Tuesday, September 7, 2021

 కరణీకము - 6 


అక్కన్న మాదన్న సోదరులు 


                   వంశపారంపర్య కరణీకాలు రద్దు కాకముందు గ్రామ కరణాలుగా  పనిచేసిన వారిలో నియోగులలోని  మరొక శాఖ గోల్కొండ వ్యాపారులు అనే పేరుతో ప్రసిద్ధులు. ఈ భాగంలో మనం ఆ శాఖకు చెందిన అక్కన్న మాదన్నల  వివరాలు తెలుసుకుందాం. సాధారణ కరణములుగానే జీవనం ప్రారంభించినప్పటికీ,  గోల్కొండ కుతుబ్ షాహి ప్రభువులు పాలించిన కాలంలో ఉన్నత రాజోద్యోగులుగా ఒక వెలుగు వెలిగిన అక్కన్న, మాదన్న సోదరుల   అజరామరమైన చరిత్రకు నేటికీ నిలిచివున్న వారు కట్టించిన  నిర్మాణాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ పాత నగరంతో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారికి శాలిబండ ( షా ఆలీ బండ) సమీపంలోని హరి బౌలి బంగారు మైసమ్మ (మహంకాళి)  ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. జంటనగరాలలో ఏటా  ఆషాఢమాసంలో వైభవంగా జరిగే బోనాల పండుగ సందర్భంగా సుప్రసిద్ధమైన  ‘ఘటం ఊరేగింపు’  ప్రారంభం అయ్యేది అక్కడినుంచే. డెబ్భై ఏళ్ల క్రితం వరకూ ఒక పెద్ద మట్టిదిబ్బ కింద పూడిపోయి ఉన్న ఈ ఆలయాన్ని పరిశోధకులు అప్పుడే  కనుగొని వెలుగులోకి తెచ్చారు. క్రీ.శ. 17 వ శతాబ్దిలో దీనిని నిర్మించిన ఆ సోదరుల పేరుమీదుగానే  నేటికీ దీనిని అక్కన్న మాదన్నల  ఆలయం అనే స్థానికులు వ్యవహరిస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా జరిగే ఘటం ఊరేగింపును   అక్కన్న మాదన్నల ఆలయంలోని ఘటాన్ని  అగ్రభాగంలో ఒక ఏనుగు అంబారీ మీద నిలిపి, అటూ ఇటూ గుర్రాలమీద పూన్చిన అక్కన్న మాదన్నల బొమ్మలు వెంటరాగా  వైభవోపేతంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా  సాగే ఘటం ఊరేగింపు నయా పుల్ వద్ద మూసీ నది నీటిలో ఘటాన్ని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. 1998 లో కొందరు ముష్కరులు విచక్షణారహితంగా చేసిన దాడిలో ఈ  హరిబౌలి  ఆలయంలో కొంతభాగం దెబ్బతిన్నది. ఒకప్పుడు ఈ  అక్కన్న మాదన్న సోదరులకు విజయవాడ ప్రాంతంలోనూ మంచి ప్రఖ్యాతి  ఉండేది. విజయవాడ ప్రాంతంలో ఇంద్రకీలాద్రి, మొగల్రాజు పురం  తదితర పర్వతాలలో అతి ప్రాచీనకాలంలో తొలిచిన గుహాలయాలు, సమీపంలోని గుంటూరు జిల్లా  ఉండవల్లి గుహాలయాలు సుప్రసిద్దాలు. కనకదుర్గ ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంలో క్రీ. పూ. రెండవ శతాబ్దిలో తొలిచిన ఒక గుహాలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలున్నాయి. ఆ పర్వతపాదంలోని   కొన్ని గుహలు క్రీ. శ. 6, 7 శతాబ్దాలలో తొలిచినట్టివి. అలాంటి ఒక గుహలో 

క్రీ. శ. 17 వ శతాబ్దంలో అక్కన్న మాదన్న సోదరులు నిర్మించినదిగా ప్రసిద్ధమైన ఒక ఆలయం ఉంది. కొందరు ఆ గుహ విష్ణుకుండిన వంశ పాలకులు  తొలిపించగా,  ఆలయం మాత్రం  అక్కన్న మాదన్నలచేత తరువాత కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. కొందరేమో ఆ సోదరులు ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయం సందర్శించిన సందర్భాలలో అక్కడే అధికారులతో  కచేరీ నిర్వహిస్తూ ఉండే  కారణంగా అక్కడి గుహలు అన్నిటినీ అక్కన్న మాదన్న గుహలు అంటున్నారనీ,  వాస్తవానికి అవన్నీ విష్ణుకుండినుల నిర్మాణాలేననీ  భావిస్తున్నారు. 


                     ఇక ఆ సంగతి అలా ఉంచి, అసలీ అక్కన్న మాదన్నలు ఎవరో చూద్దాం. కరణీకం వృత్తిగా కలిగిన కొందరు నియోగులు ‘ ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్ర’మన్నట్లు  రాజోద్యోగాలలో - మంత్రులు, సేనానులు, దుర్గాధ్యక్షులు, దుబాసీలు గా - కూడా నియమించబడటం మనకి తెలుసు. మహామంత్రి తిమ్మరుసు, మరాఠా సేనాని హరి పంత్, ఝాన్సీ లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ తాంబే మొదలైన వారిని గురించి మనం ముందే తెలుసుకున్నాం. మహారాష్ట్ర మూలాలు కలిగిన నియోగి బ్రాహ్మణులలో కొందరిని గోల్కొండ వ్యాపారులు అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవలసినది పింగళి మాదన్న, అక్కన్న సోదరుల గురించే. వీరిది భారద్వాజ గోత్రం. ఆ కారణంగా గౌతమ గోత్రుడు అయినట్టి  ‘ కళా పూర్ణోదయము’ 


కావ్యకర్త పింగళి సూరనకూ వీరికీ ఎలాంటి సంబంధమూ లేదు. గోల్కొండ వ్యాపారులు ఋగ్వేదులు. ఐదు బహమనీ రాజ్యాలలో ఒకటైన  గోల్కొండను కుతుబ్ షాహీ వంశస్థులు పాలించారనే విషయం అందరికీ తెలిసినదే. గోల్కొండ నవాబులలో తానీషా (లేక తానాషా) అనే మరోపేరు కలిగిన అబుల్ హసన్ కుతుబ్ షా ( క్రీ. శ. 1658 - 1687 ) చిట్టచివరి వాడు. తానాషా అంటే మంచిరాజు అని అర్థం. ఆ తానీషా కొలువులో మాదన్న ముఖ్యమంత్రిగానూ, అక్కన్న సేనాధిపతిగానూ పనిచేశారు. తానీషా ఇస్లాం మతంలోని షియా తెగకు సంబంధించినవాడు. అందుకే ఆయనలో పరమత సహనం ఎక్కువ. హిందూ ముస్లింలను సమభావంతో చూస్తూ హిందువులకు కూడా ముస్లిం లతో పాటు ఉన్నత పదవులిచ్చి గౌరవించాడు. హిందూ ఆలయాలకు కూడా భూరి విరాళాలు ఇచ్చేవాడు. చిన్న ఉద్యోగులుగా తన కొలువులో చేరిన అక్కన్న మాదన్నలకు వారి సేవలకు మెచ్చి తానీషా పెద్ద పదవులిచ్చి గౌరవించాడు. వారు కూడా సమయానుకూలంగా వ్యవహరిస్తూ, నవాబు మనసు గెలుచుకోవటమే కాక, అవసరమైన సందర్భాలలో రాజనీతితోపాటు కౌటిల్యాన్నీప్రదర్శిస్తూ ఒక్కొక్క మెట్టూ క్రమంగా ఎగబాకుతూ అంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 


            అందరూ అనుకునే విధంగా అక్కన్న కు  మాదన్న  స్వంత తమ్ముడు కాదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన పింగళి మాదన్నకు, గోల్కొండ రాజ్యపు  సేనాధిపతిగా  పనిచేసిన అక్కన్న తన తల్లి తరఫు దూరపు బంధువు. వారిద్దరూ  వరుసకు అక్కచెల్లెళ్ళ పిల్లలట. అయినా వారిద్దరూ స్వంత అన్నదమ్ములలాగే కలిసి మెలిసి ఉండేవారు. వయస్సులో తనకన్నా పెద్దవాడు కనుక  అక్కన్నగారిని మాదన్నగారు  ‘ అన్నగారూ ! ‘ అని సంబోధించేవారట. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ కలిసే తీసుకునేవారట. ప్రజలు కూడా వారిరువురినీ వేరువేరని  కాక, ఒక్కటిగానే భావించి ‘ అక్కన్న మాదన్నలు’ అంటూ వ్యవహరించేవారట. చెన్న పట్టణం ( మదరాసు) లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా  అవసరమైన సందర్భాలలో ‘అక్కన్న మాదన్న గార్లకు’ అంటూ ఇరువురినీ ఒకటిగానే సంబోధిస్తూ లేఖలు రాయడం చూస్తే వారిరువురూ ఎంత ఏకగ్రీవంగా పనిచేసేవారో గ్రహించగలం. అప్పట్లో కుంఫిణీ (కంపెనీ) వారి  చెన్నపట్టణం ఫాక్టరీ, ఓడ రేవు గోల్కొండ నవాబు రాజ్యంలో  అంతర్భాగంగానే ఉండేవి. నవాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే ఇంగ్లిష్ వారు అక్కడ సరకుల ఎగుమతి దిగుమతుల వంటి నౌకా వాణిజ్య  కార్యకలాపాలు నిర్వహించుకునేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎప్పటికప్పుడు తమ కార్యకలాపాలను అక్కన్న మాదన్నలకు లేఖలద్వారా నివేదించేవారు. ఇందుకోసం వారు కంపెనీ ప్రతినిధిగా గోలకొండలో ఈ సోదరులకు అనుకూలుడైన వీరరాఘవులు అనే తెలుగు కరణాన్ని గుమాస్తాగా నియమించి, అతని ద్వారా అక్కన్న మాదన్నలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వారితో సత్సంబంధాలు నెరపుతూ ఉండేవారట. వీరరాఘవులు అటు కంపెనీ వారికి, ఇటు అక్కన్న మాదన్నలకూ అప్పట్లో రాసిన లేఖల కారణంగా నాటి చారిత్రక విశేషాలతో పాటు, అక్కన్న మాదన్నల గురించిన పలు విశేషాలు మనకు తెలుస్తున్నాయి. 


                     గోల్కొండ నవాబు తానీషాకూ,  మరాఠా సార్వభౌముడైన శివాజీకీ  ఉమ్మడి శత్రువైన ఢిల్లీ మొఘల్ పాదుషా ఔరంగజేబ్ నుంచి  గోల్కొండ రాజ్యానికి ప్రమాదం పొంచివున్నదని ముందుగానే గ్రహించిన గోల్కొండ ముఖ్యమంత్రి మాదన్న పంతులు ప్రత్యేకమైన చొరవ ప్రదర్శించి శివాజీకి, తానీషాకూ  మైత్రి కుదిర్చాడు. క్రీ. శ. 1674 లో పట్టాభిషిక్తుడు అయ్యాక  శివాజీ కర్ణాటక, ద్రావిడ దేశాలపై దండయాత్రకు వెళ్ళే సమయంలో ఆయన్ని  మాదన్న గోల్కొండ కోటకు తన అతిథిగా ఆహ్వానించాడు. అప్పుడు గోల్కొండ కోటలో 


శివాజీకి మాదన్న, మాదన్నకు శివాజీ విందులిచ్చుకున్నారని ‘ శివ దిగ్విజయము’ అనే గ్రంథం పేర్కొంది. క్రీ. శ. 1680 లో శివాజీ మరణించిన తరువాత ఆయన కుమారుడు శంభాజీకి, 

తానీషాకూ మైత్రి కుదర్చటంలోనూ, వారిరువురినీ ఔరంగజేబ్ పైకి దాడికి ప్రేరేపించటంలోనూ మంత్రి మాదన్న నిర్వర్తించిన పాత్ర ప్రశంసాపాత్రం. ‘మన శత్రువుకు శత్రువు ఎల్లప్పుడూ  

మనకు మిత్రుడే’ అనే ప్రాథమిక సూత్రం మీదనే ఈ విషయంలో మాదన్న మంత్రి రాజనీతి ఆధారపడింది.  తనకు వ్యతిరేకంగా శంభాజీ గోల్కొండ నవాబుతో మైత్రి కుదుర్చుకోవటం రుచించని ఔరంగజేబ్ 1685 జూలైలో తన కుమారుడు ముఅజ్జం నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని గోల్కొండ రాజ్యం మీదికి దండయాత్రకు పంపాడు. మొఘల్ సైన్యం గోల్కొండ కోటను పట్టుకునే ప్రయత్నం చెయ్యకుండా ముందుగా హైదరాబాద్ నగరాన్ని దోచుకున్నారు. ఆ దోపిడీలో లభించిన సంపదతో మరింతగా సైన్యాన్ని, ఆయుధాలనూ సమకూర్చుకుని గోల్కొండ కోటపై దాడికి సిద్ధం కాసాగాడు ముఅజ్జం. మాదన్న మంత్రి ముందుచూపుతో మేల్కొనటం వల్ల  ముఅజ్జంతో తానీషా సంధిచేసుకున్న కారణంగా గోల్కొండ రాజ్యానికి అప్పటికి పెను ప్రమాదం తప్పింది. తాము యుద్ధానికి సిద్ధంగా లేని సమయంలో ఊహించని రీతిలో ముంచుకు వచ్చిన మొఘల్ దండయాత్ర ప్రమాదం ఆ సంధి షరతుల ప్రకారం గోల్కొండ నవాబు సాధారణ కప్పం కాక అదనంగా కోటి ఇరవై లక్షల రూపాయలు చెల్లించి మొఘల్ సార్వభౌమత్వాన్ని గుర్తించటంతో తాత్కాలికంగా నివారించబడింది. కానీ సంధి షరతుల ప్రకారం చెల్లించిన కప్పం ఔరంగజేబ్ కి ఎంతమాత్రం తృప్తి కలిగించలేదు. గోల్కొండ రాజ్యపు సంపద గురించి - ముఖ్యంగా అక్కడి వజ్రవైడూర్యాలను  గురించి వినివున్న ఔరంగజేబ్ గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని ఉబలాటపడ్డాడు. అపారమైన సంపద దోచుకోవాలంటే గోల్కొండనే కొల్లగొట్టాలని భావించాడు ఔరంగజేబు. ‘కొడితే గోల్కొండనే కొట్టాలి అనే నానుడి’  అప్పటికే సుప్రసిద్ధం. అందుకే  మొఘల్ సైన్యం 1687 ఫిబ్రవరిలో మరొకసారి గోల్కొండపై పెద్దఎత్తున దాడి చేసింది. సంధి చేసుకున్న తరువాత లభించిన ఏడాదిన్నర విరామ కాలంలో అక్కన్న మాదన్నలు గోల్కొండ కోటను పటిష్టపరిచే కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. అందుకే ఆ రెండవ దాడి ఎనిమిది నెలల పాటు సాగినా కోటను పట్టుకోవటం ఔరంగజేబు వల్ల కాలేదు. మాదన్న యుక్తులు, ఎత్తుగడలు, అక్కన్న యుద్ధ వ్యూహనైపుణ్యం, అబ్దుల్ రజాక్ లారీ వంటి స్వామిభక్తిపరులైన వీర సైనికుల శౌర్య ప్రతాపాల కారణంగా కోట శత్రు సైన్యానికి అంతకాలం పాటు వశం కాలేదు. దానికితోడు దండయాత్ర కాలంలో మొఘల్ సైన్యాలు  తీవ్ర ఆహార  కొరతను ఎదుర్కొన్నాయి. మరోపక్క కుంభవృష్టిగా కురిసిన వానలు మొఘల్ సైన్యాన్ని చీకాకు పెట్టాయి. వానలు తగ్గుముఖం పట్టాక ఔరంగజేబు తిరిగి దాడులు ముమ్మరం చేశాడు. ఈసారి కుట్రలకూ, మోసానికీ తెగబడింది మొఘల్ సైన్యం. అగ్నికి ఆజ్యం పోసినట్లు గోల్కొండ కోటలోని కొందరు సైనికాధికారులు శత్రు పక్షానికి సహకరించారు. ఆ విద్రోహకర పరిస్థితి ఏర్పడటానికి దారితీసిన కారణాలు తెలుసుకోవాలంటే గత చరిత్ర కొంత తెలుసుకోవాలి. 


                           తన సేవలతో, పరాక్రమంతో అంతకుముందు సాధారణ ‘ఫౌజ్ దారు’  స్థాయి  చిన్న సైనికోద్యోగిగా పనిచేస్తున్న అక్కన్న  క్రమంగా తానీషాకు దగ్గరయ్యాడు. తానీషాకు అక్కన్న శక్తిసామర్థ్యాలు, నిజాయతీపై నమ్మకం కుదిరింది. అందుకే ఆయన గతంలో తన దగ్గర సేనానిగా పనిచేస్తుండిన మహమ్మద్ ఇబ్రాహీం అనేవాడిని క్రీ.శ. 1682 లో తొలగించి, ఆ స్థానంలో  అక్కన్నను గోల్కొండ రాజ్యానికి  ‘షాహ లష్కర్ ‘ (సేనాధిపతి) గా నియమించాడు. ఇక అక్కడినుంచి సైన్యంలోని ముస్లిం వర్గాలలో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. అదనుచూసుకుని  సైన్యంలోని సున్నీ వర్గీయులు ( దాడి చేసిన ఔరంగజేబ్ కూడా సున్నీ 


అయిన కారణంగా ) శత్రు పక్షంలో చేరిపోయారు. ఒక ముస్లిం ప్రభువు దగ్గర హిందూ ఉద్యోగులైన అక్కన్న మాదన్నలు ప్రాపకం సంపాదించటమే కాక తమ గోల్కొండ ముస్లిం రాజ్య నిర్వహణలో వారే కీలకమై  చక్రం తిప్పుతూ ఉండటం చూసి  మతోన్మాదులు  సహించలేకపోయారు. అందుకే అక్కన్న మాదన్నల పట్ల వారు అకారణ శత్రుత్వాన్ని పెంచుకున్నారు.  వారు అక్కన్న మాదన్నలను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. అక్కన్న మీద పగబూనిన ఒకప్పటి గోల్కొండ సేనాని మహమ్మద్ ఇబ్రాహీం  వర్గీయులు చేసిన కుట్ర కారణంగానే క్రీ. శ. 1685 లో గోల్కొండపై జరిపిన మొదటి దాడిలో మొఘలులకు హైదరాబాద్ నగరంలో వారి విచ్చలవిడి దోపిడీకి ఎలాంటి  ప్రతిఘటన లేకుండా పోయింది. తిరుగుబాటుదారులైన  సైనిక సర్దారులు తమ నవాబు  హిందువులను ముఖ్యమంత్రిగా, సేనాధిపతిగా నియమించుకుని హిందూ అనుకూల పాలన సాగిస్తున్నాడనీ, హిందూ దేవాలయాలకు భూరి విరాళాలు ఇస్తున్నాడనీ  తానీషాకి వ్యతిరేకంగా  ఔరంగజేబ్ కి నూరిపోశారు. మతసహనం పొడ గిట్టని ఔరంగజేబు ఆ కారణంగా తానీషా మీద పగ పెంచుకుని గోల్కొండ కోట మీద దాడికి మొదటి పర్యాయం తన కుమారుడు ముఅజ్జంను, ఖాన్ జహాన్ అనే సేనానిని అశేషమైన సైన్యాన్ని ఇచ్చి పంపాడు. మహమ్మదీయ సర్దారులకు  అక్కన్న మాదన్నలపై ఏర్పడిన శత్రుభావం మరింతగా పెరిగి, అగ్నికి ఆజ్యంపోసినట్లైన ఒక ఘటనను  ఇక్కడ పేర్కొనాలి. మాదన్న మంత్రి రోజూ స్నానం చేస్తూ సంధ్యావందనం చేసుకునే ఒక వ్యక్తిగత కొలనులో దిగి ఒకరోజు  మహమ్మద్ ఇబ్రాహీం మాదన్న చూస్తూ ఉండగానే ఆయన్ని కవ్వించే ఉద్దేశంతో కావాలనే స్నానం చేశాడట. దీనిని తనకు జరిగిన అవమానంగా భావించిన మాదన్న వెంటనే ఇబ్రాహీంని కొరడాలతో కొట్టించాడట. కోటలో ఇదొక సంచలన వార్తగా మారి, ముస్లింలు - ప్రత్యేకించి ముస్లిం మహిళలు - అందరికీ అక్కన్న మాదన్నలపై పగ పెరిగిపోయింది. ముస్లిం సర్దారులు ఈ విషయాన్ని ఔరంగజేబ్ కుమారుడు ముఅజ్జం దృష్టికి తెచ్చి ఎలాగైనా సరే వారిరువురినీ ఖతం చేస్తేనేగానీ కోటను జయించటం సాధ్యపడదని ఆయనకు చెవినిల్లు కట్టుకుని నూరిపోశారు. వారంతా అక్కన్న మాదన్నల అంతానికి ఒక పక్కా ప్రణాళికను రచించారు. క్రీ. శ. 1687  అక్టోబర్ మాసంలో ఒకరోజు అక్కన్న మాదన్నలు కొలువునుంచి ఇంటికి వెళుతూ ఉండగా ముస్లిం స్త్రీలు వారిరువురినీ మోసపూరితంగా సంహరించారు. వారి ఇరువురి తలలూ ఔరంగజేబ్ కుమారుడు ముఅజ్జం కి పంపారు. ఆ రోజే గోల్కొండ రాజ్యంలో బ్రాహ్మణులను అసంఖ్యాకంగా చంపేశారు. అక్కన్న మాదన్నలను అడ్డు తొలగించటంతో ఇక నవాబు తానీషాకు,  గోల్కొండ కోటకు కుట్రదారులనుండి  రక్షణ కరవైంది. తానీషా కొలువులోని అబ్దుల్లా పెయిన్ అనే ఆఫ్ఘన్ దేశీయుడైన ఉన్నత సైనికోద్యోగిని పెద్ద మొత్తంలో లంచం ఇవ్వజూపి లోబరచుకున్నారు. లంచపు  సొమ్ముకు ఆశపడి పెయిన్ అర్దరాత్రి వేళ కోట తూర్పు ద్వారం తెరిపించి, మొఘల్ సైన్యానికి లోనికి మార్గం చూపాడు.మొఘలులు తానీషాని మోసపూరితంగా ఖైదుచేసి దౌలతాబాద్ ( దేవగిరి) లోని చెరసాలకు తరలించారు.అక్కడ అప్పటికే బీజాపూర్ సుల్తాన్ సికిందర్ ఆదిల్ షా బందీగా ఉన్నాడు. ఏడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్నీ, కోట్లాది రూపాయల విలువచేసే వజ్ర వైడూర్యాలనూ, బంగారు, వెండి నగలనూ మొఘలులు గోల్కొండ కోట నుంచి దోచుకుపోయారు. చెరసాలలోని తానీషా కి యాభై వేల రూపాయల వార్షిక పింఛను మంజూరుచేసిన మొఘలులు గోల్కొండ రాజ్యాన్ని తమ సామ్రాజ్యంలో విలీనం చేసేసుకున్నారు. 


                        


             ఇక అక్కన్న మాదన్నలపై గోల్కొండ రాజ్యంలోని ముస్లింలలో  తీవ్రమైన  వ్యతిరేకత రావటానికి ఒక ముస్లిం రాజ్యంలో ఆ హిందూ సోదరులిరువురూ తామే సర్వస్వమై రాజ్య నిర్వహణలో చక్రం తిప్పటం  ఒక్కటే  కాక  పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో కూడా ఒకసారి పరిశీలిద్దాం. మహమ్మద్ ఇబ్రాహీం అనే అతనిని సేనాని పదవి నుంచి 

తొలగించి, తానీషా క్రీ. శ. 1682 లో ఒక సామాన్య సైనికోద్యోగి అయిన అక్కన్నను ఆ పదవిలో నియమించటాన్ని రాజ్యంలోని సాధారణ ముస్లింలు  - ప్రత్యేకించి సున్నీ శాఖ అనుయాయులు-  సహించలేకపోయారు. షియా శాఖీయుడైన తానీషా హిందూ సోదరులైన అక్కన్న మాదన్నలను 

పూర్తిగా నమ్మి, వారిపైనే మొత్తం రాజ్యభారాన్ని మోపడం రుచించని సున్నీ శాఖీయులు ఔరంగజేబ్ దండయాత్రల సందర్భంగా అక్కన్న, మాదన్నలకు వ్యతిరేకంగా  ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బహిరంగ  తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. ఇక తన వ్యక్తిగత కొలనులో స్నానం చేసిన చిన్నపాటి  నేరానికి మహమ్మద్ ఇబ్రాహీంను  మాదన్న (అది తనకు జరిగిన అవమానంగా భావించి)  తీవ్రంగా శిక్షించడాన్ని రాజ్యంలోని సామాన్య ముస్లింలు - ప్రత్యేకించి ముస్లిం మహిళలు - సహించలేకపోయారు. ఒక ముస్లిం రాజ్యంలో ముస్లింలే రెండవ తరగతి పౌరులుగా జీవించవలసి రావటం అంటే అది  తానీషా ఇచ్చిన అలుసు చూసుకుని అక్కన్న మాదన్నలు కండకావరంతో రెచ్చిపోవటంగా వారు భావించారు. ఈ హిందూ సోదరుల ప్రోత్సాహంతో తానీషా హిందూ ఆలయాలకు భూరి ఆస్తులు, విరాళాలు ఇవ్వటం, వారు  తానీషా అండ చూసుకుని హరి బౌలిలో  బంగారు మైసమ్మ  ఆలయం నిర్మించటమే కాక, గోల్కొండ కోటలోపలే జగదంబికా మహంకాళి  అమ్మవారి ఆలయం నిర్మించి, ఏటేటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండటం సామాన్య ముస్లిం కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఇదికాక ఈ సోదరులు గోల్కొండ రాజ్యంలో తమ పర్యటనల సందర్భంగా హిందూ ఆలయాలకు తరచుగా వెళ్లి  భూరి విరాళాలు ఇస్తూ ఉండటం కూడా ముస్లిం మత పెద్దలకు కంటగింపు అయింది.   సున్నీ మతపెద్దలు ఈ విషయాన్ని దండయాత్రకు వచ్చిన ఔరంగజేబ్, అతని కుమారుడు ముఅజ్జం లకు నివేదించగా గోల్కొండ రాజ్యంలో  అక్కన్న, మాదన్నల ప్రాబల్యం ఎలాగైనా తగ్గించి తీరాలని, హిందూ మత విజృంభణకు ఎలాగైనా అడ్డుకట్ట వేసి తీరాలని, ఇందుకోసం ముందుగా ఈ సోదరుల అడ్డు తొలగించుకోవాలని ఔరంగజేబ్ భావించాడు. మతరీత్యా తానీషా షియా ముస్లిం కావటం, ఆయన పరమత సహనం పాటించటం, పరమతస్థులైన అక్కన్న, మాదన్నలకు పెద్ద పదవులిచ్చి గౌరవించటం, మాదన్న ముందుగా శివాజీకి, తానీషాకి, ఆ తరువాత శివాజీ కుమారుడు శంభాజీకీ, తానీషాకీ మధ్య మైత్రి కుదర్చటం ఔరంగజేబ్ కి ఆగ్రహం కలిగించింది. అందుకే  క్రీ. శ. 1685 లో జరిపిన  మొదటి దండయాత్రలో భారీగా కప్పం తీసుకుని వెనక్కి తగ్గినా, తానీషా మీద, గోల్కొండ షియా రాజ్యం మీద, ప్రత్యేకించి అక్కన్న, మాదన్న సోదరుల మీద పగతో రగిలిపోయిన ఔరంగజేబ్ తిరిగి క్రీ.శ. 1687 ఫిబ్రవరిలో పెద్దపెట్టున గోల్కొండపై విరుచుకుపడ్డాడు. ఇదే అదనుగా  అక్కన్న, మాదన్నల మీద, తానీషా మీద గతంలో పగబట్టిన  గోల్కొండ రాజ్య మాజీ సేనాని మహమ్మద్ ఇబ్రాహీం మొఘలులతో కలిసిపోయి, మొఘల్ సైన్యం హైదరాబాద్ నగరాన్ని దోచుకోవటంలో వారికి సహకరించటం గోల్కొండ రాజ్యానికి పెనుశాపంగా మారింది. అక్కన్న మాదన్నలు నిత్యం చేసే ధర్మకార్యాల కారణంగా గోల్కొండ రాజ్యంలోని హిందువులలోని కొందరు - ప్రత్యేకించి బ్రాహ్మణులు, శైవులు  వారిని అభిమానించినా మిగిలిన హిందువులు ఈ సోదరుల పట్ల సానుభూతితో  ఏమీ లేరు.  సాధారణ ముస్లింలు అక్కన్న మాదన్నలను  ద్వేషించటానికి మరికొన్ని కారణాలు తోడయ్యాయి. 


                      


                  అక్కన్న మాదన్నలు హిందూ దేవాలయాలకు ఉదారంగా విరాళాలు ఇవ్వటం, సత్రములు నిర్మించి,  బ్రాహ్మణులకు ఉచిత భోజన సదుపాయాలను ఏర్పాటు చేయటం వంటి  ధర్మకార్యాలు చేసి హిందువులు - ముఖ్యంగా బ్రాహ్మణుల దృష్టిలో ధర్మాత్ములని పేరొందారు. 

వారు ప్రతిరోజూ ప్రాతః కాలంలో శివపూజలు చేస్తూ, ఆ సమయమున తమను సందర్శించిన కవి పండితులను - ప్రత్యేకించి శివకవుల పాండిత్యాన్ని పరిశీలించి వారికి తగిన బహుమతులిచ్చి 

సత్కరించి పంపేవారు. ఈ సోదరులను వక్తృ శ్రోతలుగా చేసి త్రిపురాంతకం నుంచి వచ్చిన తెనాలి రామలింగము అనే శైవకవి తాను రచించిన ‘ ధీరజన మనో విరాజితము’ అనే ఏకాశ్వాస ప్రబంధాన్ని వారికి వినిపించి, వారిచే సత్కరించబడటం గురించి మనం ముందే చెప్పుకున్నాం. అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్యంలో తమకున్న ఎదురులేని అధికారాల కారణంగా నిరంకుశులై ఆనాటి అనుకూల  పరిస్థితులను తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకోవటం కూడా ఇక్కడ  గమనార్హం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్టణం, చెన్నపట్టణం లలో నాడు నిర్వహిస్తున్న నౌకా వాణిజ్య  కార్యకలాపాలు, వారి గిడ్డంగుల వ్యవహారాలను గోల్కొండ రాజ్యం తరఫున  వీరరాఘవులు  అనే ఒక తెలుగు కరణాన్ని గుమాస్తాగా నియమించి, అతని ద్వారా నియంత్రిస్తూ తమ పదవులను వ్యక్తిగత ప్రయోజనం కోసం కంపెనీ వారినుంచి వీలైనంత పెద్ద మొత్తాలలో సొమ్ము రాబట్టడానికి వినియోగించటం కూడా గమనార్హం. కంపెనీ వారి గిడ్డంగులు, రేవులు గోల్కొండ రాజ్య అధికార పరిధిలోనివైన కారణంగా ఎంత మొత్తం ఇవ్వమని కోరినా, ఎన్ని షరతులు విధించినా గత్యంతరంలేని స్థితిలో వాటన్నిటికీ అంగీకరించి కంపెనీ వారు ఆ మొత్తాలను అక్కన్న మాదన్నలకు చెల్లించేవారు. అప్పట్లో అక్కన్నకు స్వంతంగా కొన్ని ఓడలు కూడా ఉండేవి. ఆయన నౌకా వ్యాపారం నిర్వహించేవాడు. క్రీ. శ. 1679 ఫిబ్రవరి నెలలో కంపెనీ వారు తమ వ్యాపార అవసరాల నిమిత్తం తమకు శాంతోం, ఎగ్మూర్ ప్రాంతాలు కౌలుకు ఇప్పించమని  కోరినప్పుడు, తిరిగి క్రీ. శ. 1682 జూలై నెలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం చేసుకొనటానికి అనుమతులు మంజూరు చేయమని కోరినప్పుడు గోల్కొండ రాజ్యానికి కంపెనీవారు చెల్లించాల్సిన వార్షిక  పన్నుమొత్తం నిర్ణయించటంతో పాటు   ఈ సోదరుల వ్యక్తిగత ప్రయోజనాలూ నెరవేరాయి. అక్కన్న గారి స్వంత ఓడలకు కంపెనీవారు పలు వెసులుబాట్లు కల్పించారు. అలాగే క్రీ. శ. 1682 సెప్టెంబర్ నెలలో కంపెనీవారు విశాఖపట్టణం మొదలైన ప్రదేశాలలో తమకు వర్తకం విషయంలో కొన్ని వీళ్ళు కలగజేయమని అక్కన్న, మాదన్నలకు ఒక లేఖరాసి, అనేక బహుమానాలతో సహా ఆ లేఖను వారికి పంపారు. ఆ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన అక్కన్న కి, కంపెనీ వారికి దుబాష్ ( దుబాసీ) గా వ్యవహరించిన వెంకటాద్రి అనే ఒక కరణానికి - ఈ ఇరువురికీ  ఎన్నో విలువైన బహుమతులు  కంపెనీ వారినుంచి ముట్టినట్లు లేఖాధారాలు ఉన్నాయి. క్రీ. శ. 1682 నవంబర్ నెలలో మాదన్న కుమారుడు మల్లప్ప వివాహం సందర్భంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వీసెడు బంగారపు గొలుసు తయారు చేయించి పెళ్లి కానుకగా పంపారు.( అప్పట్లో రూపాయి ఎత్తును తులము అనేవారు. తులమునే కొందరు నవటాకు అనీ, ఇంకొందరు పలము అనీ కూడా అనేవారు. ఒక తులం బంగారం సాధారణంగా బరువులో పదహారు రూపాయలకు సమానంగా భావించేవారు. అలాంటి 120 తులాలు ఒక వీసె. అంటే అప్పట్లో వీసెడు బంగారం విలువ 1,920 రూపాయలన్నమాట. అప్పట్లో వెండి రూపాయిలో ఉండే వెండి విలువ రూపాయే ఉండేది)   క్రీ. శ. 1683 జనవరి నెల ఒకటో తేదీన ఆంగ్ల నూతన సంవత్సర కానుకగా     కంపెనీ వారు 400 వరహాలు మాదన్న గారికి  పంపారు. ఆ సందర్భంగా పంపిన లేఖలో మాదన్న గారి అనుగ్రహమును కోరి ఆ కానుకలను పంపినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.( వరహా అనేది వరాహ ముద్ర కలిగిన బంగారు నాణెం. దీనినే పగోడా అనికూడా అంటారు. ఒక పగోడా మూడున్నర రూపాయలకు సమానం. అంటే మాదన్న గారికి క్రీ.శ. 1683 జనవరిలో నూతన సంవత్సర కానుకగా ముట్టిన మొత్తం 400 x 3.5 అంటే 1400 


రూపాయలు).  గోల్కొండ రాజ్య పరిధిలో  వ్యాపారం చేసుకునేందుకు కంపెనీ వారు తానీషా ప్రభుత్వానికి చెల్లించవలసిన వార్షిక  పన్ను మొత్తం  1,200 వరహాలుగా క్రీ. శ. 1682 జూలైలో  నిర్ణయించబడింది. ప్రభుత్వానికి జమ అయ్యే  మొత్తం 1,200 వరహాలు కాగా దానిలో మూడవ వంతు అంటే 400 వరహాలు మాదన్న మంత్రికి లాంఛనంగా ( లంచంగా ) ముందుగానే ముట్టిందన్నమాట. గోల్కొండ రాజ్య సేనాధిపతి అక్కన్న గారికి ఇంగ్లిష్ వ్యాపారులను అనుగ్రహించటానికి, ఇతరదేశాల వ్యాపారులను గోల్కొండ రాజ్యం నుంచి తరిమివేయటానికి ఎన్నో పుట్ల రాగి, కావలసినంత ధనం ఇస్తామని చెన్నపట్నంలోని కంపెనీవారు క్రీ.శ. 1683 ఆగస్టు 14 వ తేదీ ఒక లేఖ రాశారు. ఇంతేనా ?  వైభవోపేతంగా జరిపిన   మాదన్న కుమారుడి ఉపనయనానికి, పెళ్ళికి, మాదన్న గారి పేష్కార్ ( Secretary) కి, ఆయన బిడ్డకీ, పినతండ్రికి కూడా ఇలాగే కంపెనీ వారినుంచి తరచు భారీగానే నజరానాలు ముట్టేవి. తమ స్వంత మనుషులైన వీరరాఘవులు, వెంకటాద్రి వంటి వారిని గుమాస్తాలుగా నియమించుకుని వారి ద్వారా లోపాయకారీగా జరిపిన ఈ కరణీకంలో అక్కన్న మాదన్నలే కాదు. వారి అనుచరవర్గం భారీగా లాభపడినట్లు,దశలవారీగా ప్రతి దశలోనూ లంచం చేతిలో పడకుండా ఎక్కడా ఏ పనీ కూడా  ఈ సోదరుల దగ్గర సానుకూలపడేది కాదని ఈ సోదరులు కంపెనీవారితో సాగించిన నాటి ఉత్తర ప్రత్యుత్తరాలు తిరుగులేని విధంగా చాటుతున్నాయి. కంపెనీ వారు ఆశిస్తున్న ఏ పని జరగాలన్నా వారి నుండి తమకు దక్కాల్సిన లాంఛనాలు, కానుకలు వగైరాలను ముందుగానే తమ మనుషుల ద్వారా  ఈ సోదరులు కంపెనీవారికి తెలిపేవారు. గోల్కొండ రాజ్యంలో ఈ అన్నదమ్ములకు దొరికిన బంగారు అవకాశం అలాంటిది. తానీషా అభిమానాన్ని పొందిన ఈ సోదరులమీద రాజ్యంలో చాపకింద నీరులా  ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారిని  ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితే ఉండింది.     ఆనాటి నిరంకుశ పాలన కారణంగా వీరి మాటకు అడ్డులేకుండా పోయింది. క్రీ.శ. 1672 లో తానీషా మామగారు అబ్దుల్లా కుతుబ్ షా (1626 - 72)  చనిపోయిన సందర్భంలో అక్కన్న మాదన్నలు చేసిన కరణీకం, కుట్రల 

కారణంగానే  మృతిచెందిన సుల్తాన్  అల్లుడైన తానీషా తేలిగ్గా అధికారాన్ని చేజిక్కించుకోగలిగాడనీ, ఆ కారణంగానే ఆ సోదరుల పట్ల ఆయన కృతజ్ఞతాభావంతో వారు ఏమిచేసినా ఉదాసీనంగా ఉండేవాడని అంటారు. తానీషా రాజ్యపాలనా భారం మొత్తాన్ని ఈ సోదరుల మీదనే వదిలేసి వారిపై పూర్తి విశ్వాసం కలిగివుండటం కారణంగా వారికి తమ పాలనా వ్యవహారాలలో ఇంతటి  నిరంకుశత్వం చెలాయించటం సాధ్యపడింది. ఈ సోదరులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నకొద్దీ వారిపై ముస్లిం ప్రజలలో వ్యతిరేకత తీవ్రతరం కావటం, అందరి మనసులలో గూడు కట్టుకున్న ఆ వ్యతిరేకతే  క్రమంగా  మరింత  తీవ్రమై,  కొందరు ముస్లిం స్త్రీల సహకారంతో  ఈ సోదరులను ప్రత్యర్థులు హత్యచేయటానికి దారితీసిందని మనం ముందుగానే చెప్పుకున్నాం.  గోల్కొండ రాజ్యంలోని హిందువులలోని అత్యధికులు  కూడా అక్కన్న మాదన్నల పట్ల సానుకూలంగా ఏమీ లేరు. ఈ సోదరుల వలన ప్రయోజనాలు పొందిన బ్రాహ్మణులు - ముఖ్యంగా శైవులు - వీరిని ధర్మాత్ములుగా కీర్తించినా  ఈ సోదరులు  చేసిన తప్పులలో అన్నింటికంటే క్షమించరాని  తప్పు ఒకటుంది. పరమ కిరాతకునిగా, దురాశాపరునిగా పేరొందిన పొదిలి లింగన్న అనే కరణం వజ్రాల వ్యాపారంలో ప్రవేశించి రాజ్యంలో పలు దోపిడీలు, అరాచకాలు చేస్తూ ఉంటే, అక్కన్న మాదన్నలు అలాంటి వాడిని చేరదీసి, క్రీ.శ. 1682 లో ‘ దొంగ చేతికే తాళం చెవులు ఇచ్చినట్లు’  ఆ లింగన్ననే కృష్ణానదికి దక్షిణంగా ఉన్న గోల్కొండ రాజ్యానికంతటికీ  తమ తరఫున సుబేదార్ ( గవర్నర్) గా నియమించారు. పొదిలి లింగన్న  అప్పటికే కుట్రదారునిగా, చాడీకోరుగా  ఆంధ్రదేశమంతా దుష్కీర్తిని మూటకట్టుకున్నాడు. నేటి ఆరు జిల్లాలలోని  భూభాగాన్ని గండికోట కేంద్రంగా దాదాపు రెండువందల ఏళ్ళ పాటు (ముందు  హంపి విజయనగర ప్రభువులకు సామంతపాలకులుగా, ఆ తరువాత క్రీ. శ. 1652 వరకు   స్వతంత్రంగానే ) పాలించిన  పెమ్మసాని ప్రభువులపై అసూయాద్వేషాలతో  పగబూనాడు లింగన్న.  గోల్కొండ  పంచన చేరి, అబ్దుల్లా కుతుబ్ షా కొలువులోని కుటిలుడు, స్వామిద్రోహి అయిన మీర్ జుమ్లా అనే మంత్రి ( వజీరు) తో  కలిసి కుతంత్రాలు పన్ని అబ్దుల్లా కుతుబ్ షాను గండికోటపై దాడికి పురికొలిపింది  వంచకుడైన ఈ లింగన్నే. ఆ కుట్ర ఫలితమే క్రీ.శ. 1652 లో జరిగిన గండికోట యుద్ధంలో  కుతంత్రంతో, మోసంతో గోల్కొండ సైన్యానికి లభించిన విజయం. పొదిలి లింగన్న అరాచక చరిత్ర గురించి, అతడి కుట్రపూరిత స్వభావాన్ని గురించి, తరువాత భాగంలో వివరిస్తాను. అక్కన్న మాదన్నలు  తమ స్వీయ ఆర్ధిక ప్రయోజనాల సాధనకోసం ఈ లింగన్నను తమ ప్రతినిధిగా నియమించుకుని  చేసిన పనుల కారణంగా ఈ సోదరులు ఎంతో ప్రజా వ్యతిరేకతను కొనితెచ్చుకున్నారు. హంపి విజయనగర వారసత్వాన్ని నిలబెట్టిన బలమైన  హిందూ రాజ్యమైన గండికోట విధ్వంసం  పట్ల కలత చెందిన ఆంధ్రులు అందుకు మూల కారకుడైన లింగన్నతో   అక్కన్న మాదన్నల దోస్తీని ఎలా సహిస్తారు ? అందుకే హిందువులలో అత్యధికులకు  అక్కన్న మాదన్నల పట్ల సానుకూల వైఖరి లేకపోవటం. 


                    తమ మేనల్లుడు, నేటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంచెర్ల గోపన్న 

(1620 - 88) అనే భద్రాచల రామదాసును వీరు క్రీ.శ. 1672 తరువాత కాలంలో గ్రామ కరణం స్థాయినుంచి పదోన్నతి కల్పించి తమ సిఫారసుతో పాలవంచ తహసీల్దారుగా నియమింపజేయగా, ఆ తరువాత ఆయన ప్రభుత్వ బొక్కసానికి చేరవలసిన నిధులను దారి మళ్ళించి, భద్రాచల రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికో, లేక పునర్నిర్మాణానికో  వెచ్చించినందున, ఆ నేరం తాలూకు అపకీర్తిని అక్కన్న మాదన్నలు కూడా మోయాల్సివచ్చింది. ఆ నేరానికిగాను శిక్షగా రామదాసు గోల్కొండ చెరసాలలో         పన్నెండేళ్ళు కారాగారవాసం చేస్తూ ‘ దాశరధీ కరుణా పయోనిధీ’ అనే మకుటంతో 108 పద్యాలతో దాశరధీ శతకాన్నీ, పలు కీర్తనలనూ రాశాడు. ఈ ఘటన కారణంగా రామదాసు ఆర్థిక అక్రమాల వెనుక  అక్కన్న మాదన్నల హస్తం కూడా ఉందని అక్కన్న మాదన్నల ప్రత్యర్థులతో సహా సామాన్య ముస్లింలంతా ఈ ఇరువురు సోదరులపై విమర్శనాస్త్రాలు సంధించారు. 


                      ఇక వచ్ఛే భాగంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు భక్త రామదాసు, ‘ ఆంధ్ర వాల్మీకి’ గా పేరొందిన కవి వావిలికొలను సుబ్బారావు ( వాసుదాసు)ల సాహిత్య, సామాజిక సేవతో పాటు, కిరాతకునిగా పేరొందిన పొదిలి లింగన్న కుట్రలు, కుహకాల గురించి కూడా విపులంగా వివరిస్తాను. 


                            -- మీ.. రవీంద్రనాథ్.

No comments:

Post a Comment

Total Pageviews