Tuesday, October 18, 2016

ఇవాళ అట్లతద్ది పండుగ...Duvvuri Vn Subbarao


ఇవాళ అట్లతద్ది పండుగ.
ప్రొద్దుటే కాలినడకకు వెళ్లి వచ్చిన నన్ను శ్రీమతి అడిగింది ఎక్కడేనా అట్లతద్ది పాటలు కానీ ఆటలు కానీ తటస్థ పడ్డాయా అని. రామరామ ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి సవ్వడి కనబడలేదు.

మా చిన్నతనానికి ఇప్పటికీ ఎంత మార్పు!
మాది పక్కా పల్లెటూరు. ఆ రోజుల్లో ఊళ్ళో విద్యుత్తు కూడా లేదు. అట్లతద్ది రోజున ఆడపిల్లలే కాకుండా మగపిల్లలం కూడా ఆటలాడుకోవడానికి తెల్లవారుజామునే 4 గంటలకే లేచేసి వీధుల్లోకి వచ్చేసే వాళ్ళం.
ముందురోజే ఆడపిల్లలు ఎర్రగా చేతులకీ కాళ్ళకీ గోరింటాకు పెట్టుకునేవారు. ఇప్పట్లా కోన్లు కాదు. సహజమైన దినుసు. గోరింటాకు రుబ్బడం, ఇంట్లో ఆడవాళ్ళు పిన్నాపెద్దా అందరూ చేతులకి గోరింటాకు పెట్టుకోవడం అంతా పెద్దసందడి.
ఆడపిల్లల జట్లు ఒక జట్టు మీద మరొక జట్టు పోటీగా ముందే లేచేసి ఉట్టికింద ముద్ద తినేసి అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ పీట కింద పిల్లల్లారా లేచి రండోయ్అంటూ పాడుకుంటూ వీధుల్లో తిరిగేవారు.
తల్లులు పండువెన్నెట్లో ముంగిళ్ళలో తెల్లని ముగ్గులు వేసుకుంటూ ఉండే వారు. వీధులన్నీ అలా పాటలతో రెండుమూడు సార్లు చుట్టేసి చెమ్మచెక్కలూ, కిరికి ఇంకా ఇలాటి ఆడపిల్లల ఆటలు ఆడుకొనేవారు. కొంతమంది అమ్మాయిలూ బుజబుజరేకులు ఆడుకొనేవారు.
ఆడపిల్లలు రెండు జట్లుగా విడిపోయి ఎదురెదురుగా నిలబడి ఒకరిచేతులు మరొకరు పట్టుకొని ముందుకు వెనుకకు నడుస్తూ ఒక జట్టు
బుజబుజరేకుల పిల్లుందా బుజ్జారేకుల పిల్లుందా
స్వామీ దండం పిల్లుందా స్వరాజ్యలక్ష్మికి పిల్లుందా
అని పాడుతూ ఉంటే
మరొక జట్టు పిల్లలు
బుజబుజరేకుల పిల్లుందీ బుజ్జారేకుల పిల్లుందీ
స్వామీ దండం పిల్లుందీ స్వరాజ్యలక్ష్మికి పిల్లుందీ
అని పాడడం
ఇల్లాగ చాలా చరణాలు ఉండేవి ఆ పాటలో.
ఆపాటలో ఆ పిల్లల నడకలు, రిథం చాలా తమాషాగా ఉండేవి.
చింతచెట్టు, వేపచెట్టు వంటి పెద్దపెద్ద చెట్లకి పగ్గాలతో ఉయ్యాలలు కట్టేవారు. ఆడపిల్లలు ఆ ఉయ్యాలలూగేవారు. వాళ్ళు అయిపోయాక మగ పిల్లలు ఎంతపైకంటా భయపడకుండా గాల్లోకి ఊగితే వాడంత గొప్ప.
అలా వెలుగు వచ్చేదాకా ఆడుకొని సంతోషంగా ఇళ్ళకి వెళ్లి గౌరీపూజ చేసుకొని అట్లనైవేద్యాలు పెట్టి ప్రసాదం క్రింద తినేవారు.
ఇక మగపిల్లలం. దొంగాటలు, ఒకళ్ళనొకళ్ళం తరుముకోవడం, కబడ్డీ ఆడుకోవడం ఇలాటి ఆటలు ఆ వెన్నెట్లోనూ, మసక చీకట్లోనూ అడుకోనేవాళ్ళం. మధ్యమధ్య పెద్దవాళ్ళు చీకట్లో పురుగూ పుట్రా ఉంటాయని తిడుతున్నా దొడ్లలోనూ, పెరడుల్లోనూ చెట్ల క్రింద చీకటి నీడల్లోనూ, డొంకల్లోనూ పరుగెడుతూ ఉండేవాళ్ళం. అసలు భయం అంటే ఏమిటోతెలీని వయసు. పాములు తిరిగే ప్రదేశాలు అయినా భయపడే వాళ్ళం కాదు. అన్ని వీధులూ అన్ని దొడ్లు మావే.
కొంతమందిఆకతాయి పిల్లలు దూలగొండాకు తెచ్చి మెల్లగా పక్కన జేరి ఒంటికి రాసేసే వారు. ఒకటే దురద. తిట్టుకుంటూ కొట్టుకుంటూ గోక్కుంటూ కూర్చునే వాళ్ళం. ఇంకొంత మంది పల్లేరు కాయలు తెచ్చి కాళ్ళ దగ్గిర పడేసి అవితొక్కినప్పుడు కాళ్ళకు గుచ్చుకొని అమ్మో అంటూంటే పకపకా నవ్వేవాళ్ళు.
ఉమ్మెత్త కాయలు కోసి ముళ్ళతోఉన్న వాటిని పైకి ఎగరేసి అది క్రింద పడుతూంటే చెయ్యి తిరగేసి దాని మీద కాయ పడేలా పెట్టె వాళ్ళం. అదిచురుక్కుమని గ్రుచ్చుకొని కొంచెం రక్తం చిందితే పేద్ద వీరుల్లా పోజు పెడుతూ చేతిని గిరగిరా త్రిప్పేవాళ్ళం.
మధ్యమధ్యలో కొంతమంది ఆడపిల్లలని ఏవో చిలిపి చేష్టలతో ఏడిపించేవారు. వాళ్ళు అమ్మతో కంప్లైంట్ చెయ్యడం వాళ్ళని తిట్టడంజరిగేది. మళ్ళా కాస్సేపటికి మామూలే.
వెలుగు వచ్చేసేక ఆటలు ఆపేసి ఊరు మధ్యలో ఉన్న చెరువులో దిగి ఈతలు కొడుతూ స్నానాలు చేసే వాళ్ళం. చెరువంతా తెల్లతామర పూలతో నిండి మంచి సువాసన గుబాళిస్తూ ఉండేది. ఈత కొడుతూ కొంచెం లోతుకంటా వెళ్లి అందిన తామరపూలను కోసుకొని వచ్చేవాళ్ళం.
ఈత నేర్చుకోవడానికి ఇప్పట్లా స్విమ్మింగ్ పూల్స్, స్విమ్మింగ్ క్లాసులు అవసరం ఉండేది కాదు. చిన్నప్పుడే తల్లితండ్రులు దగ్గరుండి చెరువుకి స్నానానికి తీసుకెళ్ళి నీళ్ళని అలవాటు చేసేవారు పిల్లలకి. కొంచెం పెద్దయాక పెద్దవాళ్ళు చూడకుండా చెరువులో తెగ ఈతలు కొట్టేసేవాళ్ళం. చెరువులో మునిగిపోతాం అనే భయం మాకు, పెద్దవాళ్ళకి కూడా అంతగా ఉండేది కాదు. పిల్లలు చెరువులో మునిగిపోయిన సంఘటనలు ఆ రోజుల్లో అసలు లేవనే చెప్పవచ్చును.
ఇంక పెద్దవాళ్ళు ఇంటికి వస్తావా రావా అని కోప్పడ్డాక ఇళ్ళకి చేరుకొనే వాళ్ళం.
ఎంత ఆనందం! ఎంత పారవశ్యం! అందమైన బాల్యం! ఎంత అందమైన సంప్రదాయం! ఎంత స్వేచ్ఛ!
పాపం నాగరికత, నిద్రాహారాలు లేనిచదువు నేటి పిల్లలకు అవేవీ లేకుండా చేసేశాయి. బాల్యంలోప్రకృతిఒడిలో హాయిగా ఆటలడుకొనే
అవకాశం లేకుండా పోయింది.
అసలుఅట్లతద్ది అనే పండుగే తెలియని దుస్థితిలోకి దిగజారి పోతున్నాం. ఎక్కడో మారుమూల పల్లెల్లో నాగరికతభూతం బారిన పడని తావుల్లో కాస్త ఏమైనా ఈ సంతోషాలు మిగిలి ఉన్నాయేమో మరి.
ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఆనందపు చాయలకైనా పోజాలని నేటితరం బాలపాపలని చూస్తూంటే ఎంత జాలిగా ఉంటుందో...

No comments:

Post a Comment

Total Pageviews