Friday, October 28, 2016

దీపావళి!







దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సూర్యోదయానికి 4ఘడియల ముందుగా నువ్వుల నూనె తోతలంటుకుని స్నానం చేయాలి. దీపావళినాడు ఈ సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు. కనుక ఈసమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుని, తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడు
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతేై
శ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది. అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో ఈ ప్రకారం స్నానం చేసినవారికి యమ లోకము కనపడదు.
అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై
ఈ స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు. అకాల మృత్యువు రాదు అనిశాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో ఆ మొక్కలను తల చుట్టూతిప్పుతూ ఉన్నప్పుడూ ఈ క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి
శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః
తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు ఓ అపామార్గమా! నిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్నిహరించు అని చెప్తూ చేయాలి.
ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు. తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాతయమధర్మరాజుగారికి నమస్కరిస్తూఈ క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి
యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)
యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లి దండ్రులున్నవారుమాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు.
మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.
ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు, మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినేకొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )
సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం. దీపదానం చేయటం కూడా కద్దు. ఇక్కడ్నుంచి కార్తీకమాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.
దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి, తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధురపదార్థం తినాలి. ఈ దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.
ముఖ్యంగా ఈ దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు, ఈ రోజుల్లో లక్ష్మీపూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి ఈ మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసే ఆచారం ఉంది.
దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం,ఆచారమైంది. దీనినే అలక్ష్మీ నిస్సరణం అంటారు. ముఖ్యంగా అర్థరాత్రి స్త్రీలు ఈ కార్యం నిర్వహించవలసి ఉంటుంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన ఈ దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు. ఇంత గొప్ప సాంప్రదాయం మనది.

నరకచతుర్దశి( భామావిజయం.)












నరకచతుర్దశి( భామావిజయం.)
శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి హిరణ్యాక్షుని సంహరించి భూదేవికి ఆనందం కలిగించాడు. వరాహమూర్తి వీర, విక్రమాలకు మురిసి భూదేవి శ్రీహరిని మోహించి తన కోర్కెను తీర్చమని అర్థించింది. శ్రీహరి భూదేవి కోర్కెను తీర్చాడు. అప్పుడు వారికి కలిగినవాడే ‘నరకాసురుడు’. ‘నేను హిరణ్యాక్ష సంహార సమయంలో తామసగుణంతో ఉన్న సమయంలో నీవు నన్ను కలిసిన కారణంగా.. నీకు రాక్షస ప్రవృత్తి గల కుమారుడు జన్మిస్తాడు’ అన్నాడు శ్రీహరి. భూదేవి తన కుమారుడైన నరకాసురుని సదా రక్షించమని శ్రీహరిని కోరింది. ‘ధర్మం’ తప్పనంతవరకూ నావల్ల నీ కుమారుకు ఎటువంటి హానీ జరుగదు. ‘ధర్మం తప్పి చరిస్తే మాత్రం నీ కుమారుడు నా చేతిలోనే మరణిస్తాడు’ అన్నాడు శ్రీహరి. ఆ తర్వాత భూదేవి కోరిక మేరకు నరకాసురునకు వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రగర్వంతో నరకుడు దేవలోకాలన్నీ ఆక్రమించాడు. దేవమాత అదితి కర్ణకుండలాలు, వరుణఛత్రాన్ని అపహరించాడు. తర్వాత ప్రాగ్జ్యోతిషనగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. అయితే అధర్మవర్తనుడై, లోకకంటకుడై,రాజ్యపాలన చేస్తున్నాడు. పదహారువేలమంది క్షత్రియకన్నెలను అపహరించి, బంధించి, వారిని కాళికాదేవికి బలిచ్చి త్రిలోకాధిపతి కావాలని కలలు కంటున్నాడు.నరకాసురుని దారుణాలు సహించలేని దేవతలు కాపాడమని శ్రీహరికి మొర పెట్టుకున్నారు. అప్పటికే శ్రీహరి కృష్ణావతారం దాల్చి ఉన్నాడు. నరకాసుర సంహారానికి శ్రీకృష్ణుడు వెడుతూంటే., నేనుకూడా యద్దరంగానికి వస్తాను అని సత్యభామ పట్టుపట్టింది.
‘సుందరీ! యుద్ధరంగమంటే ఏమనుకున్నావు..అక్కడ తుమ్మెదల ఝుంకారాలుండవు. అరివీర మత్తేభ ఘీంకారాలుంటాయి. దానవుల భీషణ గర్జనలుంటాయి. వికసితకుసుమ పరాగరేణువులు కాదు మీద పడేవి..గుర్రాల కాలి గిట్టలచే వెదజల్లబడే ఇసుక రేణువులు పడతాయి.శత్రుధనుర్విముక్త శర పరంపరలు మీద పడతాయి.యుద్ధరంగానికి రావద్దు.. నామాట విను.’ అని బుజ్జగించాడు శ్రీకృష్ణుడు. వినలేదు సత్యభామ.‘దానవులైతేనేమి.. రాక్షస సమూహాలైతే నాకేమి భయం? నీ కౌగిలి చాటన ఉండే నాకు ఏ భయం లేదు.. రాదు. మీతో యుద్ధరంగానికి వస్తాను..అంతే’ అని సత్యభామ మొండికేసింది. ఇక తప్పలేదు శ్రీకృష్ణునకు. ఇద్దరూ కలిసి గరుత్మంతుని మీద యుద్ధరంగానికి బయలుదేరారు.
ముందుగా శ్రీకృష్ణుడు నరకుని రాజథాని అయిన ప్రాగ్జ్యోతిష నగరద్వారం చేరి ఒక్కసారి తన పాంచజన్యాన్ని పూరించాడు. ప్రళయకాల మేఘగర్జన లాంటి ఆ శంఖధ్వని విన్న నగర రక్షకుడైన మురాసురుడు నిద్ర చాలించి, లేచి, నీటిలోనుంచి బయటకు వచ్చి.. బద్దకంగా ఒళ్లు విరుచుకుని.. శ్రీకృష్ణుని చూసి కోపంతో తన చేతిలోని గదను విసిరాడు.శ్రీకృష్ణుడు ఆ గదను తుత్తునియలు చేసి తన చక్రాయుధంతో ఆ మురాసురుని
తలను ఖండించాడు. అది తెలిసి మురాసురుని ఏడుగురు కుమారులు ఒక్కసారిగా శ్రీకృష్ణుని మీదకు దండెత్తారు. క్షణమాత్ర కాలంలో శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించాడు.
తన ఆత్మీయుల మరణవార్త విన్న నరకుడు రోష తామ్రాక్షుడై తానే స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడు. గరుత్మంతునిమీద మేఘం చాటున విద్యుల్లతలా మెరిసిపోతున్న సత్యభామను చూసి ఆశ్చర్యపోయాడు.నరకుని చూస్తూనే సత్యభామ చీరకొంగు నడుము చుట్టూ చుట్టి.. ధనుస్సు చేతబట్టి ధనుష్టంకారం చేసింది. ఆ వింటి
నారిధ్వని విన్న రాక్షసవీరులు మూర్ఛబోయారు. ఒక ఆడుది..అబల.. ఒంటరిగా తనను యుద్ధానికి రమ్మని రెచ్చగొడుతూంటే సహించలేని నరకుడు యుద్ధానికి దిగాడు. ఇద్దరిమధ్య భీషణ సంగ్రామం మొదలైంది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారి యుద్ధాన్ని తిలకిస్తున్నాడు. సత్యభామ సంగ్రామకళానైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నరకుడు. ‘ఏమది.. బంగారు ఊయలలు ఎక్కడానికి భయపడే ఈ భీరువు నిర్భయంగా గరుడుని వీపునెలా ఎక్కగలిగింది.? చిలుకలకు పలుకులు నేర్పుతూ అలిసిపోయే ఈ లలామ ఇన్ని అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చింది.?’ అని మనసులోనే అబ్బురపడి శ్రీకృష్ణుని చూస్తూ ‘ఒక ఆడుది మగరాయుడిలా పగవాడితో పోరుసల్పుతూంటే వినోదం చూస్తూ
కూర్చోవడానికి నీకు సిగ్గుగా లేదా?’ అని రెచ్చగొట్టాడు. వేంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ చక్రం అగ్నిశిఖలు విరజిమ్ముతూ వేగంగా వచ్చి నరకుని శిరస్సు ఖండించింది. నరకుని శిరస్సు నేలమీద పడింది. భూదేవి కన్నీళ్లతో అక్కడ ప్రత్యక్షమై నరకుడు అపహరించిన అదితి కర్ణకుండలాలు, వరుణఛత్రం శ్రీకృష్ణునకు సమర్పించింది. ‘భూదేవీ..నీ కుమారుని మరణానికి చింతించకు. ధర్మరక్షణ విషయంలో నేను స్వ పర భేదం పాటించను’ అన్నాడు. అనంతరం ఇంద్రాదిదేవతలు సంతోషంతో శ్రీకృష్ణుని ప్రస్తుతించారు.
నరకాసురుడు మరణించిన రోజే ‘ఆశ్వయుజ బహుళ చతుర్దశి’.
పురాణపురుషుల జన్మదినం సకల లోకాలకూ ఓ పండుగ దినం.
లోకకంటకుల మరణం కూడా సకల లోకాలకూ ఓ పండుగ దినమే.
అందుకే ‘ఆశ్వయుజ బహుళ చతుర్దశి’ని మనవారు ‘నరక చతుర్దశి’గా గుర్తించారు. ఓ
పండుగలా జరుపుకున్నారు.

నేడు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు మరియు ధన్వంతరి ఆవిర్భావ దినోత్సవం(ధన త్రయోదశి )


నేడు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు మరియు ధన్వంతరి ఆవిర్భావ దినోత్సవం(ధన త్రయోదశి )
దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.
ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి.
ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.
అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఏది ఏమైనా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ ధనత్రయోదశి., శ్రీమహాలక్ష్మి జన్మ దినాన్ని భక్తులందరూ ఒక పండుగలా జరుపుకుంటారని ఆకాంక్షిస్తూ ...
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
ధన్వంతరి:-సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు."
ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.
ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి.
ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.
ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు.

Friday, October 21, 2016

మంచికథ......

ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,

"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.

"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.

"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.⁠⁠⁠⁠

సంస్కృతం అందం చూద్దామా ...

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః||೧||

శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం
సంహారదాముక్తిముతాసుభూతం ||೨||


మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి .
రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.

అద్భుతం ఏమిటంటే ......

మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది .

రెండవ శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది .

Thursday, October 20, 2016

ధర్మసూక్ష్మాలు----- పి.భారతి


ᐅధర్మసూక్ష్మాలు 

మానవుడి గమ్యం మోక్షం. మోక్ష మార్గాల్లో ముఖ్యమైనది ధర్మం. ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాల్లో ధర్మమే మొదటిది. అధర్మ మార్గంలో సంపాదన గావించి మిగతా పురుషార్థాలు పొందకూడదు కాబట్టి దీన్ని మొదట చేర్చారు. అధర్మార్జన అనర్థదాయకం. అలాంటి అర్థార్జన పునాది లేని గోడలా కూలిపోతుంది. 'అర్థసిద్ధి కంటే ధర్మసిద్ధి మహత్తరమైనది. దానివల్ల సకల సిద్ధులూ చేకూరతాయి. శాశ్వత కీర్తి లభిస్తుంది. సద్గతి కలుగుతుంది!' అని భారతంలోని శాంతిపర్వం ప్రబోధిస్తోంది.
ఏది ధర్మం, ఏది కాదో తెలుసుకోవడం కష్టసాధ్యం. ధర్మ రహస్యం సూక్ష్మమైనది. మహాత్ములు ధర్మశాస్త్రాల్లోని విషయాలకు ఉదాహరణలుగా పురాణ ఇతిహాసాలను పేర్కొంటారు. బయటకు సబబుగా కనిపించే విషయం, ఆలోచిస్తే అధర్మం అని తేలవచ్చు. అధర్మంగా భావించే విషయం ధర్మబద్ధం కావచ్చు. ప్రజల్లో పాప పుణ్య విచక్షణ ముఖ్యం. తుదకు ధర్మమే జయిస్తుందనే విశ్వాసం సడలగూడదు.

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. 'భీష్మాచార్యుల నుంచి ధర్మం తెలుసుకోండి!' అని శ్రీకృష్ణుడు ధర్మరాజాదులకు సలహా ఇచ్చాడు. ధర్మరాజు తమ్ముళ్లతో, ద్రౌపదితో కలిసి పితామహుని వద్దకు వెళ్లాడు. అప్పుడు భీష్ముని స్థితి ఎలా ఉంది? అంపశయ్యపై పడి ఉన్నాడు. చావుకోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణం దాకా ప్రాణాలు నిలుపుకోవాలి.

ధర్మరాజు వినయ విధేయతలతో ప్రార్థించగా భీష్ముడు ధర్మబోధ ప్రారంభించాడు. ఆ మహాత్ముడి పలుకుల్ని అందరూ శ్రద్ధగా భక్తితో ఆలకిస్తున్నారు. ద్రౌపది మాత్రం నవ్వింది.

'ఏం తల్లీ! ఎందుకు నవ్వుతున్నావు?' అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు భీష్ముడు.

ఏదో నవ్వు వచ్చి నవ్వాననీ, మధ్యలో నవ్వినందుకు మన్నించమనీ ద్రౌపది ప్రార్థించింది. భీష్ముడికి తెలుసు- ద్రౌపది అనవసరంగా నవ్వదని.

'అమ్మా! నువ్వు సుగుణశీలివి. అనవసరంగా పెద్దల వద్ద నవ్వవు. మహాపతివ్రతవైన నీవు నవ్వావంటే అందులో ఏదో గూఢార్థం ఉండే ఉంటుంది. దాచక, ఉన్న విషయం చెప్పు!'

ద్రౌపది చేతులు జోడించి నమస్కరించింది.

'మహాత్మా! నన్ను మన్నించండి. మీ ఆజ్ఞను కాదనలేక నా మనసులోని మాట చెబుతున్నాను. ధర్మసూక్ష్మాలను మీరు ఎంతో బాగా ఇక్కడ వివరించి చెబుతున్నారు. అవన్నీ మాకు శిరోధార్యం. కానీ...' ఆపైన చెప్పలేకపోయింది.

'ద్రౌపదీ! ఆగిపోయావేం? సందేహించక నీ మనసులోని మాటను చెప్పమ్మా!'

'మహాత్మా! ఆనాడు... నిండు సభలో... దుశ్శాసనుడు నన్ను వివస్త్రను గావించడానికి ప్రయత్నించినప్పుడు... ఏమయ్యాయి ఈ ధర్మసూక్ష్మాలు? ఈ ధర్మసూత్రాలన్నీ తమరు ఆ తరవాతే నేర్చుకున్నారా? ఆ విషయం గుర్తుకు వచ్చి ఏడవలేక నవ్వుతున్నాను... ఇలా అంటున్నందుకు క్షమించండి!'

భీష్ముడు కాసేపు మౌనం వహించి, దీర్ఘంగా నిట్టూర్చాడు.

'ద్రౌపదీ! ఇన్నాళ్లూ నా మనసులో ముల్లులా ఉన్న సంగతే నువ్వు ప్రస్తావించావు. దాన్ని వెలికితీసి నా మనోబాధను ఉపశమింపజేసుకుంటాను. ఆనాటి నా ప్రవర్తనకు ఒక కారణం ఉంది. నా మౌనం ధర్మ సమ్మతమే! దుర్యోధనుడు దుర్మార్గుడు. అతడి కూడు తినడంవల్ల నా మనసు మలినమైంది. ఎవరి పోషణలో ఉన్నామో వారికి వ్యతిరేకంగా ప్రవర్తించరాదు. అందువల్ల చేతగానివాడిలా మౌనం వహించాను. ఇదిగో... ఇప్పుడు... అర్జునుడి బాణాలవల్ల నా మలినమైన ఆ రక్తం అంతా వెలుపలికి పోయింది. అధర్మపూరితమైన అన్నంతో వచ్చిన ఆనాటి రక్తం నేడు నాలో లేదు. కాబట్టే ధర్మోపన్యాసాన్ని ధైర్యంగా చేయగలుగుతున్నాను!'

ద్రౌపది ధర్మసందేహం తొలగిపోయింది.

'అధర్మ ప్రభువుల వద్ద పనిచేసే ఉద్యోగులు కూడా ఆ పాపపంకిలాన్ని తాము అంటించుకోవలసి వస్తుంది' అని ధర్మరాజాదులు గ్రహించారు. 

- పి.భారతి....๑۩ॐ || మనోఃబ్రాహ్మి || ॐ۩๑

Tuesday, October 18, 2016

స్పూర్తి మాటల శక్తి

నాకు ఉచిత విద్య లభించడం లేదండీ —
*..... హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదు*
2. జీవితం లో చాలా సార్లు ఓడిపోయానండి
*........................ అబ్రహం లింకన్ చాలా అపజయాలను చూశాడు*
3. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని —
*.......................- అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడు*
4. నేను చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడిని
*.......................... నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరం తోనే ఉంది*
5. జీవితం అంతా సైకిల్ మీదే గడిచిపోతోంది —
*........................ నిర్మా సబ్బు కర్సన్ భాయి పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు*
6. ఒక ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోయాను —
*........................ నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలు తో డాన్సు చేస్తుంది*
7. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు . నన్ను చూసే వారే లేరు .
*....................... ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు*
8. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది . అందుకే ఎదగ లేక పోయాను
*............ లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది*
9. నేను చాలా పోట్టివాడిని
*....................... సచిన్ టెండూల్కర్ కూడా పోట్టివాడే*
10. నేను మంద బుద్ది వాడిని
*................ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడే*
11. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను . దానితో ఏమి చెయ్యగలను ?
*.................. ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడు*
12. నా కంపెనీ దివాలా తీసింది . నన్నెవరు నమ్ముతారు ?
*................... పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసింది*
13. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యాను .ఇప్పుదు ఏమి చెయ్యగలను ?
*.............. వాల్ట్ డిస్నీ మూడు సార్లు నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యారు*
14. నా వయసు ఐపోయింది . ఇప్పుడు ఏమి చెయ్యగలను
*.............. కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండ ర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టాడు*
మనం ఉన్న చోటునుండి ఉన్నతి కి వెళ్ళాలి అనే *కోరిక* ప్రబలంగా ఉంటె మనం వెళ్ళగలం
పూర్తిగా చదివిన వారికి ధన్యవాదాలు
ఈలాంటి మాటలకూ గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్ళి గాడి లొ పెట్టె శక్తి ఉంది.
కనుక అందరికి పంచండి .....
*ఒక్కరు స్పూర్తి ని పొందిన ఈ రోజు కు మనం ఒక మంచి పని చేసినట్లే !*

Total Pageviews