ᐅధర్మసూక్ష్మాలు
మానవుడి గమ్యం మోక్షం. మోక్ష మార్గాల్లో ముఖ్యమైనది ధర్మం. ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాల్లో ధర్మమే మొదటిది. అధర్మ మార్గంలో సంపాదన గావించి మిగతా పురుషార్థాలు పొందకూడదు కాబట్టి దీన్ని మొదట చేర్చారు. అధర్మార్జన అనర్థదాయకం. అలాంటి అర్థార్జన పునాది లేని గోడలా కూలిపోతుంది. 'అర్థసిద్ధి కంటే ధర్మసిద్ధి మహత్తరమైనది. దానివల్ల సకల సిద్ధులూ చేకూరతాయి. శాశ్వత కీర్తి లభిస్తుంది. సద్గతి కలుగుతుంది!' అని భారతంలోని శాంతిపర్వం ప్రబోధిస్తోంది.
ఏది ధర్మం, ఏది కాదో తెలుసుకోవడం కష్టసాధ్యం. ధర్మ రహస్యం సూక్ష్మమైనది. మహాత్ములు ధర్మశాస్త్రాల్లోని విషయాలకు ఉదాహరణలుగా పురాణ ఇతిహాసాలను పేర్కొంటారు. బయటకు సబబుగా కనిపించే విషయం, ఆలోచిస్తే అధర్మం అని తేలవచ్చు. అధర్మంగా భావించే విషయం ధర్మబద్ధం కావచ్చు. ప్రజల్లో పాప పుణ్య విచక్షణ ముఖ్యం. తుదకు ధర్మమే జయిస్తుందనే విశ్వాసం సడలగూడదు.
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. 'భీష్మాచార్యుల నుంచి ధర్మం తెలుసుకోండి!' అని శ్రీకృష్ణుడు ధర్మరాజాదులకు సలహా ఇచ్చాడు. ధర్మరాజు తమ్ముళ్లతో, ద్రౌపదితో కలిసి పితామహుని వద్దకు వెళ్లాడు. అప్పుడు భీష్ముని స్థితి ఎలా ఉంది? అంపశయ్యపై పడి ఉన్నాడు. చావుకోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణం దాకా ప్రాణాలు నిలుపుకోవాలి.
ధర్మరాజు వినయ విధేయతలతో ప్రార్థించగా భీష్ముడు ధర్మబోధ ప్రారంభించాడు. ఆ మహాత్ముడి పలుకుల్ని అందరూ శ్రద్ధగా భక్తితో ఆలకిస్తున్నారు. ద్రౌపది మాత్రం నవ్వింది.
'ఏం తల్లీ! ఎందుకు నవ్వుతున్నావు?' అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు భీష్ముడు.
ఏదో నవ్వు వచ్చి నవ్వాననీ, మధ్యలో నవ్వినందుకు మన్నించమనీ ద్రౌపది ప్రార్థించింది. భీష్ముడికి తెలుసు- ద్రౌపది అనవసరంగా నవ్వదని.
'అమ్మా! నువ్వు సుగుణశీలివి. అనవసరంగా పెద్దల వద్ద నవ్వవు. మహాపతివ్రతవైన నీవు నవ్వావంటే అందులో ఏదో గూఢార్థం ఉండే ఉంటుంది. దాచక, ఉన్న విషయం చెప్పు!'
ద్రౌపది చేతులు జోడించి నమస్కరించింది.
'మహాత్మా! నన్ను మన్నించండి. మీ ఆజ్ఞను కాదనలేక నా మనసులోని మాట చెబుతున్నాను. ధర్మసూక్ష్మాలను మీరు ఎంతో బాగా ఇక్కడ వివరించి చెబుతున్నారు. అవన్నీ మాకు శిరోధార్యం. కానీ...' ఆపైన చెప్పలేకపోయింది.
'ద్రౌపదీ! ఆగిపోయావేం? సందేహించక నీ మనసులోని మాటను చెప్పమ్మా!'
'మహాత్మా! ఆనాడు... నిండు సభలో... దుశ్శాసనుడు నన్ను వివస్త్రను గావించడానికి ప్రయత్నించినప్పుడు... ఏమయ్యాయి ఈ ధర్మసూక్ష్మాలు? ఈ ధర్మసూత్రాలన్నీ తమరు ఆ తరవాతే నేర్చుకున్నారా? ఆ విషయం గుర్తుకు వచ్చి ఏడవలేక నవ్వుతున్నాను... ఇలా అంటున్నందుకు క్షమించండి!'
భీష్ముడు కాసేపు మౌనం వహించి, దీర్ఘంగా నిట్టూర్చాడు.
'ద్రౌపదీ! ఇన్నాళ్లూ నా మనసులో ముల్లులా ఉన్న సంగతే నువ్వు ప్రస్తావించావు. దాన్ని వెలికితీసి నా మనోబాధను ఉపశమింపజేసుకుంటాను. ఆనాటి నా ప్రవర్తనకు ఒక కారణం ఉంది. నా మౌనం ధర్మ సమ్మతమే! దుర్యోధనుడు దుర్మార్గుడు. అతడి కూడు తినడంవల్ల నా మనసు మలినమైంది. ఎవరి పోషణలో ఉన్నామో వారికి వ్యతిరేకంగా ప్రవర్తించరాదు. అందువల్ల చేతగానివాడిలా మౌనం వహించాను. ఇదిగో... ఇప్పుడు... అర్జునుడి బాణాలవల్ల నా మలినమైన ఆ రక్తం అంతా వెలుపలికి పోయింది. అధర్మపూరితమైన అన్నంతో వచ్చిన ఆనాటి రక్తం నేడు నాలో లేదు. కాబట్టే ధర్మోపన్యాసాన్ని ధైర్యంగా చేయగలుగుతున్నాను!'
ద్రౌపది ధర్మసందేహం తొలగిపోయింది.
'అధర్మ ప్రభువుల వద్ద పనిచేసే ఉద్యోగులు కూడా ఆ పాపపంకిలాన్ని తాము అంటించుకోవలసి వస్తుంది' అని ధర్మరాజాదులు గ్రహించారు.
- పి.భారతి....๑۩ॐ || మనోఃబ్రాహ్మి || ॐ۩๑
No comments:
Post a Comment