Tuesday, April 19, 2016

3) విఘ్నేశ్వరునికి మీదు కట్టడం


విఘ్నేశ్వరునికి మీదు కట్టడం 
అమ్మాయి/ అబ్బాయికిపెళ్ళి కుదిరి తాంబూలాలు పుచ్చుకోగానే, ముహూర్తం పెట్టించుకోగానే మొదట చేసేపని విఘ్నేశ్వరునికి మీదు కట్టడం.
మీదుకట్టడం ఎలా, ఇది ఆడవారు, సాధారణంగా తల్లి కడుతుంది. ఇంట్లో పెద్దలుంటే కట్టిస్తారు,మంగళవారం, శుక్రవారం కాకుండా మంచిరోజు చూసుకుని, కనీసం ముగ్గురు పేరంటాండ్రని పిలిచి, పసుపు వినాయకుని చేసి, పూజించి, ఒక ఎర్రటి జాకట్ ముక్కలో ఐదు సోలల బియ్యం పోసి అందులో ఒక బెల్లం ముక్క వేసి ఉంచి, తిరగలి వేసి, దానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి,శనగలు తీసుకుని దానిలో విసరాలి,వచ్చిన ముత్తయిదువుల చేత విసిరించి, వాటిని వేరుగా పొట్లం కట్టి, ఈ ఎర్ర గుడ్డలో పెట్టి, పసుపు వినాయకుడిని కూడా ఆ మూటలో పెట్టి గుడ్డని మూట లా కట్టి, లోపల బీరువాలో భద్రం చేస్తారు. దీనిని మీదు కట్టడం అంటారు. వినాయకుని, స్వామీ! ఈ కార్యక్రమం సాఫీగా అయ్యేలా అనుగ్రహించు, అని చెప్పి చేసేది. మరొక రకంగా చెప్పాలంటే, పాత రోజులలో ఇరుగుపొరుగువారికి పెళ్ళి పనులు మొదలుపెట్టినట్లు చెప్పడమే. మీదు కట్టే దాకా పెళ్ళికి సంబంధించిన పనులు చేయరు, బంగారు వస్తువులు చేయించడం సహా.మొత్తం కార్యక్రమం పూర్తయిన తరవాత ఈ మీదుకట్టిన మూట తీసి, బియ్యం విసిరి,శనగపప్పును అందులో వేసి ఉండ్రాళ్ళు చేసి వినాయకునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా స్వీకరిస్తాం. పెళ్ళికి ఈ కార్యక్రమం పదహారురోజుల పండుగనాడు చేస్తాం. ( పెళ్ళయిన పదహారవ రోజు పండగ చేసుకుంటాం ) సాధారణంగా ఊరిలో పిలుపులు కార్యక్రమం ఈ రోజు పెట్టుకుంటారు, కష్టేఫలి శర్మగారి సౌజన్యంతో-పెళ్ళిభోజనం మృష్టాన్న భోజనం: సాధారణంగా పెళ్ళీడుకొచ్చిన ఆడ, మగ పిల్లల్ని పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తారు అని పెద్దవారు సరదాగా అడుగుతారు పెళ్ళిభోజనం అంటే పప్పన్నం మాత్రమె కాదండోయ్! రుచికరమైన తియ్యని పదార్థములతో కూడిన మంచి భోజనము. తృప్తికరమైన భోజనము. అని నిఘంటువులు చెప్తున్నాయి. మరికి పెళ్ళికి వచ్చే మీ వంటి ఆత్మీయ అతిధులకు మరి అటువంటి భోజనం ఎలా వండాలి, వడ్డించాలి వంట బ్రాహ్మల, క్యాటరింగ్ వారితో సంప్రదింపులు. మా ఇంట ఆ సందడి చిత్రాలు. మీరూ ఆస్వాదించండి. సందర్భం వచ్చింది కాబట్టి మనలో మనమాట ఈ రోజుల్లో పెళ్ళిభోజనం పేరు చెప్పి వందలాది ఆహార పదార్ధాలు, ఇండియన్, కాంటినెంటల్ అంటూ ఎన్నెన్నో స్టాల్ల్స్ పెట్టి ప్లేట్ ఒక్కింటికీ 100 రూపాయల నించి 1000 రూపాయల ఖర్చు పెట్టడం అవసరమా? ఆయన 100 రకాల ఆహార పదార్ధాలు పెట్టాడు కాబట్టి మనం 150 పదార్ధాలు పెడదాం అంటూ పోటా పోటీగా ఒక వేలం వెర్రి వ్యవహారం లా తయారయ్యింది ఇదంతా క్యాటరింగ్ వారు బాగు కోసం తప్ప నిజంగా ఆనాడు తినే సామర్ధ్యం ఈనాటి మనకు ఉందా చెప్పండి ఎందుకంత దుబారా? ఆహారపదార్ధాలు సగం తిని పారవేయడం, మిగిలిపోవడం ఎంత బాధగా ఉంటుంది. అవసరమైన మేరకు సంప్రదాయక నవకాయ పిండివంటలతో అరటి ఆకులలో భోజనం ఎంత తృప్తిగా ఉంటుంది. ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, ఎంత పర్యావరణానికి హాని కలిగిస్తున్నాము. ఆలోచించండి. ఆ అనవసర ఖర్చు తగ్గించుకుని వధూవరుల పేరిట ఏ అనాధ శరణాలయం లోనో వృద్ధాశ్రమాల లోనో లేదా పేదలకి, అన్నార్తులకు పెడితే పుణ్యం పురుషార్ధం! ఒకవేళ మిగిలిపోయిన పదార్ధాలని సేవా భావంతో అన్నార్తులకు అందించే సంస్థలు ఇటీవల ఎన్నో వస్తున్నాయి వారి ఫోన్ నంబర్లు మనం సేకరించి, మనం వెళ్ళే కళ్యాణ మంటపాల్లో వాటి గురించి ప్రచారం చేస్తే మనకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది అందుకే కదా మన పెద్దలు అన్నారు పెట్టక పోయినా పెట్టె ఇల్లు చూపించమని! విజ్ఞతతో ఆలోచిద్దాం! మానవత్వంతో ప్రతిస్పందిద్దాం! ధన్యవాదాలతో,
సత్యసాయి - విస్సా ఫౌండేషన్!






Saturday, April 16, 2016

2) నిశ్చితార్ధము:తాంబూలాలు

నిశ్చితార్ధము:

తాంబూలాలు అని కూడా అంటారు వధూ వరులు పరస్పరం నచ్చాక ఇరువైపులా పెద్దలు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. బట్టలు పెట్టుకుని ఉంగరాలు అందజేసుకుంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. ఆధునిక కాలంలో నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్లి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెండ్లి కుమారుడు అని అమ్మాయిని పెండ్లి కుమార్తె అని వ్యవహరిస్తారు. ఇదిగో మా ఇంట మా తమ్ముడి వివాహ నిశ్చితార్ధపు వేడుక...వీక్షించండి నిండు తెలుగు మనసుతో ఆశీర్వదించండి!
తాంబూలాలు కార్యక్రమానికి వేదికైన పినపళ్ళలో మాస్వగృహం ముస్తాబు. తాంబూలాల పెళ్లివారిని మా ఇంటి గాతే కూడా పూర్ణ కుంభంతో సుస్వాగతం అని మౌనంగా మనసారా స్వాగతం పలుకుతోంది. దారి పొడుగునా పిల్లలు రంగవల్లికలు తీర్చడంలో సందడి సందడిగా తిరుగాడుతున్నారు. బంధు మిత్రులు హడావిడి సరదా కబుర్లు, మా హిత పురోహితులు బ్రహ్మశ్రీ సత్తిబాబు గారి శాస్త్ర ప్రకారంగా యధావిధిగా జరిపించిన శుభకార్యం సందడి ఇదిగో చూడండి ఆ చిత్రాలు...మీరూ మనసారా ఆశీర్వదించండి!! 

సత్యసాయి - విస్సా ఫౌండేషన్.






































1) పెళ్ళంటే పందిళ్ళు



పెళ్ళంటే పందిళ్ళు

























పెళ్ళంటే పందిళ్ళు 
పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఎంత ఆర్భాటంగా చేసాము అన్నదానికంటే ఎంత సంప్రదాయ బద్దంగా చేశాము అన్నది ఏంతో సంతృప్తి గా ఉంటుంది. కళ్ళలో పెళ్లి పందిరి కనబడ సాగే అన్న పాట ఎంత చల్లగా హాయిగా ఉంటుంది. పందిరి అంటే తాటాకు పందిరే చలవ పందిరి అంటారు. ఈ కాలంలో ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయం, తాటి ఆకు లభించాలి, చెట్టు నుండి కోసి వాటిని ఒక వరుసక్రమంలో ఒక దానిపై ఒకటి వరుసగా పేర్చి చదును చేసే ప్రక్రియను మడదొక్కడం అంటారు. ఈ మధ్యకాలంలో పాకలు పందిళ్ళు నేసే వారు కరువవుతున్నారు. ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. పందిరిని బట్టి ఆధారపడుతుంది. అందుకనే గ్రామాలలో కూడా పెళ్లిళ్ళలో పందిరిలు నామమాత్రం గానే కనిపిస్తున్నాయి. టెంటు వేసేస్తే సరి అని సరిపెట్టేసు కుంటున్నారు. కనీసం 6 మంది 4 రోజులు కష్టపడితే పందిరి తయారవుతుంది. ఇక ఆ పందిరి కింద కాసింత సేదతీరితే ఆ పచ్చి తాటిఆకు వాసన ఆ పందిరి స్తంభాలకు కట్టిన పచ్చి కొబ్బరాకులవాసనా, తోరణాలుగా కట్టిన మామిడాకుల వాసనలు పీలుస్తూ ఆ పందిరి కింద సేదతీరితే అటు ఎండనుండి రక్షణతో పాటు సంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నామన్న భావనతో ఎంతో తృప్తి గా అలౌకిక ఆనందం అంతేకాదు ప్రకృతి సహజసిద్ధమైన అలసట పోగొట్టి మనసుని ఉల్లాసంగా ఉంచే గుణం తాటి ఆకుల్లోను , తాటి పందిళ్ళలోను, పాకల్లోను ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే పూర్వం శుభకార్యాలకి కొబ్బరి ఆకుల కన్నా తాటి వనరులనే ఎక్కువ ఉపయోగించేవారు. ఈ విషయంలో కొబ్బరికన్నా, మరింత శాతం తాటి మంచిది అంటున్నారు పరిశోధకులు. అందులో అనేక విశే షాలు, ఔషధగుణాలు, కలగలుపుగా ఎన్నో ఉన్నాయి. దీని సాధారణ ఉపయోగాలు చూస్తే, దీని ఆకులు లతో పూరిపాకలే కాక శోభస్కరమైన పెళ్లి పందిరికీ, వాడేవారు కాగితం లేని పూర్వకాలంలో ప్రజలందరూ తాటి ఆకుల్నే వాడేవారు. వాటినే తాళపత్రాలు అని పిలిచేవారు. నేటికీ ఎన్నో గ్రంధాలు మనకి తాళపత్రాలలోనే ఉన్నాయి. ఇక దీని కాండం ఇంటి వాసాలుగా ఉపయోగిస్తారు. అనేక పల్లెల్లో, వ్యవసాయ భూముల్లో ఈ తాటివాసాలతో, తాటి ఆకులతో కట్టిన ఇళ్ళు మనకి నేటికీ కనిపిస్తూనేవుంటాయి. ఈ ఇళ్ళు మనకి వేసవిలో చల్లగానూ, శీతాకాల, వర్షాకాలాల్లో వెచ్చగానూ వుంటాయి. అందుకే తాటితో తయారైన ఇంటిని ‘నేచురల్‌ ఎయిర్‌కండిషన్డ్‌ హౌస్‌’ అంటారు. తాటికల్లుని నీరాగా అందరూ సేవించడం మనకి తెలిసినదే. తాటి సంపద ఆయుర్వేదపరంగా కూడా మనిషికి మేలుచేస్తుందనే చెప్తోంది. భొజానాల్లో అరటి ఆకులు కూడా మాయమై పోతున్నాయి. నేటి ఆధునిక ఒత్తిడుల మయ మాయా జీవనంలో ఇలా ఒక చల్లని పందిరికింద సేద తీరితే ఎంత హాయి! ఇలా పందిరి వేసాక దానికి తెల్ల వస్త్రాన్ని కప్పి రంగు రంగుల పువ్వులతో అలంకరిస్తే ఇంటి ముంగిట ఎంత చల్లదనం ఎంత శోభాయమానం... నగరాల్లో పట్టణాల్లో పెళ్లి మంటపాలకు లక్షాలాది రూపాయలు ఖర్చు చేసేవారు ఏదో ఒక గ్రామంలో ఇలా పందిరి ఏర్పాటు చేసి తక్కువ ఖర్చులో ఎంతో వైభవంగా చెయ్యవచ్చు సంప్రదాయాన్ని పరిరక్షించావచ్చు ఆలోచించండి! ఇంతకీ ఈ హడావుడి అంతా ఏమంటే? రాజు తలుచుకుంటే దేనికైనా కొదువా అంటారు కదా మా తమ్ముడు రాజు తలుచు కుంటే అంతేమరి! ఇదిగో మా తమ్ముడు చి. వెంకటేశ్వర్లు వివాహ నిశ్చితార్దానికి మా ఇంటి ముంగిట పందిరి శోభ! అచ్చతెలుగు సంప్రదాయం ఆస్వాదించండి! రేపటి పోస్ట్ లో నిశ్చితార్ధం దృశ్యాలు వీక్షించండి మనసారా ఆశీర్వదించండి! సత్యసాయి విస్సా ఫౌండేషన్!

Total Pageviews