Thursday, November 3, 2016

వానల్లు కురవాలి... వానదేవుడా వరిచేలు పండాలి... వానదేవుడా!

'Rain Rain go away
come again another day'
మంచుతో నిండిన దేశాల్లో పాడుకునే పాట ఇది. ఇది కాదు మన సంస్కృతి.
నెలకు మూడు వానలు కురవాలి అని మనం కోరుకుంటాం.
వానల్లు కురవాలి... వానదేవుడా
వరిచేలు పండాలి... వానదేవుడా!
నల్లనల్ల మేఘాలు... వానదేవుడా
మెల్లంగ కురవాలి... వానదేవుడా...!
పచ్చనీ పైరులే... వానదేవుడా
ఏపుగా ఎదగాలి... వానదేవుడా!
చెరువులన్నీ నిండాలి... వానదేవుడా
ఏరులై పారాలి... వానదేవుడా...!
చేలన్నీ పండాలి... వానదేవుడా
గాదెలన్నీ నిండాలి... వానదేవుడా!
కప్పలకు పెళ్ళిళ్ళు... వానదేవుడా
గొప్పగా చెయ్యాలి... వానదేవుడా...!

సత్యప్రభావం.

సత్యప్రభావం.

పూర్వం ఒక రాజ్యంలో గజదొంగ యుండేవాడు. అర్ధారాత్రి పూట దొంగతనాలు చేసేవాడు. బాగా చీకటి పడేవరకు గ్రామాలలోయున్న దేవాలయములలో సత్కాలక్షేపాలలో పాల్గొనేవాడు. అలా చీకటి పడేవరకు వేచియుండేవాడు. దీని కారణంగా అతనికి తన జీవిత తరుణోపాయం ఏమిటి అనే వ్యధ అతనిలో జనించింది. ఒకరోజు అతడు ఆధ్యాత్మిక బోధ చేసే ఒక పండితుని వద్దకు వెళ్ళి నా జీవిత తరుణోపాయం సెలవివ్వండి అని ప్రార్ధించాడు. “నీవు దొంగతనం మానివేయమన్నాడు” ఆ పండితుడు. “అది నా వృత్తి. దానిని మానలేనన్నాడు.” “సరే భగవన్నామము మానసికంగా” చేయమన్నాడు”. అదీ కుదరదన్నాడు. అయితే “సత్యవ్రత దీక్ష స్వీకరించి సత్యము” పలకమన్నాడు. దానికి గజదొంగ తన దగ్గరకి ఎవ్వరు రారు కనుక సత్యం పలకటం తేలికయని “సరే”నన్నాడు. ఒకరోజు రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరి వెళ్ళాడు. ఇంతలో రాజు, అతని సేనాని మారువేషాలలో తిరుగుతూ అతనిని గమనించి “ఎక్కడికి బయలుదేరావు” అని అడిగారు. దానికి ఆ గజదొంగ నేను రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరానని చెప్పాడు. “అరె! ఇంత పెద్ద విషయాన్ని ఇంత ధైర్యంగా ఎలా చెప్పావు ప్రమాదం కదా” అన్నారు. దానికి “అయ్యా! నేను ఒక స్వామి వద్ద సత్యం పలుకుతానని ప్రమాణం చేశాను. కనుక మీతో సత్యమే చెప్పాను” అన్నాడు. ఆరోజు రాత్రి కోటలో గజదొంగ నాలుగు వజ్రాలు కాజేశాడు. సేనాని చాకచక్యంగా గజదొంగను పట్టుకున్నాడు. దొంగవద్ద నాలుగు వజ్రాలు దొరికినవి. కాని మంత్రి ఐదో వజ్రం ఎక్కడ అని గదమాయించాడు. అయ్యా! నేను అబద్దమాడను. అది నా నియమము. నేను నాలుగు వజ్రాలే దొంగిలించాను అన్నాడు. దొంగతనం జరుగగానే ప్రధమ విచారణ మంత్రిగారే చేసినందువల్ల ఆ అయిదో వజ్రం మంత్రిగారే అపహరించి దొంగపై అబాంఢము వేశాడని రాజు గ్రహించి మంత్రిని సోదా చేయగా అతని వద్ద అయిదవ వజ్రం దొరికింది. మంత్రిని ఆ పదవినుండి తొలగించి గజదొంగకు తన ఆస్థానంలో నగర రక్షణ పదవి ఇచ్చి అతనిని రాజు సత్కరించాడు.
సత్యానికి కట్టుబడ్డ దొంగ నగర రక్షణ పదవిలో నియమింపబడ్డాడు. సత్యానికి యుండే విలువని ప్రాధాన్యతను గుర్తెరిగి భారతజాతి ఔన్నత్యానికి వెన్నెముక అయిన సత్యధర్మ దీక్షను అందరు స్వీకరించాల్సియున్నది. సత్యం జాతి ఔన్యత్యం ఆయు:ప్రమాణాలని పెంచుతుందని అందరూ గ్రహించాలి.

పరనిందో భయావహః!!

పరనిందో భయావహః
ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న  పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.
లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత  ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.
"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది.. కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది.  శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.
పార్వతికి ఈ  ప్రశ్న చాలా బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం  సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని  ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి.  ఏంచెప్పాలి?  కొంచెం ఆలోచించింది.
"సుతను బలిమఖే "  అంది.
'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం.  ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు  తన భర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే. 'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది.
లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.
తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం.   మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని  లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.
మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు  మీఆయన కూడ నాట్యం చేస్తాడు.   ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం.
పార్వతి సమాధానం ఇంత పదునుగా
ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంత పనయింది. ఏలాగో కూడగట్టుకుంది.
ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది.
క్వను చ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది. మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి  కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం.పార్వతి వెంటనే అంది.
' నైవ జానే వరాహం ' అంది
“ ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది.
బాలే! కచ్చిన్న దృష్ట :  జరఠ వృషపతి: ? అనడిగింది. 'మీ వాహనం అదే ఆ  ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం.  మీరు నేల పై తిరుగుతారు.మీ వాహనం  ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే
వెంటనే అందుకుంది.
"గోప ఏవాస్య వేత్తా " అంది. 'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా?  పో! పోయి, మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది.మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం.

కార్తిక మాస వ్రతము. 4 వ అధ్యాయము... దీపారాధన మహిమ.

4 వ అధ్యాయము...     దీపారాధన మహిమ

ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తిక మాసమున ముఖ్యముగ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తిక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

శతృజిత్ కథ
పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు ఒక ముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నీ వెందుల కింత తపమాచరించు చున్నావు? నీ కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. అంత ముని పుంగవుడు ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నెర వేరగలదు' యని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో నియమాను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మాదులు జేసి, ఆ బాలునకు 'శతృజిత్' యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాకుమారుడు శతృజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునకు రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండి౦చుచు తన
కామవా౦ఛ తీర్చుకోనుచుండెను.
తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శతృజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦చుట మన్మధున కైననూ శక్యము గాదు. అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో నామెను సమీపించి తన కామవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములనుభవించెను.
ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్దరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.
ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలు దేరి గర్భగుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహాదానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామా౦ధకారముతో కన్ను మిన్నుతెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను. అంత యమకింకరులు' ఓ బాపడా ఎవరెంతటి నీచులైననూ, యీ పవిత్ర దినమున, అనగా, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అలా యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నప్పటికి మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆయనకు దానము చేసెను. శివదూతలు వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన వారి పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
నాలుగో అధ్యాయము - నాల్గవ రోజు పారాయణము సమాప్తం.

Wednesday, November 2, 2016

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం.

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||

నాగుల చవితి (గురువారం, 03.11.2016)

నాగుల చవితి (గురువారం, 03.11.2016)
కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు.నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.
నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||
సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ.
శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లా డింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది.
ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.

కార్తిక పురాణం 3వ అధ్యాయము - కార్తీకమాస స్నాన మహిమ

కార్తిక పురాణం
3వ అధ్యాయము - కార్తీకమాస స్నాన మహిమ
జనక మహరాజా! కార్తిక మాసమున యే ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు.
అధమము కార్తీకమాస శుక్ల పార్ణమి రోజు నయిననూ స్నానదాన జపతపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకి౦పుము.
బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట
ఈ భారతఖండమందలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వటవృక్ష౦బుపై భయంకర ముఖములతోను, దీర్ఘ కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయక౦పితము జేయుచు౦డిరి. తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పఠించుచు "ప్రభో! ఆర్తత్రాణపరాయణ! ఆనాధరక్షకా! ఆపదలోనున్న గజేంద్రుని, ని౦డుసభలో అవమానాలు పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ!"యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులుకు జ్ఞానోదయ౦ కలిగి "మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయ౦ అయినది మమ్ము రక్షింపుడు" యని ప్రాధేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని "ఓయీ! మీరెవరు? ఎందులకు మికీ రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు" యని పలుకగా వారు "విప్రపుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపదా కలగదు" అని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును యీ విధముగా చెప్పసాగెను.
"నాది ద్రావిడ దేశం. బ్రహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యంగా ధనంలాగుకోనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంట కుడిగానుంటిని.
ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తల౦పుతొ పదార్ధసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని యింటినుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి "ఓరి నీచుడా! అన్యాక్రా౦తముగా డబ్బుకూడాబెట్టినది చాలక, మంచిచెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివి గాన, నివు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు"గాక! యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమి౦పుమని వానిని ప్రార్ధి౦చితిని. అందుల కాతాడు దయదలచి "ఓయీ! గోదావరి క్షేత్రమ౦దొక వటవృక్షము గలదు. నెవందు నివసించుచూ యే బ్రాహ్మణుడు కార్తీకవ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణునివలన పునర్జన్మ నొ౦దుదువు గాక" యని వేడలిపోయెను. ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్నూ నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.
ఇక రెండవ రాక్షసుడు "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మణుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా యనునటులచేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచు౦డెడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవర్తి౦చితిని. కాన, నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము" అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను. "మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేయుచు మధ్యమాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాన౦తరము యీ రూపమును ధరించితిని, కావున నన్ను కూడా పాపవిముక్తుని కావి౦పు"మని ప్రార్ధించెను.
ఓ జనక మహారాజా! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి "ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోరకృత్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతును"యని, వారినోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనావిముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంటమునకేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦తురు. అందువలన, ఎంత ప్రయత్నించినాసరే కార్తిక స్నానాలనాచరించాలి.
ఇట్లు స్కాందపురాణా౦తర్గత, వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యముందలి మూడవ రోజు అధ్యాయము - మూడవ రోజు పారాయణము సమాప్తము.

Total Pageviews