Saturday, February 18, 2017

అప్పుడు శ్రీకూర్మంలో

అప్పుడు శ్రీకూర్మంలో
______________
అప్పుడు శ్రీకూర్మంలో
శ్రీకూర్మం ఎదట నిల్చున్నప్పుడు
నాలోపల ఏదో సంభవించింది,
లేదా నాకు సంభవిస్తున్నదేదో
క్షణమాత్రం పాటు ఆగిపోయింది.
ఆ క్షణం జరిగిందేదేదో
గుర్తుపట్టాలని ప్రయత్నిస్తున్నాను
కాని అది క్షణం కూడా కాదు
ఒక సూర్యశకలం, కొంత నక్షత్రధూళి
భూమిగా రూపుదిద్దుకున్నప్పుడు
నీలిరోదసిలో వినిపించిన ప్రథమస్పందన.
అది మొదటిసారి శబ్దం
శబ్దాన్ని విన్న మెలకువ కావచ్చు
లేదా నన్ను కబళిస్తూ వస్తున్న
ఊహ, భ్రమ, వేదన, పారవశ్యప్రకంపన
నన్ను వదిలిపెట్టిన
మహావిమోచనీయమధురక్షణమేనా కావచ్చు
అక్కడొక చతుర్భుజ, అష్టభుజ
అనంతభుజమూర్తిని చూస్తానని
ఎందుకనుకున్నానో తెలియదు, కాని
పేర్లుగా, రూపాలుగా, కొలతలుగా
పొగ, ప్రయాస,పరిరంభంగా
విస్తరించిన నా ప్రపంచాన్ని
ఒక్కసారికి కిందకు గుంజినట్టుంది
పిల్లవాడు గాలిపటం
దారం వెనక్కి లాగినట్టు.
ప్రయత్నాలు, ప్రయోగాలు, ప్రగల్భాలు,
పరితోషణాత్మక ప్రభావాలన్నిటినీ
హోటల్లో సర్వరు ఎంగిలిబల్ల తుడిచినంత
నిర్లిప్తంగా
ఒక దయామూర్తి
తుడిచిపెట్టేసిన ముహూర్తమేనా కావచ్చు.
అక్కడ నా లోపల గదిలో
అప్పుడేం జరిగిందో
ఇంకా తొంగితొంగి చూస్తూనే వున్నాను
అది చీకటి అనిగానీ వెలుతురు అనిగానీ
చెప్పలేను
భాష లేని, భావానికి దొరకని
సృష్టిపూర్వ,యుగానంతర
సంస్థితి.
అప్పుడు బహుశా నాకొక తెలివిడి కలిగిఉంటుంది
జ్ఞానం, విజ్ఞానం కాని ఒక ప్రజ్ఞానం,
బహుశా అనాదిగా నాకు తెలిసి కూడా
తెలుసునని ఆ క్షణందాకా తెలిసిరాని సంజ్ఞానం.
ఏ సత్యయుగంలోనో,
ఇంకా పశుపక్ష్యాదులు, వృక్షాలు,సర్పాలు,
మానవులు, మహీధరాలు పుట్టకముందే
ఒక నిశ్చింత ప్రతిష్టితమైంది.
నువ్వెంత చింతించినా
నీకు తెలుసు, నీ అడుగున, అట్టడుగునొక
నిశ్చింత నిశ్చలంగా నిలిచి ఉందని.
అక్కడ ఆ గర్భాలయంలో
ఆదికూర్మాన్ని చూసినప్పుడు
నా ఆనందమందరానికి ఊతంగా
అట్టడుగున అభయం కలిగిస్తున్నదేమిటో
అవగాహన కలిగింది.
ముందు నా తల్లిదండ్రులు
చిలికారు ఈ సాగరాన్ని
నేను పైకి తేలాను,
విషపాత్రనో, పీయూషకలశాన్నో-
తేల్చుకోలేకుండానే
కాలం గడిపేసాను.
ఇప్పుడు నాకు గుర్తొస్తున్నది
చిలుకుతున్న కవ్వం పక్కన పెట్టి
మజ్జిగగిన్నెంతా కలయతిప్పి
మా అమ్మ పైకి తీసిన
వెన్నముద్ద.

No comments:

Post a Comment

Total Pageviews