Wednesday, September 11, 2019

అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము డా .యస్వీ రాఘవేంద్ర రావు

నీరాజనము
సకల సాహితీ ప్రక్రియా స్రష్ట వగుచు
నాంధ్రభాషా ప్రపంచము నద్భుతముగ
"వేయి పడగల " మోసిన "విశ్వనాథ"
ఎటుల సేవించి నీ ఋణ మీగ గలము ?
"చెలియలికట్ట" లేని సువిశేష చిరత్న వినూత్న సాహితీ
జలనిధి ! "కల్పవృక్షము" నొసంగితి, కావ్య సుధారసంబులన్
తెలుగు జనాళి తన్పితివి దివ్యకవీంద్ర ! "కళాప్రపూర్ణ !" నీ
వల "శశిదూతమున్" నెఱపి, తాంధ్రియు వాఙ్మయ కౌముదిం గనెన్.
"ఆంధ్ర పౌరుషము"ను, "నాంధ్ర ప్రశస్తి"యు
దెసల నీ కతమున తేజరిల్లు
"జ్ఞానపీఠ" సు"కవిసమ్రా" డ్ప్రథితకీర్తి !
వీక దనరిన "జగదేకవీర !"
నవ్యులలో నవ్యుడవై,
కావ్య పునర్జీవన ఘనకార్య సవన సం
సేవ్యుడవై మంటివి, సం
దీవ్యత్కవిచంద్ర ! కొనుము నీరాజనముల్.
"గిరికుమారుని ప్రేమగీతాలు" నేర్పి,
"అనార్కలి" భగ్నప్రణయము తెల్పి,
"నర్తనశాల" లో నాట్యాలు నేర్పించి,
"వేనరాజు కథ" ను విశదపఱచి,
"మాస్వామి" కీర్తించి మహితభక్తి,
నల "స్వర్గానికి నిచ్చెనల్" రహిని గూర్చి,
"కోకిలమ్మకు పెళ్ళి కూర్మి చేయించి,
"కిన్నెరసాని" పాటలో కరుణ నింపి,
వివిధ సాహితీ ప్రక్రియా విలసనమున
ఆంధ్ర వాణిని కైసేసి తమరవీర !
ఆర్ష సంస్కృతి "ధర్మచక్రావతార !"
అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము
డా .యస్వీ రాఘవేంద్ర రావు

No comments:

Post a Comment

Total Pageviews