Tuesday, February 6, 2018

*ప్రార్థన*

*ప్రార్థన* 
భగవంతుడా! నాకు అదివ్వు, నాకు ఇదివ్వు, భగవంతుడా! నన్ను కాపాడు, అదే గదా! మనం కోరుకుంటున్నది భగవంతుడిని కాదు, 
మనం కోరుకుంటున్నది భద్రత, ఆనందం. 
ప్రార్థనలో మనం కోరుకుంటున్నది సుఖసంతోషాలనే కానీ అది ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా లేము. అన్నిటికన్నా ముందు, మనలో మనము ఖచ్చితంగా ఉండటం ముఖ్యం. ఆ తర్వాత మనం నిజమైన ఆనందానికి, సుఖసంతోషాలకు ఉన్న అడ్డంకులను ఎలా దాటాలో చూడవచ్చు.
మన మూర్ఖత్వం చూసుకోనంత వరకూ భగవంతుడి వైపు చూడటం వల్ల లాభం లేదని గ్రహించాలి . 
మతం పట్ల మనకున్న మౌలిక ఉద్దేశాన్ని మనం నిజాయితీగా చూస్తే, మనమెప్పుడూ దైవత్వాన్ని కాంక్షించలేదని మనం గమనిస్తాం. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి.
మన ఆకాంక్ష ఎల్లప్పుడు అనంతం కోసం వుండాలి.
మన ఆకాంక్షంతా సౌకర్యం, సంపద, అధికారం, సుఖాల కోసమే వుంటుంది .
వీటన్నిటినీ సాధించేందుకు భగవంతుడు ఒక పరికరం అని అనుకుంటున్నాం .
మన రక్షణనో లేదా ప్రాపంచిక విషయాలనో కోరుకుంటూ ఉంటే, మన ప్రార్థనకు అత్యాశ, భయం ఆధారాలవుతాయి. ఇది పనిచేయదు.
సాధారణంగా, మనం ప్రార్థనను దేవుడిని చేరుకునే మార్గంగా భావించాలి.
కానీ భగవంతుడి గురించి మనకు నిజంగా తెలిసిందేమిటి? మనం అర్థం చేసుకోవాల్సినదేమిటంటే, ప్రగతి అనేది ప్రార్థన వల్ల జరగదని, ప్రార్థనాయుతంగా ఉండడం అనే గుణం వల్ల ప్రగతి వస్తుంది, అంతే కాని ప్రార్థనను ఒక చర్యలా చేయడం వల్ల కాదు. ప్రార్థనా పూర్వకంగా ఉండడం అంటే మొత్తం మన జీవనాన్నే ఒక అర్పణగా మార్చడం, అది మనల్ని మనం అర్పించుకునే ప్రక్రియ.
ప్రార్థనా పూర్వకంగా ఉండడమనేది సకల భూతాంర్గతమూ, సర్వవ్యాపితమూ అయిన దైవంతో లోతైన బంధాన్ని కలిగి ఉండడం. అదొక గుణం, అదొక స్థితి. మనం ప్రార్థనా పూర్వకంగా మారేకొద్దీ, అది అత్యంత మనోహరంగా ఉంటుంది. కానీ మనం మన అంతర్గత ప్రవృత్తికి సంధానమై ఉన్నపుడే మనం ఆ స్థితికి చేరుకుంటాం. అప్పుడు అనుభవం పరిపూర్ణానందంగా ఉంటుంది.
మనం పూర్తి ఆనందంగా ఉన్నప్పుడు, మనం సహృదయులమై
స్వీకరించగలుగుతాం. అప్పుడు ప్రార్థన ఏమాత్రం ఏకపాత్రాభినయం కాబోదు, ఎంతో గొప్ప సంతోషాన్ని తెచ్చే వేడుకగా మారుతుంది.
అప్పుడు మనం భయంతోనో లేదా అత్యాశతోనో ప్రార్థించం. ఎందుకంటే అప్పుడు ప్రార్థనే ఒక పారితోషికమవుతుంది కాబట్టి.
మనం నిజంగా ప్రార్థనాపూర్వకంగా ఉండడం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు, ప్రార్థన దేవుడిని చేరే మార్గం కాక, దేవుడే మన ప్రార్థనకు సాధనంగా మారుతాడు.

No comments:

Post a Comment

Total Pageviews