Sunday, April 7, 2019

నిన్న నేడు రేపు ఈనెల 6 ఉగాది enadu

నిన్న నేడు రేపు
ఈనెల 6 ఉగాది
... అంటే!
ఉగాది, యుగాది అనే రెండు పదాలూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తాయి. యుగాది అనేది సంస్కృత పదం. ఇదే కాలక్రమంలో ఉగాదిగా మారిందని భాషావేత్తలు చెబుతున్నారు. దీన్ని పలు రకాలుగా వివరించారు. 


* ‘ఉగస్య ఆదిః ఉగాది’ - ఉగము అంటే నక్షత్రగమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ప్రారంభపు రోజు.. అంటే ఈ రోజు నుంచి నూతన కాలగణన ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజుకు ఉగాది అనే పేరు వచ్చింది. 


* మరో వివరణ ప్రకారం ఉగము అనే పదానికి జన్మ, ఆయుష్షు అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటిప్రకారం విశ్వ జననం, ఆయుష్షులకు మొదటిరోజు కాబట్టి ఈ రోజుకు ఉగాది అనే పేరు వచ్చింది. 


* ఇంకో రకంగా చూస్తే ‘యుగము’ అంటే జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన కాలప్రమాణాలున్న సంపూర్ణ సంవత్సరానికి ఇది తొలిరోజు కాబట్టి ఈ రోజుకు యుగాది అని పిలిచారు. 


* కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ‘పంచవత్సరో యుగమితి’ - ఐదు సంవత్సరాలు ఒక యుగం అంటూ ‘యుగం’ అనే భావనకు నిర్వచనం ఇచ్చాడు. జ్యోతిశ్శాస్త్రం కూడా ఇదే భావనను సమర్థించింది. 


వసంత గాలికి..!
ఉగాది
వికాసానికి గుర్తు...
భూమిపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది.
వసంతమాసంలో ప్రకృతి అంతా కొత్త చిగుర్లు వేస్తుంది.
రానున్న సత్ఫలితాలకు సంకేతాలనిస్తుంది.
మనిషి ఆశలు కూడా చిగురుల వంటివి. అవి ఫలించాలి... ఫలితాలనివ్వాలి...
అదే ఈ పండగ చెప్పే శుభకామన.
మిగిలిన పండగలకన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది. సాధారణంగా పర్వదినాలన్నీ ఏదో ఒక దేవత లేదా దేవుడికి సంబంధించి ఉంటాయి. ఉగాది ఇందుకు పూర్తి భిన్నం. ఏ దేవుడి పేరూ ఈ రోజు ప్రత్యేకంగా వినిపించదు. ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మార్పులకు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిదుకోవాలనే సందేశాన్ని ఇది  అందిస్తుంది. సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది.
ఎల్లప్పుడూ మంగళధ్వనులు వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత. ఈవిధంగా ఉగాది మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది.
అంతేకాదు ఈ పర్వదినం పునరుజ్జీవనానికి సంకేతం. అప్పటివరకు మోడుబారిన చెట్లు, తీగెలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పూలు, కాయలతో కళకళలాడినట్లు కష్టనష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకుసాగాలనే సందేశాన్ని అందిస్తుంది.


పచ్చడికీ ఓ లెక్కుంది...

ఉగాది పండగలో మరో ప్రత్యేకత ఉగాది పచ్చడి. మిగిలిన పండుగల్లో పిండివంటలు చేసుకుంటే ఉగాది రోజున పచ్చడి చేసుకుంటాం. అది కూడా పూర్తిగా స్వాభావికంగా. అంటే, ఏవిధంగానూ పచనం (వండటం) చెయ్యకుండా తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం అనే ఆరు రకాల రుచులు అందించే పదార్థాలు కలిపి తయారుచేసే పచ్చడి ఇది. ఈ రుచుల్ని కలపటానికీ ఓ లెక్క ఉంది. తీపి, కారం సమానంగా కలపాలి. వీటి మోతాదుకు సగభాగం పులుపు, వగరు, వీటికి సగభాగం ఉప్పు, చేదు కలపాలి. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ శరీరంలో సమతూకాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి. సంవత్సరం పొడవునా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖసంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకుసాగాలనే తాత్త్విక సందేశం ఉగాది పచ్చడిలో ఉంది.


ధర్మసందేహం
పంచాంగంలో వివరించే నవనాయకులను ఎలా నిర్ణయిస్తారు?
కాలచక్ర పరిభ్రమణం ఆధారంగా నవనాయకుల నిర్ణయం జరుగుతుంది. ఆ విశేషాలను జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరానికీ రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అని తొమ్మిదిమంది నాయకులు ఉంటారు. వీరినే నవనాయకులు అంటారు. సంవత్సరాది (ఉగాది) ఏ వారం వస్తుందో.. ఆ వారానికి అధిపతిని రాజుగా నిర్ణయిస్తారు. వికారి నామ సంవత్సరం శనివారం నాడు వస్తోంది కాబట్టి.. రాజు శని. మిగిలిన నాయకులను గ్రహరాజు అయిన సూర్యుడి ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు వివిధ రాశుల్లోకి, నక్షత్రాల్లోకి సంక్రమించే వారానికి అధిపతి అయిన గ్రహం అందుకు సంబంధించిన శాఖకు అధిపతి అని శాస్త్రం నిర్దేశించింది.
సూర్యుడు మేషరాశిలోకి సంక్రమించే వారాన్ని బట్టి మంత్రిని, సింహరాశిలోకి ప్రవేశించే వారం ఆధారంగా సేనాధిపతిని, కర్కాటక సంక్రమణం చేసే వారాన్ని బట్టి సస్యాధిపతిని, ధనూరాశిలోకి వచ్చే వారం ఆధారంగా ధాన్యాధిపతిని, మిథున సంక్రమణ జరిగే వారాధిపతిని అర్ఘాధిపతిగా, తులలో ప్రవేశించే రోజును బట్టి రసాధిపతిని, మకరరాశిలో ప్రవేశించే వారం ఆధారంగా నీరసాధిపతిని.. ఇలా నవనాయకులను నిర్ణయిస్తారు. సూర్యుడు.. ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే వారం అధిపతి ఆధారంగా మేఘాధిపతిని నిర్ణయిస్తారు.
నవనాయకులను బట్టి.. సంవత్సర ఫలితాలను అంచనా వేస్తారు పంచాగకర్తలు. రాజు, మంత్రి, సేనాధిపతి పరిపాలనను నిర్ణయిస్తారు. సస్యాధిపతిని బట్టి వర్షపాతం, ధాన్యాధిపతిని బట్టి ధాన్యవృద్ధి, అర్ఘాధిపతిని ఆధారంగా నవ్వులు, మినుములు మొదలైన వాటి దిగుబడి, మేఘాధిపతి ఆధారంగా వర్షాలు, పంటలు ధరలు, రసాధిపతిని బట్టి పులుపు, చేదు మొదలైన పదార్థాల ధరల హెచ్చుతగ్గులు నిర్ణయిస్తారు.
- మల్లాప్రగడ శ్రేమన్నారాయణమూర్తి



పంచాంగాలు, సిద్ధాంతాలు
పంచాంగం అంటే ఐదు అంగాలని అర్థం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం - ఈ ఐదు అంగాల (అంశాలు) గురించిన వివరణలు ఇచ్చే గ్రంథమే పంచాంగం.   దీని రచనకు సూర్య, దృక్‌ అనే రెండు సిద్ధాంతాలు మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిల్లో సూర్యసిద్ధాంతం అత్యంత ప్రాచీనమైంది. సుమారు 1800 ఏళ్లుగా ఇది వాడుకలో ఉంది. భట్టోత్పల, దివాకర, కేశవ, విజయనంది, చిత్రభాను, శ్రీరంగనాథ, మకరంద, నరసింహ, భాస్కరాచార్య, ఆర్యభట్ట, వరాహమిహిార తదితర ఖగోళ గణిత (ఆస్ట్రో మాథమెటిక్స్‌) శాస్త్రవేత్తలు కాలవిభజనకు స్పష్టమైన వివరణలు ఇచ్చారు. వీరిలో క్రీ.శ 1178 కాలానికి చెందిన మల్లికార్జున సూరి రాసిన ‘సూర్య సిద్ధాంత భాష్యం’ తెలుగు, సంస్కృత భాషల్లో ముద్రితమై, ఇప్పటికీ వాడుకలో ఉంది. పంచాంగ రచనలకు ఇప్పటికీ ఇదే ప్రామాణిక గ్రంథం. సూర్యసిద్ధాంతం, ఆర్యభట్టీయం, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం - ఈ మూడు గ్రంథాల ఆధారంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికీ తమ కాలమానిని (కాలెండర్‌) రూపొందించుకుంటున్నాయి. దృక్‌ సిద్ధాంతాన్ని కేరళ రాష్ట్రానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ‘పరమేశ్వర’ (క్రీ.శ.1431) వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు. సూర్య, దృక్‌ సిద్ధాంతాల ఆధారంగానే పంచాంగాలు తయారవుతాయి. 


చంద్రుడు కదలితే మాసం...సూర్యుడు కదిలితే కార్తె
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చైత్ర, వైశాఖాలనే మాసాల పేర్లు చంద్రగ్రహ సంచారం ఆధారంగా ఏర్పడ్డాయి. నక్షత్రాల ఆధారంగా చంద్రుడి గమనాన్ని పరిశీలిస్తే చంద్రుడు ఒక నక్షత్ర కూటమి నుంచి బయల్దేరి మళ్లీ అదే నక్షత్ర కూటమికి చేరుకోవటానికి దాదాపు 27 రోజులు పడుతుంది. దీన్నే నక్షత్రమాసం అంటారు. ఈ 27 రోజుల్లో చంద్రుడు దాటే ఒక్కో నక్షత్రం ఆధారంగా అశ్వని, భరణి, కృత్తిక మొదలైన 27 నక్షత్రాల పేర్లు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ప్రతి నెలలో నిండు పూర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు మీద ఆ నెలకు పేరు ఏర్పాటు చేశారు. దీనిప్రకారం చంద్రుడు పూర్ణమి రోజున చిత్త నక్షత్రంలో ఉంటే చైత్రమాసం అవుతుంది. విశాఖ నక్షతంల్రో ఉంటే వైశాఖం అవుతుంది. ఇలాగే, అన్ని మాసాల పేర్లు ఏర్పడ్డాయి.
అలాగే సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా చేశారు. వాటికి ‘కార్తె’ అనే పేరు నిర్ణయించారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు రెండు వారాల పాటు ఉంటాడు. దీనిప్రకారం ఒక్కో కార్తె సుమారుగా 13 లేదా 14 రోజులు ఉంటుంది. అశ్వని నుంచి రేవతి వరకు ఇలా నక్షత్రాల పేరు మీద కార్తెలు ఏర్పడ్డాయి.


నారదుడి కొడుకులంట...
ఆజన్మ బ్రహ్మచారి అయిన నారదమహర్షికి ఒక రోజు విచిత్రమైన కోరిక కలిగింది. సంసారం మాయ అంటారు. అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి, తన కోరికను విష్ణుమూర్తికి తెలియజేస్తాడు. భూలోకంలోని ఓ కొలను చూపించి, అందులో స్నానం చేసి రమ్మంటాడు విష్ణువు. సరేనంటూ అందులోకి దిగా స్నానం చేసి వచ్చేసరికి నారదుడు స్త్రీగా మారి, పూర్వజ్ఞానాన్ని కోల్పోతాడు. ఇంతలో అటుగా వచ్చిన ఓ రాజు స్త్రీరూపంలో ఉన్న నారదుడిని చూసి మోహించి, ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి 60 మంది సంతానం కలుగుతారు. కొన్నేళ్ల తర్వాత శత్రువులతో జరిగిన యుద్ధంలో రాజు తన 60 మంది సంతానంతో సహా మరణిస్తారు. స్త్రీరూపంలో ఉన్న నారదుడు అంతులేని దుఃఖానికి గురవుతాడు. మరణించిన వారికి ఉత్తరక్రియలు జరిగిన తర్వాత తాను పూర్వం స్నానం చేసిన కొలనులో స్నానం చేయడంతో అతనికి స్త్రీరూపం పోతుంది. అయినా తన పుత్రులు యుద్ధంలో మరణించిన దుఃఖం నుంచి మాత్రం అతడు తేరుకోలేకపోతాడు.  అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఇదంతా తన మాయ వల్ల జరిగిందని చెబుతాడు. నారదుడి సంతానం పేరు శాశ్వతంగా నిలిచి ఉండేలా వారి పేర్లే కాలప్రమాణాలుగా మారి, సంవత్సరాల పేర్లుగా మారుతాయని వరమిస్తాడు. అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల.... తదితర 60 మంది పేర్లే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సంవత్సరాల పేర్లుగా వ్యాప్తిలోకి వచ్చాయి.
- కె . సుబ్బరామ  సోమయాజి


 

ఇది కాల గణితం
ఉగాది...
దేనికి సంకేతం? ... కాలానికి
ఆ రోజు ఏ దేవుణ్ణి కొలుస్తాం? ... కాలాన్ని
ఆ రోజు ఏం తెలుసుకుంటాం?
... కాల గమనాన్ని
అంతులేని నిగూఢమైన ఆ శక్తి ప్రవాహం నిరంతరాయం...
క్షణమొక యుగం... అంటారు...
అసలీ క్షణమేంటి? యుగమేంటి?
ఆ కొలతలెలా వచ్చాయి..?
ప్రకృతికి, మనిషికి, కాల విభజనకు ఉన్న సంబంధమేంటి?
* యజుర్వేదంలో కూడా అహోరాత్రం, అర్ధమాసం, మాసం, రుతువులు, సంవత్సరాల వివరాలు తెలిపే మంత్రాలు ఉన్నాయి. ‘అర్ధమాసాస్తే కల్పంతాం, మాసాస్తే కల్పంతాం । రుతవస్తే కల్పతాం సంవత్సరస్తే కల్పతాం।’ (యజుర్వేదం 27:45) మంత్రాలు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి. యజుర్వేదం నాలుగు, ఏడు కాండల్లో రుతువుల ప్రస్తావన వస్తుంది. శతపథ బ్రాహ్మణంలో కూడా రుతువుల ప్రస్తావన ఉంది. అయితే, ఇందులో ఏడు రుతువుల్ని ప్రస్తావించారు.


మధు... మాధవ... నభ... తపస్య...
ప్రకృతిలో వచ్చే మార్పే రుతువు.  వసంత, గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శిశిర అనే ఆరు రుతువులు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఒక్కో రుతువు రెండు నెలలు ఉంటుంది. అయితే అత్యంత ప్రాచీనమైన రుగ్వేదంలో వసంతం, గ్రీష్మం, శరత్‌ అనే మూడు రుతువుల ప్రస్తావన మాత్రమే ఉంది.  కృష్ణయజుర్వేదంలో ఐదు రుతువుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత తైత్తిరీయ సంహితలో మొదటిసారిగా ఆరు రుతువుల ప్రస్తావన కనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చైత్రం, వైశాఖం, జ్యేష్టం అనే 12 మాసాల పేర్లు కాకుండా మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఇష, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అనే పేర్లు ఇందులో ఉపయోగించారు.


మనిషి జీవితం నియమబద్ధం. ప్రకృతి సిద్ధం. ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు నిద్రలేవాలి? నుంచి ప్రతి పనికీ చరాచర ప్రకృతే ఆధారభూతం. వాటిలో వచ్చే మార్పులే ప్రామాణికం. దీన్నే ఆలంబనగా తీసుకుని కాలాన్ని గణించారు మన పూర్వీకులు.
* అతి ప్రాచీనమైన రుగ్వేదంలో కాలం, కాల విభజన గురించిన ప్రస్తావనలు చాలా చోట్ల ఉన్నాయి. ఆయా కాలాల్లో నిర్వహించాల్సిన యజ్ఞ, యాగాది క్రతువులను వివరించే సందర్భాల్లో కాల ప్రస్తావన అందులో కనిపిస్తుంది. రుగ్వేదం ఏడో మండలం 103వ సూక్తంలో రుతువుల ప్రస్తావన ఉంది. సోమ, అతిరాత్ర యజ్ఞాల గురించి వివరిస్తూ, రుత్విక్కులు ఆయా రుతువుల్లో ఈ యాగాలు చెయ్యాలని అందులో ఉంది.
* యుగాలు, యుగవిభజన ప్రస్తావన మొదటిసారిగా మహాభారతంలో కనిపిస్తుంది. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలతో పాటు కల్ప, మహాకల్ప విభజన కూడా వ్యాసమహర్షి ఇందులో ప్రస్తావించాడు. మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీతలో ‘కల్పక్షయే పునస్తాని...’, ‘కాలః కలయతామహం..’ మొదలైన శ్లోకాల ద్వారా మహాభారత కాలానికి సంబంధించిన స్పష్టమైన కాలవిభజన గమనించవచ్చు.


వేద సిద్ధాంతం
వేద కాలంనాటి కాలవిభజనలో అత్యంత సూక్ష్మమైన విభాగం ‘నిమేషం’. దీన్నే వాడుకలో ‘నిమిషం’ అన్నారు. నిమేషం అంటే రెప్పపాటు కాలం. రుగ్వేదంలో ఈ పదాన్ని కాలానికి సంకేతంగా కాకుండా ‘రెప్పపాటు లేనివారు (దేవతలు)’ అనే అర్థంలో వాడారు. మాండూక్యోపనిషత్తులో ‘కలా ముహూర్తాః కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః । అర్ధమాసా మాసా రుతవస్‌ సంవత్సరశ్చ కల్పంతాం।।’ - అంటూ కాలవిభజన గురించి చెప్పారు. మహాభారతం శాంతిపర్వంలోని ‘కాష్ఠా నిమేషా దశ పంచ చైవ....’ అనే శ్లోకం ఉంది. ఇవి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కాలవిభజను దాదాపుగా సమానంగా ఉండే ప్రామాణికాలను గురించి చెబుతాయి. దీని ప్రకారం...
1 నిమేషం = రెప్పపాటు కాలం
15 నిమేషాలు = 1 కాష్ఠం
30 కాష్ఠాలు = 1 కళ
30 కళలు = 1 ముహూర్తం
30 ముహూర్తాలు = 1 దివారాత్రి (ఒక రోజు)
30 దివారాత్రులు = 1 మాసం
12 మాసాలు = 1 సంవత్సరం
మనుధర్మశాస్త్రం, అర్ధశాస్త్రంలో కూడా ఇదే రకమైన విభజన ఉంది. 


సూర్య సిద్ధాంతం
ఇప్పుడు వాడుకలో ఉన్న కాలవిభజనకు సూర్య సిద్ధాంతం పరమ ప్రామాణికం. ఇది కాలాన్ని మరింత సూక్ష్మంగా వివరిస్తోంది. ‘మూర్త’, ‘అమూర్త’ అనే రెండు రకాల కాలమానాలు ఈ సిద్ధాంతంలో ఉన్నాయి. ఈ రెండూ  వాటి స్వభావాన్ని ప్రకటిస్తాయి. మూర్త కాలమానంలో పేర్కొన్న కాలాంశాలను స్పష్టంగా మనం కంటితో చూడడానికి లేదా అనుభూతి చెందటానికి అవకాశం ఉంటుంది. ఇందులో అతిచిన్న ప్రమాణం ‘ప్రాణ’. పది దీర్ఘాక్షరాలు పలికే సమయాన్ని ‘ప్రాణ’ అంటారని సూర్యసిద్ధాంతం చెబుతోంది. దీన్నే ఆంగ్లంలో ‘బ్రీతింగ్‌ పీరియడ్‌’ అంటారు. అంటే ఒకసారి శ్వాస తీసుకునే సమయం. ‘ప్రాణ’ ప్రమాణం ఆధారంగా ఇతర కాలవిభాగాలను నిర్ణయించటం జరిగింది.
అమూర్త కాలమానంలో పేర్కొన్న  ప్రమాణాలు అతిసూక్ష్మమైనవి. వీటిని భౌతిక దృష్టికోణంతో అనుభూతి చెందటానికి అవకాశం లేదు. ఈ కాలమానం ప్రకారం ‘త్రుటి’ అనేది అతిచిన్న ప్రమాణం. సూర్యసిద్ధాంత గ్రంథంలో త్రుటి గురించి మరే ఇతర వివరాలు లేవు. అయితే, 12వ శతాబ్దానికి చెందిన భాస్కరుడు తన సిద్ధాంత శిరోమణి గ్రంథంలో త్రుటి అనే కాలవిభాగానికి కొన్ని వివరణలు ఇచ్చారు. దీనిప్రకారం రోజులో 2916000000  వంతు , సెకనులో 33750వ వంతు సమయం త్రుటి అవుతుంది.
ఈ సిద్ధాంతం ప్రకారం
6 ప్రాణ కాలాలు = 1 విఘడియ
60 విఘడియలు = 1 ఘడియ
60 ఘడియలు = 1 అహోరాత్రం (ఒక రోజు)

No comments:

Post a Comment

Total Pageviews