Thursday, February 11, 2016

చంద్ర వర్ణన :
చంద్రుని గురించి, దమయంతికి ఇంకా ఇలా చెప్తున్నాడు నలుడు.
"జ్యోత్స్న నాగఁ దమిస్ర నా నుభయభార్య
లుడుపతికి; నందు నొకతె తె, ల్పోర్తు నలుపు;
తాను వారికి మెచ్చుగాఁ దాల్పఁబోలుఁ
తెలుపు నలుపును నగు మేను నెలత! యితడు".
(శృంగారనైషధము - శ్రీనాథుడు)
అర్థములు: జ్యోత్స్న = వెన్నెల; నాగ = అనియు; తమిస్ర = చీకటి; నా = అనియు; ఉభయభార్యలు = ఇద్దరు పత్నులు; ఉడుపతి = తారాపతియైన చంద్రుడు (ఉడు అనగా నక్షత్రము); ఒకతె = ఒకరు; ఓర్తు = ఒకరు; వారికి మెచ్చుగా = వారికి నచ్చినట్టుగా; మేను = శరీరము; నెలత = స్త్రీ.
భావము: "దేవీ! ఈ సుధాకరునికి ఇద్దరు సతులు ఉన్నారు. వారు జ్యోత్స్న మరియు తమిస్ర. అందులో జ్యోత్స్న (వెన్నెల) తెల్లగాను, తమిస్ర (చీకటి) నల్లగాను ఉంటారు. అందుచేత, వారికి ఇష్టమైనరీతిలో ఉండుటకై, ఈ మాయలమారి జాబిల్లి కొన్నాళ్ళు తెల్లగాను, కొన్నాళ్ళు నల్లగాను తన దేహవర్ణమును మారుస్తూ ఉంటాడు." ఇదీ నలుని వివరణ....... సహృదయపాఠకులు ఈపాటికి కనిపెట్టేవుంటారు - అవే శుక్లపక్షము మరియు కృష్ణపక్షము అని.
కవిసార్వభౌముల కమనీయ కల్పనకు అడ్డేమున్నది!....
తల్లి తండ్రులకు ఒక గమనిక, ఒక విన్నపం.
పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా పౌరులుగా తీర్చిదిద్దాలి అనుకుంటే, అది మీ చేతులలోనే ఉంది.
1. రోజులో ఒక పది నిముషాలు పిల్లలు ( వారు ఎ వయసు వారైనా ) చెప్పే మాటలను శ్రద్ధగా, సంతోషంగా , ఆసక్తిగా విని, వారితో పదినిముషాలు గడపడం అలవాటు చేసుకోండి.
2. ఆ పదినిముషాలు టీవీ, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంకా ఇతరత్రా వ్యాపకాలు లేకుండా చూసుకోండి.
3. అలాగే సాధ్యమైనంత వరకు, రోజులో ఉదయం అల్పాహారం కానీ, రాత్రి భోజనం కానీ కుటుంబ సభ్యులు కలిసి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ టైం లో కూడా వీలైనంత వరకు, జోక్స్, సరదా కబుర్లతో గడపండి.
4. అలాగే, పిల్లల ఎదురుగా ఎవరినీ విమర్శించడం అలవాటు చేసుకోకండి. పిల్లల ఎదురుగా పోట్లడుకోకండి. అలాగే, ఒకరి పుట్టింటి వారిని ఒకరు పిల్లల ఎదురుగా విమర్శించకండి.
5.వారానికి ఒకసారి అయినా, పిల్లలతో కాస్సేపు ఆడుకోండి.
6. వీలైనంత వరకు మీరు టెక్నాలజీ ని పిల్లల ఎదురుగా సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించండి.
7. పిల్లల స్నేహితుల మీద, వారి తో కలిసి తిరిగే సమయం మీద ఒక కన్నేసి ఉంచండి.
8. పిల్లల స్నేహితులు ఇంటికి వచ్చినపుడు, వారి వారి ప్రత్యెక గదులలో కాకుండా ఇంటిలో కామన్ హాల్ లో కూర్చొని, మాట్లాడుకోమని చెప్పండి.
9. మీరు వారి మాట వింటారు అనే నమ్మకాన్ని, పిల్లలలో కలుగ చేయండి. మీ పిల్లలు చెడిపోతే అది మీ బాధ్యతే.
10. పిల్లలు పార్టీలకు, గెట్ టుగెదర్ లకు వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి రావలసిన సమయాన్ని మీరు నిర్ణయించండి.
11. పిల్లల ముఖ్యమైన స్నేహితుల, ప్రొఫెసర్ ల ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోండి.
12. ఒకవేళ పిల్లలు పరీక్షలలో విఫలం అయినా, వారిని ఇతరులతో పోల్చితిట్టకండి. అది వారి మనసు మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
13. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము అనే నమ్మకాన్ని వారిలో కలిగించండి.
14. ఇంట్లో పెద్దవాళ్ళు ( నానమ్మలు, తాతయ్యలు ) ఉంటె వారితో కొంతసేపు గడపడం అలవాటు చేయండి.
15. వారి పట్లమీరు గౌరవం చూపిస్తే, పిల్లలు కూడా వారిని గౌరవిస్తారు.
ప్రతి తల్లితండ్రులు ఈ సూచనలు పాటిస్తే, పిల్లలు కొంతవరకు ప్రక్కదారులు పట్టకుండా ఉంటారు.

పెద్దలమాట చద్దిమూట!!

వయసు త్వరగా ఎదగడం మన చేతుల్లో ఉండదు.
జీవితంలో పైకి ఎదగడం మన చేతల్లో ఉంది!!!



Tuesday, February 9, 2016

పెరుగు తింటే ఆరోగ్యం.. ! కానీ పెరుగు తినడంపై చాలా అపోహలున్నాయి. కాస్త జ్వరం, దగ్గు, జలుబు, గాయాలు

 తగిలినప్పుడు పెరుగు తినకూడదు అని చెబుతుంటారు. కానీ పెరుగులో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు 

ఉన్నప్పుడు.. అనారోగ్యంతో ఉన్నప్పుడు పెరుగు ఎందుకు తినకూడదు అంటారు ? అంతేకాదు.. రాత్రిపూట 

పెరుగు తినవచ్చా ? తినకూడదా ? అనేది మరో పెద్ద డైలమా ? కొంతమంది రాత్రిపూట పెరుగు తినవచ్చు అంటే.. 

మరికొందరు అస్సలు రాత్రి పూట డిన్నర్ లో పెరుగు చేర్చుకోనేకూడదు అంటారు ? అసలు ఏది వాస్తవం ?? 

పెరుగులో అనేక ఆరోగ్యప్రయోజనాల

ు దాగున్నాయి. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వాళ్లు కనీసం పెరుగైనా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు 

సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది. 

ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, ట్రెండ్స్ కారణంగా.. మంచి బ్యాక్టీరియాని కోల్పోతున్నాం. కాబట్టి ఇది 

పుష్కలంగా లభించే.. పెరుగుని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి డైట్ లో 

కంపల్సరీ పెరుగు చేర్చుకోవాలి. అయితే రాత్రి పూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే జలుబు, 

దగ్గుతో బాధపడేవాళ్లు తరచుగా జలుబు చేసే అలర్జీ ఉన్నవాళ్లు మాత్రం పెరుగు రాత్రిపూట తీసుకోకపోవడం 

మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే.. పెరుగు కఫంకి కారణమవుతుందని ఆయుర్వేదం 

రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తుంది. అయితే ఇది అందరూ పాటించాల్సిన అవసరం లేదు. 

ఎవరైతే ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడతారో వాళ్లు మాత్రమే కర్డ్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ఇంకా నచ్చితే మజ్జిగ తీసుకున్నా మంచిదని సూచిస్తున్నారు.
శ్రీ నాధుడు ... అరవ బొజనం !

ఒకసారి శ్రీనాథుడు.పేద కోమటి వేమారెడ్డి పంపితే కాంచీపురం వెళ్ళాడట .
అక్కడ ఎవరింట్లోనో భోజనం చేశాడు.వారి భోజనాన్ని యిలా వర్ణిస్తున్నాడు.
తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు 
చెవులలో పొగ వెళ్లి చిమ్మిరేగ
బలుతెరంగుల తోడ పచ్చళ్ళు
చవి గొన్న బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు ససిలేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కు వచ్చు
నరవ వారి యింట విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమతీరు సిగ్గులేక
చూడవలయు ద్రావిడుల కీడు మేళ్ళు
.
అప్పటికి మిరపకాయలు లేవు కారాలన్ని టికీ మిరియాలనే వాడేవారు.
ఆంధ్రులకు పప్పు ముఖ్యం వారికి చారు ముఖ్యం.
అలవాటు లేని చారు మొదటనే వడ్డించే సరికి
ఆ కారం ఆయన నసాళానికి అంటిందట.
యవిసాకు ఆర్నెల్ల కిందట వేయించి పెట్టినది
దాని వాసన తలుచుకుంటేనే పండ్లు పులిసి పోతాయి.
వివిధ రకాల పచ్చళ్ళు,
వేపాకు వేయించి చేసిన పొడి వేశారట.
అవన్నీ తినలేక ఈ పద్యం చెప్పాడట.
ఆయనకు అందర్నీ విమర్శించడం అలవాటే కదా!
యిప్పుదేవరూ అంత కారాలు తినడం లేదు.
యిది శ్రీనాథుని కాలం లోని సంగతి. . .

"అన్నవరం దేవుడు"
శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారితో కలసి కోలుతీరిన ప్రదేశం.పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా.ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగ గా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత.అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది. ''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప'' అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.



Monday, February 8, 2016

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?
లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో యే దేవతామూర్తిని యేవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అయిన పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. "భగవంతు వలగొను పదములు పదములు" అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరి - పరమేశ్వరుడు, లక్ష్మీదేవి - శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతాడు. మనం తలవంచి నమస్కారం చేస్తాం. ఆ శఠారి (శఠం అంటే మనలో ఉండే మొండితనం - దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ? అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమః - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమః - పాదౌపూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చు.అని పెద్దలు చెపుతారు.

Total Pageviews