Sunday, September 27, 2020

సర్వేజనా సుజనా భవంతు! సర్వే సుజనా సుఖినో భవంతు! స్వస్తి! - మీ బాలు

 ఒరేయ్ పిల్లలూ ఏడవకండర్రా! అంతల్లా గుక్క పెడితే గొంతు పాడవుతుందిరా. అదిగో మళ్ళీ! నేను చెబుతున్నా అలానే ఉంటే ఏలా? బాధ ఉంటుందిరా బంగారాలూ; ఉండదని నేను అనను. కానీ ఒక్కసారి ఆలోచించండి! ఈరోజు కాకపోతే, రేపు. పోనీ పదేళ్ళ తరువాత. ఎప్పటికైనా ఇది తప్పదు కదా. అయినా, నేనంటే అభిమానం ఉంటుందని తెలుసుకానీ.. మరీ ఇంత వెర్రిప్రేమ ఏమిట్రా మీకు. నా భార్యాపిల్లల్ని, భారతీరాజా, ఇళయరాజా, జానకి గారు, రామోజీరావు గారు, మా అన్నయ్య విశ్వనాథ్, తమ్ముడు కమల్‌హాసన్ వంటి ఆత్మీయుల్ని, మరీ ముఖ్యంగా, లక్షల సంఖ్యలో ఉన్న మిమ్మల్మి, లక్షలు కాదేమో కోట్లే అయ్యుండొచ్చు కదా? ఇలా మీ అందరినీ విడిచిపెట్టి వచ్చేస్తుంటే.. నాకూ దుఃఖం తన్నుకొచ్చిందిరా పిల్లలూ. నాకు 75 యేళ్ళు వచ్చినా నేను బాలుడినే కదా. మీ బాలూనే కదా. అందుకే దుఃఖం ఆపుకోలేక పోయాను. ఇక్కడకు వచ్చే వరకూ మీ అందరి కోసం ఏడుస్తూనే ఉన్నాను. , 


కానీ ఇక్కడకు వచ్చిన క్షణం నుండి నా దుఃఖమంతా ఆవిరైపోయింది. నా కోసం స్వయంగా మా అమ్మానాన్న, మా గురువుగారు కోదండపాణి గారు ఎదురొచ్చారు. ఒక్కసారి ఊహించండి, అలాంటి క్షణంలో నా మనఃస్థితి ఎలా ఉంటుదో?  అలా వాళ్ళ ముగ్గురికీ సాష్టాంగ నమస్కారం చేసి, ఈ లోకంలో ప్రవేశించాను. ఇక్కడంతా చాలా బావుందిరా. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏడుపన్నదే లేదు. లోపలికి వచ్చిన దగ్గర నుండి నా పెదాలు నవ్వుతూనే ఉన్నాయి. నా గుండె ఆనందంతో పొంగుతూనే ఉంది. అసలు ఏ ఏడుపు లేకపోవడమే స్వర్గంరా నాన్నా! అంతకుమించేమీ కాదు. మీరు కూడా అక్కడ అలా ఉండడానికి ప్రయత్నించి చూడండి. అప్పుడు అదే స్వర్గమవుతుంది. 


ఈపాటికి మీరు ఊహించే ఉంటారు, తరువాత నేనెక్కడకి వెళ్ళానో! మహ్మద్ రఫీ గారి దగ్గరకురా. మామూలుగా వెళ్ళలేదు. చిన్నపిల్లాడిలా పరిగెత్తుకు వెళ్ళాను. బడే గులాం అలీ ఖాన్, మెహదీహసన్‌ కూడా అక్కడే ఉన్నారు. దానితో నా ఆనందం అంతకు పది రెట్లు పెరిగింది. వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా అక్కడకు బాపూ గారూ, రమణగారు వచ్చారు. మరి బాపూ గారికి వీళ్ళ సంగీతం అంటే ఎంత అభిమానమో తెలుసు కదా. “ఏమిటి బాలూగారు, అప్పుడే వచ్చేశారు?” అని ఆశ్చర్యంగా అడిగారు రమణగారు. మన “కొత్త సినిమాకి సంగీతం చేద్దామని” అని చిన్నగా నవ్వారు బాపు గారు. “ఏంటి ఇక్కడ కూడా సినిమాలు ఉంటాయా?” అని ఆశ్చర్యంగా అడిగాన్నేను. “ఇక్కడ లేనిదీ, దొరకనిదీ అంటూ ఏదీ లేదు బాలూ గారు; ఒక్క ఏడుపు తప్ప. అందుకే పాపం మన బాలచందర్ గారు ఎంతటి ప్రతిభావంతుడైనా, ఎన్నెన్ని మంచి కళాఖండాలు తీస్తున్నా, జనం రావట్లేదు. భూలోకంలో ఆయన మార్కెట్ ఎంత ఫుల్లో.. ఇక్కడంత నిల్” అన్నారు రమణగారు. 


“మరి ఇక్కడ మార్కెట్ ఎవరికుంది?” అన్నాన్నేను. “మాకైతే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ అప్సరసలతోటే మాకు తలనొప్పిగా ఉంది. ఈ బాపూ ఎవరో ఒక భూలోకంనుండి వచ్చినమ్మాయినో, పాతాళం నుండి వచ్చినమ్మాయినో హీరోయిన్‌గా తీసుకుంటాడు. ఇతడి తీతకి ఆ అమ్మాయిలు ఈ రంభా ఊర్వశులకంటే మాచెడ్డ అందంగా కనబడతారు. దానితో దేవతలలో ఆ అప్సరసల ప్రభ కొంచెం తగ్గింది. అందుకే మామీద ఆ కినుక. ఇక్కడ అందరికంటే మంచి మార్కెట్ మాత్రం మన జంధ్యాలదే, సర్లే మీరొచ్చేశారు కదా, ఇంక మనకు బోలెడంత కాలక్షేపం. ముందు కాసేపు అలా ఈ స్వర్గం అంతా తిరిగిరండి, తరువాత తాపీగా మాట్లాడుకుందాం” అని నా భుజం మీద చిన్నగా తట్టి అన్నారు మన రమణ గారు.


నేనలా సరదాగా తిరుగుతుండగా, ఒకచోట ఐరావతం ఎక్కి వస్తున్న ఇంద్రుడు కనబడ్డాడు. “బాలుగారూ బావున్నారా!” అన్నాడు. నేనెంత ఆశ్చర్యపోయానో చెప్పలేను. “నేను మీకు తెలుసా” అని అడిగా. మీరు తెలియని లోకం ఏదుందండి అసలు. నేనూ, మా శచీ రోజూ మీ పాటలతోనే నిద్రలేస్తాం. ఇదిగో ఇప్పుడు ఇలా విహరిస్తూ కూడా మీ పాటలే వింటున్నా, అంటూ ఆ ఐరావతం మీద ఉన్న చిన్నపాటి స్వరమంజూషలో ఉన్న మీటను పైకి జరిపాడు. “రా దిగిరా దివినుండి భువికి దిగిరా” అనే పాట వస్తోందప్పుడు. ఇంద్రుడు పెద్దగా నవ్వుతూ.. మొన్న దేవతల సమావేశంలో పెట్టిన విభావరిలో ఈ పాట రాగానే.. తన్మయత్వంలో ఉన్న మా అధినేతలైన ఆ పరమశివుడు, మహావిష్ణువు భూలోకాని బయల్దేరబోయారు. మేం కాళ్ళావేళ్ళా పడి వాళ్ళను ఆపాల్సివచ్చింది.


“సరే సరే ఇకనుండి మనం రోజూ కలుస్తూనే ఉంటాం కదా! అలా తిరిగిరండి కాసేపు” అని అలా ముందుకు వెళ్ళిపోయాడు. తరువాత నేను నందనవనంలోకి వెళ్ళాను. అక్కడ ఉన్న కల్పవృక్షానికి, కామధేనువుకి నమస్కరించుకున్నాను. ఇంతలో మా వేటూరి సుందరరామ్మూర్తి ఎదురొచ్చాడు. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. “దిక్కుమాలింది అప్పుడే వచ్చేసావేమిట్రా?” అని అలా నోరుతెరచే నిలబడిపోయాడు. “మీకు తెలుసు కదా! దిక్కుమాలింది అన్నది ఆయన ఊతపదం.” నేను వెంటనే వెళ్ళి మా సుందర్రాముడిని గట్టిగా కౌగిలించేసుకున్నాను. అక్కడనుండి ఆయన నన్ను ఆ స్వర్గమంతా తిప్పుతూనే ఉన్నాడు. నాకంటే పదేళ్ళు ముందొచ్చాడుగా మరి. 


ముందుగా త్యాగరాజస్వామి వద్దకు తీసుకువెళ్ళాడు. అంతటి మాహానుభావుడిని చూడగానే నా ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోయింది. అక్కడెవరో పెద్దాయన త్యాగరాజస్వామికి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఆయన వెనుకభాగం మాత్రమే కనబడుతోంది. కానీ, ఎవరో తెలిసినవారే అన్నట్టు అనిపించడంతో, మెల్లిగా ముందుకు వెళ్ళి చూశాను. ఆయన, ఎవరొచ్చారా అన్నట్టు తలత్రిప్పి చూశారు.  ఆశ్చర్యం.. మన మంగళంపల్లివారు. ఆయన నన్ను చూడగానే “ఓయ్ బాలూ నువ్వూ వచ్చేశావా” అన్నారు పెకి లేస్తూ. నేను ఆ త్యాగరాజస్వామి పాదాలకూ, బాలమురళిగారి పాదాలకు నమస్కరించాను. మంగళంపల్లివారు నన్ను లేవనెత్తి కావలించుకొని, త్యాగరాజస్వామికి నన్ను చూపిస్తూ.. “స్వామీ! మా బాలూ” అన్నారు. అప్పుడు ఆయన కళ్లల్లో ఎంత సంతోషం కనబడిందో చెప్పలేను. అప్పుడా త్యాగరాజస్వామి చిన్నగా ఆశీఃపూర్వకంగా నవ్వుతూ.. “తెలుసు” అన్నారు. నేను మరోసారి శిరస్సువంచి ఆయనకు నమస్కరించాను. 


మళ్ళీ కలుస్తామని వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని నేనూ, వేటూరి అక్కడనుండి బయలుదేరాం. నిన్న రాత్రి వరకూ అలా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. మధ్యలో మాకు జంధ్యాల కలిశాడు. ఇంక చెప్పేదేముంది. నవ్వులే నవ్వులు. కాసేపటికి మా దగ్గరకు ఇద్దరు దూతలు వచ్చి, “మిమ్మల్ని దేవేంద్రులవారు స్వరస్థలికి సగౌరవంగా తీసుకురమ్మన్నారు మహాశయా” అన్నారు. సరే పదమంటూ వాళ్ళ వెనుక బయలుదేరా. వేటూరీ, జంధ్యాల కూడా మా వెంటే వచ్చారు. అక్కడ సభంతా గంధర్వులతో నిండిపోయి ఉంది. తుంబురుడు, నారదుడు కూడా కనిపించారక్కడ. అధ్యక్షపీఠంలో సాక్షాత్ సరస్వతీదేవి కూర్చుని ఉంది. నన్ను చూడగానే “రా నాయనా!” అంది. నేను గభాలున వెళ్ళి అమ్మ పాదాల మీద పడ్డాను. “నువ్వు పెట్టిన భిక్షతోనే 54 సంవత్సరాలపాటు భూలోకంలో గానగంధర్వుడన్న కీర్తి సంపాదించానమ్మ” అంటూ, ఆనందంతో ఉబికి వచ్చే కన్నీళ్ళతో అమ్మ పాదాలను తడిపివేశాను. అమ్మ ఆనందంగా.. “లే నాయనా, లే!. ఇక్కడ కూడా నీ ప్రతిభ అసాధారణ స్థాయిలో వెల్లడి కాగలదు. నీ కీర్తి ఆ చంద్రతారార్కం ఉంటుంది.”


పైనున్న ఏడులోకాలలోనూ ఏ సంగీత విభావరి అయినా, జంటగానం చేయాలన్నప్పుడు ఈ తుంబుర నారదులే వెళ్ళవలసి వస్తోంది. ప్రతీచోటకీ వారే అంటే కష్టం కదా నాయనా. అందుకే ఇకనుండి ఆ బాధ్యతలో కొంత నువ్వు కూడా తీసుకోవాలి. ఇదివరకే వచ్చి వేచి ఉన్న ఆ మహాపురుషునితో కలసి నువ్వు జంటగానం చేయాలి అంటూ తన కూడిచేతి చూపుడు వ్రేలితో సభలో ఉన్నతాసనంపై కూర్చున్న ఉన్న ఒకవ్యక్తిని చూపించింది. నేను అటుగా చూశాను. “మాష్టారు. మన ఘంటసాల మాస్టారు” నేను చేతులెత్తి నమస్కరించాను. ఆయన కళ్ళతోనే ఆశీర్వదించారు.


తరువాత ఆ సరస్వతీదేవి.. “నాయనా! నువ్వు మొదలు పెట్టవలసిన ఇంకొక ముఖ్యమైన పని కూడా ఉంది. భూలోకంలో నువ్వు నిర్వహించే “పాడుతా తీయగా” వంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ప్రారంభించాలి. మా ముగ్గురమ్మలం న్యాయనిర్ణేతలగా వ్యవహరిస్తాం. గణపతి, కుమారస్వామి కూడా ఆ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగంలో పోటీపడతారు. కార్యాచరణమను సిద్ధంచేసుకో నాయనా. వచ్చే విజయదశమిని ఈ కార్యక్రమానికి శుభమూహూర్తం నిర్ణయించాం. ఇది పరమేశ్వరాజ్ఞ” అని చెప్పి సభ ముగించింది.


ఆ తరువాత నేను, వేటూరీ, జంధ్యాల మా బసకు వచ్చేశాం. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఒకరిమీద ఒకరం చెణుకులు విసురుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాం. పొద్దున్న లేవగానే.. ఈ విషయాలన్నీ మీకు ఎలా అయినా చేరవేయాలన్న తహతహ మొదలయ్యింది. ఆ మాటే వేటూరికి చెప్పాను. నిన్నటి నీ అనుభవాలు, అనుభూతులూ ఒక ఉత్తరంలో వ్రాసి ఇవ్వమన్నాడు. అలానే వ్రాసి ఇచ్చాను. దానిని భూలోకానికి పంపే మార్గం కావాలి కనుక, మా వేటూరి ఫొటో ఫ్రేము కట్టించి పెట్టుకున్న Rajan PTSK ను ఈ ఉత్తరం చేరవేసే మాధ్యమంగా ఎంచుకున్నాము. పాపం అతడు కూడా నిన్నటి నుండి నాకోసం ఏడుస్తూనే ఉన్నాడు. అతడి ఇంటిలో ఉన్న మా వేటూరి ఫొటో ద్వారా ఈ ఉత్తరాన్ని జారవిడిచాము.  అదే మీరిప్పుడు చదువుతున్నారు. ఇకపై మీరెవ్వరూ ఏడవవద్దు. నేనిక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. ఇక ఉంటానురా బంగారాలు. జాగ్రత్తగా ఉండండీ! 


సర్వేజనా సుజనా భవంతు! సర్వే సుజనా సుఖినో భవంతు! స్వస్తి! 

- మీ బాలు


యుద్ధం ముగిసింది ..అర్జనుడు హుందాగా కూర్చోగా రధం నగరాని వచ్చింది...కృష్ణుడు అర్జనుడిని ఓరకంట చూస్తూ " దిగు పార్ధా" అన్నాడు.

 యుద్ధం ముగిసింది ..అర్జనుడు హుందాగా కూర్చోగా రధం నగరాని వచ్చింది...కృష్ణుడు  అర్జనుడిని ఓరకంట చూస్తూ " దిగు పార్ధా" అన్నాడు.

పార్ధుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు..

ఆనవాయితి ప్రకారం ముందుగా సారధి దిగి రధం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు........

దానికి విరుద్ధంగా  ముందు సారధి దిగకుండా  తనను దిగమనడంతో అర్జనుడి ఇగో హర్ట్ అయింది...

ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక...రధం దిగాడు..

అర్జనుడు దిగి కొంతదూరం పోయాక అప్పుడు దిగాడు కృష్ణుడు ..

మరునిముషం రధం భగ్గున మండి బూడిద అయింది...

అదిరిపడ్డాడు అర్జనుడు...

యుద్ధం లో ఎన్నో దివ్యస్త్రాలు ప్రయోగించబడినవి వాటిని తన శక్తిద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు ఆయన దిగగానే శక్తి విడుదలై రధం మండిపోయింది... అదే ముందు కృష్ణుడు రధం దిగిఉంటె.....?

అలానే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయ్

తప్పదు...

చెప్పడం ధర్మం...మాకన్ని తెలుసనుకుంటె మన  ఖర్మం....

" ఓం నమో భగవతే వాసుదేవాయ".


🙏🏻జై శ్రీ కృష్ణ 🙏🏻

నీవు లేవు నీ పాటవుంది నీవు పరచిన వేలాది పాటల బాట వుంది.

 నీవు లేవు నీ పాటవుంది

నీవు పరచిన వేలాది పాటల బాట వుంది.

నీ పాట వింటూ పెరిగాం
నీ గొంతు లొంచే ఎన్నొ భావాలు ఎరిగాం
తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్లు
రాకూడదు అనుకున్న ఆ రోజు తొందరగా వచ్చింది
వినకూడదు అనుకున్న ఆ కబురు
వినబడి మనసు మూగ బోయింది
జాబిలంటి నీ పాట వినకుంటే మాకు వెన్నెలేది
ఇక వసంతాలు ఎన్నొచ్చినా నీ కమ్మని కోకిలమ్మ గొంతు కబురేది
గున్నమావి విరబూస్తున్నా మా పాటల తోటమాలి జాడేది
మా ఎదలన్నీ తుమ్మెదలై నీ పాటల చుట్టూ తిరుగుతున్నాయ్‌ వెర్రిగా
కళ్ళనిండా అశ్రువులే ఉబుతున్నాయి ఏక ధారగా
ఎలా మోయాలొయి వింత భారం
దేహమున్న లేవు ప్రాణాలే
నీవు నీ పాటే కాదా మాకు పంచ ప్రాణాలు
ఇక సందె మబ్బులెన్నొచ్చినా స్వాతి చినుకు తడుపేది
అల్లకల్లొల అలల్లొ నావలా రేవు చేరేదెలా రేపు గడిచేదెలా నీవు లేకుండా
నీవు లేవు నీ పాటవుంది నీడగా
నీవు పరచిన వేలాది పాటల బాట వుంది మా తోడుగా
కొట్లాది మంది అభిమానులకు స్వాంతనగా
మీ సత్యసాయి విస్సా
------

Saturday, September 19, 2020

🕉️జంబుద్వీపే భరతవర్షే భరతఖండే🕉️


సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.


అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?


జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:


1) కేతుముల వర్ష 

2) హరి వర్ష 

3) ఇలవ్రిత వర్ష 

4) కురు వర్ష 

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష 

7) కింపురుష వర్ష 

8 ) భద్రస్వ వర్ష


(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)


పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.


ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.


మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.


దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !


మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.


మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?


ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.


🌷🙏శ్రీ మాత్రే నమః🙏🌷

Friday, September 18, 2020

 ✍అన్ని రోగాలకూ విరుగుడు మనసే!✍


జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్యసమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని మన జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చిచెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసుబాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు.


అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.


ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టురైకేస్ వాక్  చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.  


మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్: కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !


ఆవేశ కావేశాల వల్లే అధికరక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే  అధికరక్తపోటు ఎక్కువట !


అతిబద్ధకం వల్ల చెడుకోలెస్టరాల్: కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!


మధుమేహం సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !


అతివిచారం వల్ల ఆస్త్మా: ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తా వస్తుందట. 


ప్రశాంతత లేక గుండెజబ్బులు: ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం 


50% ఆధ్యాత్మికత లోపంవల్ల

25% మానసిక కారణాల వల్ల

15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల

10% శారీరక కారణాల వల్ల


రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపుమాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే 

స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి

కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి.

Very nice information pleace forward

Thursday, September 17, 2020

ధ్వని అనుకరణ పదాలు గణ గణ

 *ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు.*


మనం చాలా పదప్రయోగాలు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతూ మర్చిపోతున్నాం.


 1.కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ. 

9.గణగణ. 10.గునగున 

11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత

22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక. 

27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర.  37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ..

 46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర. 

50.భుగభుగ. 

51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు. 


అందుకే.......

దేశ భాషలందు తెలుగులెస్స..

మంజీరమ్మ పాద మంజీర జీవభావం! సత్యసాయి విస్సా - మంజీరక దేశం

 





మంజీరమ్మ పాద మంజీర జీవభావం!

దివినుండి భువికి మా కొరకు ఉరికిన ఓ గోదారమ్మ చెల్లీ!
మా మంజీరమ్మ తల్లీ! వందనం
రావమ్మా నీ గజ్జెల రవళి
ఘల్లు ఘల్లు మంటూ
జన హృదయాలు జల్లుమనగా
గలగలా పారి సేదతీర్చగ వడి వడిగా సాగి
మా నేతల భగీరథ యత్నాలు రత్నాలు కాగా
సింగూరున ఆగి ఒక్కోక్క చుక్కగా మా గొంతులో జారి
వాగుగా పారి మా తెలంగాణా మాగాణమ్ముల చేరి
వరివై, జొన్నవై, చెరకువై, కూరవై మా ఆహారమై,
పత్తివై మా ఆహార్యమై
మెతుకు సీమ విశ్వానికే బతుకు నిచ్చు సీమగా మార్చి
మమ్ము దీవించు తల్లీ మంజీరమ్మా వందనం!
సతతము నీ పాద మంజీరాలంటిన జీవులం తల్లీ
మా ఊపిరి నీవు మా ఊహవు నీవు
మా ఉనికివి నీవు మా మనికివి నీవు
మా జీవము నీవు మా జవము నీవు మా రాజస రాజీవము నీవు
మా రసరాజం నీవు మా మానసం నీవు మా సాహసం నీవు
మా ఉల్లాసం నీవు మా ఉత్తేజం నీవు
సదా నీ పాద మంజీరాలు అంటి వుండే జీవులం
మమ్ము దీవించు తల్లీ మంజీరమ్మా వందనం!!
మంజీరమ్మ పాద మంజీర జీవభావం!
సత్యసాయి విస్సా - మంజీరక దేశం
(మెదక్‌ జిల్లాలో ఉన్న మంజీర నదిని ఒకప్పుడు ఈ నేలను మంజీరక దేశం పిలిచే వారని చరిత్ర)

Total Pageviews