దీపావళి ముందురోజు నరకచతుర్దశి. నరకాసురుడు మరణించినరోజుగా దాన్ని భావిస్తారు. భాగవతం దశమస్కంధంలోని ఈ కథ పోతన పుణ్యమా అని బాగా ప్రసిద్ధికెక్కింది. నరకుడు లోక కంటకుడయ్యేసరికి కృష్ణుడు- నరకాసుర సంహారానికై బయలుదేరాడు. ‘నీ మానిత బాహుదుర్గముల మాటున ఉండగ ఏమిశంక? నీతో అరుదెంతు’ అంది సత్య. యుద్ధంలో కృష్ణుడు గాయపడ్డాడు. వెంటనే ‘వేణింజొల్లెము వెట్టి(జుట్టు ముడిపెట్టి) సంఘటిత నీవీబంధయై(కోకచుట్టి)’ సత్య నరకుడితో తలపడింది. ‘వీరశృంగార భయరౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యెనో’ అన్నట్లుగా విజృంభించింది. ‘జ్యావల్లీ(వింటితాడు) ధ్వని గర్జనంబుగ సురల్ సారంగ యూధంబుగా... అలినీలాలక చూడ నొప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో’ అంటూ పోతన లోకోత్తరంగా వర్ణించాడు. చివరకు నరకుడు కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. ‘అమర్త్యులు మునులున్ మింటన్ పువ్వులు కురియుచు’ పండుగ చేసుకున్నారు. దరిమిలా నరకుడు మరణించిన ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరకచతుర్దశిగాను, విజయోత్సవాలు జరిగిన తరవాతి రోజు దీపావళి పండుగగాను మారిపోయాయి. వాస్తవానికి చతుర్దశిని ‘దీపరాత్రి’గా ఆరాధించడం కృష్ణుడికన్నా ఎంతో ముందే ఉంది. పితృదేవతలు తరించాలన్న కోరికతో స్వర్గం దిశగా దీపాలు చూపిస్తూ దీపదానాలు చేయాలని వామన పురాణం ఏనాడో చెప్పింది. సంతానానికో దారి చూపించిన పెద్దలు ఏ చీకటి లోకాల్లోనో మార్గం తోచక తపిస్తున్నారేమోనని ప్రేమతో స్వర్గానికి తోవ చూపించడాన్ని మానవీయ కోణంలోంచి ఆలోచిస్తే, వామన పురాణ వాక్కులోని ఉదాత్తత బోధపడుతుంది. వైజయంతీ విలాసంలో ‘దీపము భవహరము శుభంకరము’ అన్న పలుకుల ప్రాశస్త్యం తెలుస్తుంది. ‘నరక భయాన్ని పోగొట్టే చతుర్దశి’గా నరకచతుర్దశిని ధర్మశాస్త్రాలు వ్యాఖ్యానించడంలోని ప్రామాణికత అర్థమవుతుంది. ‘సంతానము దీపధారులయి తాపము తీర్చిరి నాక(స్వర్గ)మందగా’ అని పితృదేవతలు సంతృప్తి చెందడంవల్ల నరకచతుర్దశి పండుగ అవుతుంది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న ప్రార్థన స్వర్గస్థులైన పెద్దలకు సైతం వర్తింపజేయడం దానికి కారణం.
పితృదేవతలకు వెలుతురు చూపించేందుకు దీపాలు, కాగడాలు వెలిగించే సంప్రదాయమే క్రమంగా మతాబులు కాల్చడంగా మారిందంటారు. అక్కడితో ఆగితే బాగుండేది. దాసు శ్రీరాములు చెప్పినట్లు ‘ఉద్భటముగ ఢమ్ము ఢామ్మను తుపాకులవెన్ని మతాబులెన్ని పిక్కటిలెడు ఝల్లులెన్ని మరి కాకరపూవతులెన్ని గాల్తురో’ లెక్కే లేకుండా పోయింది. భారీ శబ్దాల బాణసంచా పేలుళ్ళతో తీవ్ర ధ్వని, వాయు కాలుష్యాలకు దీపావళి నెలవైంది. ‘దిబ్బు దిబ్బు దీపావళి...’ కాస్తా డబ్బు డబ్బు దీపావళిగా మారి పర్యావరణానికి చేటయింది. మామూలు మనిషికి చేదయింది. ఆర్భాటాలు పెరిగిపోయాయి. ‘ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ మతః శాంతిం ప్రయచ్ఛమే’ అనే ప్రార్థనతో దీపాలు వెలిగించి ఇహపరాలను జ్యోతిర్మయం చేయాలన్న పెద్దల మౌలిక ఆలోచనలను ఈ జాతి విస్మరించింది. ‘తైలంలేని వత్తిని ఏ అగ్గిపుల్లా వరించదు’ అన్నట్లుగా తైలం(ధనం) లేని వ్యక్తిని దీపావళి వరించడమే లేదు. ‘కుప్పనూర్చుట పొల్లు కొరకా, కూడు వండుట గంజి కొరకా?’ అన్న ‘నార్లమాట’ను గుర్తుకు తెస్తోంది. ‘ఈ గడ్డునాళ్ళలో పండుగ పండుగంచు గుదిబండగ దండిగ కైతలల్లి వేదండమునెక్కి(ఏనుగునెక్కి) చాటినను దండగ’ అని కవులు తీర్మానిస్తున్నారు. పండుగరోజుల్లో పెద్దలు నిర్దేశించిన విధివిధానాల వెనక మన సంస్కృతీ బీజాలున్నాయి. వారి ఆలోచనల వెనక చరిత్ర ముందుచూపు అంతరార్థాలు పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మరిచిపోతే పండుగ పరమ లక్ష్యమే మసకబారి బాణసంచా నుసి మిగులుతుంది. ‘పరబ్రహ్మ స్వరూపమైన ఓ దీపమా! ధీయోయోనః ప్రచోదయాత్’ అంటూ వేడుకోవడం మినహా చేసేదేం లేదేమో... ‘దీపేన సాధ్యతేసర్వం’ అన్నారుగా... చూద్దాం!
No comments:
Post a Comment