Saturday, January 2, 2016

తిరుప్పావై పాశురములు
18 వ రోజు - అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించటం
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్
ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి, ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషాకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం, అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ,వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను "శ్రీ" అంటారు.
లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషాకారం అంటారు.
అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన బాధలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్తలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఃఖిస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఃఖంగా భావించటం. వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం.
అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన రాముడయితే అమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీళా దేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీళాదేవి అనే పేరుతో ఎవ్వరు కనిపించరు. రాధగానో, రుక్మిణి గానో, సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తుత్వాన్ని చేయగలిగినవారు కాదు. మరి ఆయనకుండే పదహారువేల మందిలో ఎవరు నీళాదేవి అని గుర్తించేది? అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపు రాణుల్లో ఒక ఆవిడపేరు నాజ్ఞజితి. శ్రీకృష్ణుడు నీళాదేవిని ఎట్లావివాహం చేసుకున్నడని మన సంప్రదాయం తెలియ జేస్తుందో అలాగే ఈ నాజ్ఞజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడాటానికి శివధనస్సును చేదించినట్లే, ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీళాదేవే పురుషాకారం అంటారు. ఈరోజు నీళాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది.
"ఉందు మదకళిత్తన్" మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు "ఓడాద తోళ్ వలియన్" ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అలాంటి "నంద గోపాలన్" నందగోపాలుని "మరుమగళే!" కోడలా అంటూ పిలిచారు. సీతా దేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. "నప్పిన్నాయ్!" ఓ సమగ్రమైన సౌందర్య రాశి! అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. "కందం కమరుం కురలి" సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ."కడై తిఱవాయ్" గడియ తెరువుమా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని.
"కోరి అరైత్తన కాణ్" కోడి కూస్తుంది, అయితే కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా "ఎంగుం " అన్ని కోళ్ళు కూస్తున్నాయి "వంద్" తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది.
నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. "మాదవి ప్పందల్ మేల్" మాధవీ లత ప్రాకిన పందిరి మీద "పల్గాల్" అనేక సార్లు "కుయిల్ ఇనంగళ్" కోకిలల గుంపులు "కూవిన కాణ్" కూస్తున్నాయి.
బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, "పందార్ విరలి" బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.
"ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ" నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. "శెందామరై క్కైయాల్" నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో "శీరార్ వళై ఒలిప్ప" నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, "మగిరింద్" అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో "వందు తిఱవాయ్" నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ లేపింది.
తిరుప్పావై పాశురములు
17 వ రోజు - ఆచార్యుడు అందించే మంత్రం
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్
ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నిన్నీ పాశురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్క సారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుషా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏక్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.
ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాళ్, "అమ్బరమే" వస్త్రములు, "తణ్ణీరే" నీళ్ళు, "శోఱే" ఆహారం, "అఱం శెయ్యుం" ఏ ప్రయోజనం ఆశించకుండా, "ఎమ్బెరుమాన్" దానం ఇచ్చే "నందగోపాలా!" నంద గోపాలా "ఎరుందిరాయ్" లేవయ్యా, అనిలేపారు.
ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది, మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు, ఎందుకంటే యశస్సును ప్రసాదించేది - యశోద లేక మంత్ర రత్నం. "కొన్బనార్ క్కెల్లాం" సుందరమైన దేహ స్వరూపం కల్గి, స్త్రీ జాతి కందరికి "కొరుందే!" చిగురులాంటి దానా. "కుల విళక్కే" ఆ కృష్ణ ప్రేమ కల్గిన కులానికే ఒక దీపంలాంటి దానా "ఎమ్బెరుమాట్టి" నీవే ఆయన అనుగ్రహాన్ని కల్గించే స్వామినివి "యశోదా!" ఓ యశోదమ్మా! "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రం గా ఊహించింది అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది, ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.
అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. "అమ్బరం ఊడఱుత్తు" ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా "ఓన్గి" పెరిగి "ఉలగళంద" లోకాలను అంతా కొలిచిన, "ఉమ్బర్ కోమానే!" దేవతలందరికి నియంత అయిన స్వామి "ఉఱంగాదు" నిద్ర పోవటానికా నీవు వచ్చావు ఇక్కడికి, "ఎరుందిరాయ్" లేవయ్యా. అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ విన్నపించింది.
ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతరంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు, ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు, ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు, ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు. "శెమ్బొఱ్ కరలడి" అపరంజి బంగారు కడియం కల్గిన "చ్చెల్వా" ఓ సంపన్నుడా "బలదేవా!" బలదేవా! "ఉమ్బియుం నీయుం" నీవూ నిద్ర పోకూడదు, "ఉఱంగ్" మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.

తిరుప్పావై పాశురములు 16వ రోజు - భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే

తిరుప్పావై పాశురములు
16వ రోజు - భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.
ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాళ్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.
"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ధ్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చే్రాల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ధ్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్" మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం" మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళం తీయవయ్యా.
ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్లపిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, "నెన్నలే వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం ఆయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటే "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.
"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.

తిరుప్పావై పాశురములు 15వ రోజు - ఆచార్య సన్నిధానానికి చేరే ముందు స్థితి

తిరుప్పావై పాశురములు
15వ రోజు - ఆచార్య సన్నిధానానికి చేరే ముందు స్థితి
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.
ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మద్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్శి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.
కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు"నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.
బయట నుండి వాళ్ళు "వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక"వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.
కాని బయట నుండి,"ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరొకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి"ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.
"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై" బలం కల్గిన ఏనుగు - కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.
ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మథురానగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముష్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.
ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

తిరుప్పావై పాశురములు 14వ రోజు - వేదమే ప్రమాణం

తిరుప్పావై పాశురములు
14వ రోజు - వేదమే ప్రమాణం
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.
"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.
"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.
అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.
జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో "శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

మిత్రులందరికీ శుభసాయంత్రం!! కావేవి కళలకు అనర్హం!!!


Friday, January 1, 2016

'గంగిరెద్దులాట' ప్రాచీనమైన జానపద కళ, ఈ దిగువ లంకెలు నొక్కండి వీక్షించండి!

        'గంగిరెద్దులాట' ప్రాచీనమైన జానపద కళ,
 ఈ దిగువ లంకెలు నొక్కండి వీక్షించండి!
1)   http://youtu.be/hrXR7C2I3dU 



         గంగిరెద్దులు ఆడించడం అనేది మన సంస్కృతిలో జానపద కళల్లో ఒకటి. పూర్వం సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతీ గ్రామ సీమలో ఈ గంగిరెద్దు మేళాలు దర్శనమిచ్చేవి. గంగిరెద్దుల వారు వీటితో చేయించే నృత్యాలు అబ్బురపరుస్తాయి. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉంటారు.ఒక వ్యక్తి గంగిరెద్దును ఆడిస్తుంటే మిగతా వారు డోలు సన్నాయిలు వాయిస్తుంటారు.వారి మేళతాళాలకు అనుగుణంగా గంగిరెద్దు నృత్యం చేస్తుంది.  ముఖ్యంగా గంగిరెద్దును దానిని ఆడించు అతను చాతీమీద పెట్టుకుని ఆడించే విధానం అకట్టుకుంటుంది. గంగిరెద్దుల వారు గ్రామాల్లో ఇంటీంటికి తిరిగి గంగిరెద్దును ఆడిస్తూ ఇంటిల్లిపాదినీ ముఖ్యముగా పిల్లలను తమదైన శైలిలో పొగుడుతూ ఆశీర్వచనాలు అందిస్తారు. ఆ ఇంటినుంచి నగదు,  వస్తురూపేణా లేదా పాతబట్టలు ఇలా తీసుకుంటారు.    
        గంగిరెద్దులాట చాలా ప్రాచీనమైన కళ దీని గురించి పురాణ ఇతిహసాల్లో కూడా ప్రస్తావన ఉంది. గంగిరెద్దు సాక్షాత్తు విష్ణుస్వరూపంగా ఒక పౌరాణిక గాధ ఒకటి వుంది.  పూర్వం గజాసురుడనే రాక్షసుడు పరమశివున్ని వరం కోరుకుని తన గర్భంలో నివాసముంచుకోగా పార్వతిదేవి కోరికపై బ్రహ్మది దేవతలు గజాసురుని రాజ్యానికి మేళం వలే వచ్చి గంగిరెద్దుతో నృత్యం చేయించారని ఆనృత్యానికి పరమానందభరితుడైన గజాసురుడు ఏమి వరం కోరుకొమ్మని అడగగా బ్రహ్మాది దేవతలు పరమశివున్ని ఇవ్వమని అడిగారని పురాణాల్లో ఉంది. ఇలా అతి ప్రాచీనమైన కళలని మనం పరిరక్షించు కోవాలి..మొన్న మావూరు వెళ్ళినప్పుడు ఈ అద్భుత కళా విన్యాసం మీకోసం! సత్యసాయి విస్సా ఫౌండేషన్. 

Total Pageviews