Saturday, May 2, 2015

అందరికీ శుభరాత్రి!!!

మన ఆలోచనల్లోని నాణ్యతను బట్టి మన జీవితంలో ఆనందం వుంటుంది.
అందరికీ శుభరాత్రి!!!


మంచిమాట!!

మంచిమాట!!

మంచి నడవడిక ఎవరో ఇచ్చే కానుక కాదు 
ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.



Friday, May 1, 2015

బ్రౌనింగ్ కవి వాక్యాలే అనువాద కవిత

ఆ వాక్యం చూసినప్పుడు కలిగిన ఆ పులకింత రోజంతా అట్లానే ఉంది. రాత్రి భోజనాలప్పుడు విజ్జికీ, పిల్లలకీ చెప్పాను కూడా. ఎక్కడి శరభవరం, ఎక్కడి ఇన్నిస్ ఫ్రీ సరోవరం!
సాహిత్యమే కదా ఒక సేతువు కట్టింది.
ఆ వాక్యం మళ్ళా మళ్ళా గుర్తొస్తున్నప్పుడల్లా నాకు మరెన్నో స్థలాలు కాలాలూ మదిలో మెదుల్తూ ఉన్నాయి. చీనాలో ఒకప్పుడు తాంగ్ రాజవంశానికి రాజధానిగా ఉన్న చాంగాన్ ( ఇప్పటి క్సియాన్ ) లో దు-ఫూ, లి బాయ్ లు కవిత్వం చెప్పిన రోజులు, ఉత్తర జపాన్ లో సైగ్యొ కవీంద్రుడు నడిచిన దారుల్లో బషొ కూడా వర్ణించిన శిరాకవా సరిహద్దు, అక్కడి విల్లో చెట్టూ, గొగోల్, డాస్టవస్కీ, టాల్ స్టాయి ల మొదలుగా ప్రతి రష్యన్ మహారచయితా వర్ణించిన సెంట్ పీటర్స్ బర్గ్ వీథులు, బ్యునోస్ ఎయిర్స్ నేషనల్ లైబ్రరీ నేలమాళిగలో బోర్హెస్ తడుములాడిన పుస్తకాల అల్మైరాలు, - ఇలాంటివే ఎన్నో మదిలో మెదిలాయి.
రామారావు కన్నెగంటి వీటన్నిటినీ నా కళ్ళతో చూడాలి,చూసిన ప్రతి తావునుంచీ నాకో సందేశం పంపాలి.
అదీ కాక, వసంతంలో తోలివసంతం నుంచి మలివసంతానికి మలుపు తిరిగే ఈ చైత్రవైశాఖాల సరిహద్దులో నిలబడినప్పుడు నాకు బ్రౌనింగ్ కవి వాక్యాలే పదేపదే గుర్తొస్తూన్నాయి:
O to be in England
Now that April's there
And whoever wakes in England
Sees, some morning unaware
That the lowest boughs and the brushwood sheaf
Round the elm tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England -now!
And after April, when May follows,
And the whitethroat builds and all the swallows!...
ఆ వాక్యాలు నాలో ఈ వాక్యాల్ని కదిలిస్తూన్నాయి.
వైశాఖం ప్రవేశించినప్పుడు
ఉండవలసింది నువ్వా కొండల్లో
ఇక్కడ నగరవీథుల్లో
దట్టంగా పరుచుకున్న చెట్టునీడలు
నీకు తూర్పుకనుమలుగానే గోచరిస్తాయి.
వేసవిరాత్రుల్లో మీ ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు
రాత్రి పదిగంటలెప్పుడవుతుందా అని రోజంతా చూసేవాడివి
అప్పుడు మాసిన కోరారంగు తెరవెనక
వాళ్ళు హారతిపట్టి 'పరబ్రహ్మ పరమేశ్వర 'అనగానే
నీలో ఒక నిండారు జలపాతం.
ఇప్పుడు తురాయి చెట్లగుబుర్లలో
తొలి ఎరుపురేకలట్లా హారతివెలిగించాయి.
ఇప్పుడు నువ్వు ప్రాచీన చీనానగరం చాంగాన్ లోనే ఉన్నావు
వీథుల్లో రాలుతున్న పసుపు పూలమధ్య నడుస్తూ
ప్రాచీన చీనాకవిలా నువ్వు కూడా
కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదనుకుంటావు.
రోజులెంత నిర్దయగా,
నిస్సారంగానైనా గడవనివ్వు,
కాని ప్రతి వైశాఖం నీకోసం
గుప్పెడు శనగల్లాగా
వేసవి సోమరిక్షణాల్ని
పట్టుకొస్తూనే ఉంటుంది.

మార్టిన్ సన్ మూడు కవితలు


కవిత
ఇప్పుడు మనమీ భూమ్మీద ఒక తాళం వాయిద్దాం
ఆ తాళం మరేదో కాదు, ఒకప్పటి నీ చందమామనే.
వానాకాలపు అడవుల్ని కొమ్ముతో గోరాడినంతకాలం గోరాడి
ఇప్పుడు ఏడు సత్రాల యజమానిలాగా లావెక్కిపోయాడు.
చిత్తడినేలలలోతుల్లోంచో,ఆకాశమంత ఎత్తుల్లోంచో
నువ్వు ఊహించగలిగిన మాటల్లోనే మేం మాట్లాడతాం
వికసించినవో, వాడిపోయినవో నక్షత్రాలకుమళ్ళా ప్రాణంపోసి
నీ చేతుల్లో ఉన్న పువ్వులో కొత్త పరిమళం ఊపిరూదుతాం
తమ్ముడూ, తమ్ముడూ, ఏమైనా రానివ్వు-
దవానలం, బీభత్సం, నేల నాలుగు చెరగులా విప్లవం,
కాని గుర్తుపెట్టుకో,ఎప్పటికీ, ఈ రెండుమాటలూ:
పువ్వుకి పరిమళాలూదు.
స్వగ్రామం
నీ స్వగ్రామంలో వానపాములు గుల్లబరిచిన తోటలో
కాశీరత్నం తీగె ఇంకా పూస్తూనే ఉంది.
ఇళ్ళల్లో పాతాకాలపు పొడవాటి గోడగడియారాలు టిక్కుటిక్కుమంటూనే ఉన్నాయి.
ఇళ్ళ కప్పుల్లోంచి యూపస్తంభాల్లాగా పొగపైకి లేస్తోనే ఉంది.
ఎన్నో సముద్రాల మీద ఎంతో కఠినాతికఠిన జీవితం ముగించుకుని
క్రూరాతిక్రూరమైన తావులన్నీ చూసి వచ్చినవాడికి
ఈ శాంతిమయ గ్రామం ఒక ప్రశాంత అసత్యంగా గోచరిస్తుంది.
కాని ఈ అసత్యానికే జీవితమంతా చుట్టుకుపోవాలనిపిస్తుంది.
ఈ ఒక్క అసత్యం కోసం
ఎన్ని దుష్టసత్యాల్నైనా కాళ్ళతో మట్టేసి రావాలనిపిస్తుంది.
శ్రోతలు
వినడమొక్కటే తెలిసిన ఆ రోజుల్లో
నెగడిచుట్టూ చేరి పెద్దవాళ్ళంతా
అంతిమదినందాకా, ఒక రక్షకుడెవరో
వాళ్ళని శుభ్రపరిచే క్షణంకోసం వేచిచూస్తూ
తమ పాపమయదేహాల్ని చలిగాచుకుంటూ ఉండేవాళ్ళు.
ఎక్కణ్ణుంచో ఒక పిల్లి మావుమనేది, నెగడి రగుల్తుండేది,
పొగగొట్టాలు కూతపెట్టేవి.
కాలుజారిన ఒక పిల్లను తలుచుకుంటూ
ఎవరో శోకభరితంగా గొంతెత్తేవారు.
పళ్ళూడి పొద్దువాటారినవాళ్ళు
పొల్లుపోయిన ధాన్యంగురించో
పురుగుపట్టినపంటగురించో మాట్లాడుకునేవాళ్ళు.
ఆ చిన్నప్పటి నెగడిదగ్గరే నేనిప్పటికీ గడ్డకట్టుకుపోయాను.

హేరీ మార్టిన్ సన్ (1904-1978) స్వీడిష్ రచయిత, కవి, యాత్రాచరిత్రకారుడు

మొన్న ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కడో దూరదేశాన్నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రియబంధువులాగా హేరీ మార్టిన్సన్ కవితాసంపుటి The Procession of Memories, Selected Poems 1929-1945 నా కోసం ఎదురుచూస్తూ ఉంది.
కొన్నాళ్ళకిందట Chickweed Wintergreen, Selected Poems చదివినప్పణ్ణుంచీ మార్టిన్ సన్ కవిత్వం పట్ల గొప్ప ఇష్టం పెంచుకున్నాను. అందులో ఉన్న కవితలు కొన్ని ఈ పుస్తకంలో కూడా ఉన్నప్పటికీ, అనువాదకులు వేరు కావడంతో మళ్ళా కొత్త కవితలు చదివినట్టే ఉంది. Chickweed Wintergreen రాబిన్ ఫుల్టన్ అనువాదాలు, The Procession of Memories కి లార్స్ నోర్డ్ స్ట్రోం అనువాదకుడు.
హేరీ మార్టిన్ సన్ (1904-1978) స్వీడిష్ రచయిత, కవి, యాత్రాచరిత్రకారుడు. 1974 లో మరొక స్వీడిష్ నవలాకారుడితో కలిసి సాహిత్యానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నాడు.
మార్టిన్ సన్ జీవితం కథ కన్నా విచిత్రమైంది.ఆరేళ్ళ వయసులోనే కుటుంబం ముక్కలైంది. తండ్రి క్షయవ్యాథితో మరణించాడు. అఏడుగురు పిల్లల్ని సాకలేక తల్లి అమెరికా పారిపోయింది. పిల్లలంతా తలోదిక్కూ అయిపోయారు. మార్టిన్ సన్ కూడా తర్వాత పదేళ్ళ పాటు రరకాల ఇళ్ళల్లో,పొలాల్లో బతుకుతెరువు వెతుక్కోవలసి వచ్చింది. పదహారో ఏట నావికుడిగా మారాడు. ఆ ప్రయాణాల్లో అమెరికా వెళ్ళవచ్చుననీ, తల్ల్ని చూడొచ్చనీ కోరిక. 1922 లో అమెరికా వెళ్ళడమైతే వెళ్ళాడుగానీ,తల్లిని చూడలేకపోయాడు. 1927 లో మలేరియా బారినపడి క్షయవ్యాధి సూచనలు కనిపించడంతో సముద్రాన్ని వదిలి మళ్ళా స్వీడన్ చేరుకున్నాడు. నిరాశ్రయుడిగా, నిర్భాగ్యుడిగా జీవిస్తుండగా హెల్గా జొహన్సన్ అనే ఒక వామపక్షస్త్రీవాది పరిచయమైంది. ఆమె అతడికన్నా పధ్నాలుగేళ్ళు పెద్దది. ముగ్గురు పిల్లలతల్లి. ఆమె స్టాక్ హోం శివార్లలో ఉన్న తన వ్యవసాయక్షేత్రానికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని మార్టిన్ సన్ ని ఆహ్వానించింది. ఆ పరిచయం ప్రణయంగా మారి ఆ మరుసటి ఏడాది వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత 1940 లో వాళ్ళిద్దరూ విడిపోయేదాకా ఆ కాలమంతా మార్టిన్ సన్ జీవితంలో అత్యున్నతమైన, సృజనాత్మకంగా సుసంపన్నమైన కాలం. ఒకదానివెనక ఒకటి అతడు కవిత్వం, నవలలు, వ్యాసాలు, నాటకాలు,రేడియో నాటకాలు రాస్తూనే ఉన్నాడు. కాని అతడికి రాజకీయ నిబద్ధత లేదని అతణ్ణి హెల్గా వదిలిపెట్టేసాక, ఇంగ్రిడ్ లిండ్ క్రాంజ్ అనే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. 1949 నుంచీ స్వీడిష్ అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. 74 లో అతడి కవిత్వానికి నోబెల్ బహుమతి వచ్చిందిగాని, ఆ ఎంపిక కమిటీలో అతడు కూడా ఉన్నందువల్ల తీవ్ర విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో అతడు రాయడం, ప్రచురించడం మానేసాడు. ఆ విమర్శ మానసికంగా కలిగించిన ఒత్తిడి తట్టుకోలేక నాలుగేళ్ళు తిరక్కుండానే ఒకరోజు హాస్పటల్లో తన పేగులు కత్తిరించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మార్టిన్ సన్ చక్కటి పాఠశాల చదువుకు నోచుకున్నవాడు కాడు. కాని చదువుని ప్రేమించాడు, సాహిత్యాన్ని ప్రేమించాడు. ప్రకృతిని ఆరాధించాడు. భూగోళ,ఖగోళ శాస్త్రాలు అతణ్ణి సమ్మోహితుణ్ణి చేసాయి. నిరాశ్రయంగా గడిచిన బాల్యం, ప్రపంచసముద్రాలన్నిటిమీదా పయనించిన యవ్వనం, ఏళ్ళ తరబడి ఆకాశాన్ని మాత్రమే చూస్తూ ఖండాంతరాల మీద సాగిన జీవితం అతడి దృష్టిని అసీమితం చేసేసాయి.. 'ఒక తుహినకణంలో విశ్వాన్ని దర్శించగల కవిత్వం 'అతడిదని నోబెల్ కమిటీ ప్రస్తుతించింది.
ఒక దిమ్మరిగా,కూలీగా, నిర్భాగుడిగా జీవించినప్పటికీ మార్టిన్ సన్ కవిత్వం సోషలిస్టు తరహా ప్రసంగాలకు పూనుకోదు, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోదు. ఎంతో ఆరోగ్యవంతంగా, నవనవలాడే పండులాగా, అప్పుడే వికసించిన అడవిపువ్వులాగా, దూరంగా కనవచ్చే దీవి మీద వినవచ్చే తొలిపక్షి కూజితంలాగా కొత్తగా తాజాగా ఉంటుంది. ఏ కవిత చదివినా ప్రాణం లేచివచ్చినట్టుంటుంది.
మార్టిన్ సన్ లానే నేను కూడా తొమ్మిదో ఏటనే ఇల్లు వదిలిపెట్టాను. అతడు తనవికాని దారుల్లో సంచరించినట్టే నేను కూడ నావి కాని దారుల్లో, తీరాల్లో ప్రయాణిస్తూనే ఉన్నాను. అతడిలానే నేను కూడా తల్లి కోసం వెతుక్కుంటూనే ఉన్నాను. అతడిలానే నాకు కూడా పూలూ, ముళ్ళూ అనే తేడా లేకుండా ప్రకృతి మొత్తం ప్రాణప్రదం. బహుశా అందుకేనేమో ఆ కవిత్వం చదువుతుంటే ఒక ఫిన్నిష్ విమర్శకురాలు రాసినట్టుగా Reading poetry is human nearness అని అనిపిస్తుంది.

తాటి ముంజలు పరిచయం చేద్దాం!

ఇప్పటి పిల్లలకి 
వేసవి అంటే? కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఏ.సిలు
వేసవి సెలవులు అంటే మొబైల్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, టి వి లో కార్టూన్ చానల్స్.
మరి మా చిన్నప్పుడో....అబ్బో ఎన్ని సంగతులు ఎన్నెన్ని సంగతులు వీటన్నింటి గురించి ప్రతి రోజూ బోలెడు కబుర్లు చెప్పుకుందాం! 
వేసవి అంటే?
తాటి ముంజెలు, ఐస్ ప్రూట్స్, డ్రింక్ బండి లో చల్లని పానీయాలు     
వివిధ కాలాలకి తగినట్లుగా ప్రకృతి మనకెన్నో సదుపాయాలూ ఇచ్చింది. పూర్వం ఆయా కాలాల్లో వచ్చే కాయలు, పండ్లు మన ఆహారంలో భాగం అయ్యేవి, ఆధునికత పుణ్యమా అని వాటికి దూరమయ్యాం. వాటిని  నేటి తరానికి పరిచయం చెయ్యడం మన కనీస కర్తవ్యం.. వేసవిలో మండే ఎండలు వాటినుంచి ఉపశమనానికి  పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు,  తాటిముంజలు ఇలా ఎన్నో ఉన్నాయి.
ముందుగా ...తాటి ముంజలు పరిచయం చేద్దాం! వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు విూదపడకుండా ఒడుపుగా బొటన వేలితో పై పోర తీసి తినటం ఒక సరదా...తాటి ముంజెల వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు ...ఆరోగ్యానికి  ఎంతో మేలుచేస్తాయి.  ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. తాజాగా ఉండే ఈ తాటిముంజ జ్యూసీ లిచీ ఫ్రూట్ లా ఉంటుంది.  తాజా లేలేత కొబ్బరి బోండాం రుచి కలిగి ఉంటుంది. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.  తాటి ముంజల్లో అధిక నీటిశాతం ఉండటం వల్ల దీని వల్ల శరీరానికి తగినంత తేమ అందించి, చర్మంను, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు, డీహైడ్రేషన్ నివారణకి గొప్పగా సహాయపడుతుంది. ఉదర సంబధ సమస్యలకు, అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారించడంలో, మలద్ధకం పోగొట్టే అద్భుత చికిత్స, అన్ని కాలాల్లో కన్నా ఎండవేడిమికి  ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు.అందుకు ప్రధాన కారణం, శరీరం నుండి నీటిని కోల్పోవడం వల్ల వచ్చే నీరసం, అలసటను నివారించి, తక్షణ శక్తిని పొందవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగిన మన దేశీయ ఉత్పత్తులను సేవిద్దాం! తాటి ముంజెలు తిన్న తర్వాత మూడు  కాయలతో చక్కని బండిని తాయారు చేసేవాళ్ళం ఆడుకోడానికి నిజంగా వేసవి లో తాతగారి ఊరు లేదా ఏదైనా గ్రామాన్ని మీ పిల్లలతో దర్శింప చెయ్యండి. మన సంస్కృతి లోని  ప్రతి చెట్టు చేమ వీటన్నింటి గురించి వివరించండి.  రేపు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం!! మణిసాయి విస్సా ఫౌండేషన్. 

జపం చేసేటప్పుడు 108 సంఖ్య తో ఎందుకు చేస్తారు?

                            జపం చేసేటప్పుడు 108 సంఖ్య తో ఎందుకు చేస్తారు?

               108 నరములతో 108 కేంద్రాలతో మానవుడి మెదడు ఉంది. అందుకనే 108 సార్లు  108 జపమాలతో ఓ మంత్రాన్ని జపించమని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. పగడాలతో జపిస్తే వేయింతల ఫలము, రత్నమాలతో జపిస్తే పదివేలరెట్లూ, ధర్భముడితో నూరుకోట్ల రెట్లు, రుద్రాక్షల ద్వారా అనంతమైన ఫలము  లభిస్తుందని లింగపురాణం చెబుతోంది. చాలా మందికి జపం గట్టిగా చదవాలా .... లేక  నెమ్మదిగా చదవాలా అని సందేహం ఉంది. గట్టిగా అందరికీ వినపడేటట్లు చదివినా వినపడీ వినపడకుండా ఉండేటట్లు, మనసులో జపం చేసుకున్నా ఏ పద్ధతిలో చేసుకున్నా ఉత్తమమేనని పెద్దలు చెపుతారు.

Total Pageviews