ఒకనాడు భోజరాజు ఆస్థానానికి దక్షిణ దేశం నుండి లక్ష్మీధరుడు అనే కవి వచ్చాడు.
ఆయన ముఖం తేజస్సు తో వెలిగిపోతూ వుంది.భోజరాజు ఆ కవిని గురించి ఎప్పుడూ విని
వుండలేదు .ఆయనను చూడగానే ఈయన మహానుభావుడు అనే అభిప్రాయం కలిగింది.
కవిగారు భోజరాజుకు మంగళ వాక్యాలతో స్వస్తి చెప్పి అభివాదం చేసి కూర్చున్నాడు
రాజా! నీది పండిత,మండిత సభ.నీవు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడివి.అని ఒక శ్లోకం చెప్పాడు
భోజ ప్రతాపం తు విధాయ ధాత్రా
శేషై: నిరస్తై:పరమాణుభి:కిం
హరే: కారే భూత్ పవి,రంబరే చ
భాను:పయోధే:ఉదరే కృశాను:
అర్థము:--ఆ బ్రహ్మ భోజుడి పరాక్రమాన్ని సృష్టించి,మిగిలిపోయి వదిలేసిన
పరమాణువులతో యింద్రుడి చేతిలోని వజ్రాయుధమూ,ఆకాశము లో సూర్యుడు,
,సముద్రం మధ్యలో బడబాగ్ని తయారయ్యాయేమో.
ధాత్రా=ఆ బ్రహ్మ చేత భోజప్రతాపం విధాయ=భోజుడి పరాక్రమం సృష్టించ బడి, శేషై:
నిరస్తై పరమాణుభి:=మిగిలిపోయి పారేసిన పరమాణువు లతో,హరే: కరే అభూత పవి:=ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఏర్పడింది,ఆకాశములో సూర్యుడూ,పయోధే ఉదరే కృశాను:=సముద్ర గర్భం లో బడబాగ్ని కూడా ఏర్పడి నాయేమో
రాజు,సభికులు ఆ శ్లోకం విని చకితులయ్యారు.రాజు కవికి అక్షరలక్షలు యిచ్చాడు.
రాజా నీ రాజ్యం లోనే ఉండిపోవాలనే కోరికతో సకుటుంబంగా వచ్చాను అన్నాడు
లక్ష్మీధరుడు. ఎందుకంటే
క్షమీ దాతాః గుణ గ్రాహీ స్వామీ స్వామీ పుణ్య యేన లభ్యతే
అనుకూలః శుఛి: దక్షః కవిహి విద్వాన్ సుదుర్లభః
తా:-- క్షమాగుణం వున్నవాడు,దాత, ప్రతిభ గురించగలవాడు.అయిన ప్రభువు పుణ్యం .
వలననే లభిస్తాడు.దానికి తోడు, అనుకూలుడూ,నిర్మలుడూ,సమర్థుడూ,పైపెచ్చు కవీ, విద్వాంసుడూ అయిన నీలాంటి రాజు దొరకడం చాలా కష్టం..
భోజరాజుకు అలాంటి కవులు ఆశ్రయం కోరి వస్తే యింక కావలిసింది ఏముంటుంది?
ఈయనకు వెంటనే ఒక ఇల్లు ఏర్పాటు చేయ వలిసిందని మంత్రిని ఆజ్ఞాపించాడు.
ఆ సమయము లో ఏ ఇల్లూ ఆయనకు యివ్వద్ఫానికి ఖాళీగా లేదు.మంత్రి వెతికి
వెతికి ఒక నేత గాడు వున్న యింటికి వెళ్లి నీవు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి.ఈ
యింట్లోకి మహా విద్వాంసుడికి ఇవ్వాల్సి వుంది అని చెప్పాడు.ఆ నేతగాడికి చాలా
బాధ కలిగింది.యిప్పటి కిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే తనేక్కడికి వెళ్ళాలి?అని
నేరుగా రాజు గారి దగ్గరకు వెళ్లి నమస్కరించి తన గోడు చెప్పుకున్నాడు.రాజా!నీ
మంత్రి నన్ను మూర్ఖుడిగా లెక్క కట్టేశాడు.అన్యాయంగా నన్నుయింటినుంచి
వెళ్లగొడుతున్నాడు..ఎవరో గొప్ప విద్వాంసుడికి యిస్తాడట.నీవైనా పరీక్షించి చూడు
నేను మూర్ఖుడి నో పండితుడనో అని ఈ శ్లోకం చెప్పాడు.
కావ్యం కరోమి నహి చారు తరం కరోమి
యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి
భూపాల మౌళి మణి రంజిత పాద పీట
హే సాహసాంక! కవయామి వయామి యామి
తా:--కావ్యం నేనూ వ్రాస్తాను.కానీ అంత చక్కగా రాయలేను.బాగా ప్రయత్నిస్తే
చక్కగానూ వ్రాయగలను.,శత్రురాజుల శిరస్సు మీది రత్నాల కాంతి చేత ఎర్రగా
ప్రకాశించే పాద పీఠంకల మహారాజా! సాహసమే మారు పేరుగా గలవాడా! కవయామి=కవిత్వమూ వ్రాస్తాను,వయామి=నేతా నేస్తాను,యామి=వెళ్ళమంటే వెళ్ళీ పోతాను. ఈ శ్లోకంలో చమత్కారమేమిటంటే .చివరి పాదం లోని 'కవయామి' 'వయామి' 'యామి' అన్నమాటలు ఎంతో చమత్కార యుక్తములుఎలాగంటే 'కవయామి' అనేది ఒక క్రియాపదం. కవిత్వముచెప్పగలను అని దాని అర్థం.అందులో మొదటి అక్షరం 'క' తీసివేస్తే 'వయామి' అవుతుంది. అంటే మగ్గం నేసుకోగలను అని అర్థం, దానిలోనుండి 'వ' అనే అక్షరం తీసివేస్తే 'యామి' అవుతుంది. వెళిపోగలను అని అర్థం. యిలా ఒకపదం నుండి ఒక్కొక్క అక్షరాన్ని తగ్గిస్తూ పోతే యింకో క్రియాపదం రావడం ఎంతో చమత్కారం.
రాజుకు ఒక నేతగాడు తనను నువ్వు అని సంబోధిస్తుంటే ఆశ్చర్యమూ,ఆ నేతగాడి
కవితా మాధుర్యానికి సంతోషమూ కలిగాయి. కవితా శక్తి మాటయితే కొంచెంఆలోచించ
వలిసిందే కానీ నీ శ్లోకం చాలా బాగుంది.అన్నాడు. ఆ నేత కార్మికుడికి కొంచెం కోపం వచ్చింది.పైకి మాత్రం రాజా!ఒక్క విషయం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం వేరు,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక ,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక పోతున్నాను.అన్నాడు. ఏమిటా విషయం?సంకోచించకుండా చెప్పు అన్నాడు రాజు. దేవా!నేను కాళిదాసును తప్ప ఇతరులను కవులుగా పరిగణించ లేకపోతున్నాను.నీ సభలో కవిత్వ తత్వం తెలిసిన విద్వాంసులు కాళిదాసు తప్ప యింకెవరున్నారు?అని యింకో శ్లోకం చెప్పాడు.
యత్-సారస్వత సౌరభం గురు కృపా పీయూష పాకోద్భవం
తత్ -లభ్యం కవినైవ;హఠతః పాఠ ప్రతిష్ఠాజుషా
కాసారే దివసం వసన్నపి పయః పూరం పరం పంకిలం
కుర్వాణః కమలాకరస్య లభతే కిం సౌరభం సైరిభః
అర్థము:--కవిత్వ సౌరభం అనేది గురు కృప అనే అమృతపాకం వల్ల పుట్టేది.అది కవి
అయిన వాడికే లభిస్తుంది.బలవంతంగా (హఠతః)పాఠాలు చెప్పించుకుని
ఎక్కించుకునే వాడికి దొరకదు.రోజంతా చెరువులో కూర్చొని (కాసారే దివసం వాసన్ అపి) చెరువునంతా పూర్తిగా కలుషితం చేస్తున్న (పయః పూరం పరం పంకిలం కుర్వాణః)
దున్నపోతు(సైరిభః) తామరకొలను సౌరభాన్ని పొందుతుందా?
అయం మే వాగ్గుమ్భః-విశదపద వైదగ్ధ్య మధురః
స్ఫురత్-బంధః, వంధ్యః పరహృది,కృతార్థ: కవిహృది
కటాక్షః-వామాక్ష్యా: దరదళిత నేత్రాంత గళితః
కుమారే నిస్సారః,స తు కిమపి యూనః సుఖయతి.
అర్థము:- ఈ నా పద గుంభనము స్పష్ట మైన పదాల అమరికతో మధురమైనది,పద
బంధాల మెరుపు గలది.అది కవి హృదయాన్నే మెప్పిస్తుంది.యితర హృదయాలలో
అది నిష్ఫల మైపోతుంది. అతివ అరమోడ్పు కన్నుల నుంచి జారే చూపు పసిబాలుడికి
పనికి రాదు,పడుచు వాడి నయితేనే అది ఉల్లాస పరచగలదు. పోతే నేను నిన్ను నువ్వు నువ్వు అన్నానని కోపగించుకోకు.
బాల్యే సుతానాం,సురతేంగ నానాం
స్తుతౌ కవీనాం,సమరే భటానాం
'త్వం' కార యుక్తాః హి గిరః ప్రశ స్తాః
కః ది ప్రభో మోహభరం, స్మరత్వం
అర్థము:--బాల్యం లో కుమారులకూ,ఏకాంత ప్రణయ వేళలలో స్త్రీలకూ,స్తుతించే
టప్పుడు కవులకూ,యుద్ధము లో సైనికులకూ 'నువ్వు' అన్న సంబోధన తో కూడిన
మాటలే ప్రశస్తమయిన మాటలని శాస్త్రం జ్ఞాపకం చేసుకో నీ కెందుకీ అపార్థం?
బోజరాజు బాగా చెప్పావు అని మెచ్చుకొని అతనికి అక్షర లక్షలిచ్చి సన్మానించటమే
కాక వున్న యింట్లోనే ఉండేందుకు అనుమతి నిచ్చి పంపేశాడు.ఆ లక్ష్మీధర కవికి
త్వరగా ఒక భవనం నిర్మించమని,అంతవరకూ అతన్ని అతిథి గృహం లోనే వుంచమని
మంత్రిని ఆదేశించాడు. అలా ఆ నేతగాడు కవిత్వం చెప్పి రాజును మెప్పించి తన యింటిని కాపాడుకున్నాడు.
No comments:
Post a Comment