలిగే ప్రశ్నేమిటి కనుక. ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా, చేసేటువంటి వాటి యందు పట్టు లేకుండిన, ఇవన్నీ తనప్రయోజనం కోసం కాదని భావించటంచే తనకు అంటుకోవటం లేదు. ఈ జ్ఞానం చేతనే వాళ్ళలో ఉండే రాగ, భయ, క్రోదాలు తొలగిపోతాయి. అందుకే "త్యక్త రాగ భయ క్రోదాలు"అని అనలేదు స్వామి. త్యక్తం అంటే త్యజించడం, వదలటం. వీత అంటే తొలగిపోయిన అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటికి వదిలివేయటంలేదు, చీకటి తానంతట తానే తొలగిపోతోంది. మనం రాగ, భయ, క్రోదాలను వదిలివేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటున్నాయి. మనం వదలడం కాదు, అవి వదిలిపోవాలి మనల్ని.
ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే, వాడి జ్ఞానం మనకు కల్గినప్పుడు. ఆండాళ్ ఈ రోజు అదే వివరిస్తుంది. మాకుతొలగాల్సినవి తొలగాయయ్యా. రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది. ఆడిన ప్రతి మాట ప్రతి చేష్ట నీవరకు పర్యవసిస్తుంది. మాకు సరియైన జ్ఞానం కల్గింది, నీవేవరో మాకు తెలిసింది. ఇక ఈ జ్ఞానం "మద్భావ మాగతాః" తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావుకదా, మా కిప్పుడు కావలసింది అది అన్నారు. అవన్నీ నాకు తెలియవు అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు అదైతే ఇస్తా అన్నాడు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసును, నీ వెవరివో మాకు తెలుసూ అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్ట పరుస్తున్నారు. నీవెవరో మాకు తెలుసు, ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు, కాని "ఒరుత్తి మగనాయ్ పిఱందు" ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. అవతరించాడు అని చెప్పడంలేదు ఆండాళ్, ఎందుకంటే అయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడాయన. అవతరించాడు అని చెబితే అది ఆయనని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆండాళ్ తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది.
ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే, స్వామిపై అంత ప్రేమ. మరి పుట్టింది అద్వితియురాలకు అంటే, ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి, "ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర" మరొక అద్వితియురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు.
"తరిక్కిలానాకి" సహించలేక పోయాడు "త్తాన్" ఆ నీచుడు, కంసుడు అని పేరుకూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడైపోతుంది అని. ఏం చేయ్యాలని అనుకున్నాడంటే "తీంగు నినైంద" కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో, "కరుత్తై పిరపిత్తు" అది వారికే జరిగేట్టు చేసాడు. "కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్న" కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే తరించి పోయేవాడు.
స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. "నెడుమాలే" అయన దీర్గమైన వ్యామోహం, ప్రేమ కల్గినవాడు తనను ఆశ్రయించుకున్నవాళ్ళ యందు, అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడికి తమపై ప్రేమలేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం, ఆయన విభువు, అయన కుండేది మనపై ప్రేమ విభువంతా. సీత హనుమతో రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడువిచ్చాడు, రాముడితో చెప్పు "మార్తా దూర్దం న జీవిష్యే" నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది. హనుమ ఈ విషయం చెప్పగానే, రాముడు ఆశ్చర్యంతో "యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి" అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైన ఉండవచ్చును. మరి తనో, "నజీయేయం క్షణమపి వినాతాం అశితేక్షణాం" నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు, విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్ళకు ఈరోజు ఆయన కళ్లల్లో అంత వ్యామోహం చూసారు.
సరే ఇంక ఏంకావాలి అని స్వామి అడిగాడు. "ఉన్నై అరుత్తిత్తు వందోం" మేం నిన్ను కోరి వచ్చాం. "పఱై" వ్రత పరికరాలు "తరుతియాగిల్" నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం. స్వామి వీళ్ళను పాపం శ్రమపడి వచ్చారర్రా అని అనగానే, "తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్" లేదు మేం సంతోషంతో వచ్చాం. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమా లేదు హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ గోష్టి వారు.

Total Pageviews