1906 లో దక్షిణాఫ్రికాలో భారతీయుల పోరాటానికి గాంధీ కొత్త అస్త్రమొకటి కనుక్కున్నాడు. ఆ అస్త్రానికి పదునుపెట్టే క్రమంలో,మానవచరిత్రలో అటువంటి సత్యాగ్రహులెవరైనా ఉన్నారా అని అన్వేషించినప్పుడు సోక్రటీస్ లో అతడికి అటువంటి మేలిమి సత్యాగ్రహి కనిపించాడు. తన మీద ఏథెన్సు పౌరులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ఏథెన్సు పౌరసభ ముందు సోక్రటీస్ చేసిన ప్రసంగంలో ఒక సత్యాగ్రహి నడతకు చక్కని ఉదాహరణ గాంధీకి కనిపించింది. అందుకని ఆయన ప్లేటో రాసిన Apology ని వెంటనే గుజరాతీలోకి అనువదించాడు.
దాని ఇంగ్లీషు అనువాదం 1908 లో ఇండియన్ ఒపీనియన్ పత్రికలో Story of a Solider of Truth పేరిట ఆరువారాల పాటు సీరియల్ గా ప్రకటించాడు.
తన అనువాదం ప్రచురించబోయే ముందు మొదటివారం చిన్న ఉపోద్ఘాతం కూడా ఇట్లా రాసాడు:
"వీరోచిత స్వభావుడైన సోక్రటీస్ అత్యున్నతమైన నైతకశీలాన్ని కలిగిన అసాధారణమైన వ్యక్తి. ఆయన క్రీ.పూ. 471 లో పుట్టాడు. ఒక గ్రీకు పౌరుడిగా, ఉదారమైన, సత్ప్రవర్తనతో కూడిన జీవితం జీవించాడు.అతడి శీల శ్రేష్టతని, సదాచారాన్ని తట్టుకోలేని ఒక అసూయాపరుడు అతడి మీద కొన్ని తప్పుడు అభియోగాలు మోపాడు. సోక్రటీస్ దైవభీతితో జీవించాడే తప్ప, మనుషులు చేసే అవమానాల్ని పట్టించుకోలేదు. అతడికి మృత్యుభయం లేదు. ఒక సంస్కర్తగా,అతడు ఏథెన్సును ప్రక్షాళనం చెయ్యాలనుకున్నాడు. గ్రీకు నగరరాజ్యంగా ఏథెన్సు రాజకీయ జీవితంలో ప్రవేశించిన దుర్మార్గాన్ని పరిశుభ్రం చేసే క్రమంలో అతడు చాలామంది మనుషుల్ని చూడవలసి వచ్చింది. తనను కలవడానికి అసంఖ్యాకంగా వచ్చే యువకుల హృదయాల్లో అతడు చాలా బలమైన ముద్ర వేసాడు. దురాశాపరులైన కొందరు అక్రమంగా సంపాదించుకునే అన్యాయార్జితానికి అతడి బోధలు అడ్డుకట్ట వేసాయి.ఇతరులను దోచుకుని బతికే వారికి అవి ఆటంకంగా మారేయి.
అప్పటి ఏథెన్సులో, నగరరాజ్యానికి చెందిన సాంఫ్రదాయిక మతక్రతువుల్ని ధిక్కరించడం గాని, ధిక్కరించమని ఎదటివాళ్ళకు చెప్పడం గాని నేరంగా భావించబడేది. అటువంటి ఆరోపణ ఋజువైతేదానికి మరణ శిక్ష విధించేవారు. సోక్రటీస్ సాంప్రదాయిక మతాన్ని విశ్వసించాడు కానీ, ఆ మతక్రతువుల్ని పాటించడంలోని అవినీతిని ప్రతిఘటించమని పిలుపు నిచ్చాడు.అతడికై అతడికి ఆ మతక్రతువుల్తో పని లేదు.
ఏథెన్సు చట్టాల ప్రకారం అటువంటి నేరాల్ని ఒక మహాజనసభ విచారిస్తుంది. రాజ్యం తాలూకు మతాన్ని ఉల్లంఘించాడనీ, అట్లా ఉల్లంఘించమని తక్కినవాళ్ళకు కూడా బోధించాడనీ సోక్రటీస్ మీద అభియోగాలు మోపారు. వాటిని మహాజనసభ విచారించింది. ఆ సభలో చాలా మంది సభ్యులు సోక్రటీస్ బోధల వల్ల ఇబ్బందిపడ్డవాళ్ళే. అందుకని వాళ్ళతడి మీద కక్ష గట్టారు. వాళ్ళతడు అపరాధి అని తప్పుడు నిర్ధారణ చేసి అతడికి విషపానం ద్వారా మరణశిక్ష విధించారు. ఆ రోజుల్లో మరణశిక్ష అనేకవిధాలుగా అమలు చేసేవారు. సోక్రటీస్ కు విషపానం ద్వారా అమలు చెయ్యాలని తీర్మానించేరు.
ఆ ధైర్యశాలి ఆ విషాన్ని తన స్వహస్తాల్తో స్వీకరించి మరణించాడు. తన శిక్ష అమలయ్యే రోజు కూడా అతడు తన మిత్రులతో, శిషులతో సంభాషిస్తూనే ఉన్నాడు. మానవదేహ నశ్వరత్వం గురించీ, ఆత్మ అమరత్వం గురించీ ప్రసంగించాడు. అతడు చివరి నిమిషం దాకా కూడా ఎటువంటి భయభీతినీ చూపించలేదనీ, చిరునవ్వుతో విషపానం చేసాడనీ చెప్తారు. తన ప్రసంగం చివరి వాక్యం పూర్తి చేస్తూనే, మనం గ్లాసులో ఉన్న షర్బత్తు తాగడానికి ఎంత ఆత్రుత చూపిస్తామో అంత, త్వరత్వరగా ఆ విషాన్ని తాగేసాడు.
ఈ రోజు మనం సోక్రటీస్ స్మృతికి నీరాజనాలు అర్పిస్తున్నాం. అతడి బోధలు కోట్లాదిమందికి దారి చూపించేయి. అతడిమీద నేరారోపణ చేసినవాళ్ళనీ, అతడిమీద తీర్పు తీర్చినవాళ్ళనీ ఈ రోజు ప్రపంచం శపిస్తున్నది. కానీ సోక్రటీస్ అమరుడిగా నిలబడ్డాడు. అతడి వల్లా, అతడిలాంటి వాళ్ళ వల్లా గ్రీసు యశోవంతమైనది.
తన గురించి తాను సోక్రటీసు చెప్పుకున్న సమర్థనను అతడి సహచరుడు, సుప్రసిద్ధుడు ప్లేటో అక్షరబద్ధం చేసాడు. ఆ రచన అనేక భాషల్లోకి అనువాదమయ్యింది. ఆ సమర్థన ఆద్యంతం నైతిక శక్తితో ప్రోజ్జ్వలంగా ఉంది. కాబట్టి మేము కూడా దాన్ని అనువదించాలనుకున్నాం. అయితే, దాని యథాతథంగా అనువదించడం కాక, దాని సంక్షిప్తంగా మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాం.
మనం దక్షిణాఫ్రికాలోనే కాదు,భారతదేశంలో కూడా గొప్ప సంఘర్షణకు లోనవుతున్నాం. మనమిందులో నెగ్గినప్పుడే మనల్ని పీడిస్తున్నవాటినుంచి బయటపడగలుగుతాం. మనం కూడా సోక్రటీస్ లాగా బతకాలి, అతడిలాగ మరణించగలగాలి. అన్నిటికన్నా ముందు అతడొక గొప్ప సత్యాగ్రహి. అతడు తన వాళ్ళను ప్రతిఘటించడం కోసమే సత్యాగ్రహానికి పూనుకున్నాడు. అందువల్ల గ్రీకులు గొప్పవాళ్ళు కాగలిగేరు.భయం వల్లనో,అవమానాలకు భయపడో, లేదా మృత్యుభీతివల్లనో మనం మన లోపాలను గుర్తెరగకపోయినా, ఇతరుల దృష్టిని వాటినుంచి తప్పించాలని చూసినా మనం భారతదేశ ప్రయోజనాలకు ఏ మాత్రం మేలు చేకూర్చలేం. అటువంటప్పుడు మనం బయటినుంచి ఎన్ని పరిష్కారాలు వెతికినా, ఎన్ని కాంగ్రెసు సమావేశాలు నడిపినా, చివరికి అతివాదులం గా మారినా కూడా ప్రయోజనముండదు. భారతదేశ శ్రేయోమార్గం అటు లేదు. మన వ్యాధి ఏదో మనం సరిగ్గా నిదానించి దానికి బహిరంగంగా చికిత్స చేసినప్పుడే భారతదేశ రాజకీయదేహం లోపలా, బయటా కూడా స్వస్థపడుతుంది. అప్పుడే అది తన వ్యాథికారక క్రిములనుంచి ప్రక్షాళనం పొందుతుంది. బ్రిటిష్ వాళ్ళ, ఇతరుల అణచివేతను ఎదుర్కోగలుగుతుంది. అలాకాక మొత్తం దేహమే వ్యాధిగ్రస్తమై ఉన్నప్పుడు మనమొక తరహా క్రిముల్ని నిర్మూలిస్తే, మరొక తరహా క్రిములు మళ్ళా దాని మీద దాడిచేస్తూనే ఉంటాయి. చివరికి మొతం భారతదేశ రాజకీయ శరీరమే శిథిలమైపోతుంది.
మేమిట్లా ఆలోచించినప్పుడు, సోక్రటీస్ లాంటి మహాత్ముడి మాటల్లో ఒక అమృతం గోచరించింది. కాబట్టి దాన్ని కడుపారా సేవించమని మేము మా పాఠకుల్ని కోరుకుంటున్నాం.తద్వారా వారు తమని చుట్టబెడుతున్న వ్యాధితో పోరాటం చేయగలగుతారు, తక్కినవారు కూడా చేయడానికి తోడ్పడ గలుగుతారు. ఈ ఉద్దేశ్యంతోనే మేం సోక్రటీస్ ప్రసంగాన్ని సంక్షిప్తంగా ఇక్కడ అందిస్తున్నాం."
ఈ అనువాదాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో నిషేధించడం ఒక కొసమెరుపు.
చాలా ఏళ్ళ తర్వాత, 1953 లో నెహ్రూ ఇట్లా రాసుకున్నాడు:
" నేనొక్కప్పుడు ప్లేటో సంభాషణలు చదువుతున్నప్పుడు అతడిమీద సోక్రటీస్ ఎంత ప్రభావం చూపించాడో ఎవరో నాకు చెప్పుకొచ్చేరు. ఇప్పుడు ఈ సంభాషణలు చదువుతుంటే, గాంధీజీ నా మీద చూపించిన ప్రభావాన్ని చదువుతున్నట్టనిపించి నేను ఆశ్చర్యచకితుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను."
No comments:
Post a Comment